Home » Yandamuri veerendranath » మరణ మృదంగం
"నేను చెప్పే బహుమతి ప్రభుత్వం నుంచి కాదు." నవ్వాపుకుంటూ అంది.
"మరెవరి....." అతడు మాటలు మధ్యలో ఆపుచేసి ఆనందంతో కేక పెట్టాడు. ఆమె మూసి వున్న తలుపువైపు నిర్థారణగా చూసింది.
* * *
"శ్రీ సీతారామచరణ సేవా ప్రభావసంపాదిత
కవితా విచిత్ర శ్రీవత్సస గోత్ర- పవిత్ర,
సురేంద్ర, ప్రియపాఠక మానేసేంద్ర ప్రణీతం,
బిల్హణోపాఖ్యానం సంపూర్ణ సుఖాంతం"
అన్నాడు బిల్హణుడు.
"ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపి రాకుండా కవిత్వం చెపుతున్నావా?"
జానీ ఉత్పలవైపు చూసి నవ్వుతూ, ఇన్నాళ్ళ చెరనుంచి నీకు విముక్తి. బిల్హణుడు అన్నట్టు సుఖాంతమే! ఇక ఎలాంటి భయమూ లేదు. నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు" అన్నాడు.
ఆమె మౌనంగా అతడివైపు చూసింది. అలా చూడటంతో కళ్ళు కమలాలయ్యాయి. కనుకొలుకులు వర్షపు చుక్కల్ని దాచిపెట్టిన తామరాకులయ్యాయి.
నువ్వు నా ఆలోచన్లలో సజీవమై వున్నంతకాలం అంతమేలేని నా ఆలోచన్లకు సుఖమెక్కడ? నా ఈ నిష్క్రమణ సూర్యాస్తమయ వర్ణాలతో, అనుభవాలవల్ల పుట్టి అనుభూతుల్లో జీర్ణమై, శరీరంతోపాటే శిథిలమవ్వాలి. కనీసం నీకైనా చెప్పుకోలేని స్థితి నాది! విశ్వం అంతం అయ్యేచోటు దీపం వెలిగించి నీకోసం ఎదురు చూడాలని వుంది. కానీ నా పవిత్ర రక్తం దానికి వప్పుకోదు. నా వంశ ప్రతిష్ట నన్నాలోచింప నివ్వదు. నువ్వు తెరిచినా తలుపుల్లోంచి నా మనో విహంగం స్వేచ్ఛాలోకాల్లోకి ఎగిరిపోయింది. ఆచారం నిర్మించుకున్న కట్టుబాట్ల పరిథిలోంచి బయటకు దూకే ఈ ఆలోచన్లని ఎవరాపగలరు? ప్రత్యూష కిరణంలా ప్రవేశించావు. సంధ్యా ఛాయలో నిన్ను పోగొట్టుకున్నాను. ప్రేమలోకి మల్లే ఇక్కడా నిద్రాహారాలు లేవు. ఈ లేమి భయంవల్ల కాదు. నా జ్ఞాన కల్హారాలు, పురిటిగది వదిలి మొదటిసారి బయటకు వచ్చిన శిశువు కనుల వలె విచ్చుకుంటున్నాయి! అందుకుని స్వేచ్ఛగా ఆనందించలేను. అందుకోలేనని వదిలెయ్యలేను. ఎప్పుడో ఈ కట్టుబాట్లని తెంచుకుని వచ్చేస్తాను. అప్పుడు మాత్రం కాదనక నీ ప్రేమ కాసింత పంచివ్వు: ప్రాణంకోసం ప్రాణాల్ని అడ్డుపెట్టగలిగే నిస్వార్థత మనిషికెలా వస్తుందో కాస్త చెప్పు. ఆ నేర్చుకోవటంలో గురుదక్షిణగా 'ఏమాత్రం విలువలేని నన్ను ' నేను సమర్పించుకోనీ! ఎంతో గొప్పగా నన్ను వూహించుకుంటున్న నాకు, ఏ మాత్రం విలువలేదని ఇప్పుడే తెలిసింది. నాకిదంతా ఒక కలగా