Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2


    2. జల్లెడతో పిండిని జల్లించినట్లు బుద్ధిమంతులు తమ బుద్ధిబలమున భాషను సంస్కరించి అందింతురు. అప్పుడు విద్వాంసులు తమ అభ్యుదయమును దృష్టియందుంచు కొందురు. వారి వాక్కునందు మంగళమయ లక్ష్మి నివసించును. "లక్ష్మీర్నిహితాధివాచి."

    3. బుద్ధిమంతులకు యజ్ఞద్వారమున వాక్కు భాష లభించును. ఋషుల అంతఃకరణవాక్కు వారికి లభించినది. ఆ వాక్కుతోనే వారు జనులను చదివించినారు. సప్తఛందములు ఈ వాక్కునందే స్తుతించును.

    4. కొందరికి అనుకున్నను వాక్కు అర్థముకాదు. కొందరికి విన్నను వాక్కు వినిపించదు. సంభోగాభిలాషగల భార్య మంచి దుస్తులు ధరించి భర్తకు తనను ప్రకటించినరీతి కొందరికి వాగ్దేవి స్వయముగా వ్యక్తమగును.

    5. విద్వన్మండలిలో కొందరకు 'భావగ్రాహి' అను పేరుగలుగును. అట్టివారు లేకున్న ఎట్టి పనియు జరుగదు. వేదార్థజ్ఞానము కలుగదు. కొందరు రసహీన వాక్యమును అభ్యసింతురు. వారు యదార్థధేనువులుకారు. కాల్పనిక మాయామయ ధేనువులు! "అధేన్వాబరతి మాయమా."

    6. మిత్రుని వదిలిన విద్వాంసుని వాణికి ఫలితం సత్కర్మ మార్గమును తెలియ జాలడు "నహిప్రవేద సుకృత స్యపన్థామ్."

    7. కాంచగలవాడును, వినగలవాడును మనోభావములు ఎరిగి ప్రకటించుటలో అసాధారుణులగుదురు. అందరు అట్టివారు కారు. కొందరు పుక్కిటికి తాగు నీరు వంటివారు. కొందరు నడుములోతు నీరుగలతటాకము వంటివారు. మరి కొందరు స్నానము చేయగల హ్రదము వంటివారు.

    8. ఒకప్పుడు సమానజ్ఞానములు గల బ్రాహ్మణుల సమావేశము జరుగును. అప్పుడు వారు వేదార్థముల గుణదోష విశ్లేషణ చేయుదురు. వారిలో కొందరికి జ్ఞానమే ఉండదు. కొందరు స్తోత్రిజ్ఞులై వేదార్థ జ్ఞాతలై విరాజిల్లుదురు.

    9. ఇహమున వేదజ్ఞ బ్రాహ్మణులతోను, పరలోకమందలి దేవతలతోను కర్మ నిర్వహించ నట్టివాడును, స్తోత్రజ్ఞుడు కానివాడును, సోమయజ్ఞము చేయనివాడును పాపాత్మకమగు ఐహిక భాషనేర్చును. మూర్ఖుడగును. నాగలి పట్టువాడగును.

    10. కీర్తి మిత్రునివలె పనిచేయును. ఇది సభలందు ప్రాముఖ్యత కలిగించును. కీర్తివలననే చెడు పేరు తొలగి పోవును. కీర్తి లభించినవాడు ప్రసన్నుడగును. కీర్తివలన అన్నము లభించును. బలము కలుగును. ఎన్నో ఉపకారములు సమకూరును.        

    11. ఒకడు అనేక ఋక్కులు వచించుచు యజ్ఞానుష్ఠానమున సహాయపడును. ఒకడు గాయత్రి ఛందమున సామగానము చేయును. బ్రహ్మయను పురోహితుడు జ్ఞానవిద్యను వ్యాఖ్యానించును. అధ్వర్యుడు యజ్ఞపు వివిధకార్యములు చేయును.

      (శీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత పదవ మండలము ఎనిమిదవ అష్టకమున రెండవ అధ్యాయము సమాప్తము.)

            ఓం నతామినన్తిమాయివో నధీరావ్రతాదేవానాం ప్రథమాధ్రవాణి
            నరోదసీ అద్రుహోవేద్యా భిర్నపర్వతానివమే స్థివాంసః

                మూడవ అధ్యాయము             డెబ్బది రెండవ సూక్తము
                      ఋషి - దేవదేవలోకమునుడు లేక బృహస్పతి. దేవత -
                                     జ్ఞానము. ఛందస్సు - అనుష్టుప్.


