Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2


    18. స్వర్గమునందున్న సూర్యుడా! నేను నీ బంధువును. నాభానేబిష్టుడను. నిన్ను స్తుతింతును. నాకు ఆవులు లభించవలెనను కోరిక కలిగినది. ద్యులోకము సూర్యునకు, మాకు ఉత్పత్తి స్థానమగును. సూర్యునకు, నాకు ఎందరు పురుషుల అంతరము ఉన్నది?

    19. ద్యులోకమే నా జన్మస్థానము. నేను ఇచటనే నివసింతును. సకల కిరణములును, దేవతలును నావారలే అగుదురు. నేను అందరివాడను. సత్యరూప బ్రహ్మకన్న ముందే ద్విజులు జన్మించినారు. యజ్ఞస్వరూప గోవులేక మాధ్యమికే వాక్కు జనించి ఈ సమస్తమును సృష్టించినది.

    20. అగ్ని ఆనందమున సాగును. నలువైపుల తన స్థానము గ్రహించును. ఇతడు ఉజ్వలుడు. ఇహపర ఉభయలోకములకు సాయపడువారు. అతడు కర్రలందుండును. ఇతని జ్వాలలు పైకి లేచును. అతడు స్తుత్యుడు. అగ్నికి అరణిమాత అరణి సుస్థిర, సుఖావహ అగ్నిని అతిత్వరగా పుట్టించును.

    21. ఉత్తమోత్తమ సోత్రములు పలుకుచు పలుకుచు నాభానేదిష్టుడను అలసి నాను. నా స్తుతలు ఇంద్రుని చేరినవి. ధనిక అగ్నీ ! వినుము మా ఇంద్రుని యజ్ఞము చేయుము. నేను అశ్వమేధము చేయువాని పుత్రుడను నా స్తుతుల వలన నీవు వర్థిల్లుదువు.

    22. వజ్రధర నరేంద్ర ఇంద్రా! మేము విశేషధనము కోరినాము. ఇది తెలిసి కొనుము. మేము నిన్ను స్తుతింతుము. నీకు హవి సమర్పింతుము. మమ్ము రక్షింపుము. హర్యశ్వవంత ఇంద్రా! మేము అపరాధులమై నీ వద్దకు చేరకుందుముగాక.

    23. దీప్తమూర్తులగు మిత్రావరుణలారా! గోవుల కొరకు అంగిరులు యజ్ఞము చేసినారు. సర్వజ్ఞనాభా నేదిష్టుడు స్తోత్రాభిలాషినై వారివద్దకు చేరినాను. నేను స్తుతించి యజ్ఞము పూర్తి చేసినాను. అందుకే నేను వారికి అత్యంత ప్రియ విప్రుడను అయినాను.

    24. ఇప్పుడు మేము గోధనము కోరినాము. అనాయాసముగ స్తుతించినాము. వరుణుని వద్దకు చేరినాము. శీఘ్రగామి అశ్వము ఆ వరుణుని బిడ్డయే. వరుణా! నీవు విప్రుడవు అన్నదాతవు.

    25. మిత్రా, వరుణులారా! అన్నవంత పురోహితులు స్తుతించుచున్నారు. మీరు మాకు అనుకూలురు కావలెను మీ బంధుత్వము హితకరము. అందువలన సకల స్థానములందు స్తోత్రవాక్యములు ఉచ్చరించబడును. పరిచితమార్గము సుఖకరమైనట్లు మీ బంధుత్వము మా స్తుతులను సుఖకరము చేయవలెను.

    26. పరమబంధు వరుణా! దేవతలతో కూడ స్తోత్రములు, నమస్కారములు అందుకొనుము. వర్థిల్లుము వరుణుని యజ్ఞమున ఆవుపాలు ఏరులై పారవలెను.

    27. దేవతలారా! మీరు యజ్ఞరక్షకులు మమ్ము రక్షించుటకుగాను మీరందరు ఏకము కండి. అంగిరులారా! మీరు ఉద్యమింఛి నాకు అన్నము కలిగించినారు. మీకు అనుమాన నివృత్తి అయినది. గోధనమును అందుకొనండి.

     (శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత పదవ మండలము ఎనిమిదవ అష్టకమున మొదటి అధ్యాయము సమాప్తము.)

             ఓం నతామిన్తిమాయినో వధీరావ్రతా దేవానాం ప్రథమాధ్రవాణి
            నరోదసీ అద్రుహో వేద్యా భిర్న పర్వతాని నమేత స్థివాంసః

              రెండవ అధ్యాయము             అరువది రెండవ సూక్తము
 ఋషి - మానవ నాభావేదిష్టుడు. దేవత - విశ్వేదేవతలు. ఛందస్సు - వేరు వేరు.