అనిపిస్తోంది! నూతి నుంచి బయటకొచ్చిన కప్పకి సముద్రం కనపడినట్టు నాకీ ప్రపంచం కనపడుతూంది. ఇంత భయంకరంగా వుంటుందా బయట ప్రపంచం అనిపిస్తోంది ఇప్పుడు! భక్తిరంజని వింటూ వంట చేసుకుంటూ, భర్తతో రోజులు గడిపేస్తూ కొందరు, ఆదరాబాదరా అన్నంతిని, ఆలస్యంగా వచ్చినందుకు పై అధికారితో తిట్లుతిని, సాయంకాలం రేడియోలో వార్తలువిని, రాత్రిళ్ళు భార్యలవల్ల పక్కింటి కబుర్లువిని, ఒకరోజు గడిచి పోయిందిలే అనుకుని కొందరు చాప క్రింద నీరులా చుట్టుముడుతున్న ప్రమాదాన్ని ఎందుకు గుర్తించరు? మనిషి ఏర్పర్చుకున్న భద్రతా, దేవుడిచ్చిన అడవులూ, చివరికి నీరు, భూమి, గనులు, అన్నీ బలవంతంగా..... కొన్ని చట్టబద్ధంగా, కొన్ని చట్ట రహితంగా కొల్లగొట్టబడుతూవుంటే ఒక్కరూ పట్టించుకోరేం? పోన్లే.... వసంత పవనం కూడా బరువై మామిడి పూతని వదిలి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. తృణ పత్రాలు ఉత్తుంగ తరంగాల్లో పడి కొట్టుకుపోతాయి. నీ హేమంత వసంతాల్ని ఎవరికైనా ఇవ్వు. కానీ నీ కభ్యంతరం లేకపోతే గ్రీష్మాన్ని నా కొదిలిపెట్టు....
ఆమె చెంపని బాధగా నొక్కుకుంది.
"ఏమిటాలోచిస్తున్నావు?" అడిగాడు బిల్హణుడు. ఆమె వెంటనే జవాబు ఇవ్వలేదు. ఏ క్షణమైనా ఆమె కనులు వర్షించేలా వున్నాయి. తనని రక్షించటం కోసం కొండ శిఖరాల్లా నిలబడిన ముగ్గుర్ని వదిలి వెళ్ళటం!
"మళ్ళీ అప్పుడప్పుడు కలుస్తూ వుంటావుగా" అడిగింది అనూష.
"మీ పెళ్ళికి వస్తాను" అందామనుకుంది. అంతకన్నా హీనమైన చౌకబారు జవాబు ఇంకొకటి వుండదనిపించింది. చిన్న కాగితం తీసి జానీకి అందిస్తూ "ఆటో గ్రాఫ్ ప్లీజ్" అంది. జానీ దాన్ని అందుకుని "ఏం వ్రాయను?" నవ్వుతూ అడిగాడు. ఆమె జవాబు చెప్పలేదు. పెన్ తో నాలుగు లైన్లు వ్రాసి ఇచ్చాడు. ఆమె ఆత్రంగా అందుకుని ఏం వ్రాసాడా అని చూసింది.
Morning beautiful....A little acquaintance
A little love and then a good day
Evening is short, A little hoping
a little dreaming and then.... a good bye
ఎందుకో తెలీదు కాని ఆమె వదనం మ్లానమైంది. అప్రయత్నంగా కుడి చెంపదగ్గిర నొక్కుకుంది.
"మరినన్నడగవేం?" అన్నాడు బిల్లూ. ఆమె కాగితం అతడికి అందించింది. "ఇంటి దగ్గిర దింపినప్పుడు వ్రాస్తాలే" అన్నాడు దాన్ని అందుకోకుండా.
"బయల్దేరు" అన్నాడు జానీ.
"మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను" అంది అనూషతో.
