Home » Diet and Health » ఎపిసోడ్ -26


    రాజారావువల్ల తనకు లభించిందేమిటి? కనీసం రాజకీయంగానైనా తనను పైకి రానివ్వలేదు. ప్రతిసారీ వచ్చే ఎలక్షన్స్ లో సీటు ఇప్పిస్తానంటూ మభ్యపెట్టాడు. ఈసారి ఎలా తప్పించుకుంటాడో తను చూస్తుంది! తన పరువు ప్రతిష్టలకు ఎక్కడ భంగం వాటిల్లుతుందోనని అతని భయం. తనతో ఇలా కాలక్షేపం చెయ్యటానికి అతనికి పరువునష్టం లేదు. అందరికీ తెలిసిన విషయాన్ని తెలియనట్లు నటించటం! రాత్రంతా నిద్రలేని అరుంధతి, ఆలోచనలోంచి క్రమంగా నిద్రలోకి జారిపోయింది.

 

    ఆమెకు మెలకువ వచేప్పటికి సాయంత్రం ఆరు దాటింది. హడావిడిగా లేచి ముఖం కడుక్కొని కాఫీ తాగింది. ముస్తాబయి మొదటి అంతస్తు వరండాలో నిల్చొని గేటువైపుకు దృష్టి సారించింది. గేటు బయట చాలా మంది ఉన్నారు. నాగేంద్రరావు తోటలో నిల్చొని ఉన్నాడు పూల మొక్కల్ని పరిశీలిస్తూ.

 

    నాగేంద్రరావు అమ్మగారికి చేతులెత్తి మొక్కాడు. అతను సన్నగా పొడవుగా చలాకీగా ఉంటాడు, ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే తెలివితేటలు ఉన్నాయి. అయితే ఏం లాభం? అరుంధతి "వెధవాయ్" అంటే ఇట్టే వెధవలా ముఖం పెట్టేస్తాడు. ఆ మాటకొస్తే ఆమెముందు ఎప్పుడూ చచ్చు పెద్దమ్మలాగే ముఖం పెడతాడు. ఆ మాటకొస్తే ఆమెముందు ఎప్పుడూ చచ్చు పెద్దమ్మలాగే ముఖం పెడతాడు. ఆమెకు అలాంటి ముఖాలంటే ఇష్టం అని ఆమెను చూడగానే గ్రహించాడు. ఆమె అభిమానాన్ని చూరగొన్నాడు.

 

    "నాగేంద్రరావుగారూ! అందర్నీ లోపలకువచ్చి కూర్చోమనండి" అంది అరుంధతి.

 

    నాగేంద్రరావు తల పైకి ఎత్తి అలాగే ఉండిపోయాడు.

 

    "రంగన్నచేత కుర్చీలు లాన్ లో వేయించండి."

 

    నాగేంద్రరావు మెడ నరాలు పీకుతున్నాయి. అయినా ముఖం దించటానికి ధైర్యంలేదు. ఒక్కసారి మెడను కాస్త దించితే బాగుండును. "అలాగేనండమ్మా!" అంటూ తల దించుకున్నాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ, రంగన్నకు పని పురమాయించాడు.

 

    "ఇవ్వాళ ఈ బ్రహ్మరాక్షసికి బుర్రలో ఏదో పురుగు దొర్లినట్టుంది. అందర్నీ వచ్చి కూచోమంటుంది" అనుకున్నాడు మనస్సులోనే.

 

    అరుంధతి వరండానుంచి వెళ్ళిపోయింది. "రండయ్యా! అందరూ. ఇవ్వాళ మీ అదృష్టం పండిందిలే! రండి! రండి" అన్నాడు నాగేంద్రరావు. వాళ్ళందరికి పనులు వెంటనే ఎక్కడ జరిగిపోతాయోనని వాడి దిగులు. అతడి వాటా అతనికి దొరకదేమోనని భయం.

 

    రంగన్న గేటు తెరిచాడు. లోపలకు ప్రవేశిస్తున్నఒక్కొక్కరిముందుకూ చెయ్యి చాపాడు. నాగేంద్రరావు కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. ఇంతకాలం వాడికి ఇలాంటివి తెలియవని అనుకున్నాడు. చూస్తుండగానే రంగన్న చేతిలో పది రూపాయలు ఉన్నాయి. రంగన్న కళ్ళు మిసమిసలాడుతున్నాయి. రోజుకు పది! ముప్పయ్ రోజులకు? అబ్బో చాలా డబ్బే! తనకు లెక్క పెట్టుకోవాలంటే చాలాసేపు పడుతుంది. ఒక్కోరోజు ఇంతకంటే ఎక్కువ మందే వస్తారు. రంగన్న లోలోపల తబ్బిబ్బయిపోతున్నాడు.

