Home » Sree Sree » Srisri Kathalu

 

                                  
                                    నవ రసాల శ్రీశ్రీ
    
                                  లెని 'నిజం'
                                 అద్భుతరసం
    

    1980వ సంవత్సరం జనవరి 2వ తారీఖున ఇంకా
    తెల్లవారకముందే మాస్కోలోని క్రెమ్లిన్ భవనంలో లెనిన్
    సమాధి ముందు ఇవాన్ నిలుచున్నాడు. రోజూ ఈ సరికే
    ఇక్కడ ఒక పెద్ద క్యూ ఉండేది. ఇప్పుడు తానొక్కడే
    ఉన్నాడు. అందరికన్నా ముందుగా వచ్చేశానేమో అను
    కున్నాడు. అటూ ఇటూ చూశాడు. ఎటూ మనుషుల
    అలికిడి లేదు. "లెనిన్ సమాధి ముందు మనుష్యుల్లేక
    పోవడమేమిటి? ఆశ్చర్యంగా ఉందే!" అనుకున్నాడు. ఆ
    క్రితం రాత్రి రేడియోలో వెలువడ్డ ప్రకటన విని ఉంటే
    అతనికే ఆశ్చర్యం కలిగి ఉండేదికాదు. కొన్ని మరమ్మత్తుల
    నిమిత్తం లెనిన్ శవపేటికను వేరేచోటికి కదిలిస్తున్నారనీ,
    మళ్ళీ ప్రకటన వచ్చేదాకా ఎవరూ క్యూలో నిలబడక్కర
    లేదనీ రేడియోలో హెచ్చరించడం జరిగింది. ఈ సంగతి
    తెలియక ఇవాన్ అలాగే నిలబడి ఉన్నాడు.
    ఇంతలో ఒక సైనికుడు వచ్చి ఉదయం "ప్రావదా" పత్రికను అతనికి చూపించాడు. ఇప్పుడు తెలిసిందతనికి సమాధి ముందు ఎవరూ లేకపోవడానికి కారణం. తాను తెచ్చిన పువ్వులదండను భక్తిగా అక్కడ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఇవాన్.
    టాస్ వార్తా సంస్థకూడా లెనిన్ విషయాన్ని ప్రపంచం అంతకూ ప్రసారం చేసింది.
    సైన్సు ఫిక్షన్ సరఫరాచేసే అమెరికన్ జర్నలిస్టులు రకరకాల ఊహాగానాలతో పత్రికలను నింపివేశారు. చంద్రుడుకీ భూమికీ మధ్యవున్న ఒక అంతరిక్ష నివేశనంలో లెనిన్ కు ప్రాణప్రతిష్ట చేసే ఆధునిక వైద్య ప్రయోగాలు జరుగుతున్నాయని ఒక పాత్రికేయుడు రాశాడు. అంతకుముందు రెండు రోజుల కిందట రష్యన్లు సాల్యూట్ 10 అనే అంతరిక్ష పరిశోధనారాగాన్ని కక్ష్యలోనికి పంపించిన వార్తను ఆధారం చేసుకుని అతడీ ఊహాగానం చేశాడు. స్పేస్ లేబరేటరీలో ఇద్దరు జీవశాస్త్ర నిపుణులున్న విషయాన్ని తన వాదానికి ఉపపత్తిగా పేర్కొన్నాడు.
    శ్రీహరి కోటలోని మన అంతరిక్ష వైజ్ఞానికులు దీనిని గురించి ఇప్పుడే వ్యాఖ్యానించ డానికి వీలులేదనీ మరో రెండు రోజులైనా వేచి చూడవలసి ఉందనీ పత్రికా ప్రకటన చేశారు. భూమి చుట్టూ తిరుగుతున్న ఆర్యభట్ట 4 ఎత్తైన టెలివిజను ఫోటోగ్రాఫులు పంపిస్తున్నదా అన్న ప్రశ్నకు ఔననిగాని లేదనిగాని జవాబు చెప్పడానికి నిరాకరించారు.
    జనవరి 4వ తారీఖున టాస్ వార్తా సంస్థ "లెనిన్ కు ప్రాణ ప్రతిష్ట చేసి ప్రయత్నాలు ఫలిస్తున్నాయని ప్రకటించి ప్రపంచమంతటినీ దిగ్భ్రాంతిలో ముంచింది. సోవియట్ మహానాయకునికి ఈసరికే ప్రాణప్రతిష్ట జరిగిపోయి ఉండాలనీ లేకుంటే టాస్ అటువంటి ప్రకటనచేసి ఉండదనీ బ్రిటీష్ సైంటిస్టులు అభిప్రాయపడ్డారు.
