Home » Yandamuri veerendranath » మరణ మృదంగం
ఈదేశంలో కనీసం ఒకరైనా దీన్ని వార్తల్లో చదివి, తను చేసిన పని మంచిది అని మెచ్చుకుంటారా? పోలీసాఫీసరే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు అనుకుని తనని అసహ్యించుకుంటారా..... లేదు లేదు- అలా ఎన్నటికీ కాదు. ఎవరో ఒకరుంటారు. ఈ వాస్తవ సంఘటనల స్వరూపాన్నంతా ఒక కథగా వ్రాస్తారు. సలీంశంకర్ లనీ వసంత్ దాదాలనీ ఏ ప్రభుత్వమూ, ఏ కోర్టూ ఏమీ చేయలేదని- వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఒక భాగమేననీ నిరూపిస్తారు. అది చదివి ఓ ఆడపిల్ల. "నిజమే అంకుల్! నువ్వు చేసింది ఈ పరిస్థితుల్లో కరెక్టే" అనుకోదా! ఒక పిల్లవాడు చదవడం అయిపోగానే "గుడ్ బాస్! ఇంతకన్నా వేరే మార్గం ఏముంది? నీ వెనుక- నిన్ను బలపర్చడానికి మేమున్నాం" అనుకోడా? దాదాల్ని పోలీసులు ఎదుర్కోలేరు. ఇదొక సత్యం. రేపు దాదాయే ఈ దేశపు హొం మినిస్టర్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది రెండో సత్యం. భగత్ సింగ్ లు - బోస్ లు అవసరం లేదు పక్కవాడి అత్యాచారాల్ని ఆపడానికి. చిన్న ప్రాణ త్యాగం చాలు. ఇది ఆఖరి సత్యం.
అతడి మనసు తేలిగ్గా వుంది. అతడు అడ్డా నుంచి ఇంటివైపు వెళుతూంటే అక్కడ కనబడ్డాడు పాత ఖైదీ.... గుండప్ప.
* * *
చాలా పాత కాలంనాటి తాళం కప్పలా వుంది అది. తెరిచి ఎంతో కాలమయినట్టుంది. ఒకప్పుడు సామాన్లు ఆ ద్వారం గుండా వెళ్ళేవి. ఇప్పుడు మూసేసారు.
దాదాతో పాటు వచ్చిన అధికారి దాన్ని తెరిచి వాళ్ళిద్దరినీ లోపలికి పంపించాడు. తిరిగి వెళ్ళిపోతూ దాదాతో అన్నాడు- "మీరు, శంకరూ ఇదే ద్వారం గుండా బయటకు వచ్చెయ్యండి. నేను బయట కాస్త దూరంలో నిలబడి వుంటాను. మీరు రాగానే యధాప్రకారం తాళం వేసుకుని నేను వెళ్ళిపోతాను. మీరిద్దరూ బయటకు వచ్చాక వీలైనంత తొందరగా ఇక్కణ్ణుంచి కారు వరకు వెళ్ళడానికి ప్రయత్నించండి. నాతో మరి మాట్లాడనవసరం లేదు. మనం తరుఅవాత కలుసుకుందాం".
దాదా తలూపాడు.
ఇద్దరూ లోపలికి వెళ్ళగానే తలుపు దగ్గరగా వేసి దూరంగా తన కారు దగ్గర నిలబడ్డాడు ఆ అధికారి. ఈ సహాయం చేసినందుకు అతడికి ఆరంకెల్లో ముడుతోంది.
దాదా టైము చూసుకున్నాడు.
సరిగ్గా రెండు నిమిషాల్లో సలీంశంకర్ అక్కడికి రావాలి! ముఖ్య ద్వారం నుంచి, అన్ని పరీక్షలు అయి, ప్రయాణీకులు లోపలి హాలులోకి చేరుకున్న సవ్వడి గోడ అవతల నుంచి వినిపిస్తూంది. దూరంగా అద్దాల్లోంచి జపాను వెళ్ళే విమానం కనిపిస్తూంది.