 

    లక్షాధికారి రామినీడూ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కోటేశ్వరరావు, డిప్యూటీ సెక్రటరీ బషీర్ ఆనాటి ఆగంతుకులలో ముఖ్యులు. యం.యల్.సి. సీటుకోసం ప్రయత్నిస్తున్న విమలాదేవి కూడా వాళ్ళలో ఉంది. ఆవిణ్ణి చూస్తే నాగేంద్రరావుకు మహా తేలికభావం. తనేననుకుంటే తనకంటే, జావకారిపోతూ, పాచిపని చెయ్యటానికి కూడా సిద్ధమైనదానిలా ఉంటుంది- అనుకుంటాడు నాగేంద్రరావు ఆమెను చూసినప్పుడల్లా. అందరూ లాన్ లో కూచున్నారు. చల్లనిగాలి వీస్తూంది. కాని ఎవరికీ హాయిగా లేదు. అందరూ బిగుసుకొనే కూచున్నారు. అక్కడకు వచ్చే ఏ ఇద్దరూ హాయిగా మాట్లాడుకోరు.

 

    జానకి గేటులోకి వచ్చింది. రంగన్న చెయ్యి చాపాడు. ఆమె అతనికేసి చురచుర చూసి లోపలకు వెళ్ళిపోయింది. అది గమనించిన నాగేంద్రం ముసిముసిగా నవ్వుకున్నాడు.

 

    "రా తల్లీ! రా౧ ఇక్కడకు వచ్చే వాళ్ళందరిలో నువ్వు డబ్బులో, హోదాలో, వయసులో చిన్నదానివే అయినా మనిషిగా మాత్రం చాలా పెద్దదానివిగానే నిరూపించుకుంటున్నావు" మనస్సులోనే అనుకున్నాడు. నాగేంద్రరావు జానకిని చూస్తూ.

 

    ఆమె వచ్చి ఒక ఖాళీ కుర్చీలో కూర్చుంది. ఆమెను అంతకు ముందు చూడని వాళ్ళు ఎగాదిగా చూశారు. సాధారణమయిన వాయిల్ చీరలో అతి సాధారణంగా కనిపిస్తున్నది. విమలాదేవి ఆమెను శల్య పరీక్ష చేస్తున్నట్టు చూడసాగింది. తనకు పోటీ వస్తుందేమోనని ఆమెకు భయం పట్టుకొంది.

 

    "ఏం అమ్మాయ్! ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నావా?' సందేహం నివృత్తికోసం అడిగింది.. ఆమె అలా అంతమందిలో ప్రశ్నించటం బాగా అనిపించలేదు జానకికి.

 

    "అవును" అంది ముక్తసరిగా.

 

    "ఎక్కడ? ఏం ఉద్యోగం?" హుందాగా ప్రశ్నించింది విమలాదేవి.

 

    "మీకు అనవసరం!" ఆ మాటలు విమలాదేవికి కంకర రాళ్ళులా వచ్చి తగిలాయి.

 

    అందరూ లేచి నిల్చుంటుంటే, విమలాదేవీ, జానకీ కూడా లేచి నిల్చున్నారు.

 

    చివర మెట్టుదిగి వంగి కాలు పట్టుకొని అక్కడే ఆగిపోయిన అరుంధతి దగ్గరకు పరిగెత్తాడు నాగేంద్రరావు ఆదరాబాదరాగా.

 

    "ఏమయిందమ్మా?"

 

    "మెట్లమీద కాలు జారింది. బొటన వేలు మడత పడింది" అంది అరుంధతి బాధగా. అప్పటికే అందరూ ఆమె చుట్టూ చేరారు. విమలాదేవి అరుంధతి ముందు మోకాళ్ళమీద కూచుంది. కాలు పట్టుకొని సవరించబోయింది. వళ్ళు మండిపోయింది నాగేంద్రరావుకు.

 

    "అలా పట్టుకోకండి. ఫ్రాక్చర్ అయిందో ఏమో?" అన్నాడు నాగేంద్రరావు.