    ఐక్యరాజ్యసమితిలో అప్పటికే అధిక సంఖ్యాకులుగా ఉన్న తృతీయ ప్రపంచ సభ్యులు లెనిన్ కు ఘనమైన స్వాగతం ఇవ్వటానికి తీర్మానించబోయారు. అధికారరీత్యా రష్యానుండి ప్రకటన వెలువడేదాకా ఈ తీర్మానాన్ని వాయిదా వెయ్యాలని అమెరికా అడ్డుపుల్ల వేసింది. చనిపోయిన మనిషిని బతికించడం అంత తేలికయిన పనికాదని బాధ్యత పెరిగిన సమితి సభ్యులు అనవసరోద్రేకాలకు లోనుకాకూడదనీ." సమితిలోన అమెరికన్ రాయబారి గంభీరోపన్యాసం చేశాడు.
    ప్రపంచంలోని కొన్ని మత సంస్థలు నాస్తిక రాజ్యమైన సోవియట్ యూనియన్ చేస్తున్న ఈనాటి సరికొత్త ప్రయోగం భగవంతుని సంకల్పానికి విరుద్దమని ఘోషించాయి. ఈ ప్రయత్నం సఫలం కాకూడదని దైవభక్తులందరూ ప్రార్ధనలు జరిపించాలని సిఫారసు చేశాయి. ఇండియాలో కొన్ని కొన్ని కూటాలవారికి ఈ సలహా బాగా నచ్చింది. ప్రదర్శనలకని ప్రార్ధనలకనీ భజనలకనీ చాలా డబ్బు పోగుచెయ్యడం జరిగింది. అయితే ఆ పెద్దపెద్ద మొత్తాలను ఎవరెవరు ఏయే విధాలుగా కైంకర్యం చేశారో ఆ వివరాలేవీ పత్రికల్లో రాలేదు.
    జనవరి 5వ తారీఖున శ్రీహరికోట వైజ్ఞానికులు, లెనిన్ లేచి నిలబడి కాలని సవరించుకుంటున్న రేడియో టెలిఫోటో గ్రాఫును పత్రికలవారికి విడుదల చేశారు. ఆధునిక విజ్ఞానశాస్త్రం సాధించిన ఈ ఘనవిజయాన్ని మనపత్రికలన్నీ వేనోళ్ళ శ్లాఘించాయి.
    ఐక్యరాజ్యసమితిలో మళ్ళీ తర్జనభర్జనలు బయలుదేరాయి. బ్రతికి వస్తున్న లెనిన్ కు స్వాగతం ఇవ్వడంలో ఎవ్వరికే అభిప్రాయభేదం అంటూ ఏదీలేదు. అయితే ఏ దేశానికాదేశమే తమ ఆతిధ్యాన్ని లెనిన్ మునుముందుగా స్వీకరించాలని పట్టుపట్టాయి. విచిత్రం ఏమిటంటే అమెరికన్లు కూడా లెనిన్ కు న్యూయార్క్ లో మాడిసన్ స్క్వేర్ లో స్వాగతం ఇస్తామని ప్రతిపాదించారు. ఆఫ్రికా దేశాల వాళ్ళెవ్వరికీ ఇది మనస్కరించలేదు. మాస్కోలోనయినా సరే ఒప్పుకొంటాము గాని అమెరికాలో ఎక్కడా ఈ సన్మానం జరగడానికి వీలులేదని ఆ దేశాల ప్రతినిధులు గగ్గోలు పెట్టారు.
    అప్పటి ఐక్యరాజ్యసమితిలో భారతదేశ ప్రతినిధిగా ఒక తెలుగాయన ఉన్నారు. ఆయన ఢిల్లీతో నిమిషాల మీద సంప్రదించి హైదరాబాదులో ఇది జరిపించడానికి సమితి సభ్యులంతా అంగీకరించాలని విజ్ఞప్తి చేశాడు. లంచి విరామం కారణంగా తీర్మానం మీద ఓటింగు జరుగలేదు. లాబీ వర్గాలలో ఇండియాకు అనుకూలంగా గట్టి ప్రచారమే జరిగింది. ఈ గౌరవం భారతదేశానికి దక్కడం ఇష్టంలేని కొన్ని రాజ్యాలకు ఆఫ్రికా మీద ఎక్కడలేని అభిమానమూ పుట్టుకొచ్చింది. ఆఖరికి, "అంగోలాలో స్వాగతం" అనే తీర్మానం నెగ్గింది.
    అంగోలాలో పెద్దపెట్టున ప్రయత్నాలు జరిగిపోతున్న సమయానికి మాస్కోలోని వైజ్ఞానిక బృందం ప్రస్తుతం భూలోకాన్ని యింకా అంటిపెట్టుకుని ఉన్న కలుషిత వాతావరణంలో రోదసీ మండలంలో సజీవుడుగా ఉన్న లెనిన్ ను భూమిమీద ఎక్కడ దించినా ఆయన జీవించడం కష్టమేమో అన్న సందేహాన్ని వెలిబుచ్చింది. దీన్ని ఆసరాగా తీసుకుని మనదైనభక్తులు మళ్ళీ విజ్రుంభించారు. ప్రపంచాన్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకునే ఉద్దేశంతో రష్యన్లొక బూటకపు నాటకం ఆడుతున్నారే తప్ప చచ్చిపోయిన మనిషిఏమిటి(?) మళ్ళీ బతకడమేమిటి(?) అనే తమ పాత పాటని మరోసారి లంకించుకున్నారు. అయితే మనదేశంలోని ప్రధాన నగరాలలో పలుకుబడి గల సంస్థలుగా రూపొందిన పెక్కు నాస్తిక కేంద్రాలు ఈ దైవభక్తుల ప్రచాన్ని తీవ్రంగా ఖండించాయి. హేతువాదానికీ శాస్త్రవిజ్ఞానానికీ బద్దవిరోధులైన ఈ ముఠాల వాళ్ళు తమకు దొరికిన ప్రతి చిన్న విషయాన్ని వుపయోగించుకొని ప్రజలలో గందరగోళాన్ని సృష్టించడం ఇవాళేమీ కొత్తకాదని స్పష్టం చేశారు.
