Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
9. సింధువు అశ్వవంత, సుఖకర రథమును గెలుచును. ఆమె ఆరథమున అన్నము తేవలెను. యజ్ఞములందు సింధు రథపు మహిమ గానము చేయబడును. సింధురథము అహింసితము కీర్తికరము మహంతము.
డెబ్బది ఆరవ సూక్తము
ఋషి - ఇరావత పుత్రుడు సర్వజాతివాడు జరత్కర్జుడు. దేవత - సోమము.
ఛందస్సు - జగతి.
1. శిలలారా ! అన్నవంత ఉష వచ్చినంత నిన్ను వెల్లడింతును. నీవు ఇంద్ర, మరుత్తులు, ద్యావా పృథ్వులకు సోమము అందించుము. వారిని అనుకూలురును చేసికొనుము. ఈ ద్యావాపృథ్వులు ఏకముగా మనగృహములందు సేవలు అందు కొనవలెను గృహములందు ధనము నింపవలెను.
2. అభిషవశిల చేత పట్టినంత. అశ్వము వంటిదగును. ప్రస్తరమా ! నీవు శ్రేష్ఠసోమమును అందించుము శిలలచే సోమాభిషవము చేయు యజమాని శత్రువు ఓడించగల బలవంతుడగును. ఇది అశ్వములను ఇచ్చును. వాని వలన కావలసినంత ధనము లభించును.
3. ప్రాచీన కాలమున మను యజ్ఞమునకు సోమరసము విచ్చేసినది. అట్లే ఈ ప్రస్తరమున నిష్పిడిత సోమము జలమున ప్రవేశించ వలెను. గృహనిర్మాణములందు గోవులను - యజ్ఞకార్యములందు అశ్వములను స్నానము చేయించుటకు అవశ్విర సోమమును ఆశ్రయింతురు.
4. శిలలారా! రాక్షసులను నష్టపరచండి. నిబ్రుతిని దూరము చేయండి. దుర్భుద్ధిని తొలగించండి. సంతానయుక్త ధనము ప్రసాదించండి. దేవతలను ప్రసన్నులను చేయు శ్లోకములు సమార్జించండి. "దేవావ్యః శ్లోకమద్రయః"
5. శిలలు ఆకాశము కన్న తేజస్వులు 'సుధన్వ' పుత్రుడు 'విభ్వ' కన్న శీఘ్రకర్ములు. సోమాభిషవమున వాయువుకన్న వేగవంతములు. అగ్నిని మించిన అన్నదాతలు దేవతలను ప్రసన్నులను చేయుటకుగాను అట్టి శిలలను పూజించండి.
6. యశస్విశిలలు మా కొరకు అభిషుత సోమమును ఏర్పరచవలెను. అవి స్తోత్రసహిత ఉజ్వల వాక్యము ద్వారా ఉజ్వల సోమయాగమున మమ్ము నిలుపవలెను. నేతలగు ఋత్విక్కులు స్తోత్ర ధ్వనులు చేయుదురు. ఒకరిని మించి ఒకరు కమనీయ సోమరసము, సోమయజ్ఞమును మధింతురు.
7. కదలిన శిలలు సోమమును పిండును. అవి స్తుతులు కోరును. అగ్ని కొరకు సోమరసము సిద్ధము చేయును. అభిషవకారి ఋత్విక్కులు శేషసోమమును సేవింతురు. శుద్ధి చేయుదురు.
8. నేతలారా ! శిలలారా ! మీరు శోభన అభిషవ కర్తలు కండి. ఇంద్రుని కొరకు సోమాభిషవము చేయండి. దివ్యలోకము కొరకు అద్భుత సంపద సమకూర్చండి పార్ధివ ధనమును యజమానికి ఇవ్వండి.
డెబ్బది ఏడవ సూక్తము
ఋషి - భృగుగోత్ర స్యూమరశ్శేరుడు. దేవత - మరుత్తులు. ఛందస్సు - 5
జగతి మిగిలినవి త్రిష్టుప్.
1. మరుత్తులు స్తుతులకు ప్రసన్నులగుదురు. మబ్బువెడలిన వాన చినుకులవలె ధనము కురిపింతురు. హవియుక్త యజ్ఞమువలె జగముల ఉత్పత్తికి కారణభూతులు అగుదురు. మరుత్తుల మహాబలమును నేను పూజించలేను. శుభముల కొరకు సహితము నేను స్తుతించజాలను.
