Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2


    6. అప్పుడు నీ కొరకు యజ్ఞము ఉత్పన్నమైనది. ఆనంద దాయకములగు మంత్రములు ఆవిర్భవించినవి అప్పుడునీవు పుట్టిన, పుట్టనున్న లోకములను వశపరచుకున్నావు.

    7. అప్పుడు అపక్వదుగ్ధములుగల గోవులకు పక్వదుగ్ధములు కల్పించినావు. ద్యులోకమునకు సూర్యుని ఎక్కించినావు.

    స్తోతలారా ! సామమంత్రములద్వారా - ప్రవర్గ్య సోమసమశోభాయమాన స్తుతులతో ఇంద్రుని వర్థిల్లచేయండి. స్తుతప్రియుడగు ఇంద్రుని కొరకు - హర్షదము, విశాలమగు సోమగానము చేయండి.

                                డెబ్బది తొమ్మిదవ సూక్తము
 ఋషి - అంగిర నృమేధ, పురుమేధులు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - బృహతి

    1. ఇంద్రుడు సకల యుద్ధములకు ఆహ్వానయోగ్యుడు. అతడు మా స్తోత్రములను మన్నించవలెను. మూడు సవనములకు విచ్చేయవలెను.

    ఇంద్రుడు వృత్రఘ్నడు. అతని ఆయుధము అవినాశ్యము అతడు స్తుతియోగ్యుడు. అభిముఖ అర్హుడు.

    2. ఇంద్రా !నీవు సత్యమవు. అందరకు ప్రధానధన ప్రదుడవగుము. స్తుతులను ఐశ్వర్యవంతములు చేయుము. నీవు ఎంతో ధనవంతుడవు. బలపుత్రుడవు. మహామహుడవు. నీకు యోగ్యమగు ధనమును మేము ఆశ్రయింతుము.

    3. ఇంద్రా ! నీవు  స్తుతింపదగినవాడవు. నీ కొరకు మేము యదార్థసోత్రములు రచిస్తాము. నీవు ఆ స్తుతులందు చేరుము. వానిని స్వీకరించుము. నీ కొరకు మేము  ఉచ్చరించు స్తోత్రముల నన్నింటిని స్వీకరింపుము.

    4. మఘవా ! నీవు సత్యమవు - "త్వంహిసయ్తోమఘవన్" నీవు ఎవ్వనికిని లొంగలేదు. రాక్షసులను నశింప చేసినావు. హవ్యదాతకు ధనము అందునట్లు చేయుము.

    5. బలాధిపతి ఇంద్రా! నీవు అభిషుత  సోమవంతుడవై యశశ్విని అయినావు. ఎవరును ఎరుగజాలని, గెలువ జాలని రక్కసులను - నీవు ఒక్కడవే - మానవులను రక్షించు వజ్రముతో హతమార్చినావు.

    6. బలశాలి ఇంద్రా ! నీవు విశిష్టజ్ఞానవంతుడవు మేము -  పితృధనభాగమువంటి ధనమునిమ్మని నిన్ను యాచించుచున్నాము. నీ కీర్తి, ఎంత విశాలమో నీ గృహము అంత  విశాలము, అది ద్యులోకమున ఉన్నది, నీ సుఖములన్నింటిని మా వరకు  చేరనిమ్ము.

                                   ఎనుబదవ సూక్తము
    ఋషి - అత్రి పుత్రి ఆపాల, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - 1,2. పంక్తి
                                     మిగిలిని అనుష్టుప్.


    1. జలములకు స్నానమునకు వెళ్లునపుడు అపాల కన్యనగు నేను ఇంద్రుని ప్రసన్నుని చేయ దలచినాను. నా కున్న చర్మరోగనివారణకు - నాకు మార్గమున - సొమము లభించినది. ఆ సోమముతో నేను అన్నాను.

    "ఇంద్రాయసునవై త్వాశక్రాయ సునదైత్వా" నిన్ను ఇంద్రుని కొరకు  అభిషవించుచున్నాను. శక్రుని కొరకు అభిషవించుచున్నాను.

