Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam


    "ఇది న్యాయమా?" దమయంతి పెదవి కదలినది. ధ్వనిలో ఆవేదన, ఆవేశము ఉన్నవి." నల మహారాజు నన్ను అగ్నిసాక్షిగా పెండ్లాడినాడే! దేవతలను కాదని నేను అతనిని వలచితినే! ఏమి చేసినానని అంత నిర్దయుడు అయినాడు? అడవిలో నన్ను విడువనని, భయపడకుమని మాట ఇచ్చినాడే! ఎందుకంత కఠినుడు అయినాడు. నన్ను నట్టడవిలో విడిచి ఎందుకు పోయినాడు? ఎందుకు పోయినాడు?" అని జలజల కన్నీరు రాల్చినది.
    భీమరాజు, మహారాణి నిస్సహాయులయి చూచినారు.
    "ఇది న్యాయమా?" నలుడు దమయంతిని అడిగినాడు. ఉప్పెనలు దిగమింగి మాట్లాడినాడు. దుఃఖమును అణచుకున్నాడు. నలుడు మగవాడు. "నన్ను కలి పురుషుడు పట్టినాడు. నా తపోబలమున అతనిని పారద్రోలినాను. నిన్ను చూచుటకు పరితపించి వచ్చినానే! నీవు రెండవ స్వయంవరము రచించినావు. మరొక పురుషుడు ఇంకొక మగడు కావలెననుకున్నావే? ఇది ధర్మమా?" సూటిగ అడిగినాడు. దమయంతి మనసున సూదులు గుచ్చినాడు.
    "దైవమా! నిజము నిరూపించుము" అని దమయంతి చేతులు జోడించి ప్రార్థించినది "మహారాజా! నన్ను నమ్ముము. ఇదంతయు నేను రచించిన నాటకము. నిన్ను కనుగొనుటకు ఇచటికి రప్పించుటకు చేసిన ఉపాయము. నిన్ను వెదకుటకు పంపిన వారిలో అయోధ్యకు చేరిన పర్ణాదుడు నిన్ను గురించి చెప్పినాడు. అప్పుడు నీవు బయటపడలేదు. అట్లయిన నీవు వత్తువని స్వయంవరమను నెపము పెట్టినాను. నీవు వచ్చినావు. కేశిని వలన నిన్ను కనుగొన్నాను. మహారాజా! ఇది వట్టి నెపము. నిజముకాదు. రాజులెవరు లేరు. నీకు తెలియుటలేదా!" అని దమయంతి నలుని పాదములపైబడినది. కన్నీటితో కడిగినది. "నాకు ఎటువంటి పాప బుద్ధిలేదు. నమ్ముము. ఓ సూర్యచంద్రాది దేవతలారా! ఓ వాయుదేవా! నన్ను రక్షించండి. నిజము నిరూపించండి. నా మగనికి నామీద నమ్మకము కలిగించండి. ఇంక ఎట్లు చెప్పుదును? ఎట్లు నమ్మింతును?" అని వాపోయినది. తనకు దిక్కెవరని నలుదిక్కుల చూచినది.
    "అనుచున్న యవసరంబున నఖిలభూతాంతర్గతుండయిన వాయుభట్టారకుండెల్లవారలు విన నాకాశంబు నుండి నలునకిట్లనియె:-
    అమల చరిత్ర నిట్లు దమయంతి బతివ్రత బల్కుదే నృపో
    త్తమ విను దీనియందు విదితంబగు శీలవిధిన్ సుధాంశుడుం
    గమలహితుండు నేనునయి కాచితి మొక్కట మూడు వర్షముల్
    గొమరుగ దీని జేకొనుము కోమలి నీ కనురక్త నావుడున్
        కురిసె మరు ద్వచనానం
        తరమున సుర పుష్పవృష్టి దడయక మ్రోసెన్
        సురదుందుభి నాదంబులు
        గరము ప్రసన్నుడయి వీచె గంధవహుండున్"
    నలుడు వాయుదేవుని మాటలు విన్నాడు నిగ్రహించుకొనలేక పోయినాడు. కన్నీరు జలజల రాలగా దమయంతిని రెండు చేతులతో ఎత్తినాడు. గట్టిగా కౌగిలించుకున్నాడు.
    దమయంతి ఏడ్చినది.
    నలుడు కన్నీరు రాల్చినాడు.
    నలదమయంతులు ఏకమయినారు.
    గంగాయమునలవలె కలసిపోయినారు.
    కలసి పారినారు.
    అది చూచిన జనుల కన్నులు చెమ్మగిల్లినవి.