ఆ ప్రయాణికులకీ, వీళ్ళకీ మధ్య ఒక గోడా, తలుపూ మాత్రమే అడ్డున్నాయి. వీళ్ళిద్దరూ వున్నది ఒకప్పటి స్టోర్ రూమ్ అవడం చేత మసక చీకటిగా వుంది. ఎక్కువ వాడకపోవడం వల్ల అదోరకమైన వాసన వేస్తూంది.
శంకర్ రావడానికి ఇంకొక నిమిషం మాత్రమే వుంది. ఆ మధ్య తలుపులు కూడా తీసి వుంచే ఏర్పాట్లు చేశాడు దాదా. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతూంది.
దాదా తలపక్కకి తిప్పి తను ఆస్పత్రి నుంచి తీసుకువచ్చిన వ్యక్తివైపు చూశాడు. ఆ చీకట్లో పొడవూ, లావూ-గ్రెగరీ పెక్ లా- అచ్చు సలీంశంకర్ ఎత్తుతో సరిపోయేలా వున్నాడు. దాదా కళ్ళల్లో సంతృప్తి కదలాడింది.
"ఏమీ గొడవ చెయ్యకూడదు. నిన్నొక చోటుకి తీసుకువెళతారు. గొడవ చెయ్యకుండా వెళ్ళు" అన్నాడు చిన్న పిల్లవాడికి చెప్పినట్టు.
అప్పటివరకూ ప్రతీ దానికీ నిజంగానే చిన్నపిల్ల వాడిలా తలూపుతూ వస్తున్న ఆ స్థూలకాయుడు ఈసారి మాత్రం దాదా చెవి పక్కగా చిన్నస్వరంతో అన్నాడు.
"త్యక్త్వా వరణ్యాత్మ విభూషణాని
బర్హాణి తీరో పగతా నదీనాం
నిర్భర్ద్యృ మానా ఇవ సార సౌఘైః
ప్రయాన్తి దీనా విమదామ యూరాః"
అప్పటి వరకూ నిశ్చలంగా వున్న జలాశయపు అడుగున వున్నట్టుండి ఒక అగ్ని పర్వతం బ్రద్దలైనట్టు దాదా అదిరిపడ్డాడు. ఒక క్షణం అర్థంకాక అయోమయంగా పక్కకి చూశాడు. అది సంధి ప్రేలాపనో, పిచ్చివాడి మాటలో లేక నిజమైన సంస్కృతమో అర్థం కాలేదు.
అంతలో బిల్హణుడు అన్నాడు- "నన్ను పిచ్చివాడు అనుకుంటున్న ఓ పిచ్చివాడా! ఆ పద్యానికి అర్థం చెపుతాను విను- వర్షాకాలమున ఆనందంతో నృత్యం చేయగల నెమళ్ళు, ఎండాకాలం వస్తే కేకలు కూడా పెట్టలేవు. పోయేకాలం వచ్చినప్పుడు మనిషి వేసిన ఎత్తులు ఇలాగే వుంటాయి! మా జానీ అంటూ వుంటాడు. విజయం కళ్ళముందు పొరలు దింపుతుందని! ఆ రకమైన మత్తులో గొప్ప మాఫియా లీడర్ వైయుండి ఏం చేస్తున్నావో కూడా నీకే తెలియనంత బేవార్సు ప్లాన్ వేశావు!"
"ఎ..... ఎవరు నువ్వు?" దాదా అడిగాడు.
"ఇంకో నిమిషంలోనో రెండు నిమిషాల్లోనో సలీంశంకర్ వస్తాడుగా. వాడినే అడుగుదువు గానీ! వెయిట్ చెయ్యి" అన్నాడు బిల్హణుడు.
దాదా దృష్టి బయటనుంచి వచ్చిన ద్వారం మీద పడడం చూసి బిల్హణుడు నవ్వేడు. "నీ దగ్గర ఆయుధం లేదు. సెక్యూరిటీ చెక్ అయిపోయింది కాబట్టి వచ్చే సలీంశంకర్ దగ్గర కూడా వుండదు! చూద్దాం బలప్రయోగంలో ఎవరు నెగ్గుతారో..... అంత వరకు నువ్వు బయటకు పోలేవు దాదా. ఇదే అనూష ప్లాను..... ఇటో అటో తేలిపోయే ప్లాను"
"అనూషా..... అ....అనూషా".