    2. ఇంద్రా! నీవు వీరుడవు అత్యంత దీప్తిమంతుడవు. విశేషగృహమునకు వెళ్లువాడవు. ఇది అభిషుత సొమము. దీనిని దంతములతో నమిలి సిద్ధము చేసినాను. యవలసత్తు పురోడాశాదులను, ఉక్దను సమర్పించినాను. వానిని స్వీకరింపుము. అపాలకు చర్మరోగము. ఆమెను భర్త విడిచినాడు. ఆ రోగ నివారణకు ఇంద్రుని ప్రార్థించదలచ నవి ఆమెకు అభిషవశిలలు లభించలేదు. దంతములతో నమిలి సొమము సిద్ధము చేసినది.

    (ఇది భక్తి ఆవేశము.  ఆవేశమున విధినిషేధములు ఉండవు. భక్త కన్నప్ప పుక్కిటి నీటితో కాళహస్తీశ్వరుని అభిషేకము చేసినాడు ! ఇది వేదమున తొలి ఉదాహరణ)

    3. ఇంద్రా ! నిన్ను  తెలుసికొన గోరినాను. తెలియలేకున్నాను.

    సోమమా! ఇంద్రుని కొరకు తొలుతమెలమెల్లగగా తదుపరి వేగముగా ప్రవహింపుము.

    4. ఆ ఇంద్రుడు నన్ను - అపాలను - బహువాక్కుల సమర్ధము చేయవలెను. బహు సంఖ్యను చేయవలెను. అనేక మారులు ధనికురాలీని చేయవలెను. నన్ను నా భర్త విడిచినాడు. నేను ఇటకు వచ్చినాను నేను ఇంద్రుని కలిసికొందును.

    5. ఇంద్రా ! నా తండ్రి తలను, పొలమును, నాగర్భమును ఉత్పాదక స్థానములను చేయుము.

    (అపాల తండ్రి తలమీద వెంట్రుకలులెవు. మొలిపించవలెను. పొలము ఊసరమైనది. పండించవలెను. అపాలకు  సంతానములేదు కలిగించవలెను.)

    6. నా తండ్రిది ఊసరక్షేత్రము. చర్మవ్యాధివలన నా వంటి మీద వెంట్రుకలు లేవు. నా తండ్రి తలమీద వెంట్రుకలేదు. "సర్వాతారోమశాకృధి" అన్నింటికి వెంట్రుకలు మొలిపింపుము.

    (పొలమునకు సంబంధించి పంటపండించుము.)

    7. శతక్రతు ఇంద్రుడు తనరథపు పెద్దరంధ్రములు, శకటపు చిన్న రంధ్రములు, సంధుల చిన్నరంధ్రములను శోధించి అపాలను సూర్యసమాన తేజస్విని - చర్మయుతను చేసినాడు.

    (ఇది చర్మరోగము -కుష్ఠువంటివానికి - చికిత్సవలెఉన్నది. సూర్యరశ్మిని కొన్నిరంధ్రముల ద్వారా ప్రసరింపచేయు చికిత్సవలె ఉన్నది.)

   
                                  ఎనుబది ఒకటవ సూక్తము
    ఋషి - అంగిరస శ్రుతకక్షుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - మొదటిది
                                అనుష్టుప్ - మిగిలినవి గాయత్రి.


    1. ఋత్విక్కులారా ! ఇంద్రుడు అందరిని భరించువాడు. శతయాజ్ఞకుడు. మానవులందరిలో అధిక ధనదాత. అట్టి సోమపాయ ఇంద్రుని విశేషమున స్తుతించండి.

    2. మీరు ఇంద్రుని  - బహుజన ఆహూథునిగ, అనేకులచే స్తుతించ బడువాడగ, గానయోగ్యునిగ, సనాతనునిగా స్తుతించండి.

    3. ఇంద్రుడే మాకు మహాధనదాత. మహా అన్న ప్రదాత. అందరిని ఆటలాడించువాడు. మహా ఇంద్రుడు మా వద్దకు రావలెను. మాకు ధనమందించవలెను.

