Home » Ladies Special » Women Lifestyle

ఆడవారిగానే ఉంటాము!

 

 

ఎటుచూసినా మగవారి ఆధిపత్యమే కనిపించే ఈ ప్రపంచంలో ఒకోసారి ‘ఈ ఆడబ్రతుకు ఎందుకురా బాబూ’ అన్న నిర్వేదం కలగక మానదు. కానీ పరిస్థితులు మారుతున్నట్లున్నాయి. ఎందులోనూ, ఎవరితోనూ తక్కువ కాదని నిరూపించుకునేందుకు మహిళలు చేసిన పోరాటం మంచి ఫలితాలనే ఇస్తున్నట్లుంది. అందుకనే ఇప్పుడు ఆడవారు తమ జీవితం పట్ల నిర్వేదం చెందడం తగ్గింది. బీబీసీలో వచ్చే Radio 4 Woman's Hour కార్యక్రమాన్ని మొదలుపెట్టి 70 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ 70 ఏళ్లలో మహిళల అభిప్రాయాలలో ఏమన్నా మార్పులు వచ్చాయేమో పరిశీలించేందుకు వారు వేయిమందికి పైగా మహిళలను కొన్ని ప్రశ్నలు వేశారు. ఈ సమాధానాలతో గతకాలంలో జరిగిన కొన్ని పరిశోధనలను పోల్చి చూశారు. ఫలితాలు ఇవిగో...

ఉద్యోగం:

1951లో కేవలం 31 శాతం మహిళలు మాత్రమే ఉద్యోగంలో ఉంటే ఇప్పుడు ఏకంగా 60 శాతం మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అంతేకాదు! వయసుతో సంబంధం లేకుండా ఆడవారంతా కూడా ఉద్యోగాలకు సిద్ధపడటం మరో విశేషం. 1951లో 55 ఏళ్లు పైబడిన స్త్రీలలో ఉద్యోగం చేసేవారి సంఖ్య 22 శాతంగా ఉంటే, ఇప్పుడని ఏకంగా 62 శాతానికి చేరుకుంది. ఉద్యోగం చేయడానికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారని అడిగిన ప్రశ్నకు వారి దగ్గర ఖచ్చితమైన జవాబులు ఉన్నాయి. ఆత్మగౌరవం కోసం ఉద్యోగం చేయాలనుకుంటున్నామని చాలామంది బదులిచ్చారు. దీనికి తోడు డబ్బు సంపాదించాలన్న కోరిక, పని చేసేందుకు తగిన వాతావరణం ఉండటంతో తాము ఉద్యోగం చేసేందుకు సంకోచించడం లేదని చెప్పారు.


కుటుంబ జీవితం:

మహిళల వైవాహిక జీవితం కూడా బాగానే ఉన్నట్లు బీబీసీ భావిస్తోంది. 1951లో కేవలం 25 శాతం మహిళలు తమకి వైవాహిక జీవితంలో తగిన స్వాతంత్ర్యం లభించిందని చెప్పగా, ప్రస్తుతం అలా చెప్పే మహిళల సంఖ్య 42 శాతానికి చేరుకుంది. అంతేకాదు పదిమందిలో తొమ్మిదిమంది మహిళలు తమ భర్త తమకు తగినవాడని భావిస్తున్నారు. 1938నాటికి మహిళలలో ఎంతమంది పిల్లల్ని కనాలి అన్నదాని మీద కూడా తగినంత స్పష్టత లేదు. కానీ ఇప్పుడేమో 56 శాతం మహిళలు తమకి ఇద్దరు పిల్లలు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

సమస్యలు లేకపోలేదు:

ఉద్యోగమూ, కుటుంబ జీవనమూ తృప్తిగా ఉన్నాయి కదా అని మహిళలకు అసలు సమస్యలేవీ లేవు అనుకోవడానికి లేదు. 46 శాతం మంది తమ అందాన్ని మెరుగుపర్చుకునేందుకు కాస్మెటిక్‌ సర్జరీ చేయించుకుంటే బాగుండు అన్న ఆలోచనలో ఉన్నారు. తాము లావుగా ఉన్నామని బాధపడేవారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. ఇక ఆరోగ్యం గురించీ, ఆర్థిక సమస్యల గురించిన కష్టాలూ అలాగే ఉన్నాయి.

ఏతావాతా తేలిందేమిటంటే స్త్రీల జీవితం ఒకప్పటికంటే ఇప్పుడు కాస్త మెరుగుపడిందని... లేదా మెరుగుపడినట్లుగా వారు భావిస్తున్నారని! అందుకే 1947లో తాము ఆడవారిగాకంటే మగవారిగా ఉంటే బాగుండు అనుకునేవారి సంఖ్య 44 శాతంగా ఉంటే, ప్రస్తుతం ఆ సంఖ్య కేవలం 14 శాతంగానే ఉంది! మరి ఈ 14 శాతం చెరిగిపోయేందుకు ఇంకెన్నాళ్లు పడుతుందో!

- నిర్జర.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.