Home » Health Science  » నెలసరిలో వాటిని ముట్టుకోకూడదా.. చాలామందికి తెలియని షాకింగ్ నిజాలు!

నెలసరిలో వాటిని ముట్టుకోకూడదా.. చాలామందికి తెలియని షాకింగ్ నిజాలు!

ఋతుస్రావం, లేదా నెలసరి మహిళల జీవితంలో ఒక సహజమైన భాగం,  భారతదేశం ఎంత అబివృద్ది చెందుతున్నా మహిళల నెలసరి విషయంలో ఇప్పటికీ అంతగా అవగాహన లేదు.  చాలామంది నెలసరి గురించి బయటకు మాట్లాడాలంటే అదేదో పెద్ద తప్పుగా, మాట్లాడకూడని విషయంగా చెబుతుంటారు. కానీ దీని వల్ల మహిళలు,  కౌమారంలో ఉన్న ఆడపిల్లలు చాలా రకాల సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు. ముఖ్యంగా నెలసరి సమయంలో ఊరగాయలు ముట్టకూడదని,  ఇల్లంతా తిరగకుండా ఒకవైపు కూర్చోవాలని, ఇలా చాలా విషయాలు నేటికాలంలో ఆడపిల్లలను అటు ఇబ్బంది పెడతాయి, మరొక వైపు చాదస్తం అనుకునేలా చేస్తాయి. ప్రతి సంవత్సరం మే 27వ తేదీన వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే ను జరుపుకుంటారు.  దీని సందర్బంగా నెలసరి గురించి చాలామందికి తెలియని విషయాలు తెలుసుకుంటే..

రక్తం రంగు..

 ఋతుస్రావ రక్తం రంగు లేత ఎరుపు, గులాబీ, గోధుమ రంగు లేదా ముదురు గోధుమ రంగులో కూడా ఉండవచ్చు.  ఇది శరీరంలోని హార్మోన్ల మార్పులు, రక్త ప్రవాహం , రుతుస్రావం జరిగే రోజుపై ఆధారపడి ఉంటుంది. రక్తస్రావం రంగు ఎక్కువ కాలం పాటు అసాధారణంగా ఉంటే లేదా దానికి తీవ్రమైన వాసన ఉంటే, వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.

తలస్నానం..

నెలసరి సమయంలో తలస్నానం చేయకూడదు అనేది చాలామంది  నమ్ముతారు. కానీ ఇది అపోహ అంటున్నారు వైద్యులు.  వైద్యుల ప్రకారం, నెలసరి సమయంలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం.
తలస్నానం చేయడం, స్నానం చేయడం శరీరాన్ని శుభ్రంగా ఉంచి, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.   గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కూడా కడుపు నొప్పి, తిమ్మిర్ల నుండి ఉపశమనం లభిస్తుంది.

పిఎమ్ఎస్..

పి.ఎం.ఎస్. అంటే ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్ అనేది ఒక నిజమైన శారీరక ,  మానసిక పరిస్థితి. ఋతుస్రావానికి ముందు, మహిళలు మానసిక స్థితిలో మార్పులు, చిరాకు, అలసట, తలనొప్పి , కడుపు నొప్పి వంటి సమస్యలను వస్తుంటాయి. ఇది హార్మోన్ల మార్పుల వల్ల జరుగుతుంది, అందువల్ల దీనిని నిర్లక్ష్యం చేయకూడదు.

ఊరగాయలు, పుల్లని పదార్థాలు..

నెలసరి సమయంలో ఊరగాయలు లేదా పుల్లని పదార్థాలను ముట్టుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవట.   ఇది కేవలం పాత నమ్మకాలపై ఆధారపడిన ఒక అపోహ మాత్రమేనని అంటున్నారు. కాకపోతే ఊరగాయలు శరీరాన్ని మరింత వేడిగా చేస్తాయి, దీనివల్ల నెలసరి రక్తస్రావం మరింత పెరుగుతుంది.  అందుకే ఊరగాయలకు దూరంగా ఉండమంటారు.  ఇకపోతే  ఋతుస్రావం సమయంలో మహిళలు అన్ని పనులను యధావిధిగా చేసుకోవచ్చు. ఎవరైనా ఇంటి పనులు, వంట చేసిపెట్టేవారు ఉంటే.. ఆ నాలుగు రోజులు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు.

శానిటరీ ప్యాడ్..

చాలామంది మహిళలు రక్తస్రావం అధికంగా కాకుండా లైట్ గా అవుతుంటే.. శానిటరీ ప్యాడ్ ను రోజంతా మార్చకుండా అలాగే వాడుతూ ఉంటారు.  ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఒకే ప్యాడ్‌ను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియా పెరిగి, ఇన్ఫెక్షన్ , చర్మపు దద్దుర్ల ప్రమాదం పెరుగుతుందట. ప్రతి 4 నుండి 6 గంటలకు ప్యాడ్ మార్చాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

వ్యాయామాలు..

ఋతుస్రావ సమయంలో తేలికపాటి వ్యాయామం, యోగా , నడక చాలా మంచివి.  ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి, నొప్పి, ఒత్తిడి , మానసిక స్థితి మార్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే, భారీ వ్యాయామాలు చేయడం మానుకోవాలి.

                              *రూపశ్రీ.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.