 

    కుర్చీ పట్టుకొచ్చి వేశాడు రామినీడు. ఆమెకు చెయ్యి ఆసరా ఇచ్చి విమలాదేవి ఆ కుర్చీలో కూర్చోపెట్టి ఆమె కాలు తన ఒడిలో పెట్టుకుంది.

 

    మరో కుర్చీ తెచ్చి వేశాడు ఇంజనీరు కోటేశ్వరరావు ఎదురుగా.

 

    "కాలు కుర్చీమీదకు పెట్టుకోండి ఎత్తుగా రక్తప్రసారం సరిగా వుంటుంది" అన్నాడు.

 

    విమలాదేవి చిన్నగా అరుంధతి కాలును ఎత్తి ఎదురు కుర్చీమీద పెట్టింది. అరుంధతి కుర్చీకి చేరబడి కళ్ళు మూసుకుంది. ఇంతమంది ఇన్ని పనులు చేస్తుంటే కళ్ళప్పగించి చూస్తూ నిలబడింది జానకి.

 

    "అయ్యో! ఎంత ప్రమాదం జరిగింది తల్లీ! అయ్యగారికి ఫోన్ చేస్తాను? అంటూ పైకి వెళ్ళబోయాడు నాగేంద్రరావు.

 

    "అక్కర్లేదు!" అంది అరుంధతి గంభీరంగా.

 

    "అలా అంటే ఎలాగమ్మా? ఇంత ప్రమాదం జరిగితేను? ప్రాక్చర్ అయిందో ఏమో?" స్వరంలోకి బాధను తెచ్చుకోటానికి ప్రయత్నిస్తూ అంది విమలాదేవి.

 

    బొటన వ్రేలు మడత పడిందానికి వాళ్ళంతా చేసే హడావిడి చూస్తుంటే వళ్ళు మండిపోయింది జానకికి.

 

    "ఆయనగారు సన్మాన సభలో వుంటారు. ఈ మాట వినగానే లేచి వచ్చేస్తారు, ఆయనకు ఫోను చెయ్యకండి" అంది అరుంధతి. కాని రాజారావు రాడని తనకు తెలుసు. ఏ డాక్టరుకో ఫోను చెయ్యమని చెబుతాడు. అంతకంటే పెద్ద హడావిడి ఏమీ పడడు. తనకు తగిలింది మమూలు దెబ్బేననీ, తడిగుడ్డ చుడితే తెల్లవారేసరికి నొప్పి తీస్తుందనీ ఆమెకు తెలుసు. ఆమెకు ఆ దెబ్బను చిన్న దెబ్బలా తీసిపారేయాలని లేదు. అందరూ చేస్తూన్న హడావిడి చూస్తూంటే బాగానే వుందనిపించింది. కొంతకాలం ఇదొక కాలక్షేపం అనుకుంది అరుంధతి.

 

    "అయితే డాక్టరుకు ఫోన్ చేస్తాను" అన్నాడు నాగేంద్రరావు. ముఖంలోకి కలవరపాటును తెచ్చిపెట్టుకున్నాడు.

 

    "చెయ్యండి. పెద్ద ఆసుపత్రి సూపర్నెంటుకు చెయ్యండి" అంది అరుంధతి బాధగా ముఖం పెట్టి.

 

    "ఆయన గుండెకాయల స్పెషలిస్టు. ఆయనొచ్చి ఏం చేస్తాడు?" అనుకున్నాడు ఇంజనీర్ కోటేశ్వరరావు మనస్సులో. "ఎందుకైనా మంచిది, సర్జన్ కుక్కుటేశ్వర్రావుగారికి కూడా ఫోన్ చెయ్యండి" అన్నాడు పెద్దగా.

 

    అంతవరకూ తనకు ఛాన్స్ రాలేదని బాధపడుతున్న బషీర్- "బోన్ స్పెషలిస్టు హుసేన్ నుకూడా పిలవండి" అన్నాడు నాగేంద్రరావుతో.

 

    నాగేంద్రరావు పైకి వెళ్ళాడు. మొదలియార్ కూ, కుక్కుటేశ్వర రావుకూ మాత్రమే ఫోన్ చేశాడు. కిందకు వచ్చి, హుసేన్ ఫోన్ మీద అందలేదని అబద్ధం ఆడేశాడు. నాగేంద్రరావుకు బషీర్ అంటే కసి.