    4. సుందర కిరీట ఇంద్రుడు - హోతమరియు నిపుణుడగు సుదక్ష ఋషి సమర్పించిన యవలు కలసి, పాత్రయందున్న సోమమును - పానము చేసినాడు.

    5. సోమ పానమునకు గాను మీరు ఇంద్రుని విశేషముగ  పూజించండి. సోమమే ఇంద్రుని వర్థిల్లచేయును.

    6. ఇంద్రుడు ప్రకాశమానుడు. అతడు సుదకర సోమపానము చేయును. దాని బలమున సకల భువనములను అణిచిఉంచును.

    7. సర్వదమనుడు, మీ సకల స్తోత్రములందున్న ఇంద్రునే - మీ రక్షణ కొరకు ఆహ్వానించండి.

    8. ఇంద్రుడు శత్రునాశకుడు. రాక్షసులకు అగమ్యుడు. ఆహింసితుడు. సోమపాత. సర్వజననేత. ఇంద్రుని కార్యములకు అంతరాయము కలిగించువాడులేడు.

    9. ఇంద్రా! నీవు స్తుతుల ద్వారా సంభోదన యోగ్యుడవు. విద్వాంసుడవు. శత్రువుల వద్ద హరించిన ధనమును మాకు అనేక సార్లు అందించుము. శత్రుధనముతో మమ్ము రక్షింపుము.

    10. ఇంద్రా ! ఈ ద్యులోకము నుండియే వందలు, వేల బలములు, ఆననములు అందుకొని మా వద్దకు రమ్ము.

    11. సమర్ధ ఇంద్రా ! మేము కర్మవంతులము. యుద్ధమున జయంచుటకు కర్మలు చేసెదము. పర్వతభంజక, వజ్రధర ఇంద్రా ! మేము యుద్ధములందు అశ్వములతో విజయులమగుదుము.

    12. గోపాలుడు గడ్డి అందించి గోవులను సంతుష్టులను చేయును. అట్లే బహుకర్మ ఇంద్రా ! నీ  నలువైపులా ఉక్థలు చదివి నిన్ను సంతుష్టుని చేసెదము.

    13. శతక్రతు ఇంద్రా ! సకల జగములు కోరికలుగలవి. మేము సహితము ధనాది కోరికల పారలము. వాటిని ఫలింప చేయుము.

    14. బలపుత్ర ఇంద్రా ! నరులు కోరికలవారు. కాతరశబ్దములవారు. వారునిన్నే ఆశ్రయింతురు. అందువలన విదేవత కూడ నిన్ను మించజాలడు.

    15. కోరికలు తీర్చగల ఇంద్రా ! నీవు అందరిని మించిన ధనదాతవు. భయంకర శత్రువును దూరము తరుమువాడవు. అనేకులను భరించగలవాడవు. కర్మలద్వారా మమ్ము పాలించుము.

    16. బహువిధ కర్మ ఇంద్రా! సొమము అన్నింటిని మించిన యశస్వి. పూర్వకాలమున  నీకొరకు మేము అభిషవించినాము. దానితో ఉన్మత్తుడవగుము. మమ్ము మత్తులను చేయుము.

    17. ఇంద్రా! నీ ఉన్మత్తత వివిధ కీర్తియుక్త. మేము అభిషవించిన సొమము అన్నిటి కన్న ఎక్కువ పాపనాశకము - బలప్రదాత.

    18. ఇంద్రా! నీవు వజ్రధరుడవు. యదార్ధకర్మివి. సోమపాయివి. దర్శనీయుడవు. నీవు సకల మానవులకు  ఇచ్చిన ధనమును మాత్రమే ఎరుగుదుము.

    19. ఇంద్రుడు ఉన్మత్తుడు. మేము స్తుతులు వచింతుము. అవి అభిషుత సోమమును స్తుతించవలెను. స్తోతలు సోమమును పూజించవలెను.

    20. ఇంద్రునిలో సకల కాంతులు నిలిచి ఉన్నవి. అతనిలో ఏడుగురు హోతులు ఉన్నారు. అతడు సోమము సమర్పించి నంత ప్రసన్నుడగును. అట్టి ఇంద్రునే సోమాభిషవమైనంత - ఆహ్వానిస్తాను.

