Home » Balabhadrapatruni Ramani » అనూహ్య

                          

                                  7 వవారం   సీరియల్ 

      "విజయా! ఫ్రెండ్స్ కి  కన్సెషన్ ఇస్తావా?" అని అడిగాడు వివేక్. నేను అతనివైపు కోపంగా చూశాను.
    అతను నా వైపు చూడలేదు. బేరర్ తెచ్చన డ్రింక్స్ తీసుకుంటున్నాడు. విజయ గంభీరంగా  ముఖంపెట్టి-
    "నో...నో... బిజినెస్  దగ్గర  మొహమాటాలు లేవు!" అంది
    "అవతలివాళ్లు అర్ధకంగా నిరాధారులైనప్పుడో!" శ్లేషగా అడిగాడు.
    విజయ్ నవ్వుతూ- "ఏం? ప్రాక్టీసు మానేశారా  తమరూ?" అంది.
    "నా గురించి కాదు!" డ్రింక్ సిప్ చేస్తూ అన్నాడు.
    నేను అక్కడినుండి వారికి  దూరంగా వెళ్ళి పోయాను. అతని మాటలూ, చేష్టలూ నా అభిమానాన్ని గాయపరుస్తున్నాయి.
    వివేక్ ఎవరితోటో మాట్లాడ్తూ, నవ్వుతూ నాకు  దూరంనుంచి కనిపిస్తున్నాడు.
    వివేక్ చాలా  పొడగరి! పోడుక్కితగ్గ లావుతో హేండ్సమ్ గా వుంటాడు. అందుకే కన్నెపిల్లలు సైతం అతని వెంటపడిపోతుంటారు.
    భోజనాలప్పుడు ప్లేట్ తీసుకుని విజయ నా దగ్గరకొచ్చి నిలబడి- "వివేక్ తో మాట్లాడుతున్న అతన్ని చూశావా?" అంది.
    నేను అటు చూశాను, నల్లగా పొట్టిగా వున్న ఓ వ్యక్తి  వివేక్ తో మాట్లాడుతున్నాడు.
    "ప్రతాప్ అని  పెద్ద బిజినెస్ మెన్... ప్రస్తుతం నా క్లైంట్" అంది విజయ.
    "విడాకుల కేసా?" అడిగాను.
    అది నవ్వి- "కాదు....ఏదో ఆస్తి తగాదాట, కొంచెం పర్సనల్ గా మాట్లాడాలంటున్నాడు. నేనిప్పుడు అతనితో  వెళ్తున్నాను" అంది.
    నేను దాని దైర్యానికి విస్తుబోతూ చూశాను పెళ్ళి చేసుకోమంటే 'ఇంకా  ఆ అవసరం అనిపించడంలేదు' అంటుంది. హాయిగా ఇంకా 'మిస్' గానే తిరుగుతోంది. ఏమీ 'మిస్' కావడంలేదేమో బహుశా!
    "రేపు కలుస్తాను...బై!" అని వెళ్ళిపోయింది.
    నాకేం తినబుద్ధి కావడంలేదు. ప్లేట్ పెట్టేసి శీఖా దగ్గరికి వెళ్ళాను చుట్టూ చాలామంది చేరి శీఖా దంపతులని అభినందిస్తున్నారు. అందరూ తప్పుకునేదాకా వెయిట్ చేసి అప్పుడు వీడ్కోలు చెప్పాను.
     శీఖా నా చెయ్యి పట్టుకుని  నొక్కి - "ఔనూ...వివేక్ మళ్ళీ వస్తానన్నాడా?" అంది.
    నేను ఆశ్చర్యంగా "వెళ్ళిపోయాడా?" అన్నాను.
    "ఆఁ! చాలా  సేపైంది" అంది.
    "మరిచిపోయుంటాడు" అని  నవ్వాను మనసులో మాత్రం చాలా అవమానంగా వుంది.
    శీఖా  చిన్నగా నవ్వి- "ఏం మగవాళ్ళు వీళ్ళూ కట్టుకున్న  భార్యల్నికూడా మరిచిపోతుంటారా! ఎక్కువగా డ్రింక్ చెయ్యలేదు కూడానూ... ఎవరినైనా డ్రాప్ చెయ్యమంటావా?" అంది.
    "నో...థాంక్స్ నేను వెళ్ళిపోగలను గుడ్ నైట్ " అని బయటికి  నడిచాను.
