Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
6. ఇంద్రుని అశ్వములు యుద్ధ సమయములందు స్వయముగా శత్రువుల మహాధనమును తెచ్చి ఇచ్చును. అవి సుశిక్షిత అశ్వములవలె లయ బద్ధముగ అడుగులు వేయును.
7. స్తోతలారా! రథయోజక వాయువును బహుకర్మ కర్త ఇంద్రుని పూషను స్తుతించండి. వారితో మీ సఖ్యత అంగీకరింప చేయండి. వారు ఏకమనస్కులు, అన్యోన్య మనస్కులై ప్రాతఃకాల యజ్ఞమునాకు ఉపస్థితులగుదురు.
8. సరస్వతి, సరయు, సింధుమున్నగు ఇరువదియొక్క నదులను, వనస్పతులను, పర్వతములను, అగ్నిని, సోమపాలక కృశాను గంధర్వుని, బాణబాలక గంధర్వుని నక్షత్రములను, హవిర్భాగముగల రుద్రుని, రుద్రులందు ప్రధానరుద్రుని మారక్షణల కొరకు యజ్ఞమునాకు ఆహ్వానించు చున్నాము.
9. గొప్పవి, తరంగములు గల సరస్వతి, సరయు, సింధుమున్నగు ఇరువదియొక్క నదులు రక్షించుటకు విచ్చేయవలెను. జలప్రేరకములగు ఈ దేవతలు ఘృత, మధుసమాన జలములను అందించవలెను.
10. మహా దీప్త దేవమాత అదితి మా ఆహ్వానము వినవలెను. దేవపిత త్వష్ణ తన పుత్రులగు దేవతలు, వపత్నల సహితుడై మా ఆహ్వానము వినవలెను. ఋభుక్ష, ఇంద్ర, వాజ, రథపతి, బాగా, స్తుత్య మరుద్గణములు స్తుతుల కొరకు మమ్ము రక్షించవలెను.
11. మరుత్తులు అన్నమున్న ఇంటివంటి రమణీయులు. రుద్రపుత్ర మరుత్తుల స్తుతి శుభావహమగును. మానవులందు మేము గోధనవంతులము, కీర్తివంతులము కావలెను. దేవతలారా! సదా మేము అందరము కలసి నడువవలెను "ఇళయాసచేమహే"
12. మరుద్గణ, రుద్ర, దేవబృంద, వరుణ, మిత్రులారా! పాడియావు పొదుగు భారమైనట్లు మీరు ప్రసాదించిన కర్మఫలమును సుసంపన్నము చేయండి. మా స్తోత్రములు విని రథముపై ఎక్కి మీరు మా యజ్ఞమునకు విచ్చేసినారు.
13. మరుత్తులారా! పూర్వము అనేకమారులు మీరు మా బంధుత్వమును రక్షించినారు. ఇప్పుడు సహితము అట్లే చేయండి. మేము సర్వప్రథమముగ వేది ఏర్పరచెదము. అక్కడ అదితి - మానవుల సహితముగ మాకు బంధుత్వము ప్రసాదించ వలెను.
14. ద్యావాపృథ్వులు అందరిని కల్పించునవి. దీప్తిశీలలు యాగయోగ్యులు వారికి జన్మతోనే ఇంద్రాదుల ప్రాప్తి కలిగినది. అవి బహువిధములుగ దేవతలను, మానవులను రక్షించవలెను పాలకులగు దేవతలతో కలసి అవి జలమును ప్రవహింప చేయును.
15. వాణి - వాక్కు - మహామహులను పాలించునది. స్తుతివంతము. దేవతలను స్తుతించునది. సోభిషవ కారణమున మహత్వము సాధించినది. అట్టి వాణి సకల స్వీకరణీయ ధనములను వ్యాపింప చేయును. స్తోతలు స్తోత్రములచే దేవతలను యజ్ఞకాంక్షులను చేయుదురు.
16. గయ ఋషి క్రాంత ప్రజ్ఞుడు. బహుస్తుతిసంపన్నుడు. యజ్ఞజ్ఞాత. ధనేచ్చుకుడు. విప్రుడు. అతడు ధనమును ఆశించి ఈ విధముగా ఉక్ధములు, స్తోత్రములచే దేవతలను స్తుతించినాడు.
17. దేవతలారా! అదితీ! జ్ఞాని ప్లుతి పుత్రుడు గయుడు ఈ విధముగా మిమ్ము వర్తిల్ల చేసినాడు. దేవతల ప్రసన్నతయే మనుషుల పాలన గయుడు దేవతలను స్తుతించినాడు.
అరువది అయిదవ సూక్తము
ఋషి - వసుక్రపుత్ర వసుకర్ణుడు. దేవత - వివేదేవతలు.