 

    అప్పుడే హార్ట్ ఆపరేషన్ ఒకటి చెయ్యటానికి సిద్దంగావున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ మొదలియార్ ఫోన్ అందుకున్నాడు. ఆ ఫోను ఎక్కడినుంచి వచ్చిందో తెలియగానే సంతోషం పట్టలేకపోయాడు. అతడు ఎంతకాలంగానో డి.యం.యస్. కావటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని, కాలం కలిసిరావటంలేదు. అరుంధతి గురించి విన్నాడు. కాని ఆమెను ఎలా చేరాలో తెలియక వూరుకున్నాడు. ఆడబోయిన తీర్ధం ఎదురయినట్టయింది మొదలియార్ కు. హార్ట్ ఆపరేషన్ తన అసిస్టెంటుకు అప్పగించి విమానంలాంటి కారులో హుటాహుటీ వచ్చి అరుంధతి బంగళా ముందు వాలిపోయాడు.

 

    సర్జన్ కుక్కుటేశ్వరరావు ఆపరేషన్ చేస్తుండగా ఆ వార్తను మోసుకొచ్చింది సిస్టర్. ఆపరేషన్ హడావిడిగా ముగించి, కుట్లువేసే బాధ్యతను అసిస్టెంటుకు అప్పగించి ఆఘమేఘాలమీద వచ్చిపడిపోయాడు కుక్కుటేశ్వరరావు. వస్తూనే గేటుదగ్గర నిలిచివున్న తన బాస్ కారు చూసి కుక్కుటేశ్వరరావు నీళ్ళు కారిపోయాడు. మళ్ళీ ఒకరకంగా మంచిదే ననుకున్నాడు. మొదలియార్ కు తనంటే ఇష్టంలేదు. అయినదానికీ, కానిదానికీ చీవాట్లు వేస్తూవుంటాడు. తనకు అరుంధతిగారి దగ్గరకు వెళ్ళే చొరవ వుందని తెలుసుకుంటే ఇక తన జోలికి చస్తేరాడు. అయినా, కాలు బెణికితే హార్ట్ స్పెషలిస్టు ఏం చేస్తాడు? వాడి తాడు! ఆలోచిస్తూ లోపలకు ప్రవేశించిన కుక్కుటేశ్వరరావుకు మొదలియార్ అరుంధతి కాలును పరీక్షించడం కనిపించింది.

 

    కుక్కుటేశ్వరరావును చూడగానే, మొదలియార్ కు ముందు విస్మయమూ, ఆ వెనక కోపమూ కలిగాయి. కాని అందులో ఏ ఒక్క భావాన్ని బయటపడనీకుండా జాగ్రత్తపడ్డాడు.

 

    "కమిన్! నువ్వుకూడా చూడు" అన్నాడు మొదలియార్ కుక్కుటేశ్వరరావును.

 

    "అలా దారికిరా!" అనుకున్నాడు కుక్కుటేశ్వరరావు.

 

    కుక్కుటేశ్వరరావుకూడా కాసేపు కాలును అతిశ్రద్ధగా పరీక్షిస్తున్నట్లు నటించాడు. అక్కడ తను వచ్చి చూసేంత ప్రమాదం ఏమీలేదు. కాని, అలా తేల్చేస్తే ఎలా?

 

    మొదలియార్, కుక్కుటేశ్వరరావును పక్కగా తీసుకెళ్ళి ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ వుంటే అందరూ చూస్తూ కూచున్నారు.

 

    "పాదాలకీ, మోకాలుకూ ప్లాస్టర్ వేయాలి. మీరు ఓ పదిరోజులు బెడ్ రెస్టు తీసుకోవాలి" అన్నాడు మొదలియార్.

 

    "అంత అవసరమంటారా?" అరుంధతి సాలోచనగా అడిగింది.

 

    "అవునమ్మా! తమరు విశ్రాంతిగా వుండాలి. కాలు కదిలించకూడదు" అన్నాడు కుక్కుటేశ్వరరావు.

 

    "మళ్ళీ తరువాత ఏమయినా కాంప్లికేషన్స్ వస్తే కష్టం. మేమిద్దరం చెరొకపూటా చూసి పోతూంటాము రోజూ" అన్నాడు మొదలియార్.

 

    వీళ్ళకు ఆమెగారితో పనులు ఉండి ఉంటాయి. అందుకే ఇంత హడావిడి చేస్తున్నారు అనుకుంది జానకి.

 

    "విమలాదేవిగారూ!"

 

    "అమ్మా!" అంటూ ఒక్కసారిగా వచ్చి అరుంధతి ముందు నిల్చుంది విమలాదేవి.