2. మరుత్తులు తొలుత మానవులు. తదుపరి వారి పుణ్యకర్మముల వలన దేవతలైనారు. సేనలన్ని కలసినను మరుత్తులను పరాభవించలేవు. మరుత్తులు ద్యులోకమువారు. మనకు కనిపించరు. వారి పరిధి పెరుగదు. అందువలన వారిని స్తుతించలేదు.
3. స్వర్గమందును పృథ్వియందును. మరుత్తులు స్వశక్తి మీద పెరిగినారు. సూర్యుడు మేఘమునుండి వెలువడువలె మరుత్తులు వెలువడుదురు. వారు వీరపురుషులవలె స్తోత్రాభిలాషులు శత్రుసంహారక శూరులవలె మరుత్తులు వెలుగొందుదురు.
4. మరుత్తులారా ! మీలో మీరు ఢీకొని వర్షము కలిగించినపుడు భూమి బెదరదు బలహీనపడును. మీకు హవి సమర్పించినాము అన్నవంతులవలె అందరు కలసిరండి.
5. రథమున కట్టిన అశ్వములవలె మీరు వేగవంతులు. ప్రభాతకాంతి వలె ప్రకాశింతురు శ్యేనమువలె శత్రువును తరుముదురు. స్వయముగా కీర్తిని ఆర్జించుకొందురు. బాటసారులవలె దిశలకు పయనింతురు వర్షము కురిపింతురు.
6. మరుత్తులారా ! బహుదూరము నుండి మీరు బోలెడు గుప్తధనము తెస్తారు. ధనమును అందుకున్న మీరు గుప్త రూపముననే ద్వేషించు శత్రువును దూరము చేయుదురు.
7. యజ్ఞసంపద కలిగి, యజ్ఞానుష్ఠానము చేసి మరుత్తులకు దానమిచ్చువానికి అన్నము, ధనము, జనము కలుగును వారు దేవతలతో కూడి సోమపానము చేయుదురు. "దేవానామపిహోపేథేఅస్తు."
8. మరుత్తులు సోమ యజ్ఞార్హులు వారు యజ్ఞమును రక్షించువారు. ఆకసమునుండి. ఆదిత్య జలవర్షము కురిపించువారు. వారు వేగరథమున విచ్చేయవలెను మా బుద్ధిని రక్షించవలెను యజ్ఞమున చేరి ఇష్టప్రకారము హవిని ఆరగించవలెను.
డెబ్బది ఎనిమిదవ సూక్తము
పూర్వవత్ ఋషిదేవత. ఛందస్సు - త్రిష్టుప్ - జగతి.
1. స్తోత్రపరాయణులగు విప్రస్తోతవలె మరుత్తులు యజ్ఞమునందు ధ్యానమున్నవారు దేవతలను యజించు యజమాని కర్మమున నిమగ్నుడైనట్లు మరుత్తులు వృష్టిప్రదాన కార్యమున నిమగ్నులగుదురు. మరుత్తులు రాజుల'వలె పూజనీయులు దర్శనీయులు గృహమేధివలె పాపరహితులు శోభిల్లువారు.
2. మరుత్తులు అగ్ని సమాన తేజోవంతులు. వారి రొమ్మున బంగారునగలు శోభిల్లును. వారు వాయు వేగము గలవారు. జ్ఞానులవలె పూజ్యులు. సుందర నేత్రులు సుందర వదనులు వారు యజ్ఞములకు ఏగుదురు.
3. మరుత్తులు వాయువువలె శత్రువును గడగడలాడించువారు. అగ్నిజ్వాల వంటి ధగధగలాడు ముఖములవారు. కవచ ధారులగు యోధులవలె శౌర్యవంతులు. పితృవచనము వంటిదాతలు.
4. రథచక్రముల ఇరుసువలె మరుత్తులు ఒకేతీరువారు. జయశీల శూరుల వలె దీప్తిమంతులు దాతలగు మానవుల వలె జలము వర్షించువారు చక్కని స్తుతులు చదువు వారివలె సుశబ్దవంతులు.
5. మరుత్తులు అశ్వములవలె శీఘ్రగాములు ధనిక రథస్వామి వలె మిక్కిలి దాతలు నదులవలె జలమును దిగువకు తెచ్చువారు. అంగిరులవలె సామగాన తత్పరులు నానారూప ధారులు.