            ఓం యేయజ్ఞేన దక్షిణయాసమక్తా ఇంద్రస్య సఖ్యమ మృత్వమానశా |
            తేభ్యోభద్ర మజ్ఞిరసోవో అస్తుప్రతి గృభ్ణీతమాన వంసుమేధసః ||

    1. అంగిరులారా! మీరు యజ్ఞద్రవ్యములు ఇచ్చినారు. దక్షిణలు ఇచ్చినారు. ఒకేసారి ఇంద్రుని బాంధవ్యము, అమరత్వము పొందినారు. మీకు శుభములు కలుగవలెను. సుయజ్ఞ అంగిరులారా! నేను మనుపుత్రుడను. నన్ను స్వీకరించండి. నేను చక్కగా యజ్ఞము చేయుదును. "ప్రతిగృభ్ణీతమానవం సుమేధసః"

    2. అంగిరులారా! మీరు మాకు పితృసములు. మీరు అపహృత గోవులను తెచ్చినారు. సంవత్సరమంతము యజ్ఞము చేసి బలాసురుని వధించినారు. మీకు దీర్ఘాయువు కలుగవలెను. "ప్రతిగృభ్ణీతమానవం సుమేధసః"

    3. మీరు సత్యరూపయజ్ఞము చేసినారు. అందువలన ద్యులోకమున సూర్యుని స్థాపించినారు. భూమాతను ప్రసిద్ధను చేసినారు. మీకు సంతతి కలుగవలెను. "ప్రతిగృభ్ణీతమానవం సుమేధసః"

    4. దేవపుత్ర ఋషులగు అంగిరులారా! నేను నాభానేదిష్టుడను. యజ్ఞములందు సువచనములు పలుకువాడను. అవధరించండి శోభన బ్రహ్మతేజస్కులుకండి. "ప్రతిగృభ్ణీతమానవం సుమేధసః"

    5. వీరు వివిధరూప ఋషులు. అంగిరులు గంభీర కర్మ వంతులు. వారు అగ్ని పుత్రులు వారు నలుదిశల ప్రాదుర్భవించినారు.

    6. అంగిరులు వివిధరూపులు అగ్నివలన ద్యులోకపు నలుదిశల ప్రాదుర్భవించినవారు. వారిలో కొందరు నవశ్వము తొమ్మిదినెలల యజ్ఞము చేసినారు. కొందరు దశాశ్వము పదినెలల యజ్ఞము చేసినారు. ఆ విధముగా వారికి గోధన కలిగినది. అంగిరులు దేవతలతో ఉండువారు. వారిలో శ్రేష్ఠుడు నాకు ధనము ప్రసాదించవలెను.

    7. అంగిరులు కర్మకర్తలు. వారు ఇంద్రుని సాయమున అశ్వ, గోయుక్త గోష్ఠములను ఉద్ధరించినారు అవిలంబ కర్ణములు గలవారు నాకు వేయిగోవులను ఇచ్చినారు. దేవతలకు యజ్ఞాశ్వమును ఇచ్చినారు.

    8. నీటనానిన గింజవలె సావర్ణమనువునకు ధన, సంతాన వృద్ధి కలుగ వలెను. ప్రస్తుతము మనువు వందల అశ్వములు, వేలు గోవులను దానము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు.

    9. మనువు వలె దానము చేయ గలవాడు లేడు. అతడు స్వర్గమువంటి ఉన్నత భావములవాడు. సావర్ణ మనువుదానము నదివలె సర్వత్ర వ్యాపించినది "సిన్ధురివ పప్రథే." 

    10. యదు, తుర్వ రాజర్షులు కళ్యాణకారకులు, గోయుక్తలు, దాసులవంటివారు, మనువు భోజనముకు గాను పశువులను అర్పింతురు.

    11. మనువు సహస్రగోవులదాత మానవులకు నేత అతనికి అనిష్టము చేయగలవాడులేడు. మనువు దక్షిణలు సూర్యసమములై ముల్లోకములు ప్రసిద్ధములు దేవతలు సావర్ణ మనువు ఆయువును పెంచవలెను. సకల కర్మలు చేయు మాకు అన్నము లభించవలెను.

                                 అరువది మూడవ సూక్తము
        ఋషి - ప్లతపుత్ర గయుడం. దేవత - విశ్వేదేవతలు. ఛందస్సు - జగతి
                                          16,17 త్రిష్టుప్.