"అవును".
* * *
దాదా, సలీంశంకర్ ల గురించి అందరూ తక్కువ అంచనా వేసింది ఇక్కడే. ఆఖరి నిముషంలో యమిన్ సున్ ఎదురుతిరుగుతాడనీ, తను బయటకు వెళ్ళటానికి ఒప్పుకోకపోవచ్చునన్నీ సలీంశంకర్ కి ముందునుంచీ అనుమానం వుంది. దానిని వసంత్ దాదా కూడా కొంతవరకూ బలపరిచాడు. జపాన్ ఎయిర్ పోర్ట్ లో మాఫియా- సలీంశంకర్ ని కాల్చేస్తుందని తాము చెప్పిన మాటలు యమిన్ సున్ పూర్తిగా నమ్మేడో లేదో తెలీదు. ఒకవేళ అలా జరిగినా, పోస్ట్ మార్టమ్ కి ముందు, చనిపోయినవాడు సలీంశంకర్ కాదని ధృవీకరణ జరిగితే, యమిన్ సున్ కనీసం పది సంవత్సరాలు జైల్లో వుండక తప్పదు. అంత రిస్క్ తీసుకుంటాడా అతడు?- దాదాకి పూర్తిగా నమ్మకం కుదరలేదు.
దాదా అనుమానించినట్టే- ప్రయాణీకుల లాంజిలోంచి సలీంశంకర్ లేచి బయల్దేరబోతూంటే యమిన్ సున్ అటకాయించాడు. సలీంశంకర్ పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఇటువంటిదేదో అవుతుందని ముందే అనుకుంటూ వచ్చాడు.
"ఇదంతా కేవలం నిన్ను జపాన్ తీసుకెళ్ళడానికి వేసిన ఎత్తు శంకర్! నేనేగానీ ఇలా నాటకమాడకపొతే- నువ్వు భారతదేశపు కోర్టుల్లోనే ఒకటి తరువాత మరొక ఎత్తు వేసి ఇక్కడే వుండిపోతావని తెలుసు. నా ఇన్నేళ్ళ అనుభవంలో ఏ నేరస్తుణ్ణి ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు".
యమిన్ సున్- ఇదంతా అనూష ఎత్తు అని చెప్పలేదు. చెప్పటానికి అతడి అహం అడ్డొచ్చింది.
శంకర్ మొహం తెల్లబోయింది (అలా కనిపించింది). యమిన్ సున్ నవ్వేడు.
శంకర్ తిరిగొచ్చి అతడి పక్కన కూర్చున్నాడు.
"నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు శంకర్! నా పేర్న స్విస్ బ్యాంక్ లో జయచేసిన డబ్బు గురించి కదూ! దాని గురించి మా అధికారులకి నేనే చెప్పబోతున్నాను".
సలీంశంకర్ వాచీ వెనుకనుంచి సూది తీయటాన్ని అతడు గమనించలేదు.
"ఇక పొతే మీ మాఫియా గురించి..... మా జపాన్ వారితో పోల్చుకుంటే అదేమంత భయంకరమైనది కాదు. దాన్నెలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు."
సలీంశంకర్ కుర్చీకోడు మీదనుంచి చేతిని పక్కకి జరిపాడు. యమిన్ సున్ భుజం అతడికి అందుబాటులో వుంది.
"ఒకవేళ మాఫియా నా ప్రాణం తీసినా- ఒక నరరూప రాక్షసుడిని ఉరికంబం ఎక్కించానన్న తృప్తి నాకుంటుంది. అసలు పోలీసు డిపార్ట్ మెంట్ లో నాలాటి వాళ్ళు చా.....లా.....అ....రు....దు..... అ.....ను....కో"
యమిన్ సున్ తల పక్కకి వాలిపోయింది. అయిదు నిముషాలపాటు అతడికి స్పృహరాదు.
అప్పుడు నవ్వేడు సలీంశంకర్ మొదటిసారి.
