Home »  » Dasara 2025 Vijayawada Durga Devi

దుర్గమాసురుడు అనే రాక్షసుని సంహరించినందుకుగాను అమ్మవారికి దుర్గాదేవి అన్న పేరు వచ్చింది. ఈ దుర్గమాసురుని సంహరించడంలో భాగంగా దుర్గాదేవి, నవదుర్గలు పేరుతో మరో తొమ్మిది ఉప అవతారాలను ధరించిందట. బెంగాల్‌ ప్రాంతంలో ఈ నవదుర్గలనే ఎక్కువగా ఆరాధిస్తుంటారు. ఒకో రాత్రీ ఒకో దుర్గ అవతారాన్ని పూజిస్తారు. అందుకే అక్కడ నవరాత్రులంటే దుర్గాపూజే!

తెలుగునాట కూడా దుర్గాదేవికి ప్రాధాన్యత ఎక్కువే. తెలుగువారి ఇష్టదేవత అంటే బెజవాడ కనకదుర్గమ్మే! మరి నవరాత్రుల సందర్భంగా ఆ దుర్గాదేవిని ఎలా పూజించాలో తెలుసుకుందామా...
దుర్గాదేవి పౌరుషానికీ, పోరాటానికీ చిహ్నం. అందుకని ఈ రోజు అమ్మవారిని ఎర్రటి ఎరుపు రంగు చీరతో అలంకరించాలి. ఎర్రటి మందారపూలతో పూజించాలి. మందార పూలు కుదరకపోతే, ఎరుపు రంగులో ఉన్న ఏ పూలతో అయినా పూజించవచ్చు.

ఈ రోజు అమ్మవారి ముందు దుర్గాష్టకమ్‌, దుర్గా సప్తశతిలాంటి స్తోత్రాల పారాయణ చేయాలి. ఏవీ కుదరకపోతే ‘ఓం దుం దుర్గాయై నమః’ అనే మూలమంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి. ఇక ఈ రోజు అమ్మవారికి పులగం, కదంబం, పరమాన్నం, చక్కెర పొంగలి లాంటి ప్రసాదాలని నైవేద్యంగా పెట్టవచ్చు. ఇవేవీ కుదరని పక్షంలో ఒక కొబ్బరికాయనైనా కొట్టి అమ్మవారికి నివేదించాలి.

మనసు నిగ్రహంగా ఉంటేనే ఎలాంటి పోరాటంలో అయినా గెలవగలుగుతాము. మనసుకి ఎంత ఇష్టంగా ఉన్న వస్తువునైనా వదులుకునేంత పట్టుదల ఉంటేనే ఇలాంటి నిగ్రహం సాధ్యమవుతుంది. అందుకనే నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవిని పూజించే రోజున మనకి ఇష్టమైన ఆహార పదార్థాల నుంచి దూరంగా ఉండాలట.

దసరా సందర్భంగా ఇలా అమ్మవారిని దుర్గాదేవి రూపంలో పూజించుకున్న తర్వాత, అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు చీరను ఎవరన్నా ముత్తయిదువకి దానం చేయాలి. ఇలా కనుక చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు, కోర్టు కేసులలో చిక్కుకున్నవారు దుర్గాదేవిని కనుక పూజిస్తే తప్పకుండా ఆ సమస్యల నుంచి విముక్తులవుతారు. ఇక జీవితంలో తట్టుకోలేనన్ని సమస్యలు ఉన్నా, చీటికీ మాటికీ భయాందోళనలకు గురవుతున్నా కూడా దుర్గాదేవని పూజిస్తే ఉపశమనం లభిస్తుంది. 


Related Novels


Dasara 2025 Vijayawada Durga Devi

Dasara 2023 Vijayawada Annapurna Devi

Dasara 2023 Vijayawada Gayatri Devi

Dasara 2023 Home

More