Home » Sree Sree » Srisri Kathalu
పంచపాండవులు
హైదరాబాదు వ్యవహారంలో అనవసరంగా జోక్యం కలిగించు
కున్నాడని ఒక తెలుగు యువకవిని ప్రభుత్వం వారు
నిర్భంధంలో ఉంచారు. ఏ ప్రభుత్వం అని నన్నడక్కండి.
నిర్భంధములో ఉంచడం ప్రభుత్వాల జన్మహక్కు.
ప్రభుత్వాలు ఉన్నంతకాలం నిర్భంధాలు కూడా ఉండితీర
వలసిందే ప్రభుత్వాలు నిర్భంధాలులేని ప్రపంచాన్ని
ఎప్పటికైనా మనం కళ్ళ జూడగలమా అనేది కూడా
ప్రస్తుతానికి అప్రస్తుతం ఇక అసలు సంగతి.
ఆ కవి జైల్లో కూర్చొని ఏవో పాటలూ, పద్యాలూ, కథలూ, కలలూ రాశాడు. వాటిలో ఈ దిగువ "కల" నా చేతిలో పడింది. ఇది నాకు ఎలా వచ్చిందని అడక్కండి. నాచేత అనవసరంగా అబద్దం ఆడించకండి. తొలినుంచి తుది దాకా ఇదో కల్పిత కథ అనుకోండి.
అప్పుడెవ్వరికీ ఏ యిబ్బందులూ ఉండవు. నిజానికి దీని మాతృక హెన్రీ ట్రీస్ రచనలో వుంది. ఓపిక వున్నవాళ్ళు వెతుక్కోవచ్చు. అప్పుడు తెలుస్తుంది. ఆ మాతృక కన్న ఈ రచన ఎంత భిన్నమో!
నా చేతిలో పడ్డ దస్తావేజు ఇది. "నిన్న రాత్రంతా సరిగా నిద్రపట్టలేదు. ఇక్కడికి నేనెందుకు వచ్చానో ఎలాగవచ్చానో తెలియదు. నేను చేసిన తప్పేమిటి? జీవితానికర్ధం ఏమిటి? దీనికో అభివృద్ధి. ఓ క్రమం ఉన్నాయా? నిజంగా ఈలోకం అభ్యుదయ మార్గంలోనే ప్రయాణిస్తోందా? ఏది సత్యం? ఏది నిత్యం? ఇవన్నీ ఆలోచిస్తుంటే ఎప్పుడో చిన్న కునుకుపట్టింది. ఎంతోసేపు కాదు. ఆ నిద్రలో ఒకపాడు కల కన్నాను మేలుకొన్న తర్వాత కూడా నా విశ్వాన్నీ విశ్వాసాన్నీ కుదిపివేస్తోంది ఆ ఘోరస్వప్నం.
నేనో ఆపరేషన్ టేబిల్ మీద పడుకున్నానట యుద్దంలో గాయాలు తిని పడిపోయిన నన్ను శత్రువులు ఖైదీగా పట్టుకొని ఒక పాతాళ గృహంలో పారేశారు. లేదా ఒక పెద్ద రావిచెట్టు వేళ్ళసందున పడుకున్నానేమో? అలా పడుకున్న నా శరీరంలో అన్ని భాగాలూ దృఢంగానే ఉన్నాయి.
అయినా ఏదో నీరసం ఏదో నిశ్శక్తి నన్నావరించింది. పురుగుకన్నా హీనంగా పడివున్నట్లనిపించింది.
ఏదో రాయాలని కలం తీయబోయానట. నా చెయ్యి దానంతట అది ఊడొచ్చింది. అరచేయీ అయిదువేళ్ళూ నా కళ్ళముందు గిరగిర తిరుగుతూ ఉంటే నా కళ్ళు కూడా తిరిగిపోయాయి.
అలా ఎంతసేపు కళ్ళూ కళ్ళముందు వేళ్ళూ తిరిగాయో తెలియదు. ఎప్పుడో ఈ పరిభ్రమణం హఠాత్తుగా ఆగిపోయి ఐదు వేళ్ళూ వరసగా నా కళ్ళముందు నిలబడ్డాయి. క్రమంగా అవి మనుషుల ఆకారం ధరించాయి. నిజంగా మనుషుల్లాగా కాదు. అప్పుడప్పుడు ఎండిపోయిన చెట్టు కొమ్మల్లోనూ నాచు కప్పిన పాడు గోడలమీద సముద్రతీరంలో కెరటాలు తినివేసిన రాళ్ళలోనూ మనకు మనుష్యాకారాలు కనపడవూ, అలాంటిరూపాలు.
కొంతసేపు జాగ్రత్తగా ఆ రూపాలను చూశాను. బాగా చూడడానికి అవకాశం ఇచ్చి తర్వాత అవి నీడల్లోకి తప్పుకున్నాయి. అయిదుగురూ అయిదు రకాల భీభత్సరూపంలో కనబడ్డారు.