చాలా ప్రొఫెషనల్ గా, ఏమీ తడబడకుండా లేచి వరండావైపు వచ్చాడు. ప్రయాణీకుల్లో ఎవరైనా యమిన్ సున్ ని చూసినా- విమానం కోసం ఎదురు చూస్తూ అతడు కళ్ళు మూసుకున్నాడని అనుకుంటారు తప్ప, తాత్కాలికమైన మత్తులోకి వెళ్ళాడని అనుకోరు.
సలీంశంకర్ వడివడిగా నిర్మానుష్యమైన ఆ వరండా దాటి వెనుకవైపుకి వచ్చాడు.
అక్కడ వున్న ఇద్దరు వ్యక్తుల్ని చూడగానే అతడి మొహం విప్పారింది.
"దాదా! యమిన్ సున్ పక్కన ఈ వ్యక్తిని కూర్చోబెట్టాలి" అన్నాడు. అతడి వుద్దేశ్యమేమిటంటే- ఆ పోలీస్ అధికారికి తెలివి వచ్చిన వెంటనే పక్కనున్న మనిషిని చూసి- ఇక గత్యంతరం లేక అతడినే తీసుకెళ్ళి తన పరుపు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడని! మార్గమధ్యంలో ఎలాగూ విమానం కూలిపోతుంది. కాబట్టి- అక్కడితో కేసు పూర్తవుతుంది.
"తొందరగా.....మళ్ళీ అతడికి మెలకువ వచ్చేస్తుంది".
దాదా అడుగు ముందుకు వేశాడు. వెంటిలేటరు వెలుతురు అతడి మొహం మీద పడింది. అదో రకమైన అవ్యక్త భావాన్ని, ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోవటాన్నీ సలీంశంకర్ గుర్తించాడు.
"ఏం జరిగింది దాదా?" అని అతడు ప్రశ్నిస్తూ వుండగా బిల్హణుడు కూడా వెలుగులోకి వచ్చాడు. తెరిచినా నోరు అలాగే వుండి పోయింది. సలీంశంకర్ కి! ఆ సమయంలో బిల్హణుడిని ఆ స్థానంలో వూహించలేదు.
కానీ అతడు ఇంతకన్నా విపత్కర పరిస్థితుల్ని ఎన్నో చూసినవాడు. ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి క్షణ కాలం కూడా పట్టలేదు. మేజోడులోంచి మెరుపుకన్నా వేగంగా పిస్టల్* తీసాడు.
ఈ లోపులో బిల్హణుడు కూడా జేబులోంచి పిస్టల్ తీసాడు.
కానీ, సలీంశంకర్ దగ్గిర పిస్టల్ వుంటుందని వూహించని అతడు, తన వద్దనున్న ఆయుధం తీయడంలో కొద్దిగా ఆలస్యమైంది. శంకర్ పిస్టల్ పేల్చాడు. బిల్హణుడి చేతిగుండా అది దూసుకుపోయింది.
__________________________________________________
* ప్రోబ్ అనే పత్రికలో చాలాకాలం క్రితం ఒక వ్యాసం పడింది. దానిని వ్రాసిన రచయిత ఒక ప్రయాణికుడు. అతడొకసారి విదేశయానం కోసం విమానాశ్రయంలో వుండగా కొందరు పోలీసు అధికారులు అతడిని కలుసుకుని, అంతర్జాతీయ విమానాశ్రయం లోపలికి పిస్తోలు తీసుకెళ్ళమని కోరారు. గేటుదగ్గర వ్యక్తులు సరిగ్గా ప్రయాణికుల్ని పరీక్షించడం లేదని వార్త అందడంవల్ల ఈ విధంగా చేయడం జరిగింది. ఆ ప్రయాణీకుడు కాలిమేజోళ్ళలో పిస్తోలు దాచుకుని అనుమానం రాకుండా లోపలికి ప్రవేశించగలగటంతో ఆ గార్డులని తరువాత సస్పెండ్ చేయటం జరిగింది. అధికారుల నిర్లక్ష్యాన్ని ఆ రచయిత అలా సోదాహరణంగా వివరించాడు.