    21. దేవతలారా ! మీరు  త్రికద్రుకము కొరకు జ్ఞానసాధక యజ్ఞము చేసినారు. మా స్తుతివాక్యము ఆ యజ్ఞమును వర్ధిల్ల చేయునుగాత.

    (జ్యోతిర్గౌరాయంతి త్రికద్రుకాః అని శాయణుడు. జ్యోతి - గోవులు - ఆయువు ఈ మూడు త్రికద్రుకము. "చేతనం యజ్ఞమ్" అని మంత్రము. చేతనఃజ్ఞానసాధనం యజ్ఞం అని శాయణుడు.)

    22. ఇంద్రా! నదులు సముద్రమునకు చేరినట్లు - స్కల్ సోమములు నీలో  ప్రవేశించును.

    23. మనోరధపూరక , జగృత ఇంద్రా ! నీవు నీ మహిమతో సోమపానమున వ్యాపించినావు. పాత్రయందలి సోమము యధేచ్చగా నీ దేహమున చేరవలెను.

    24. వృత్రఘ్న ఇంద్రా! నీ ఉదరమునకు సోమము పర్యాప్తము కావలెను. మా సోమమే నీకు సరిపోవలెను.

    25. నేను శ్రుతకక్షుడను. అశ్వప్రాప్తికొరకు మరింతగానము చేయుదును. గృహమునకుగాను ఇంద్రుని ఎంతో కీర్తింతును.

    26. ఇంద్రా! అభిషవమైనంత  సోమము నీకు పర్యప్తము కావలెను. నీవు సమర్థుడవు ధనదుడవు. సోమము కొరకు నీవు పర్యాప్తుడవు.

    27. వజ్రధర ఇంద్రా! నీవు దూరముగా ఉన్నను  మాస్తుతి నిన్ను చేరవలెను. నీ నుంచి మాకు విశేషధనము లభించవలెను.

    28. ఇంద్రా ! నీవు శూరుడవు. ధైర్యశాలివి, నీవు వీరులనే కోరుకుందువు. అందరు నిన్ను ఆరాధించవలెను.

    29. బహుధని ఇంద్రా ! సకల యజమానులు నీ దానమునే ఆశిస్తారు. మాకు  సహాయకుడవు అగుము.

    30. అన్నపతి ఇంద్రా! నీవు సాంద్రతగల నాస్తిక బ్రాహ్మణుని వంటివాడవుకాకుము. అభిషుతము, క్షీరాది యుక్తమగు సోమపానము చేయుము.

    31. ఆయుధపాణులగు రాక్షసులు రాత్రిళ్లు మమ్ము నియంత్రంచరాదు. ఇంద్రా !నీ  సాయమున మేము వారిని నాశనము చేయుదుము.

    32. ఇంద్రా! నీ సాయము అందుకొని మేము శత్రువులను దూరము చేయుదుము. "త్వమస్మాకం తవస్మసి" నీవు మా వాడవు మేము నీ వారలము.

    33. ఇంద్రా! స్తోతలు నిన్ను అభిలషింతురు. మాటమాటకు నిన్ను స్తుతింతురు. స్తోతలు నీకు బంధుస్వరూపులు. వారు నిన్ను సేవింతురు.

                                   ఎనుబది రెండవ సూక్తము
            ఋషి - సుకక్షుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు -గాయత్రి.

    1. సూర్యాత్మక ఇంద్రుడు ప్రసిద్ధధనవంతుడు. మనోరధపూరకుడు. మానవహితైషి కర్మవంతుడు ఉదారుడు. అతడు యజమానికి నలువైపుల ఉదయించును.

    2. ఇంద్రుడు తన బాహుబలముణ తొంబది తొమ్మది పురములను ధ్వంసము చేసినాడు. వృత్రుని హతమార్చినాడు. మేఘుని వధించినాడు.     


Related Novels


Sitaa Charitham

Jeevanayanam

Modugupoolu

Rigveda Samhitha - Part 2

More