మొదటివాడికి కళ్ళుండవలసినచోట రెండు ఆలిచిప్పలూ వాటిలో రెండు కుంకుడు పిక్కలూ ఉన్నాయి. కింది దవడ లేనేలేదు. చేతకాని కుర్రాడెవరో చేసిన మట్టి బొమ్మలాగున్నాడు.
రెండోవాడికి ఒకకాలూ, ఒకచేయి, ఒకచెవీ లేవు. ఒళ్లంతా వాచిపోయి గాలి ఊదిన రబ్బరు బొమ్మలాగా ఉన్నాడు.
మూడోవాడికి ఒంటినిండా కురుపులు. బహుశా అవి ముచ్చిరేకులు కాబోలు. భుజకీర్తులు ఊడిపోతే అవి మళ్ళీ అంటించుకోవాలని తాపత్రయ పడుతున్నాడు. నాలుగోవాడు అయిదోవాడు ఇంచుమించు ఒక్కలాగే ఉన్నారు. (అయిదోవాడు ఒక పిసరుపొట్టి అంతే భేదం) ఇద్దరినీ ఎండిపోయిన ఈతాకులతో చేసినట్టుంది. వాళ్ళ శరీరాలలో ఒక్కొక్క అంగానికీ ఒక్కొక్క జబ్బుపట్టుకొన్నట్టుంది. మొత్తం మీద అన్నీ కుళ్ళిపోవడపు వివిధ దశలను ప్రదర్శించుతున్నాయ్. ఎంతో ప్రయత్నం మీదగాని ఇది ముక్కూ -ఇది జుబ్బా, ఇది చెయ్యీ - ఇది పాదం అనిపోల్చుకోలేం. వాళ్ళ విశాలమైన వక్షస్థలాల మీద నుంచి అరటి నారలాంటి ఉత్తరీయాలని తొలగించి చూస్తే లోపలి శరీర భాగాలు కనిపించాయి.
వాటిని కూడా దారుణమైన రోగక్రిములు ఆక్రమించుకున్నాయి. వైద్యగ్రంథాల లోని త్రివర్ణ చిత్రాలలాగున్నారు వాళ్ళిద్దరూ.
అందరి పరిచయం నాకయిందని వాళ్ళకి పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాత అందరి తరపునా మొదటివాడు కిందిదవడ స్థానే తన చేతిని వాడుతూ బోధపడీ బోధపడని చప్పుళ్ళు చేస్తూ నోటినిండా వేడి కోడిగుడ్డు కుక్కుకొని నములుతున్నవాడు మాట్లాడినట్లుగా ఒక ప్రకటనచేశాడు.
"మేము అయిదుగురు అన్నదమ్ములం మా పేర్లు థ, భీ, అ, న, సహ! మహాభారత యుద్దానికి పొరవం మాకు పెద్దపెద్ద పేర్లు ఉండేవి. ఒక్కొక్క యుద్దంతో మానవజాతి అభివృద్ధి చెంది మా పేర్లు హరించుకుపోతూ వచ్చాయి. ఇంకో యుద్ధం వస్తే మాలో నలుగురి పేర్లు పూర్తిగా హరించుకుపోయి ఆనందంతో అసలే చప్పుడు చేయడం మానేస్తాయి. ఆఖరివాడొక్కడు మాత్రం సహకారంతో మిగులుతాడు. మేమంతా ఒక ఆకురూపమో, తీగరూపమో ధరించి మనందరికీ ఆశ్రయం యిచ్చే యీ రావిచెట్టు అభివృద్ధికి సాయపడతాము."
అందరికన్నా పెద్దవాడు ఈ కథ సరీగా చెప్పినట్లు నమ్మకం లేక మిగిలిన నలుగురూ ఒకరి తర్వాత ఒకరు నాముందు మాటలతో ఒకడూ, సంగీతంతో ఒకడూ, భరతనాట్యంతో ఇద్దరూ చాలా కష్టపడి చెప్పి నాకు బోధపరచడానికి ప్రయత్నించారు.
"ఇది వెనకటి కథే! ఇందులో కొత్తేమీలే"దన్నాను నేను భీకరంగా రెండోవాడు నావేపు చూసి ఇలా అన్నాడు. "బతకడం అనే జబ్బుతో బాధపడుతున్నావు నువ్వు. ఇప్పుడున్న వయస్సులో మానవజాతి మా కథని అర్ధం చేసుకోలేదు. నిన్ను తలదన్నిన వాళ్ళు వ్యాఖ్యానాలకి ప్రయత్నించి మరణంలో మంటగలిసి పోయారు. అన్నదమ్ముల యుద్దమనే ప్రధాన బీజంలోంచి బయలుదేరే రెండుదళాలు ఈ రావిచెట్టుగా ఎదుగుతున్నాయి. నువ్వు ఇంకో నూరేళ్ళు బతికినా ఈ రహస్యాన్ని గ్రహించలేవు. ఈ లోపున నువ్వు చచ్చిపోతే ఈ సృష్టికొక లోపం రాదు."