    1. దేవతలు దూరప్రదేశములనుంచి వచ్చి మానవులతో స్నేహము చేయుదురు. ప్రసన్నులను చేసినంత దేవతలు వివస్వత పుత్రమనువు సంతానములను పోషింతురు. దేవతలు నహుహ పుత్ర యయాతి యజ్ఞమున ఉపవిష్టులగుదురు. వారందరు మమ్ము ఆదరించి ధనములు ప్రసాదించవలెను.

    2. దేవతలారా ! మీ సకల నామములు వందనీయములు. స్తుత్యములు యాగయోగ్యములు అదితి, జలము, పృథ్వినుండి జన్మించిన దేవతలారా! నా ఆహ్వానములు ఆలకించండి.

    3. సకలమున సమరించు పృథ్వి దేవతల కొరకు మధుర దుగ్ధములు ప్రవహింప చేయును. మేఘవంతుడు అవినాశ్య ఆకాశము దేవతల కొరకు అమృతము ధరించును. అట్టి అదితి పుత్ర దేవతలను స్తుతించండి. అది మంగళ ప్రదమగును వారి శక్తి ప్రశంసనీయము. వారు వర్షము తెచ్చువారు. వారి కార్యములు సుందరములు.

    4. కర్మనిష్ఠమానవులను రెప్పవాల్చక వీక్షించు దేవతలు సేవించుటకుగాను అమృతము అందినది. దేవతల రథము జ్యోతిర్మయము. వారి కార్యములు నిర్విఘ్నములు వారు పాపరహితులు. జన కళ్యాణమునకు గాను వారు ఉన్నత ప్రదేశమున నివసింతురు.   

    5. స్వతేజవిరాజితులు, యజ్ఞములకు విచ్చేయు సుప్రవ్యద్ధదేవతలు అహింసితులై ద్యులోకమున ఉన్న మహా దేవతలకు అదితికి శుభములు కలుగునట్లు నమస్కరించండి. శోభన స్తుతులచే సేవించండి.

    6. దేవతలారా! నేనుకాక మిమ్ము మరెవరు స్తుతించగలరు? జ్ఞానులు, సంతన వంతులగు దేవతలారా! పాపములనుండి రక్షించి శుభములు కలిగించు యజ్ఞము నేను కాక మరెవరు చేయగలరు?

    7. మనువు అగ్నిని ప్రజ్వలింప చేసినాడు. సుమనస్కుడై, సప్తహోతల సహితుడై దేవతలకు ఉత్తమ హోమద్రవ్యములు సమర్పించినాడు. అట్టిదేవతలు మాకు అభయము, సుఖము, సుపథము, శుభములు కలిగించవలెను.

    8. ఉత్తమ జ్ఞానులు సర్వజ్ఞాతలగు దేవతలు సమస్తస్థావర, జంగమాత్మక విశ్వమునాకు ఈశ్వరులు. అట్టి దేవతలారా! మీరు మమ్ము కాయక, మానసిక పాపములనుండి రక్షించండి. శుభములు కలిగించండి. 

    9. మేము యజ్ఞములందు ఇంద్రుని ఆహ్వానింతుము. అది మాకు ఆనందకరమగును. మేము దేవతలను ఆహ్వానిస్తాము. వారు పాపములు వదిలింతురు. వారి కార్యములు సుందరములు. మాకు శుభములు కలుగవలెననియు, ధనము లభించవలెననియు అగ్ని, మిత్ర, వరుణ, భగ, ద్యావాపృథ్వులు, మరుత్తులను ఆహ్వానింతుము.

    10. ద్యులోకరూప నౌక అక్షయము సుసంఘటితము పాపరహితము అవినాశ్యము దీని ఆచరణ సుందరము. మేము మాకు శుభముల కొరకు ఈ నౌకను ఎక్కుదుము. దేవత్వము నొందుదుము. దీని మీద పయనము భయ రహితము. ఇది సుఖములు కలిగించునది. ఇది విస్తరించవలెను.

    11. యజనీయ దేవతలారా! మాకు రక్షణలు బోధించండి. నాశము చేయు దుర్గతి నుండి మమ్ము రక్షించండి. మేము సత్యరూప యజ్ఞము ఏర్పరచెదము. మిమ్ము ఆహ్వానింతుము. ఆలకించండి, రక్షించండి శుభములు కలిగించండి.

    12. దేవతలారా ! మా రోగములను వదిలించండి. సకల ప్రకార పాపబుద్ధిని నష్టపరచండి. మాకు దాన శూన్య బుద్ధిని కలిగించకండి. దుష్టుని దుర్భుద్ధిని సహితము దూరము చేయండి. మా శత్రువులను దూరమునాకు పంపండి. మాకు సుఖములు, శుభములు కలిగించండి.

