Home » suryadevara rammohan rao » Anitara Sadhyudu
నాయకిని అమితంగా ప్రేమిస్తారు, ఆరాధిస్తారు.
వార్ని అమితంగా ఆకర్షించేది నాయకి అద్భుతమైన వ్యక్తిత్వం.
ఆమె కళ్ళలో ప్రేమ వుంటుంది.
కాంక్ష వుంటుంది.
మృదు మధురమైన అపార అనురాగ ఝురి ఆమె కళ్ళలో నిండుగా తొణికిసలాడుతుంటుంది.
కొద్ది క్షణాలు వారి మధ్య నిశ్శబ్దం అలుముకుంది.
భావానికి, భాషకు అందని బాధాకరమైన ఎడబాటు వారిని మూగవాళ్ళను చేసింది.
రెస్టారెంట్ లో డిమ్ లైట్స్ వెలిగాయి. నలుపు, తెలుపుల విచిత్ర సమ్మేళనం...
ఉత్తర అమెరికా తెల్లవాళ్ళు... దక్షిణ అమెరికా నుంచి వచ్చి స్థిరపడ్డ బాక్స్... కలిసి.
హడావిడిగా వుంది రెస్టారెంటంతా. "నిన్ను పెళ్ళి చేసుకోబోయే వ్యక్తి గొప్ప అదృష్టవంతుడు. ఎన్ని జన్మలు పుణ్యం చేసి, మరెన్నో జన్మలు తపస్సు చేసుంటాడు నీకోసం" క్రీస్టినీ ఆరాధనగా చూస్తూ అంది.
"నువ్వంటుంటావే అప్పుడప్పుడు- ఒక ఆడ, మగ జీవితాంతం హండ్రెడ్ పర్సెంట్ ఆనందంగా, అన్యోన్యంగా వుండాలంటే చాలా పద్ధతులు అవలంభించాలని. నీవు చెప్పే ఆ పద్ధతులే మాకు అప్పుడప్పుడు గుర్తు కొస్తుంతాయి. అందుకే అంటాను క్రీస్టినీ ఈజ్ టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని. నిజంగా నీక్కాబోయే భర్త చాలా అదృష్టవంతుడు" మాంటే ఎమోషనల్ గా అంది.
నాయకి చటుక్కున ఇద్దరి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని సుతారంగా వాటిని పెదాలతో స్పృశించింది.
"ఇదే... ఈ అదృష్టమే ఏ మగవాడికి దక్కుతుందో... ఐయామ మేడ్... నేను నిజంగా మగవాడ్నే అయుంటే నిన్ను... నిన్ను..." తన క్రింద పెదవిని పై పంటితో కాంక్షగా నొక్కుకుంటూ కన్నుగీటింది.
నాయకి గలగలా నవ్వింది. చీరను నిండుగా సర్దుకుంది- వారికేసి కొంటెగా చూస్తూ.
తెల్లనిది ఆమె పలువరుస. దానిమ్మ గింజల్లాంటి పొందికైన ఆరోగ్యవంతమైన పళ్ళు తళుక్కున మెరిశాయి.
యోగాతో మేను మిలమిలా మెరుస్తుంటే. ఎయిరోబిక్స్ తో శరీరం పొందికగా, అత్యద్భుతంగా ఎక్కడికక్కడ అవయవాలు పేర్చినట్లుంటుంది నాయకి.
వాతావరణం ఆహ్లాదకరంగా వుంది. రాబోతున్న వర్షాన్ని సూచిస్తు చల్లని ఈదురుగాలి ప్రారంభమైంది.
నాయకిని చూసి ఆకర్షితులైన ఇద్దరు అమెరికన్ యువతులు కట్టు, బొట్టుతో పాటు జుత్తును కూడా అందంగా, పొడవుగా పెంచుకున్నారు.
ఆ జుత్తే వార్నిప్పుడు అల్లరి పెడుతోంది గాలివాటుకు రేగిపోతూ.
మిచిగాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఫేకల్టీలో ఒక ఇండియన్ గర్ల్ కి ఫస్ట్ ర్యాంక్ రావటం లక్షలాది మంది అమెరికన్స్ ని, వేలాదిమంది మూరోపియన్స్ ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఆమె అక్కడ ఏ పార్టీకి వెళ్ళినా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యేది. క్రిస్టీని, మాంటే వాళ్ళ ఆచారం ప్రకారం, వారికి లభించే స్వేచ్చతో ఏ పార్టీకి వెళ్ళినా నదురుగా కనిపించే ప్రతిమగవాడితో ఒకింతసేపు డాన్స్ చేసేవాళ్ళు.
నాయకి ఓచోట చూస్తూ కూర్చుండి పోయేది. ఆమెకన్నీ తెలుసు. అన్నీ వచ్చు... కాని... కానీ... అంతే ఆమె.