            ఓం దేవానాంమ వయంజానా ప్రవోబామ విపన్యయా |
            ఉక్థేషుశస్య మానేషుయః పశ్యదుత్త రేయుగే ||

    1. మేము దేవతల - ఆదిత్యుల - జన్మమును స్పష్టముగా చెప్పగలము. రానున్నయుగమున దేవసంఘమ - యజ్ఞానుష్ఠానము పిదపనే స్తోతను చూడగలడు.

    2. సృష్టి ఆదిన బ్రహ్మణస్పతి - కర్మకారునివలె - దేవతలను సృష్టించినాడు. ఆసత్ నుండి సత్ ఉత్పన్నమైనది.

    3. దేవతల సృష్టికన్న ముందే అసత్ నుండి సత్ ఉత్పన్నమైనది. తదుపరి దిశలు దిశలనుండి వృక్షములు ఉత్పన్నమైనవి.

    4. వృక్షముల నుండి పృథివి - పృథివినుంచి దిశలు కలిగినవి. అదితినుండి దక్షుడు, దక్షుని నుండి అదితి ఉత్పన్నులైనారు.

    5. దక్షా ! నీ పుత్రిక అదితి దేవతలకు జన్మనిచ్చిన దేవతలు అమరులు స్తుత్యులు.

    6. దేవతలు ఇచట జలములందుండి మహోత్సాహము ప్రకటించినారు. వారు నాట్యము చేసినంత పనిచేసినారు. అందువలన ధూళిలేచినది.

    7. మేఘములవలె దేవతలు సకలలోకమును ఆవరించినారు. సూర్యుడు నిగూ
ముగ ఉండెను. దేవతలు సూర్యుని ప్రకాశింప చేసినారు.

    8. అదితికి ఎనిమిది మంది పుత్రులు - మిత్ర, వరుణ, దాత, ఆర్యమ, అంశ, భగ, వివస్వత ఆదిత్యులు కలిగినారు. వారిలో ఏడుగురిని తీసికొని దేవలోకమునకు చేరినది. ఎనిమిదవ వాడగు సూర్యుని ఆకాశమున విడిచినది.

    9. ఉత్తమ యుగమందు ఏడుగురు పుత్రులను తీసికొని అదితి వెళ్లిపోయినది. జనన మరణముల కొరకు సూర్యుని ఉంచినది.
   
                                         డెబ్బది మూడవ సూక్తము
    ఋషి - శక్తిపుత్ర గేరివీతుడు. దేవత - మరుత్తులు - ఇంద్రుడు. ఛందస్సు - త్రిష్టుప్.

    1. గర్భముదాల్చిన ఇంద్రమాత ఇంద్రుని కన్నపుడు మరుత్తులు మహానుభావుడగు ఇంద్రుని - నీవు బలశాలివి. శత్రువినాశమునకే జన్మించినావు. నీవు వీరుడవు. స్తుత్యుడవు, ఓజస్వివి, అభిమానివి అని స్తుతించినారు.

    2. దోహక ఇంద్రుని వద్ద సేన నిలిచి ఉన్నది.అప్పుడు మరుత్తులు విశేషస్తోత్రములు చదివినారు. ఇంద్రుని వర్థిల్ల చేసినారు. విశాల గోష్ఠము మధ్య ఆవులు ఆచ్చాదితములై ఉండును. ఆచ్చాదన వదలినంత బయటపడును. అట్లే వర్షజలము వ్యాపకా అంధకారము నుండి బయట పడినది.

    3. ఇంద్రా! నీ పాదములు మహిమగలవి. నీవు నడచినపుడు ఋభువులు వర్థిల్లుదురు. సకల దేవతలు వర్థిల్లుదురు. నీవు సహస్రవృక్షములను నోట పట్టగలవు అశ్వినులను త్రిప్పగలవు "త్వమిన్ద్రసాలావృకాన్ప హస్రమాంసంధిషే అశ్వినావృత్యాః."

    4. ఇంద్రా! నీవు యుద్ధపు తొందరలో సహితము యజ్ఞములకు చేరుదువు. అప్పుడు నీవు అశ్వినులతో స్నేహము చేయుదువు. మా కొరకు నీవు వేల ధనములు తెచ్చెదవు. అశ్వినులు సహితము మాకు ధనము ఇచ్చెదరు.