"అంటే మమ్మల్ని కలవ్వా?"
నిజమే! ఒక బార్ కి తను వచ్చి ఇతడిని కలిసిందంటేలోకం కోడై కూస్తుంది. లోకం వరకూ ఎందుకు ఇంట్లోనే వప్పుకోరు. ఇన్ని రోజులు అతని క్లబ్ పైభాగంలో వున్నదని వాళ్ళకి తెలుస్తుంది! అతడు ఎంతో హుందాగా తనతో ప్రవర్తించాడని తన మన స్సాక్షికి తెలుసు. అయినా వాళ్ళు భయపడతారు. 'వాళ్ళ'కి తను భయపడుతుంది. భయమే మనుష్యుల జీవితాన్ని శాసిస్తూ వస్తూంది. ఈ 'భయం' మాఫియా కన్నా ప్రమాదకరమైంది.
ఆమె చెంప దగ్గిర మళ్ళీ వత్తుకుంది.
"వెళ్దామా" అన్నాడు భిల్లూ. ఆమె తలూపి అనూషవైపు తిరిగి "ఒక్క అనుమానం" అంది.
"ఏమిటి?"
"గంటకో బస్సు ఇట్నుంచి అటూ, అట్నుంచి ఇటూ వెళ్ళేది! నేను వేర్వేరు సమయాల్లో బస్ స్టాప్ లో నిలబడేదాన్ని. ఏ సమయంలో నిలబడినా సగటున పదిసార్లు లైబ్రరీ వైపు బస్ వస్తే, రెండు సార్లే రామబ్రహ్మంవైపు వెళ్ళే బస్ వచ్చేది! అలాగే వస్తుందని అంత ధీమాగా ముందే ఎలా చెప్పగలిగారు?"
"అనూష నవ్వి "బస్ టైమింగ్స్ తెలుసు కాబట్టి" అంది.
"కానీ ఇటూ అటూ కూడా ప్రతి గంటకీ....." అంటూన్న ఉత్పల మాటలు మధ్యలో ఆపుచేసి "అయితేనెం- కొంచెం తర్కంగా ఆలోచించు ఉత్పలా! నువ్వు నిల్చున్న బస్ స్టాప్ దగ్గిరకి ఇట్నుంచి రామబ్రహ్మంవైపు వెళ్ళే బస్సులు 8.00 గంటలకీ, 9.00కీ, 10.00కీ వస్తాయనుకో! లైబ్రరీ వైపు వెళ్ళే బస్సులు 8.10కీ, 9.10కీ,10.10కీ అట్నుంచి వస్తాయనుకో! అప్పుడు నువ్వు ఏ సమయంలో బస్ స్టాప్ లో నిలబడినా, లైబ్రరీ వైపు వెళ్ళటానికే 50.10ఛాన్సు వుంది అవునా?"
ఉత్పల అర్థమైనట్టు తలూపింది.
తరువాత బిల్లూతో కలిసి నెమ్మదిగా సాగిపోయింది.
కదిలే మేఘం ఆగటం వర్షాగమనం. ఆ పోలిక కళ్ళకీ వర్తిస్తుంది! అనూష ఆమె వెళ్ళినవైపే చూస్తూంది. ఉత్పలని అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు ఆమె. 'అ-వి' అన్నవి రెండక్షరాలే. కానీ అవి జ్ఞానానికి ముందు చెరొకటి విడివిడిగా చేరి _అజ్ఞానం, విజ్ఞానం) మనిషిని అయోమయంలో పడేసి నిర్ణయాలు తీసుకోవటంలో ఆలస్యం చేస్తాయి.
* * *
జీప్ ఆగగానే ఉత్పల ఒక్క గెంతులో దిగి ఇంట్లోకి పరుగెత్తింది.
ఆమె ప్రవేశంతో ఆ ఇంట్లో రేగిన కలకలం వర్ణనాతీతం.