ఛందస్సు - జగతి 15 త్రిష్టుప్.
1. అగ్ని, ఇంద్రుడు, వరుణుడు, మిత్రుడు, ఆర్యమ, వాయువు, పూష, సరస్వతి, ఆదిత్యగణములు, విష్ణువు, మరుత్తులు, మహి, స్వర్గము, సోమము, రుద్రుడు, అదితి, బ్రహ్మణస్పతులు కలసి తమ మహిమచే అంతరిక్షమును నింపుదురు.
2. ఇంద్రుడు, అగ్ని శిష్టులను రక్షింతురు. యుద్ధములందు కలసి తమ శక్తితో శత్రువును పారద్రోలుదురు. విశాల ఆకాశమును తమ తేజస్సుతో నింపుదురు ఘృతయుక్త సోమరసము వారి బలమును పెంచును.
3. మహత్తమ, అవిచల, యజ్ఞవర్థక దేవతలను నేను కానున్న యజ్ఞమున స్తుతింతును. మేఘముల నుండి జలము కురిపించు దేవతలు మాకు మిత్రులు కావలెను. వారు మాకు దానములను ఇవ్వలెను. మమ్ము శ్రేష్ఠులను చేయవలెను.
4. ఈ దేవతలు తమ శక్తులతో అందరినేత సూర్యుని, ఆకాశమునందలి గ్రహ నక్షత్రాదులను, ద్యులోక భూలోక, భూలోక పృథ్వులను తమతమ స్థానములందు స్థాపించినారు. ధనదాతల వలె ఉత్తమ దానములు ఇచ్చెదరు. మానవులను శ్రేష్ఠులను చేయుదురు. వారు ధనము లిత్తురు. అందుకే స్తుతించ బడుదురు.
5. మిత్రుడు, దాతయగు వరుణునకు హోమద్రవ్యములు సమర్పించండి. వీరు రాజాధిరాజులు. వీరు ఆవాసహీనులు కాజాలరు. వారి బృహత్ శరీరములు తేజోవంతములై ప్రకాశించును. వీరి వద్ద ద్యావాపృథ్వులు యాచకులవలె నిలుతురు.
6. ఒక గోవు స్వయముగా పవిత్రస్థానమగు యజ్ఞమునకు వచ్చును. అది పాలిచ్చి యజ్ఞ కర్మమును సుసంపన్నము చేయును. ఆ గోవు దాతవరుణుడు, మరియు ఇతర దేవతలకు హోమద్రవ్యములు సమర్పించ వలెను. దేవ సేవకుడనగు నన్ను రక్షించవలెను.
7. ఏ దేవతలు తమ తేజమున ఆకాశము నింపుదురో ఎవరి జిహ్వ అగ్నియగునో, ఎవరు యజ్ఞమును వృద్ధి చేయుదురో వారు యజ్ఞమున తమతమ స్థానములు తెలిసి ఆసీనులగుదురు. వారు ఆకసమున నిలుతురు. తమ బలమున జలమును వెలికి తీసెదరు. యజనీయ హవిని తమ దేహములందు ధరింతురు.
8. ద్యావా పృథ్వులు సర్వవ్యాపకములు. అవి అందరి తల్లిదండ్రులు. అన్నింటి కన్న ముందు పుట్టినవి. రెండు ఒకే స్థానమున ఉన్నవి. యజ్ఞ స్థానమున నివసించునవి. రెండును ఏకమనస్కలై పూజనీయ వరుణునకు ఘృతయుక్త దుగ్థములు అందించును.
9. మేఘము, వాయువు, కోరికలు తీర్చువారు. బలవంతులు ఇంద్ర, వాయు, వరుణ, మిత్ర, అదితిపుత్ర దేవతలను అదితిని ఆహ్వానించు చున్నాము. భూలోక, ద్యులోక, జలమందు ఉద్భవించిన దేవతలను ఆహ్వానించుచున్నాము.
10. ఋభువులారా! మీకు శుభములు కలుగుటకు దేవతలను ఆహ్వానించు త్వష్ట వద్దకును, వాయువు వద్దకును, బృహస్పతి వద్దకును, జ్ఞాని, వృత్రఘ్నడగు ఇంద్రుని వద్దకును, చేరునదియు ఇంద్రుని సంతుష్టపరచు సోమమును మేము ధనము యాచించుచున్నాము.
11. దేవతలు అన్నమును, గోవులను, అశ్వములను, వృక్షములను, లతలను, పర్వతములను పృథ్విని సృష్టించినారు. ఆకాశమున సూర్యుని నిలిపినారు. వారి దానము ఎంతో శోభస్కరము. వారు భూమి మీద మహామహా కార్యములు చేసినారు.