    5. యజ్ఞమందు ఇంద్రుడు ఆనందించును. మరుత్తులను కలసికొనును. యజమానికి ధనము ఇచ్చును ఇంద్రుడు యజమాని కొరకు దస్యుల మాయను నష్టపరచినాడు వర్షము కలిగించినాడు చీకట్లను చెదర గొట్టినాడు.

    6. ఇంద్రుడు శత్రువులందరిని సమానముగనే నష్టపరచును. అతడు ఉష శకటమును నష్టపరచినట్లే శత్రువులను ధ్వంసము చేయును. దీప్తుడు, మహామహుడు, మరుత్తుల మిత్రుడగు ఇంద్రుడు వృత్రవధకు సాగినాడు అతడు శత్రువుల అందమగు దేహములను ధ్వంసము చేసినాడు.

    7. ఇంద్రా! నీధనమును ఆశించిన నముచి నిహత మార్చినావు. విఘాతక అసురుడగు 'నముచి'ని మనువు ముందు మాయాశూన్యుని చేసినావు. దేవతలందు మానవులకు మార్గము ఏర్పరచినావు ఆ మార్గము దేవలోకము చేరుకొనుటకు సులభమైనది.

    8. ఇంద్రా! నీవు ఈ లోకమును జలము, వెలుగులతో నింపినావు. నీవు ఎల్లరకు స్వామివి. చేత వజ్రము ధరించువాడవు సకల దేవతలు బలముగల నిన్ను స్తుతింతురు. నీవు మబ్బుల తలవంచినావు.

    9. జలమధ్యమున ఇంద్రుని చక్రము ఉన్నది. అది ఇంద్రుని కొరకు మధువును భేదించవలెను. ఇంద్రా! నీవు తృణలతాడులందు పాలను, నీటిని నిలిపినావు అవి గోస్తనమునుంచి ఎంతో చక్కగా వెడలును.

    10. కొందరు ఇంద్రుడు అశ్వమందు, ఆదిత్యునియందు జన్మించినాడు అందురు. కాని ఇంద్రుడు జలములందు జన్మించినాడు నాకు తెలియును. ఇంద్రుడు కోపమునుండి పుట్టినాడు. శత్రువుల మేడలు ఎక్కినాడు. ఇంద్రుడు పుట్టిన చోటు ఇంద్రుడే ఎరుగును "యతః ప్రజజ్ఞ ఇంద్రో అస్యవేద."

    11. గమనశీలలై చక్కగాపడు సూర్యకిరణములు ఇంద్రుని వద్దకు పోయినవి. అప్పుడు పక్షిరూపముగల యజ్ఞాభిలాషి ఋషి ఇట్లు ప్రార్థించినాడు:-

    ఇంద్రా! చీకట్లను తొలగింపుము. కంటిని వెలుగుచే నింపుము. మేము పాశబద్ధులము. మమ్ము విడిపించుము. "చక్షుర్ముముగ్ధ్య స్మాన్నధియే బద్ధాన్."

                                       డెబ్బది నాలుగవ సూక్తము
                                               ఋష్యాద్యాః పూర్వవత్

    1. ధనదానమునకుగాను ఇంద్రుడు యజ్ఞము వలన ఆకర్షించబడును. అతనిని దేవతలు, మానవులు ఆకర్షింతురు. యుద్ధమందు ధనమునార్జించు అశ్వములు ఆకర్షించును. శత్రుసంహారము చేయగల యశస్వులు ఇంద్రుని ఆకర్షింతురు.

    2. అంగిరుల ఆహ్వానవాదములు ఆకసమందంతట నిండినవి ఇంద్రుని అభిలషించువారును, అన్నము కోరువారలగు దేవతలు అనుష్ఠాతలకు గోవును చూపదలచినారు భూమిని ఏర్పరచినారు. భూమి మీద గోవులను అపహరించిన పణులను చూచినారు. తమ హితము కోరి ఆకాశమున ఆదిత్యసమమగు తమ వెలుగును పరచినారు.

    3. వీరు అమరదేవులు. వీరి స్తుతి సాగుచున్నది. వారు యజ్ఞమందు నానా ఉత్తమోత్తమ ధనములను ప్రదానము చేయుదురు. వారు స్తుతులకు యజ్ఞములకు సిద్ధికలిగించవలెను. అసాధారణ ధనము ప్రసాదించవలెను.