    అప్పుడు నలుడు కర్కోటకుని తలచినాడు. నాగ కుమారుడు నలుని వస్త్రము అందించినాడు. బాహుకుడు అది ధరించి నిజరూపము దాల్చినాడు.
    దమయంతి నిజరూపమున నలుని చూచినది. దమయంతిలో ఆనంద సాగరములు పొర్లినవి. వారిని చూచి భీమరాజు సంతోషించినాడు. నగరమంతయు అలంకరింప చేసినాడు. ఆరాధనలు చేయించినాడు. అన్నదానములు చేయించినాడు. అప్పుడు ఋతుపర్ణుడు నలుని వద్దకు వచ్చినాడు "మహారాజా! నీవు సకలలోక పూజ్యుడవు అయినను మారుపేర నావద్ద పరిచారకుడుగా ఉన్నావు. నిన్ను అనేక నీచ కార్యములకు నియమించినాను. మన్నించవలెను" అన్నాడు. నలుడు ఋతుపర్ణుని గౌరవించినాడు. అనువుగాని సమయమున ఆశ్రయము ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పినాడు. అశ్వవిద్యను బోధించినాడు. అశ్వవిద్యను గ్రహించి ఋతుపర్ణుడు అయోధ్యకు వెళ్లినాడు.
    నలుడు విదర్భలో నెల రోజులున్నాడు. తరువాత కొద్ది సైన్యము తీసుకొని నిషధకు బయలుదేరినాడు. దమయంతి విదర్భలోనే ఉండిపోయినది. నలుడు నిషధ చేరినాడు. పుష్కరుని వద్దకు వెళ్లినాడు. "పుష్కరా! నీతో జూదమాడుటకు వచ్చినాను. నీవు సకల రాజ్యమును పందెముగా పెట్టుము. నేను నా భార్య దమయంతిని పందెముగా పెట్టెదను. నీవు ఓడిన రాజ్యమును, నేను ఓడిన దమయంతిని వదులుకొనవలసి ఉండును. అట్లు కాదందువా? యుద్ధమునకు సిద్ధము కమ్ము!" నిన్ను ఓడించి నా రాజ్యము తీసుకుందును" అని పిలచినాడు.
    పుష్కరుడు ఆలోచించినాడు. యుద్ధమున నలునితో గెలుచుట కష్టము. జూదమున ఇదివరకు నలుని ఓడించి రాజ్యము హరించినాను. ఇప్పుడు దమయంతిని కూడ హరింతును అనుకొని జూదమునకు అంగీకరించినాడు. పుష్కరుడు, నలుడు సకల జనుల చూచుచుండగా జూదము ఆడినారు. నలుడు పుష్కరుని ఓడించినాడు. పుష్కరుడు సకలరాజ్యము నలునకు ఒప్పగించినాడు. తలవంచుకొని నిలచినాడు. అప్పుడు నలుడు "పుష్కరా! పూర్వము కలిమాయవలన నీకు ఓడినాను. అందుకు నీవు గర్వించినావు. ఇప్పుడు నీ బలము హరించినాను. నిన్ను ఓడించినాను. నీవు నా పినతండ్రి కుమారుడవు కావున నిన్ను ప్రాణములతో విడిచినాను. వెళ్లుము" అని పుష్కరుని పంపించినాడు.  
    దమయంతి తన బిడ్డలను తీసుకొని మహా వైభవముగా విదర్భ నుండి నిషధకు వచ్చినది. నలుడు దమయంతిని చూచి ఆనందించినాడు, ఆహ్వానించినాడు. నల దమయంతులు సుఖముగా కాలము గడపినారు. వారు నూరు యజ్ఞములు చేసినారు. ఇంద్రునితో సమానమగు ఐశ్వర్యములు అనుభవించినారు.    
    బృహదశ్వుడు ధర్మరాజునకు నల దమయంతుల కథ చెప్పి ఇట్లన్నాడు.
    "ధర్మరాజా! జూదమందు ఓడితినని విచారించకుము. నలునివలె నీవును దైవ, మానుష బల సంపన్నుడవయి శత్రువులను జయించి సమస్త ధరణీ రాజ్యమును పొందగలవు" అని చెప్పి ధర్మరాజునకు అక్షహృదయమను విద్యను ఉపదేశించి.
        కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్యచ
        ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం
    కర్కోటకుని కథ, నల దమయంతుల కథ, ఋతుపర్ణుని కథ విన్నవారి కలి నశించును" అని చెప్పి వెళ్లిపోయినాడు.


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More