6. వారు జలదాత మేఘము వంటి నదీనిర్మాతలు. వజ్రాది ఆయుధములవంటి శత్రుహంతలు వాత్సల్యము గల తల్లి యొక్క పిల్లలవంటి క్రీడా పరాయణులు మహాజనపదములవంటి వెలుగొందువారు.
7. ఉషః కిరణములవలె వారు యజ్ఞాశ్రయులు. శుభములు కోరు వీరులవలె ఆభరణ శోభితులు. నదులవంటి నడకలవారు. వారి ఆయుధములు ప్రదీప్తములు దూరమునకు సాగు బాటసారులవలె అనేకములను దాటుదురు.
8. మరుద్దేవతలారా ! స్తుతులచే వర్ధిల్లండి. మా స్తోతలను ధనికులను, రత్నవంతులను చేయండి. స్తోత్రపు సహకార స్తవమును గ్రహించండి. మీరు మాకు సదా రత్నదానములు చేసినారు.
డెబ్బది తొమ్మిదవ సూక్తము
ఋషి - పౌచీకగుణా లేక వైశ్వానరగుణ అగ్ని లేదా పాజంభ పుత్రసప్తి.
దేవత - అగ్ని. ఛందస్సు - త్రిష్టప్.
1. మానవులు మరణముగలవారు. అగ్ని మహిమవలన వారిలో అమరస్వభావమును నేను దర్శించుచున్నాను. అగ్నియొక్క రెండు దవడలు పరిపూర్ణ ఆకృతిగలవి. అగ్ని నమలకుండనే కర్రలు మున్నగు వానిని భక్షించును.
2. అగ్ని మస్తకము గుప్తస్థానమున ఉన్నది. అతని నేత్రములు వివిధ స్థానములందున్నవి. అతడు నమలడు. మంటలతో కర్రలను మింగును. మానవ యజమానులు చేతులెత్తి అగ్నికి నమస్కరింతురు. అగ్ని వద్దకు చేరి ఆహారము అర్పింతురు.
(ప్రాణులందున్న అగ్ని గుప్తస్థాన స్థితుడగును. అగ్ని నేత్రములు సూర్యచంద్రాదులగుదురు.)
3. బాలుడగు అగ్ని తల్లి పృథ్విమీద సంచరించుచునే అక్కడిలతాగుల్మాదులను ఆరగించును. నేలలో వ్రేళ్లుండి, ఆకాశమునంటు వృక్షముల ఫలములను పట్టుకొనును. ఇతని జ్వాలలు వృక్షములను దహించును.
4. ద్యావాపృథ్వులారా ! ఋతంబ్రవీమి సత్యము చెప్పుచున్నాను:-
ఈ బాలుడున్నాడే అగ్ని అరణ్యమునే భక్షించినాడు. నేను మానవుడను దేవతాగ్ని విషయము తెలియనివాడను వైశ్వానరా ! నీవు ఎంతో జ్ఞానవంతుడవు. ఆ విషయము సహితము నేను ఎరుగను.
5. అగ్నికి అన్నము అర్పించువాడును. గోఘృతమున యజ్ఞముచేయువాడును. కాష్ఠాదులర్పించి పుష్టి కలిగించువాడును అగు యజమానివి అగ్ని అపరిమితజ్వాలలతో చూచును. అగ్నీ ! అతని విషయమునను, మా విషయమును అనుకూలుడవగుము.
6. అగ్నీ ! నీవు దాహకుడవు. నిన్ను తెలియక అడుగుచున్నాను. నీకు దేవతల మీద ఆగ్రహము కలిగిందా? ఆటలాడుచునో, ఆటలాడకనో హరిత వర్ణ అగ్ని భక్షించునపుడు గోవును ఖడ్గముచే ఖండించినట్లు అన్నము కర్రలు మున్నగు వానిని చెల్లాచెదరు చేయును.
7. అరణ్యమున పెరిగిన అగ్ని వట్టి త్రాళ్ళతో కట్టి వడిగల కొన్ని గుర్రములను రథమున పూన్చినది. అగ్ని కాష్ఠరూప ధనము వలన ప్రవ్రుద్దుడై అందరను చూర్ణము చేయును. ఇతడు కర్రముక్కలతో పెంపొందువాడు.
ఎనుబదవ సూక్తము
ఋషి - పౌచీక వైశ్వానరాగ్ని. దేవత - అగ్ని. ఛందస్సు - త్రిష్టుప్.