    రోషం, దుఃఖం  ఎగసిపడ్తూ నా గుండెలు  బరువెక్కాయి. కంటికి నీటితెర అడ్డుపడి ముందున్న రోడ్డు కనిపించడం మానేసింది చీకటి భయపెడోంది. వివేక్ ని చూశాకా దైర్యంగా ఇంతసేపు వుండిపోయాను. లేకపోతే వెలుతురు వుండగానే  వెళ్ళిపోయేదాన్ని!
    అందరి కార్లూ, స్కూటర్లూ నన్ను దాటుకుని ముందుకి దూసుకుపోతున్నాయి.
    సమయం తొమ్మిది కావస్తోంది.
    గబగబా నడుస్తున్నాను. చీరకుచ్చిళ్ళు  కాళ్ళల్లో అడ్డం  పడ్తున్నాయి. ఇంతలో  వెనకనుండి ఓ ఆటో వచ్చి నా పక్కన ఆగింది.
    "కా...జానా?" ఆటో డ్రైవర్ తల బయటికి పెట్టి  ముద్దముద్దగా అడిగాడు ఎర్రని  కళ్ళతో  అచ్చు సినిమాల్లో విలన్ లా కనిపించాడు.   
    నేను తల అడ్డంగా  ఊపి నడక వేగం పెంచాను.
    ఆటో స్లోగా నన్ను ఫాలో అయింది.
    నా చేతికున్న రాళ్ళగాజులూ, చెవుల రవ్వల దుద్దులూ చమక్కుమని మెరుస్తున్నాయి! కొంగు నిండా కప్పుకున్నాను. బస్ స్టాపులో ఎవరూ లేరు. నన్ను నేను తిట్టుకుంటూ నిలబడ్డాను.
    'అంతా నా ఖర్మ! శీఖా ఎవరినై నా తోడిచ్చి పంపుతానంటే ఒప్పుకోవల్సింది. అనవసరమైన భేషజాలకి పోయాను. ఇప్పుడు ఏమిటి దారి? భయంతో ఏడుపోచ్చేస్తోంది. ఇటువంటి లోకాలిటిలలో ఆటోలూ, మనుషులూ కనిపించరు. గొప్పవాళ్ళు కార్లలోంచి బయటికి కూడా చూడరు!
    ఈ ఆటోడ్రైవర్ ఇంకా ఇక్కడే వున్నాడు. ఒంటరిగా  వున్న నామీద  ఏమైనా అఘాయిత్యాం చేస్తేనో! నాకు రోజూ  న్యూస్ పేపర్లో  చదివే వార్తలూ, సినిమాల్లో చూసే సీన్లూ గుర్తొచ్చి భయంతోళ్ళంతా చల్లబడిపోతోంది.
    ఆటోడ్రైవర్ ఆటోని కాస్త దూరంలో ఆపి, ఆటోలోంచి దిగాడు. అతని నోట్లోని చుట్టపీక ఎర్రగా మండుతోంది. అది నన్ను  భస్మం చెయ్యడానికి గురి పెట్టిన ఆగ్నేయాస్త్రంలా కనిపించింది.
    అతను నావంకే తినేసేలా  చూస్తున్నాడు. వాడి తలలో ఏం పాపిష్టి ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయో! నా నోరు  నొక్కి బలవంతంగా ఆటోలో వేసుకుని వెళ్ళిపోతే ఎవరు దిక్కు? మాటిమాటికీ ఆటో అతనివైపే చూస్తున్నాను. అలా చెయ్యడం తప్పని తెలుస్తోంది. కానీ తప్పించుకోలేకపోతున్నాను బస్ వచ్చే సూచనలేం లేవు!
    అతను ఏదో  పాట పాడ్తూ బస్ స్టాప్ వైపు వస్తున్నాడు. నా గుండెలు దడదడా కొట్టుకున్నాయి. అతను వచ్చి నన్ను పట్టుకున్నాకా  అరవలేనేమో, ముందుగా అరిచేస్తేనో! అనిపించింది. మరీ పూలిష్ గా ఆలోచిస్తున్నానేమో అనిపించి  ఊరుకున్నాను.
    "టైమ్ క్యాహువా?" నన్నే అడుగుతున్నాడు.
    వణికే గొంతుతో "నైన్ టెన్" అన్నాను.
    "హిందీ మే బొల్!" అన్నాడు.