12. అశ్వినులారా! మీరు 'భుజ్యు' ని ఆపదలనుండి రక్షించినారు. 'విద్రమతి' అనుస్త్రీకి పింగళవర్ణ పుత్రుని ఇచ్చినారు. 'విమదు' నకు అందమైన భార్యను ఇచ్చినారు. 'విశ్వక' ఋషికి 'విష్ణప్వు' డనుపుత్రుని ప్రసాదించినారు.
13. ఆయుధవంత, మధుర మాధ్యమికి వాక్కును, ఆకాశమును వహించు అజేక పాత్రుడును, సింధుఉ, ఆకాశజలము, విశ్వదేవతలకు వారి కర్మములు జ్ఞానముతో కూడిన సర్సవతియు నా వచనములను వినవలెను.
14. ఇంద్రాది దేవతలు అనేక కర్మ, జ్ఞానయుక్తులు మానవ యజ్ఞములందు యజనీయులు అమరుల సత్యజ్ఞాతలు. హవి గ్రాహకులు. యజ్ఞములందు కలసికొనువారు. సర్వజ్ఞాతలు. వారు మాస్తుతులను, ఉత్తమరీతిన సమర్పించిన అన్నమును స్వీకరించవలెను.
15. వసిష్ఠవంశమున పుట్టిన ఈ ఋషి అమరదేవతలను స్తుతించినాడు. సకల భువనములందున్న దేవతలు మాకు కీర్తి కర అన్నమును ప్రసాదించవలెను. దేవతలారా! మాకు శుభములు కలిగించండి. రక్షించండి.
అరువది ఆరవ సూక్తము
ఋష్యాద్యాః పూర్వవత్.
1. ఏ దేవతలు విశేష అన్నవంతులో, ఆదిత్యతేజో కర్తలో, ప్రకృష్ట జ్ఞానులో, సర్వధనులో, ఇంద్రవంతులో, అమరులో యజ్ఞమువలన ప్రవృద్ధులో వారిని నిర్విఘ్నయజ్ఞ సమాప్తికని ఆహ్వానించుచున్నాను.
2. మరుత్తులు ఇంద్రునిద్వారా కార్యములకు పంపబడువారు. వరుణునిద్వారా ఆమోదించబడినవారు. జ్యోతిర్మయ సూర్యుని మార్గమును పూర్తి చేసినవారు. శత్రుసంహారకులు. వారి స్తోత్రములను మేము మననము చేయుదుము. విప్రులారా ! మరుత్తుల యజ్ఞము ఏర్పరచండి.
3. పశువుల సహితుడైన ఇంద్రుడు మమ్ము రక్షించవలెను. ఆదిత్యుల సహితముగా అదితి మాకు సుఖములు కలిగించవలెను. రుద్రపుత్ర మరుత్తుల సహితుడై రుద్రుడు మమ్ము సుఖవంతులను చేయవలెను. పత్నీసత త్వష్ట మా సుఖములు పెంచవలెను.
4. అదితి, ద్యావాపృథ్వులు, మహాసత్య అగ్ని, ఇంద్ర, విష్ణు, మరుత్, విశాల, స్వర్గస ఆదిత్యగణ, సుగణ, రుద్రగణ, ఉత్తమదాత సూర్యులను ఆహ్వానించుచున్నాము. వారు మమ్ము రక్షించవలెను.
5. జ్ఞాన సముద్రుడు, కర్మనిష్ఠవరుణుడు, పూష, మహిమాన్విత విష్ణువు, అశ్వినులు స్తోతలకు అన్నము పెట్టువారు, జ్ఞానులు, పాపవినాశకులు, అమరులగు - దేవతలు మాకు మూడంతస్తుల ఇల్లు ప్రదానము చేయవలెను.
6. యజ్ఞము మాకు అభిమత ఫలములు ప్రసాదించవలెను. యజ్ఞ దేవతలు మా కోరికలు తీర్చవలెను. దేవతలు, హవి ఏర్పరచువారు, యజ్ఞాధిష్ఠాత్రి ద్యావాపృథ్వులు, పర్జన్యుడు స్తోత, వీరందరు మా కోరికలు తీర్చవలెను.
7. అన్నము కొరకని అభీష్టప్రదాతలగు అగ్నిని సోమమును స్తుతిస్తాను. సకలలోకము దాతలని వారిని ప్రశంసించును. వారిద్దరినే యజ్ఞమందు పురోహితులు పూజింతురు. వారు మాకు మూడంతస్తుల ఇల్లు ప్రసాదించవలెను.
