Home » Health Science  » ఎపిసోడ్ -26


    ఇజ్రాయిల్ ప్రజలు ఇప్పటికీ అడోల్ఫ్ ను మర్చిపోలేరు. అడోల్ఫ్ ఐచ్ మన్ పేరుమీద ఇజ్రాయిల్ లో ఓ మ్యూజియం పెట్టారు. ఆ మ్యూజియం ఐచ్ మన్ దుర్మార్గానికి నిదర్శనం. ఆ మ్యూజియంలో వున్నవి... సబ్బులు... విగ్రహాలు... ఐచ్ మన్ ఆ సబ్బుల్ని యూదుల చర్మాలతోను, ఆ విగ్రహాల్ని యూదుల ఎముకలతోనూ తయారు చేయించాడు. అంతటి దుర్మార్గుడు వాడు... ఒక మనిషి ఇంకొక మనిషిని అంత దారుణంగా హింసించగలడా? అన్నదానికి చరిత్రలో ఏకైక జవాబు అడోల్ఫ్ ఐచ్ మన్" చెప్పడం ఆపాడు ఆదిత్య.

 

    "ఇట్స్ రియల్లీ... అన్ బిలీవబుల్" అన్నాడు ధరణి.

 

    "అన్ ఫర్ గటబుల్... హారిఫయింగ్ స్టోరీ ఇన్ హ్యూమన్ హిస్టరీ" అన్నాడు ఆదిత్య.

 

    "చరిత్ర హంతకుల్నీ, నియంతల్నీ, రాక్షసుల్నీ క్షమించదు" అన్నాడు ధరణి.

 

    "అలాగే... అహోబలపతిని కూడా" అన్నాడు ఆదిత్య కోపంగా.

 

    బెల్ మోగడంతో లేచి నిలబడ్డాడు ఆదిత్య.

 

    కిచెన్ హౌస్ వైపు నడిచారిద్దరూ.

 

    భోజనాలయ్యాక తిరిగొస్తున్నప్పుడు ధరణి అడిగాడు తిరిగి...

 

    "ఎలా తప్పించుకుంటాం?"

 

    "ఐ యామ్... విత్... యూ... డోన్ట్ వర్రీ..." అన్నాడు ఆదిత్య.

 

    ఆ రోజు రాత్రి చాలాసేపటివరకూ ధరణికుమార్ నిద్రపోలేదు... తను తప్పించుకోగలడా? అన్నది అతని సందేహం.

 

    ముందు జాగ్రత్తగా తన కథను... ఓ ఉత్తరంలా రాయడం ప్రారంభించాడు ధరణి.

 

    అతను రాస్తున్న ఉత్తరం ఆదిత్యకే! ధరణి సిక్త్ సెన్సే అతనిచేత ఆ వుత్తరం రాయించింది.


                            *    *    *    *    *


    ఉదయం ఐదు గంటలయ్యింది.

 

    అప్పటికే జైలు ప్రాంగణం ఖైదీల హడావుడితో కలకలంగా వుంది.

 

    సరిగ్గా అయిదున్నర గంటలకు జైలునుంచి ప్రిజనర్స్ వ్యాన్ బైలుదేరింది పోలీస్ ఎస్కార్ట్ తో.

 

    వ్యాను ముందు జీప్ లో జైలు సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, జైలర్ వీరారెడ్డి, నలుగురు వార్డర్లు... వెనక పోలీస్ వ్యానులో అరడజను మంది సెంట్రీళు, ముఖ్యులు వున్న వ్యానులు.

 

    పాతికమంది ఖైదీలు... జీపు డ్రయివర్ కి... తనకి తప్ప వెళ్ళే ప్రదేశం... ఇంకెవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు సుబ్రహ్మణ్యం.

 

    హైద్రాబాద్ నుంచి బొంబాయికి వెళ్ళే దారిలో... మెదక్ క్రాస్ రోడ్డులకు రెండు కిలోమీటర్ల దూరంలో వున్న కొండల దగ్గరికి ప్రయాణము... గంటా నలభై అయిదు నిమిషాల ప్రయాణం.

 

    సరిగ్గా ఎనిమిదిన్నరకల్లా కొండల్లో ఉన్నారు ఖైదీలు. కొండలకు చిన్న రంధ్రాలు చేసి బ్లాస్ట్ చేసే కార్యక్రమాన్ని అప్పగించారు. ఆదిత్య, ధరణి కుమార్ లకు.

 

    మిగతా ఖైదీలు... విరిగిపడిన బండరాళ్ళను పగలకొడుతున్నారు సుత్తులతో.

 

    మధ్యాహ్నం భోజన కార్యక్రమం... అరగంట రెస్టు తర్వాత... మళ్ళీ కార్యక్రమం మొదలయ్యింది.

 

    ఆ కార్యక్రమం సాయంత్రం అయిదు గంటలవరకూ సాగింది.