ఆమె లోపలికి అడుగిడే సరికి తండ్రి ఒక మూల పడక కుర్చీలో కూర్చుని కళ్ళకి చెయ్యి అడ్డు పెట్టుకుని ఏదో దీర్ఘాలోచనలో వున్నాడు. తల్లి ఏదో పనిమీద లోపల్నుంచి బయటకి అప్పుడే వస్తోంది. ఒక మూల అక్క ఏదో చీరె కుడుతోంది.
ఆమెని ముందు చూసిన వాడు తమ్ముడు. వాడు "పులీ" అని ఒక్కకేక పెట్టి అరిచాడు. ఉత్పల తల్లి దగ్గిరకి పరుగు పరుగున చేరుకుంది. పార్వతమ్మ కూతుర్ని పొదివి పట్టుకుని ఒక్కసారిగా "తల్లీ" అని, మరి మాటలు రాక భోరున ఏడ్చేసింది.
విశ్వేశ్వరశాస్త్రి కుర్చీలోంచి లేచి, వృద్ధాప్యాన్ని కూడా మార్చిపోయి వడివడిగా కూతురి దగ్గిరకి వచ్చాడు. మనసులో భావం మొహంలో ప్రతిబింబించని స్థితి అది. ఆనందమో, ఉద్వేగమో, దుఃఖమో, ఆవేశమో తెలీదు.
మాలిని ఉత్పలకి అల్లుకున్న మాలే అయింది. చంపకమాల నాలుగు పాదాలతో, ద్విపద రెండంగల్లో ఉత్పలని చేరుకున్నారు.
బిల్హణుడు ప్రేక్షకుడిగా చూస్తున్నాడు. ఆమెతో ప్రారంభమయిన కథ ఆమెతో పూర్తయింది. సనాతన వంశంలో పుట్టి నర్సుగా ఉద్యోగం ప్రారంభించి, మాఫియా మారణహొమంలో మరణపు సరిహద్దుల్లోకి వెళ్ళి బయటపడిన అమ్మాయి ఎప్పుడో తనకి చెప్పిన పాట..... "పదిలంగా అల్లూకున్న పొదరిల్లూ మాది" అన్నది గుర్తొచ్చింది.
ఈ లోపులో హడావుడినుంచి తల పైకెత్తిన ఉత్పల బిల్లూని చూసి "అంకుల్" అంటూ దగ్గిరకొచ్చి, చెయ్యి పట్టుకుని తండ్రి దగ్గిరకి తీసుకెళ్ళి పరిచయం చేసింది.
అనూష ద్వారా అప్పటికే సగం కథ తెలిసిన విశ్వేశ్వరశాస్త్రి "కొంచెం మజ్జిగ తాగి వెళ్ళండి" అన్నాడు అభిమానం, కృతజ్ఞత నిండిన కంఠంతో. బిల్హణుడు ఉలిక్కిపడి "మజ్జిగ వద్దులెండి. తరువాతప్పుడైనా వస్తాను. చీకటి పడింది" అన్నాడు.
ఉత్పల నవ్వాపుకుంది.
"వెళ్ళొస్తాను"
"అంకుల్. ఒక్క నిమిషం" అంటూ ఆమె కాగితం తీసుకొచ్చి "ఆటోగ్రాఫ్ ప్లీజ్" అంది. ఏం వ్రాయాలా అన్నట్టు ఆమె వైపు చూసాడు. చెంప నొక్కుకుంటూ నిలబడ్డ ఆమెని చూసి, రెండే వాక్యాలు వ్రాసాడు.
"జ్ఞానమూ, దంతమూ- వచ్చేటప్పుడు ఎంతో బాధపెడతాయి.
కానీ మనిషికి అవి చాలా అవసరం".
కాగితం ఆమెకిచ్చేసి అతడు జీపెక్కాడు. ఇంటిల్లిపాదీ అతడు వెళ్ళినవైపే చూస్తున్నారు.
'నో ఎంట్రీ' బోర్డు పక్కనుంచి అతడి జీపు వేగంగా సాగిపోయింది.
(శుభం)