అమెరికన్ యువకులు చాలామంది నాయకితో డాన్స్ చేయాలని ఉత్సాహపడేవారు. మరికొందరు మితిమీరిన లాలసతో బలవంతపెట్టి డాన్స్ కి లాక్కుపోవాలని చూసేవాళ్ళు.
పెదాలతో నవ్వుతూ, కళ్ళతో హెచ్చరిస్తూ వార్ని దూరంగా వుంచగలిగేదామె.
"నాయకి... ఎప్పటిలోగా మేచ్ సెటిల్ చేసుకుంటావు? నీ పెళ్ళికి మేం తప్పక రావాలి. తప్పక పిలుస్తావుగదూ. లేదంటే చంపేస్తాం. నీ పెళ్ళి చూడాలన్న ఆకాంక్ష కంటే కాబోయే నీ బెటరాఫ్ ఎలా వుంటాడో చూడాలన్న ఆతృతే ఎక్కువగా వుంది" క్రీస్టినీ జారిపోతున్న పట్టుచీరెను భుజంపైకి లాక్కునేందుకు ఇబ్బందిపడుతూ అంది.
నాయకి చిర్నవ్వుతో చూస్తూ క్రీస్టిని చీరను ఆమె భుజంపైకి సర్దింది.
"ష్యూర్... ష్యూర్... మీరు లేకుండా నాపెళ్ళి ఎలా జరుగుతుంది?" అంది ఆమె కుర్చీలో వెనక్కి వాలుతూ.
"ఇంకా నయం... అలా చేసేవు... నీ మొగుడ్ని ఎగరేసుకొని ఏ ద్వీపానికో వెళ్ళిపోతుంది. అలా నమ్మవద్దు. ఏదో నేనంటే ధైర్యంగా అక్కడే మీ దేశంలోనే సెటిల్ అయిపోతాను...."
"నాయకి భర్తతోనా?"
ఆ ఇద్దరు ఒకరు మీద ఒకరు జోకులేసుకుంటుంటే ఆమెకు భలే సరదా.
"మీరిలా మాట్లాడుకోవడం మీదేశంలో మామూలుగా అనిపించినా మా దేశంలో అయితే, నా స్థానంలో మరో యువతి వుంటే మిమ్మల్నిద్దర్నీ ఇక్కడే ఉతికిపారేసేదే" నవ్వుతూ అంది నాయకి. సరిగ్గా అప్పుడు ఓ యువకుడు వారికేసి వడివడిగా రాసాగాడు.
అతని పేరు రాబర్ట్ క్రీస్టినీ.
క్రీస్టినీకి సోదరుడు....
ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో పిహెచ్.డి చేసాడు.
ప్రస్తుతం ఫోర్డ్ ఎంపైర్ లో ఎగ్జిక్యూటివ్ డిజైనింగ్ ఇంజనీర్.
దూరం నుంచే రాబర్ట్ ని చూసిన నాయకి అతని రాకపట్ల తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ -
"క్రీస్టినీ! మీ బ్రదర్ వస్తున్నాడు" అంది.
ఆ ఇద్దరూ ఒకేసారి తలతిప్పి అతనికేసి చూశారు.
అతను అప్పటికే వారికి దగ్గరగా వచ్చి గ్రీట్ చేశాడు.
"హలో... నాయకి... హౌ ఆర్యూ?" అన్నాడు పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ.
"ఫైన్... థాంక్యూ" అందామె ఆహ్లాదంగా.
"ఎప్పుడు ప్రయాణం?" అతని కంఠంలో గూడు కట్టుకున్న బాధను క్రీస్టినీ, మాంటేకంటే నాయకి సరిగ్గా గుర్తించగలిగింది.
అక్కడున్న ఆ ముగ్గురికి తెలుసు- అతను నాయకిని ఎంతో కాలంగా ఆరాధిస్తున్నాడని.
పట్టువదలకుండా నిరంతరం పరిశోధనలో మునిగి తేలుతుండే రాబర్ట్ దృష్టిని ఆకర్షించిన మొట్టమొదటి స్త్రీ నాయకి.
నూటనలభై పాయింట్స్ ఐక్యూ వున్న ఓ మేధావిని, అమెరికన్ ఘోటక బ్రహ్మచారిని ఆకర్షించగలిగిన స్త్రీ అమెరికన్ కాదు - ఒక ఇండియన్ - ఈ విషయం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుండేది.
తన ఆలోచనలలో ఎక్కువ భాగం పరిశోధనకే కేటాయించే ముప్ఫై అయిదు సంవత్సరాల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రాబర్ట్ కి నాయకి సైకలాజికల్ యాంకర్!
అతనెప్పుడూ ఎక్కువ మాట్లాడేవాడు కాదు. కళ్ళతోనే ఎన్నో భావాల్ని వ్యక్తపరచటం అతని ప్రత్యేకత.
నాయకి నుంచి అతనేం ఆశిస్తున్నాడో రెండు సంవత్సరాల తర్వాత కూడా బయటకు చెప్పుకోలేకపోయాడు.