    4. ఇంద్రా! శత్రువుల గోధనము హరిమ్చదలచిన జనులు నిన్నే స్తుతింతురు. ఈ విశాల పృథ్వి ఒకేసారి పుట్టినది. కాని ఇది సంతానమును కలిగించుచునే ఉండును. ఇది సహస్రధారలుగ సంపన్నదుగ్ధములను ప్రదానము చేయును. ఈ పృథ్వియను గోవును పితుక దలచిన వారు సహితము ఇంద్రునే స్తుతింతురు.

    5. ఇంద్రుడు ఎన్నటికి తలవంచనివాడు శత్రువులను దహించువాడు మహా ధనికుడు సుందరస్తుతి మంతుడు. మానవ హితమునకు వజ్రము ధరించువాడు కర్మనిష్ఠ పురోహితులారా! రక్షణ కొరకు ఇంద్రుని శరణుకోరండి.

    6. శత్రుపుర విధ్వంసక ఇంద్రుడు ఎంతో ఎదిగిన శత్రువును సంహరించినాడు. అప్పుడు ఇంద్రుడు వృత్రఘ్నుడు అయినాడు. భూమి మీదకు నీటిని దింపినాడు. అంతట జనులు ఇంద్రుని బలశాలి యనియు క్షమాశీలుడని గ్రహించినారు. ఇంద్రుడు మన కోరికలను తీర్చగలవాడు.

                                  డెబ్బది అయిదవ సూక్తము
        ఋషి - ప్రియమేధ పుత్ర పింధుక్షితుడు. దేవత - నది. ఛందస్సు - జగతి.

    1. జలమా! సేవకుడగు యజమాని గృహమందు నీ మహిమను వివరిస్తుండును. నదులు ఏడు ఏడుగా మువ్విధములై భూమి, ఆకాశము, ద్యులోకము నుండి బయలుదేరినవి అన్నింటిని మించిన ప్రవాహముగలది సింధునది.

    2. సింధూ! నీవు పంటభూములకు పారునపుడు వరుణుడు నీ కొరకు విశాల మార్గము ఏర్పరచినారు. నీవు భూమిమీద ఉత్తమ మార్గమున సాగుదువు. నీవు సకల జగమునకు అగ్రమవై విరాజిల్లుచున్నావు "ఏషామయం జగతా మిరజ్యసి."

    3. నేలనుండి ఎగిసిన సింధునాదము ఆకాశమును కప్పి వేసినది. ఇది మహావేగవంతములు, దీప్తములగు తరంగములతో సాగును. సింధునది వృషభనాదము చేయుచు వచ్చునపుడు ఉరుములతో కూడిన వానవచ్చినట్లుండును.

    4. తల్లి వద్దకు శిశువులు పాడియావు వద్దకు దూడలు వెళ్లినట్లు ధ్వనించుచు ఇతర నదులు సింధువద్దకు వెళ్లును. యుద్ధమునకేగు రాజు సేనతోవలె తన రెండు సహగామినీ నదులతో సింధునది పురోగమించును.

    5. గంగా, యమున, సరస్వతి, శ్రతుద్రి, సత్లజ్, పురుష్ణి - రవి, అసిక్ని - చినాబ్, వీటితో సాగుమరువర్దవన్ , వితస్త - ఘేలమ్, సుషోమ - సోహన్, ఆర్జికీయ - వ్యాసనదులారా ! మీరందరు ఈ స్తోత్రమును పరుగెత్తి పట్టుకొనండి వినండి.

    6. సింధూ ! నీవు తొలుత 'తృష్టామ్' తో సాగినావు. తదుపరి 'సుసర్తు' 'రస' 'శ్వేత్య' లతో కలసినావు. నీవు 'క్రము' 'గోమతులను' 'కుభ' మేహత్ నదులతో కలుపుదువు. ఈ నదులతో కలసి నీవు సాగుదువు.

    7. సింధునది సరళగామిని - శ్వేతవర్ణ - ప్రదీప్త - సింధునది పరుగుల నీరు నలువైపులకు సాగును. సింధు నదులందు వేగవంతమ్. ఇది ఆడ గుఱ్ఱము వంటి అద్భుతమైనది. సుందర యువతివలె దర్శనీయ.

    8. సింధునది శోభన అశ్వము వంటిది. సుందర రథము వంటిది. శుభ్రవస్త్రము వంటిది. సువర్ణ ఆభరణము వంటిది. సుందర సజ్జ, అన్న, పశువంత్, సౌభాగ్యవతి సింధు మధువర్ధక పుష్పములచే ఆచ్చాదితము.


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More