Home »  » Ladies Special

 

ముందు మీ ఆరోగ్యం జాగ్రత్త సుమీ...

* ఆడవారికి బాధ్యతలు ఎక్కువ. సమాజంలో నిర్వహించాల్సిన పాత్రలూ ఎక్కువే. దానితోపాటు ఒత్తిళ్ళూ అధికమే. అందులోనూ ఇంట్లో ఎవరికన్నా ఏపాటి నలతగా వున్నా వారితోపాటు రాత్రింబవళ్ళు ఉంటూ వారికి స్వాంతనని కలిగించేందుకు ప్రయత్నించడంలో మరీ ఒత్తిడికి గురవుతుంది స్త్రీ. అయితే ఈ ఒత్తిళ్ళని కూడా భరిస్తూ తన బాధ్యతలని సక్రమంగా, సరైన సమయంలో పూర్తి చేయడానికి అలవాటుపడిపోయింది. దానితో తన గురించి, తన ఆరోగ్య పరిస్థితి గురించి, తనలోని మానసిక ఆందోళన గురించి ఏమాత్రం ఆలోచించదు. అదిగో అలా తనని తాను నిర్లక్ష్యం చేసుకునే ఆడవారిని హెచ్చరిస్తోంది ఇటీవల హార్వర్డ్ మెడికల్ స్కూలు వారు వెలువరించిన పరిశోధన ఫలితం.

* ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారికి సేవలు చేయడంలో ఆడవారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం వుంటుంది అంటున్నారు పరిశోధకులు. ఆ ఒత్తిడి ఆడవారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని కూడా వీరు చెబుతున్నారు. ఈ పరిశోధనలో భాగంగా 65 సంవత్సరాలు పైబడ్డ స్త్రీలని, వారి జీవన శైలిని, వారి కుటుంబ ఆరోగ్య పరిస్థితులని, వారి వైద్య రికార్డులని పరిశీలించారు. ఒకరు ఇద్దరు కాదు... సుమారు ఐదు లక్షల మందిని పరిశీలించిన ఈ పరిశోధకులు చివరికి తేల్చిన విషయం... కుటుంబంలోని వారి అనారోగ్యం స్త్రీలని తీవ్ర ఒత్తిడికి గురిచేసి, వారి ఆయుష్షుపై ప్రభావాన్ని చూపిస్తుంది అని. అదీ దీర్ఘకాలిక అనారోగ్యం కలిగిన వారి మంచి చెడ్డలు చూడటంలో అంతర్లీనంగా ఉండే ఎన్నో విషయాలు ఆ ఒత్తిడికి కారణం అవుతాయిట.

* వయసు మళ్ళినవారు, మంచిపై ఉన్నవారి ఆలనా పాలనా చూడటంతో తమపై తాము శ్రద్ధ పెట్టకపోవటం, పూర్తిగా తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం ఒక కారణం అయితే, పోషకాహారం తీసుకోకపోవడం, సంరక్షణ చేసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ఎక్కువ శ్రమపడటం వంటివి మరో కారణం. ఈ అధ్యయనంలో భాగంగా వివిధ స్త్రీల వైద్య రికార్డుల్ని పరిశీలించినప్పుడు కేన్సర్ వంటి అనారోగ్యంతో బాధపడేవారు ఇంట్లో వున్నవారికంటే తీవ్రమైన అంగవైకల్యానికి గురైన వ్యక్తులు ఇంట్లో వున్న వారు ఎక్కువ ఒత్తిడికి గురైనట్టు తేలింది. శారీకర శ్రమ, సామాజిక ఒత్తిళ్ళు వంటివి కారణం కావచ్చంటున్నారు పరిశోధకులు. మానసిక సమస్యలతో బాధపడే వ్యక్తుల సంరక్షకులకి ఈ ఒత్తిడి మరీ అధికమట.

* ‘డిమెన్షియా’ అంటే మతిమరుపు తదితర మానసిక రుగ్మతల బారిన పడిన వారిని సంరక్షించడంలో సాధారణ స్థాయి కంటే ఒత్తిడి, వేదన అధికంగా వుంటాయిట. హార్మోన్ల హెచ్చుతగ్గులు కూడా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. రోగ నిరోధక వ్యవస్థను కాపాడే తెల్ల రక్తకణాలు చురుకుదనాన్ని కోల్పోవడం గమనించారు. దానితో అధిక రక్తపోటు, గుండెజబ్బుల వంటి వాటి బారిన పడే అవకాశాలు ఎక్కువగా వున్నట్టు గుర్తించారు. ఇలా రోగుల సంరక్షణలో ఎన్నో సవాళ్ళు, ఒత్తిళ్ళు దాగున్నాయని, ఈ విషయంలో స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

* ఇంట్లోవారి ఆరోగ్యం తప్పకుండా ఒత్తిడికి గురిచేస్తుంది. అయినవారి బాధ చూడటం కష్టమే. వారిని అన్నివేళలా కంటికి రెప్పలా కాపాడాలనుకోవటం సహజమే. అయితే అదే సమయంలో మన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించమని చెబుతున్నారు పరిశోధకులు. ముందుగా పరిస్థితులని యథాతథంగా స్వీకరించడం, తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆందోళనని దగ్గరకి రానీయకపోవడం, మంచి ఆహారాన్ని, విశ్రాంతిని తీసుకోవడం. అందుకోసం ఇంట్లో మిగిలిన సభ్యుల సహాయ సహకారాలని కూడా కోరటం, ఒత్తిడిగా అనిపించినప్పుడు రిలాక్స్ అయ్యే టెక్నిక్స్‌ని పాటించడం, వీలయితే ఓ గంట ఒంటరిగా ఉండటం వంటివన్నీ అనారోగ్యపు బారిన పడిన వారిని సంరక్షించడంలో మనం అనారోగ్యానికి గురికాకుండా కాపాడే చిన్న జాగ్రత్తలుట. ఎంతైనా మనం ఆరోగ్యంగా వుంటేనే కదా అందరినీ చక్కగా చూసుకోగలిగేది. కాబట్టి కొంచెం ధైర్యంగా, మరికొంచెం జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.

-రమ


Related Novels


Dasara 2025 Vijayawada Durga Devi

Dasara 2023 Vijayawada Annapurna Devi

Dasara 2023 Vijayawada Gayatri Devi

Dasara 2023 Home

More