1. అగ్ని స్తోతలకు అశ్వమును ఇచ్చును. అది గతిశీలమగును. యుద్ధమున శత్రువులను గెలుచును. అన్నము అందించును. అగ్ని వీరుడు, ప్రజ్ఞావంతుడగు పుత్రుని ఇచ్చును. అగ్ని ద్యావాపృథ్వులను శోభామయులను చేయును - కదిలించును. స్త్రీని వీరమాతను చేయును - "వారింవిరకు క్షింపుదన్ధమ్"
2. అగ్ని కార్యమునాకు ఉపయోగించు సమిధకాష్ఠములు శుభప్రదములు కావలెను. అగ్ని తన తేజోబలమున ద్యావా పృథ్వులందు ఉన్నాడు. అగ్ని యుద్ధములందు తన భక్తులకు స్వయముగా సాయము చేయును. గెలిపించును.
3. అగ్ని జరత్కర్ణుడను ప్రసిద్ధృషిని రక్షించినాడు. అగ్ని 'జరూథ' నామక శత్రువును జలమునుండి బయటకు తీసి దహించినాడు. అగ్ని ప్రతప్త కుండమున పడిన అత్రిని ఉద్ధరించినాడు. అగ్ని 'నృమేధ' ఋషిని సంతానవంతుని చేసినాడు.
4. అగ్ని జ్వాలారూప ధనమునిచ్చును. సహస్రగోవులు గల ఋషికి అగ్ని మంత్ర ద్రష్టపుత్రుని ఇచ్చును అగ్ని యజమానులు అందించిన హవిని ద్యులోకమునకు అందించును. అగ్నికి భూమిమీద అనేక స్థానములు ఉన్నవి "అగ్నేర్థామాని విభృతా పురుత్రా"
5. తొలుత ఋషులు మంత్రములతో అగ్నిని ఆహ్వానింతురు. యుద్ధములందు శత్రుబాధకు లోనయిన మానవులు అగ్నిని గెలుపు కొరకు పిలిచెదరు. ఆకసమున పక్షులు అగ్నిని పిలుచును. వెలగోవులు చుట్టుముట్టి గని విచ్చేయును.
6. మానవ ప్రజ అగ్నిని స్తుతించును. నహుష వంశీయులు అగ్నిని స్తుతింతురు. గంధర్వులు యజ్ఞమార్గపు హిత వచనములను అగ్ని ఆలకించును. అగ్ని మార్గము ఘృతమునందు ఉన్నది.
ఎనుబది ఒకటవ సూక్తము
ఋషి - భువనపుత్ర విశ్వకర్మ. దేవత - విశ్వకర్మ. ఛందస్సు - త్రిష్టుప్.
1. విశ్వకర్మ మాకు తండ్రి హోత అతడు సకల భువనములను హవనము చేసినాడు. తాను స్వయముగా అగ్ని యందు ప్రవేశించినాడు. అతడు స్తోత్రాదులచే స్వర్గధనమును కోరినాడు. సకల జగములను అగ్నికి అర్పించినాడు తదుపరి సమీపమున ఉన్న భూత సహితుడై విశ్వ కర్మ సహితము హుతుడు అయినాడు.
2. సృష్టికాలమున విశ్వకర్మ దేనిని ఆశ్రయించినాడు? ఎచటనుండి, ఎట్లు అతడు సృష్టికార్యము ప్రారంభించినాడు? విశ్వదర్శకుడగు విశ్వకర్మ ఏ స్థానమున నిలిచి భూమిని నిర్మించినాడు ఆకాశమును ఏర్పరచినాడు?
3. విశ్వకర్మ నేత్రములు, విశ్వకర్మ ముఖము, విశ్వకర్మ బాహువులు, విశ్వకర్మ పాదములు సర్వదిశలందున్నవి. ఆ దివ్య పురుషుడు కరచరణములచే ద్యావాపృథ్వులను సృష్టించినాడు. అతడు ఒక్కడే అగును "ఏకః"
4. సృష్టికర్తలు ద్యావాపృథ్వులను ఏవనముతో - ఏవృక్షముతో చేసినారు? దేని మీద నిలిచి ఈశ్వరుడు ఈ సకల విశ్వములను ఏర్పరచినాడు? విద్వాంసులారా ! మీమనసులను అడిగి చూడండి !