వాళ్ళు మాట్లాడడం మానేశారు. ద్వాపరయుగం కడచిపోయింది. ఈ లోపున సామ్రాజ్యాలు లేచాయి. పడిపోయాయి. మానవులు యుద్దాలు చేశారు. గెలిచారు. ఓడిపోయారు. అమోఘమైన స్వార్ధత్యాగాలని చరిత్ర లిఖించింది.
కోటికోటిసార్లు సూర్యుని ఉదయాస్తమయాలు సాగిపోగా కొత్త కొత్త మారణసాధనాలను మానవుడు కనిపెట్టగలిగాడు.
మళ్ళీ వాళ్ళు అన్నారు. "ఈనాడు చూస్తున్న ఈ వికార రూపాలలో నువ్వు మమ్మల్ని పోల్చుకోలేవు. స్వాతంత్ర్యం అంటే ఏమిటో తెలుసుకొని అనుభవించిన మేము భగవంతుని ధర్మశాసనాన్ని ప్రతిఘటించం. ప్రకృతి లిఖితాలకి జాగా ఇచ్చేపాలరాతి ఫలకాలం మేము. ఆవిడయొక్క జ్ఞానానికి, వైవిధ్యానికీ మేమే నిదర్శనం. జడుసుకోకు మమ్మల్ని చూసి! అనుక్షణం మా ఆకారం మారిపోతూనే ఉంది. ఈ చెట్టు లాగే కాని దీని మార్పులు చప్పున కనబడేవి కావు.
"మాకు ప్రసాదించబడ్డ ఈ రోగాలని అసహ్యించుకోవడం మానేశాం. కరుణా సముద్రుడైన భగవంతుడు పంపించినవి కాబట్టి ఆయన మాకు చేసిన మర్యాదను గుర్తించి అతడు పంపిన జబ్బులకు మా శరీరాలల్లో ఆతిథ్యం ఇస్తున్నాం. మా శరీరాలు ప్రకృతిదేవిగారి రసాయనిక పరిశోధనశాలలు. ఈ పరిశోధనలని అటకాయించడమంటే జీవితాన్నే అభ్యంతర పెట్టటమన్నమాట."
మన్వంతరాలు దొర్లి పోయాయి. మళ్ళీ వాళ్ళిలా అన్నారు. "మానవుడెప్పుడూ ఒక్క రూపంలోనే ఉండాలని ఎవరు శాసించారు? భగవంతుడి రూపమే ఎప్పటికప్పుడు మారిపోతోంది. సత్యం ధరించే స్వరూపాల సంఖ్యని నువ్వు లెక్కపెట్టగలవూ? సౌందర్యం ఈనాటిదా? అయితే మానవుడొక్కడే ఎంచేత ఈ విశాల విశ్వంలోని అన్ని రూపాలనీ ధరించి అన్ని జీవితాలనీ అనుభవించలేడు? ప్రయత్నించు. అవి నీకు అతి సమీపంలోనే అందుబాటులో ఉన్నాయి."
అయిదు ఆకారాలు నా చుట్టూ తిరుగుతూ పాడుతూ ఆడుతున్నాయి. "నీకు విముక్తి తెస్తున్నాం. నీకు స్వాతంత్ర్యం ఇస్తున్నాం. నీకు దేవుణ్ణి బహుమానం చేస్తున్నాం." అని ఉచ్చైస్వరంతో వాళ్ళు ఆలాపన సాగించారు.
నేను నోరు తెరవబోయాను. కింది దవడ కిందపడిపోయింది. నాకళ్ళు లోపలికి పోయి నోట్లోకి వచ్చేస్తున్నట్లనిపించింది. నాలుగోవాడు తన కురుపుల వేళ్ళతో నన్ను నిమురుతున్నాడు.
వాడు నిమిరిన చోట నాకు రెక్కలు మొలిచినట్లయింది.
"మేము నీ స్నేహితులం. మమ్మల్ని నమ్మ్జు! జీవితపు తాళపు చెవులు నీ చేతిలో పెడుతున్నాం. దేవుడికి నిన్ను చేరువగా తీసుకువెడుతున్నాం" అన్నారు వాళ్ళు.
భయంతో కళ్ళు తెరిచాను నా జైలుగది! చీకట్లోనే పోల్చుకున్నాను. భగవంతుడనీ, అభ్యుదయమనీ, సత్యమనీ, ధర్మమనీ, సుఖదుఃఖాలనీ జనన మరణాలనీ మనం అనేస్తున్నప్పుడు మనకే తెలియకుండా ఎంతెంత ప్రచండశక్తులని మేలుకొల్పుతున్నామో ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగదూ?
రెక్కలు ధరిస్తే మాత్రం ఎక్కడికి వెళ్ళగలవోయ్ మానవుడా?
---౦౦౦---