 

    నెమ్మదిగా సూర్యుడు పడమర కొండల్లోకి వాలుతున్నాడు...

 

    పక్కనే ఉన్న చెరువులో కాళ్ళూ, చేతులు కడుక్కుని ఖైదీలు ఒక్కొక్కరూ వ్యాను ఎక్కుతున్నారు.

 

    "మనం ఎలా తప్పించుకుంటాం?" మొహం కడుక్కుంటున్నప్పుడు అడిగాడు ధరణి ఆదిత్యను.

 

    అది ఆరోజు ఉదయంనుంచి పదోసారో... పదిహేనోసారో అడగడం.

 

    "డోన్ట్ వర్రీ" అన్నాడు ఆదిత్య మనసులో ఏదో పథకం రూపుదిద్దుకుంటుండగా.

 

    సరిగ్గా అయిదు నిమిషాలకు ప్రిజనర్స్ వ్యాన్ బయలుదేరింది.

 

    ముందు... జైల్ సూపరింటెండెంట్ జీపు నెమ్మదిగా వెళుతోంది.

 

    చేతి గడియారంవైపు మాటిమాటికీ చూచుకుంటున్నాడు సుబ్రహ్మణ్యం.

 

    ఖైదీలతోను, ఖైదీల మనస్తత్వంతోనూ తలపండిపోయిన అతని కెందుకో భయంగా, టెన్షన్ గా వుంది.

 

    తనో తప్పు చేస్తున్నాననే భయమే కావచ్చు... తప్పుకు సహకరిస్తున్నాననే భయం కావచ్చు.

 

    అటూ ఇటూ దట్టంగా అలుముకున్న చెట్లు... మధ్యలోంచి వాహనాలు పరుగులు తీస్తున్నాయి.

 

    రెండు కిలోమీటర్ల ఇసక దారి దాటి మెయిన్ రోడ్డు ఎక్కాయి వాహనాలు.

 

    చీకటి మరింత చిక్కపడింది.

 

    అప్పుడు టైమ్...

 

    సరిగ్గా ఐదూ ఏభైఅయిదు నిమిషాలయ్యింది.


                                               *    *    *    *    *


    హైద్రాబాద్ నుంచి మెదక్ కు వెళ్ళే రోడ్డులో మెదక్ క్రాస్ రోడ్డుకు ఇరవై గజాల దూరంలో...

 

    చెట్లచాటున కీచుమన్న శబ్దంతో ఆగింది ఒక జీపు. జీపు స్టీరింగ్ దగ్గర కూర్చున్న డేవిడ్ వెనక్కి తలతిప్పి చూశాడు. వెనక ఆరుగురు దృఢకాయులు. అందరి చేతుల్లోనూ గన్స్ వున్నాయి.

 

    "మరో పావుగంటలో క్రాస్ రోడ్స్ దగ్గరకు ప్రిజనర్స్ వ్యాను వస్తుంది. ముందు జైల్ సూపరింటెండెంట్ జీప్ వస్తుంది. ఆ జీపుకి అడ్డంగా నేను నా జీపును పెడతాను. అప్పటికే చేతుల్లో గన్స్ తో సిద్ధంగా వున్న మీరు... గాల్లో కాల్పులు జరపండి... ప్రిజనర్స్ వ్యాను, సూపరింటెండెంట్ జీపు టైర్లను ముందు షూట్ చేయండి. ఒకడు జైల్ సూపరింటెండెంట్ ను కదలకుండా చేయండి. మిగతా వ్యక్తులు ప్రిజనర్స్ వ్యాను గొళ్ళేన్ని పగలగొట్టాలి. గొళ్లెం పగిలిపోయి మరుక్షణం ఆదిత్య ఒక్కడ్నే బయటకు లాగండి. మన జీపులో కూర్చోబెట్టండి. ఎవడడ్డొచ్చినా కాల్చిపారేయండి."

 

    "మరి పోలీస్ ఎస్కార్ట్ వ్యాను వాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చోరు గదా" ఒక దృఢకాయుడు అడిగాడు.

 

    "ఆ సమయంలో వాళ్ళక్కడ వుండరు... వాళ్ళకు ఇన్ స్ట్రక్షన్స్ వెళ్ళిపోయాయి... డోన్ట్ వర్రీ" నవ్వాడు డేవిడ్.

 

    డేవిడ్ మామూలు ఆర్డినరీ డ్రయివర్ కాదు... మఫ్టీ డ్రెస్ లో వున్న సర్కిల్ ఇన్స్ పెక్టర్... హోంమంత్రికి కావలసిన మనిషి... అలాగే జీపులో వెనక కూర్చున్న దృఢకాయులు... రౌడీలు కాదు... గుండాలు కాదు... మఫ్టీలో వున్న పోలీసులు.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.