8. కర్తవ్యపాలన తత్పరులు, బలశాలురు, యజ్ఞములందు అలంకృతులు. మహా దీప్తిమంతులు, యజ్ఞములకు విచ్చేయువారు, అగ్ని చేత ఆహూతులు, సత్యపాత్రులగు దేవతలే వృత్రవధసమయమున వర్షజలము ఏర్పరచినారు.
9. దేవతలు తమ ప్రయత్నమున ద్యావాపృథ్వులను, జలములను, వనస్పతులను, యజ్ఞోపయోగ ఉత్తమ పదార్థములను ఏర్పరచినారు. తమ తేజమున ఆకాశమును, స్వర్గమును వెలిగించినారు. వారు యజ్ఞముతో తమను జోడించినారు. యజ్ఞమును అలంకరించినారు.
10. ఋభువుల హస్తకౌశల్యము సుందరము - వారు ఆకాశమును ఆశ్రయించినారు. వాయువు, మేఘముల ధ్వని మహత్తరము. జలములు, వనస్పతులు మా స్తోత్రములను పెంపొందించవలెను. ధనదాత భగుడు, ఆర్యమ మా యజ్ఞమునకు విచ్చేయవలెను.
11. సముద్రములు, నదులు, ధూళిమయ పృథ్వి, ఆకాశము, అజేకపాత్, గర్జనశీల మేఘము, ఆహిర్భబుధ్నన నా ఆహ్వానములు వినవలెను.
12. దేవతలారా ! మేము మనువు బిడ్డలము. మేము మీ యజ్ఞము చేయగలుగవలెను ప్రచలితమగు మా యజ్ఞమును చక్కగా సమాప్తము చేయండి. ఆదిత్యులారా! రుద్రులారా! వసువులారా! మీ దానశక్తి అత్యంత శోభాయుతము. మీరు మా స్తోత్రములు వినండి.
13. అగ్ని, ఆదిత్యులు ఇద్దరు దేవతలను ఆహ్వానించువారు. సర్వశ్రేష్ఠ పురోహితులు. వారికి హవిచ్చి సేవింతును. నేను నిర్విఘ్న యజ్ఞమార్గమున సాగుచున్నాను - ఋతస్య పన్థామన్వేమి సాధమా. మా వద్దనున్న క్షేత్రపతి అసుర దేవతలను మాకు ఆశ్రయము ప్రసాదించమని ప్రార్థించుచున్నాము. మా ప్రార్థన మన్నించుటకు వారు సావధానులై ఉందురు.
14. వసిష్ఠసములైన వసిష్ఠవంశజులు స్తుతించినారు. వారు తమకు శుభములు కలుగుటకుగాను వసిష్ఠ ఋషివలె దేవతలను పూజించినారు. దేవతలారా! మిత్రులవలె విచ్చేయండి. సంతుష్టమనస్కులు కండి. అభీష్టఫలములు ఇవ్వండి.
15. వశిష్ఠవంశమున పుట్టిన ఈ ఋషి అమర దేవతలను స్తుతించినాడు. సకల భువనములందున్న దేవతలు మాకు కీర్తి కర అన్నమును ప్రసాదించవలెను. దేవతలారా! మాకు శుభములు కలిగించండి. రక్షించండి.
అరువది ఏడవ సూక్తము
ఋషి - అంగిరస ఆయాస్యుడు. దేవత - బృహస్పతి. ఛందస్సు - త్రిష్టుప్.
1. మా పితరులు అంగిరులు ఏడు ఛందస్సుల బృహత్ స్తోత్రములు రచించినారు. అవి సత్యమునుండి ఉత్పన్నములు. ఆయాస్య ఋషిలోక హితము కోరువాడు. అతడు ఇంద్రుని ప్రశంసించినాడు. ఉక్ధములు రచించినాడు.
2. అంగిరులు యజ్ఞపు సుందర స్థానమునకు తప్పక చేరుదురు. వారు సత్యవాక్కులు, సరళస్వభావులు, స్వర్గపుత్రులు మహాబలశాలురు. విప్రులవలె ఆచరించువారు.
3. బృహస్పతి సహాయకులు హంసలవలె కలకలము ప్రారంభించినారు. వారి సాయమున బృహస్పతి రాతిద్వారమును తెరిచినాడు. అప్పుడు లోన బంధించిన గోవులు అంబారావములు చేసినవి. అంతట బృహస్పత్యాదులు ఉత్తమ స్తోత్రములను ఉచ్చైస్వరమున ఉచ్చరించినారు.
4. క్రింద ఒక ద్వారము, పైన రెండు ద్వారములున్న చీకటి గుహలో గోవులను దాచినారు. బృహస్పతి అంధకార మధ్యమున ప్రకాశము కలిగించ దలచినాడు. మూడు ద్వారములు తెరచినాడు. ఆవులను వెలుపలికి తెచ్చినాడు.