    భారతీయ కాలమానం ప్రకారం జనవరి 5వ తారీఖున 21 గంటల 35 నిమిషాలకు ప్రపంచ ప్రజలందరూ రోదసీ పరిశోధనాగారంలో పచార్లు చేస్తున్న లెనిన్ ను టెలివిజన్ లో చూశారు. ఇది సోవియట్ వైజ్ఞానికులు సాధించిన ఘనవిజయంగా ప్రపంచ పత్రికలన్నీ ప్రస్తుతించాయి. కాని లెనిన్ కు ఇంకా మాట్లాడేశక్తి రాలేదనీ ఆయన కంఠంలోని శబ్దం పుట్టించే తంత్రులు సరిగా పనిచెయ్యలేదని తెలుసుకున్న అభివృద్ధి నిరోధకులందరూ తమకే గొప్ప విజయం సిద్దించినట్లుగా లోలోపలనే సంతోషించారు.
    మర్నాడు ప్రపంచ ప్రజలందర్నీ ఉద్దేశించి అయిదు నిమిషాలు లెనిన్ చెయ్యడానికి కుద్ధిష్టమైన ప్రసంగం నిరవధికంగా వాయిదా పడిపోయినందుకు అపరిమితానందం పైకి మాత్రం కాదు పొందారు.
    ఎన్నో శరీరభాగాలను మార్పిడీచేసే శస్త్ర వైద్యం అప్పటికే చాలా అభివృద్ధి చెందినప్పటికీ లెనిన్ సొంత గొంతుతో మాట్లాడితేనే బాగుంటుందనే ఉద్దేశంతో సోవియట్ జీవ శాస్త్రజ్ఞులు వేరే తంత్రులను ఉపయోగించకూడదని నిర్ధారించారు.
    అంతరిక్షంలో పునర్జీవం పొందిన వ్యక్తి భూలోకంలో సజీవుడుగా ఉండడాని కనుకూలమైన వాతావరణం పరిస్థితులు ఇక్కడ పరిపక్వం కాలేదన్న సోవియట్ శాస్త్రజ్ఞుల అభిప్రాయం సరియైనదే అని ప్రపంచంలోని ప్రముఖ వైజ్ఞానికులందరూ అంగీకరించారు.
    ఇది ఒక్క అంగోలా ప్రజలకే కాక యావత్ప్రపంచ ప్రజలకీ ఆశాభంగం కలిగించింది.
    ఒక్క దైవభక్తులు మాత్రం చచ్చిన వాళ్ళు మళ్ళీ బతకడానికి వీలులేనివిధంగా భూలోకంలో నానావిధాల కల్మషాన్ని సృష్టించిన భగవంతుని చాకచక్యానికి పరమాహ్లాదభరితులయ్యారు.
    అంతరిక్ష వైద్యశాలలోని పరికరాలు క్రమక్రమంగా తమ శక్తిని కోల్పోతున్నాయి. లెనిన్ ను అక్కడ ఉండనివ్వడం ప్రమాదకరమనే నిర్ణయానికి వచ్చారు సోవియట్ శాస్త్రజ్ఞులు భూలోకంలో అయితే కనీసం ఆ మహానాయకుని శరీరాన్నయినా ద్రావకాలలో పదిలపరచవచ్చు. మున్ముందు వాతావరణ శాస్త్రం అభివృద్ధి చెందుతున్నకొద్దీ తమ ప్రయత్నాలను మళ్ళీ ప్ర్రారంభించవచ్చు.
    క్రెమ్లిన్ లోని లెనిన్ సమాధి పునరుద్ధరించబడిందని జనవరి 8వ తేదీని టాస్ వార్తా సంస్థ ప్రకటించింది.
    ఆ సాయంత్రం ఇవాన్ పూలదండతో లెనిన్ మాసోలియం ముందు క్యూలో నిలుచున్నాడు.
    
                                                                                                        (కల్పితం)
    
                                     ---౦౦౦---


Related Novels


China Yaanam

Annapurna Vari Chitralalo Sri Sri Geetalu

Sri Sri Mana Sangeetam

Srisri Kathalu

More