Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


                                                       ఆలోచనామృతము:

    1. సాహిత్యము విరాట్ రూపము కలది. దానికి అనేక ప్రయోజనములు ఉన్నవి. వ్యాసమహర్షి అప్రయోజములను అన్నింటిని పొందుపరచినాడు.
    "నసుఖాల్లభతే సుఖం" అన్నాడు వాల్మీకి. సుఖములకు కథలు లేవు. కష్టములకే కథలున్నవి. కష్టముల కథలు కోకొల్లలు. సాహిత్యమంతయు సుమారు కష్టములు, సంఘర్షణల కథలతోనే నిండి ఉన్నది. ఇది సాహిత్య ప్రకృతి. ఇది మారుట దుర్లభము.
    భారతీయ సాహిత్యము చాలావరకు సామాజికము. అందువలన అందలి కథలన్నియు సుఖాంతములు. సత్యము, న్యాయము, ధర్మములకు విఘాతములు కలుగును. కాని చివరకు విజయము లభించునని నిరూపించి జనులను సత్యమార్గమునకు ప్రోత్సహించును.
    పాశ్చాత్య సాహిత్యమున త్రాసదములకు ప్రాముఖ్యత ఉన్నది. అవి దుఃఖాంతములు. అవి వైయుక్తికములు. వ్యక్తిమనమున చాలా కాలము నిలిచిపోవును. అందుగురించి అతనిలో ఆలోచనలు రేకెత్తించును. కాని సామాజికముగా దానికి అంత ప్రయోజనము ఉన్నట్లు కనిపించదు.
    మానవ జీవితమున దుఃఖములు మాత్రమే లేవు. సుఖములు కూడ ఉన్నవి. దుఃఖముల కాలము బహుదీర్ఘముగా కనిపించును. ఇక అది అంతముకాదు అనిపించును. ఆ గడ్డుకాలము తననే అంతము చేయును అనిపించును. అట్టి సమయమున సాహిత్యము వారిని ఆదుకొనును. మీ వంటి వారు మరికొందఱున్నారు. వారు మీవలెనే బాధలు పడినారు. కాని చివరకు విజయము వారిని వరించినది అను కథ సాహిత్యము చెప్పును.
    కష్టములలో ఉన్నవారికి తోడున్న కొంత బలము. గెలుతుమన్న కొంత ఆశ. స్థైర్యము, ఆశ ఉన్నవాడు దేనినైన సాధించవచ్చును. సాహిత్యము ఆశ, స్థైర్యము మున్నగు వానిని కలిగించును. బృహదశ్వునితో ధర్మరాజునకు నల దమయంతుల కథ చెప్పించి వ్యాస మహర్షి ఆ ప్రయోజనమును సాధించినాడు.
    నలునకు ధర్మరాజునకు కథలలో పోలికలున్నవి. ఉభయులు మాయాజూదమున ఓడినారు. ఉభయులు అడవులు పట్టినారు. నలుడు అజ్ఞాతవాసము చేసినాడు. ధర్మరాజు చేయవలసి ఉన్నది. నలుడు యుద్ధమునకే సిద్దమయి పోయినాడు. నలుడు జూదమున భార్యను పణముగా ఉంచినాడు. ధర్మరాజు భార్యను ఓడినాడు. నలుడు జూదమాడి పుష్కరుని ఓడించినాడు. తిరిగి రాజ్యము సాధించినాడు. ధర్మరాజు సహితము యుద్ధమునకు, జూదమునకు రెండింటికి సిద్ధము కావలసి ఉన్నది. అర్జునుడు యుద్ధమునకు సన్నద్ధుడు అగుచున్నాడు. బృహదశ్వుడు ధర్మరాజునకు అక్షవిద్యను ఉపదేశించినాడు.
    నలుని కథ చెప్పి ధర్మరాజునకు ధైర్యము, కర్తవ్య బోధ కలిగించినట్లయినది.
    2. నలునిలో కలి ప్రవేశించినది అనిన ఒక దుర్భుద్ధి, దురాలోచన, దురలవాటు ప్రవేశించినది అని అర్థము. నలుడు వీరుడు సత్పురుషుడు. జూదమను దురభ్యాసము అతనిలో చేరినది. ఆ దురభ్యాసము, రాజ్యమును, సంపదను, భార్యను హరించినది. నలుడు అక్షవిద్య నేర్చిన తరువాత అతనిని కలి వదలినాడు. ఆవిద్యతో అతనికి ఆత్మవిశ్వాసము కలిగినది. ఆత్మవిశ్వాసము కలిని వదిలించును. విజయము కలిగించును.