    "నై మాలూమ్" దైర్యంగా అనేశాను.
    అతడు నన్ను నిశింతగా చూసి, నోట్లోంచి చుట్ట పీక తీసి క్రిందపడేసి చెప్పుతో నలిపేశాడు.
    అదేదో సినిమాలో చూపించే సింబాలిక్ షాట్ లా  అనిపించి మరీ  భయమేసింది.
    ఓసారి  ఖాండ్రించి ఉమ్మేశాడు 'ఛీ' అనుకున్నాను.
    తర్వాత జేబులోంచి దువ్వెన తీసి తల దువ్వుకున్నాడు. ఎంత వద్దనుకున్నా అతన్నె క్రీగంట గమనిస్తున్నాను.
    ఏదో పాట పాడుతున్నాడు. బూతు పాటేమో! 'అర్ధంకావడంలేదు కాబట్టి సరిపోయింది' అనుకున్నాను.
    అతను రెండు అడుగులు ముందుకి వేశాడు.
    నేనూ రెండు అడుగులు ఎడంగా వేశాను.
    "మీరు ఈ ఊరికి  కొత్తనా?" బొంగురుగా అడిగాడు.
    'ఊరికి కోత్తపిట్ట' అనుకుంటున్నాడు కామోసు అనిపించి, తల అడ్డంగా  ఊపాను.
    "బస్ స్టాఫ్ ఇది కాదు. మార్చి చాలా  దినాలైంది. ఆ రోడ్డు మలుపులో పెట్టిండ్రు" అన్నాడు.
    "ఆఁ! అన్నాను.
    మరి  ఇందాకట్నుంచీ చెప్పడేం అనిపించింది ఏం చెయ్యాలో పాలుపోవడంలేదు. అలా అంటే విధిలేక వీడి ఆటో ఎక్కుతాననుకుంటున్నాడేమో, చచ్చినా ఎక్కను అనుకున్నాను.
    ఇంతలో ఓ ఆటో రయ్యిన నన్ను దాటుకుంటూ పోతూ కనిపించింది. గబుక్కున చెయ్యి ఎత్తి ఊపెశాను.
    కానీ అంతలోనే  పక్కనున్న ఆటోడ్రైవర్ ఏమనుకుంటాడోనని భయంగా చూశాను.
    ఆ ఆటో ఆగింది.
    నేను ఆనందంగా ఆటోవైపు పరిగెత్తాను. కానీ  ఆటోని సమీపిస్తూ వుంటే నా ఆనందం  అంతా నీరుగారిపోయింది.
    అందులో అప్పటికే  ఎవరో వున్నారు! నేను నిరాశగా వెనుతిరుగుతూవుండగా....
     "అనూహ్య... ఎక్కు" అని వినిపించింది.
    ప్రాణాలు పోతున్నప్పుడు సంజీవనీ వేరు తాకించినట్లుగా అనిపించి ముందు కెళ్ళి చూశాను.
    బొంగరంమావయ్య తల బయటికి పెట్టి "ఎక్కు.... త్వరగా" అన్నాడు.
    నేను ఆలోచించలేదు, గభాల్న ఎక్కేశాను.
    ఆటో స్టార్టయింది.
    "ఇంత రాత్రివేళ ఎక్కడినించీ?" అన్నాడాయ.
    గుప్పున కొట్టింది బ్రాందీ వాసన!
    "ప్రెండ్ ఇంటినుంచి" అన్నాను.
    అతను నన్ను తాకుతూనే కూర్చున్నాడు. నాకు ఇంక జరగడానికి స్ధలం లేదు. పెనంమీద నుంచి పొయ్యిలో పడలేదుకదా అనిపించింది.
    బొంగరంమావయ్య చాలా అసందర్భమైన టాపిక్ మొదలు పెట్టాడు. ఆయన యవ్వనంలో వుండగా జరిపిన మెరకవీధి భాగోతాల గురించి... నాకు ఒళ్ళంతా కారం రాసుకున్నట్లుగా  మండిపోతోంది. 'అసలు ఈ ఆటోడ్రైవరూ, ఈయన కలిసి నన్ను  ఎక్కడికైనా తీసుకెళ్ళి....' అని ఆపై ఆలోచించలేక ఆంజనేయస్తోత్రం చదువుతూ కూర్చున్నాను.


Related Novels


Priyathama O Priyathama

Trupti

Swargamlo Khaideelu

Madhuramaina Otami

More