 

    "మీరు ఈ పదిరోజులూ కాస్త నాకు సహాయంగా ఇక్కడే ఉండిపోవాలి" అంది అరుంధతి.

 

    "అలాగేనమ్మా! ఇంటికెళ్ళి బట్టలూ అవీ తెచ్చుకుంటాను. మా వారితోకూడా చెప్పేసి వచ్చేస్తాను" అంది విమలాదేవి ఆత్రంగా, తనకు దొరికే ఆ ఛాన్సును మరొకరు కొట్టేస్తారేమోనన్నట్లు.

 

    "అయితే ఇప్పుడే వెళ్ళివచ్చేయండి. రామినీడు కారులో వెళ్ళండి" అంది అరుంధతి.

 

    రామినీడు తన పేరు వింటూనే త్రుళ్ళిపడి లేచి నిల్చున్నాడు.

 

    "మీరెందుకు, డ్రైవర్ ఉన్నాడుగా?" అంది అరుంధతి.

 

    "వాడు ఇవ్వాళ రాలేదు. ఫర్వాలేదు నేనే వెళ్ళివస్తాను" అన్నాడు ఆ అవకాశం కొరకే ఎదురుచూస్తున్నవాడిలా.

 

    "వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తానమ్మా!" అంటూ విమలాదేవి లేచింది.

 

    "మీరు జానకిని వాళ్ళింటి దగ్గర దింపేయండి" అంటూ ఆమెకేసి చూసి "మీరు వెళ్ళండి. రేపు రండి. మీ పని అయిపోయినట్టే" అంది అరుంధతి.

 

    నమస్కరించి బయలుదేరింది జానకి. ఆమె నమస్కారంలో కృత్రిమత్వం ఎక్కడా కనిపించలేదు.

 

    "ఇంజనీరుగారూ! మీరుకూడా రేపు కనిపించండి."

 

    ఇంజనీరు వెంటనే లేచి వినయంగా నమస్కరించి వెళ్ళిపోయాడు.

 

    "వీరు డిప్యూటీ సెక్రటరీ బషీర్ గారు" అంటూ బషీర్ ను మొదలియార్ కు పరిచయం చేసింది. ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు.

 

    "బషీర్ గారూ! ప్రస్తుతం ఉన్న డి.యం.యస్. ఎప్పుడు రిటైరు అవుతున్నాడన్నారు?" సాలోచనగా ప్రశ్నించింది అరుంధతి.

 

    "ఈ నెల ఇరవైతొమ్మిదో తేదీనే!" అన్నాడు మొదలియార్ ఆత్రంగా.

 

    "అంటే ఇంకా ఇరవైరోజులు ఉందన్నమాట!" అంటూ ఓ నిముషం ఆలోచిస్తున్నట్టు అరుంధతి మౌనంగా కూచుంది. మొదలియార్ ఆమె ముఖంలోకి ఆత్రంగా చూస్తున్నాడు.

 

    "అంటే మొదలియార్ గారు త్వరలో డి.యం.యస్. అవుతారన్న మాటేగా?" బషీర్ వైపు చూస్తూ అడిగింది అరుంధతి.

 

    బషీర్ ఏం జవాబివ్వాలో తోచక ఆముదం తాగిన ముఖం పెట్టాడు. అఫీషియల్ సీక్రెట్ ఎలా చెప్పటమా అనే ఆలోచనలో పడ్డాడు.

 

    "లేదమ్మా! రఘుపతిగారికి ఇవ్వటానికి ముఖ్యమంత్రిగారు నిర్ణయించారట." మొదలియారు చెప్పేశాడు.

 

    అరుంధతి ముఖం చిట్లించింది. మొదలియార్ కొంచెం వెనక్కు తగ్గాడు.

 

    "అలాగా?" అంది అరుంధతి. మొదలియార్ అవునన్నట్లు తల ఆడించాడు.

 

    "ముందే నాకు ఎందుకు చెప్పలేదు?"

 

    "తమ పరిచయం నాకు లేదమ్మా! తమర్ని దర్శించుకోవాలని ఎంతో కాలంగా అనుకుంటూనే ఉన్నాను. కాని సందేహించాను అన్నాడు మొదలియార్.

 

    "ఒకవైపు కొంపలు అంటుకొనిపోతుంటే సందేహిస్తూ కూచున్నారా? కనీసం ఇప్పటికయినా చెప్పారు. ఇంకా ఇరవై రోజులుందిగా?" అంది అరుంధతి.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.