    నేటికిని నలుని వంటివారు అనేకులున్నారు. వారు నలుని కథ వలన ప్రయోజనము పొందుటకు వీలున్నది.
    3. నల దమయంతుల కథకు అనేక కోణములున్నవి. ఇదొక చక్కని సుందరమయిన కథ. అందుకే శ్రీహర్షుడు ఈ కథను వస్తువుగా తీసుకొని "నైషధము" అను సంస్కృత కావ్యము రచించినాడు. శ్రీనాధుడు "శృంగార నైషధము" అను తెలుగు కావ్యమును రచించినాడు.
    ఇది ఒక చక్కని ప్రేమ కథ. ఆధునిక నవలలో వలె కథానాయకుడు, నాయకి, విలను, విఘాతకులు అందరు ఉన్నారు.
    నల దమయంతులు ఒకరికి ఒకరు తెలియరు. అయినను ప్రేమించుకున్నారు. ఒకరిని గురించి ఒకరు విని ప్రేమించుకున్నారు. ఇది అసాధ్యము కాదు. ఈమధ్య టెలివిజనులో చూచుకొని ప్రేమించుకున్న యువతీ యువకులు ఉన్నారని వార్త చదివినాము.
    వారిద్దరు పడుచువారు. చాలా దూరమున ఉన్నారు. సందేశము అందించేవారు లేరు. రచయిత హంసను ప్రవేశపెట్టి అద్భుతము చేసినాడు. మనిషికన్న పక్షి నయమని నిరూపించినాడు. పక్షి వారిని కూర్చినది. మనిషి వారిని విడగొట్టినాడు. హంస దమయంతి సందేశము అందించు దృశ్యమును రవివర్మ ఎంతో అందముగా చిత్రించినాడు. అది మనసులను దోచుకొని చిత్రము.
    దమయంతిని పరీక్షించుటకు దేవతలు వచ్చినారు. నలుని నీచ కార్యమునకు పంపినారు. దమయంతికి నలుని మీద ఉన్నంత నమ్మకము నలునికి దమయంతి మీద ఉన్నట్లు కనిపించదు, అందుకే అతడు ఆమెను పరీక్షించదలచినాడు. దేవదూతగా వెళ్లినాడు.
    ఆడది ఆత్మార్పణము చేయును. మగవాడు అనుమానాల పుట్ట. ఆమెను పరీక్షించుచునే ఉండును.
    దమయంతిని పెండ్లాడుటకు నలుని ప్రయత్నము అంతగా లేదు. నలుని వివాహమాడుటకు దమయంతి తపస్సు చేసినది తపస్సు. ఆమె దేవతలను ఎదిరించినది. తన ప్రియుని కనుగొన్నది. వరించినది. పూలమాల వేసినది.
    ఇది ప్రేమ కథలకు మూలము. స్త్రీ అమయాకముగా పురుషుని నమ్మును. వలచును. వలపించును. మోసపోవును. ఇది అనాదిగా వచ్చుచున్న కథ. శకుంతల మోసపోయినది. కుంతి మోసపోయినది. ఇప్పుడు దమయంతి మోసపోయినది.
    నల దమయంతుల పెళ్లి జరిగినది. ఆమె ఇద్దరు బిడ్డల తల్లి అయినది. భర్త వ్యసనములలో పడ్డాడు. తన దగ్గరికి రాడు, తన బిడ్డలను అలరించడు. రాత్రింబవళ్ళు జూదమాడుచుండును. ఆమె ఎంత కుమిలి ఉండును. ఎంత కృంగి ఉండును!
    అటువంటి మగలు ఇప్పుడు లేరా! అట్లు కృశించు భార్యలు లేరా?
    పుష్కరుడు దమయంతిని ప్రేమించినాడు. దమయంతి అతనిని తిరస్కరించినది. ఆ కసి తీర్చుకొనుటకు నలుని జూదమున దింపినాడు. జూదమాడి దమయంతిని సాధింతమను కున్నాడేమో! అది కుదరలేదు.
    జూదమాడు భర్తను మానిపించదలచినది దమయంతి. ఎంతమందితోనో చెప్పించినది. తాను స్వయముగా కొంగు కప్పుకొని సభకు వెళ్లినది. వారించినది. భర్త మానలేదు. దమయంతి భార్య మాత్రము కాదు. ఇద్దరు పిల్లల తల్లి. బిడ్డలను గురించి ఆలోచించినది. వారిని పుట్టింటికి పంపినది. అన్నింటికీ సిద్ధమయి నట్టింట కూర్చున్నది. పుష్కరుడు రాజ్యము గెలిచినాడు. దమయంతిని గెలువలేక పోయినాడు.


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More