    13. అదితి పుత్ర దేవతలారా ! మీరు ఉత్తమ మార్గము చూపి పాపములను దాటించి, శుభములు కలిగించినవాడు సంపన్నుడై వర్థిల్లును. అతనికి హాని కలుగదు. అతడు ధర్మకార్యములు చేయును. అతని వంశము వర్థిల్లును.  


    14. దేవతలు అన్నప్రాప్తికిగాను ఏ రథమును రక్షింతురో మరుత్తులు యుద్ధసమయమున సంచిత ధనప్రాప్తికి ఏ రథమును రక్షింతురో ఇంద్రా ! అట్టి ప్రాతః కాల యుద్ధమునాకు సాగు రథమునే నీవు ఆశ్రయింపుము. ఆ రథమును ఎంతటి వాడును నష్టపరచ జాలడు. దానిపై ఎక్కి మేము శుభములు అనుభవింతుము.

    15. సుక్షేత్రము, మరుస్థలము రెండింట మాకు శుభములు కలుగవలెను. జలమునందును, యుద్ధమందును రెండింట మాకు శుభములు కలుగవలెను. అస్త్రశస్త్రము విసరుకొను యుద్ధ మధ్యమున మాకు శుభములు కలుగవలెను. పుత్రులు కలుగు స్త్రీ గర్భమున మాకు శుభములు కలుగవలెను. దేవతలారా ! ధన లాభమునకు మాకు శుభములు సమకూర్చండి.

    16. ఎయ్యది పృథ్విమార్గమున సాగుటకు శుభప్రదమగునో ఎయ్యది సర్వశ్రేష్ఠధన పూర్ణమగునో ఎయ్యది వరణీయ యజ్ఞస్థానమున ఉపస్థితమగునో అట్టి గృహమునందును, అరణ్యమునందును మమ్ము రక్షించండి. రక్షకులగు దేవతలారా! మేము సుఖముగా భూమిమీద నివసించవలెను.

    17. దేవతలారా! అదితీ! ప్రాజ్ఞుడగు పులతిపుత్రుడు గయుడు ఈ విధముగా మిమ్ము సంవర్థిల్ల చేయుచున్నాడు. దేవతల ప్రసన్నతయే మానవుల పాలన యగును. గయుడు దేవతలను స్తుతించుచున్నాడు.

                                   అరువది నాలుగవ సూక్తము
        ఋషి - ప్లుతపుత్ర గయుడు. దేవత - వివేదేవతలు. ఛందస్సు - జగతి 12,
                                             16, 17, త్రిష్టుప్.

    1. యజ్ఞములందు దేవతలు మా స్తుతులు వినవలెను. దేవతలలో ఏ దేవతస్తుతి, ఎట్లు, చక్కగా రచించగలము? ఎవరు మా మీద దయ తలతురు? ఎవడు సుఖవిధానము చేయగలడు? మమ్ము రక్షించుటకు ఎవడు మా వద్దకు రాగలడు?

    2. మా అంతః కరణమున ప్రజ్ఞున్నది. అది అగ్ని హోత్రాదులు చేయ సంకల్పించినది. ప్రజ్ఞ దేవతలను అభిలషించు చున్నది. మా అభిలాషలు దేవతల వద్దకు చేరును. దేవతలు కాకా మరొక సుఖదాతలేడు. ఇంద్రాది దేవతలందు మా అభిలాషలు చేరినవి.

    3. పూష ధనదానములిచ్చి పోషించును. అతడు ఇతరులకు అగమ్యుడు. అతనిని స్తుతించండి. దేవతలందు ప్రదీప్తుడు అగ్నిని స్తుతించండి సూర్య, చంద్ర, యమ, త్రిత, వాయు, ఉష, రాత్రి, అశ్వినులను స్తుతించండి.

    4. జ్ఞాని అగ్ని ఏ విధముగా అనేక స్తోతలవాడగును? ఏ స్తుతివలన అగ్ని సన్మాని తుడగును? శోభన స్తుతులకు బృహస్పతి వర్థిల్లును అజేకపాత, ఆహిర్భుధ్న్య దేవతలు మా ఆహ్వాన సమయమున సురుచిరస్తవములు ఆలకించవలెను.

    5. అవినాశ్య పృథ్వివీ! సూర్యుడు ఉదయించునపుడు నీవు రాజులగు మిత్రా వరుణులను సేవింతువు. సూర్యుడు విశాల రథమునధిరోహించి మెల్లగాసాగును. అతడు అనేక రూపములతో అవతరించును. సప్తర్షులు సూర్యుని ఆహ్వాన కర్తలు.


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More