Home » Baby Care » Mistakes made by everyone in the matter of children food

పిల్లల ఆహారం విషయంలో అందరూ చేస్తున్న పొరపాట్లు!


ప్రసవం అయిన తరువాత పిల్లల ప్రపంచంలో తల్లిదండ్రులకు రోజులు ఇట్టే గడిచిపోతాయి. అయితే తల్లులకు మాత్రం పిల్లల విషయంలో ప్రతి రోజూ యుద్దంలానే సాగుతుంది. పిల్లల జాగ్రత్త నుండి తాము జాగ్రత్తగా ఉండటం వరకు రెండు పడవల మీద ప్రయణంలా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు తల్లిపాలు స్థానంలో ఇచ్చే పోషకాహారం, తల్లిపాలతో జతగా అందించే ఆహారం  గురించి చాలామందిలో విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. 

ఏ వయస్సులో పిల్లలకు అనుబంధాహారాన్ని ప్రారంభించాలి అనే విషయం చెప్పడంకన్నా, ఏ వయస్సులో ప్రారంభించకూడదు చెప్పడం సులభమని చాలామంది చెబుతారు. అనుబంధాహారాన్నివ్వడం కొందరు ఆలస్యం చేస్తూ ఉంటే ఇంకొందరు డాక్టర్లు, ఆరోగ్యకర్తల సలహాపై 2, 3 నెలలకే ప్రారంభిస్తున్నారు. ఇది చాలా అనారోగ్యకరమైన అలవాటు. సామాజిక మాద్యమలలో ప్రస్తుతం విపరీతమైన యాడ్స్ వస్తూ పిల్లల అనుబందాహారం గురించి లెక్కలేనన్ని ప్రొడక్ట్ లు అందుబాటులోకి తెస్తున్నాయి. ఇవన్నీ డాక్టర్ల సిఫారసు అనే స్టాంప్ ను ఒకదాన్ని తగిలించుకుని ప్రజలను మభ్యపెడుతున్నాయి. 


పిల్లలకు పెట్టదగినదే అయినా ఇలాంటి ఆహారం డాక్టరు సలహాపై తప్ప పిల్లలకు 4 నెలలు నిండకనే పెట్టకూడదు. అనుబంధాహారం పిల్లలకు పెట్టె విషయంలో చెప్పుకోవాల్సిన కొన్ని శాస్త్రీయమైన కారణాల గురించి చెప్పుకుంటే… 


అనుబంధాహారం త్వరగా ప్రారంభిస్తే పిల్లలు బాగా నిద్రపోతయారు. సరిపోయేన్ని పాలు త్రాగిన పిల్లలకన్నా ఇలాంటి ఆహారం తినేవారు బాగా నిద్రపోతారనుకోవడం అపోహ. నిజానికి వారు ఘనపదార్థాలను సరిగా జీర్ణించుకోలేకపోవడంవల్ల రాత్రి సమయాల్లో పదే పదే లేస్తూ ఎక్కువగా ఏడుస్తుంటారు. 


ఇలాంటి ఆహారాన్ని పిల్లలకు ఇస్తుంటే  శిశువులు లావుగా అవుతారని అనుకుంటారు. అయితే ఇది చాలా తప్పు. పిల్లల లావు, తీసుకొనే ఆహారం పైనే కాకుండా వంశపారంపర్య లక్షణాలపై కూడా ఆధారపడి వుంటుంది.


తల్లిపాలు త్రాగే పిల్లలు వారికి పాలు సరిపోగానే త్రాగడం మాని రొమ్ము వదిలేస్తారు. నాలుగు నెలలకు ముందే అనుబంధాహారం తినిపిస్తే వారికి ఎప్పుడు సరిపోయింది మనకు తెలియజేయలేరు. అదే 5 వ నెలలో ప్రారంభిస్తే ఆకలైనప్పుడు, నోరు తెరవడం, ఆహారం నోటిదగ్గరికి తేగానే ముందుకు వంగి సరిపోయేంత తీసుకున్నాక తలతిప్పివేస్తారు. అంటే 5వ నెలకన్నా ముందు ఆహారం తినిపించడమంటే బలవంతంగా ఆహారాన్ని నోట్లో కుక్కడమన్నమాటే.


అనుబంధాహారం త్వరగా తినడం ప్రారంభించిన శిశువులు లావుగా ఉండటానికి మరొక కారణం దాంట్లో ఎక్కువ మొత్తంలో ఉండే లవణాలు. ఆహారం తీసుకోగానే దాహం వేయడంవల్ల శిశువు ఏడ్పు ప్రారంభిస్తుంది. దీనిని ఆకలనుకొని మరింత ఆహారాన్నివ్వడం జరుగుతుంది. అది శరీరంలో క్రొవ్వురూపంలో నిలువజేయబడడంతో పిల్లలు లావెక్కుతారు. చిన్నవయస్సులో లావుగా ఉన్నవారు పెద్దవారైన తరువాత కూడా లావుగా ఉండే అవకాశం ఎక్కువ. వారు రక్తపోటు, గుండెజబ్బులు, మధుమేహం వ్యాధులకు తరచుగా గురవుతూ ఉంటారు.


తల్లిపాలు మాత్రమే త్రాగడం వల్ల పిల్లలు మొదటి 3-4 నెలలు శిశువు బరువు పెరగనట్లైతే వారు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారో లేదో డాక్టరును సంప్రదించి తేల్చుకోవాలి. శిశువు బరువు మొదటి 4 నెలలలో సరాసరి రోజుకు 20 గ్రాములు పెరుగుతుంది. ఇది కొందరి విషయంలో కొంచెం ఎక్కువ, తక్కువలు ఉండవచ్చు. బరువు పెరగనట్లైతే అనేక ఇతర కారణాలతో పాటు తల్లిపాలు సరిపోకపోవడం కూడా ఒకటి. పాలు సరిపోనప్పుడు పాల ఉత్పత్తిని పెంచే మార్గాలన్నీ ఆలోచించిన తరువాతే డాక్టరు సలహాపై అనుబంధాహారం గురించి ఆలోచించాలి. బరువు పెరగడం లేదన్న విషయం కూడా బరువు క్రమం తప్పకుండా నమోదు చేసిన తరువాతే నిర్ణయించగలము.


పిల్లలు ఏడ్చిన ప్రతిసారి ఆకలితో ఏడుస్తున్నారని అనుకోవడం  పొరపాటు. శిశువుకు ఆ వయస్సులో తెలిసిన ఒకే ఒక భాష ఏడ్పు. మూత్రం పోసేముందు, విరేచనం చేసేముందు, బట్టలు బిగుతుగా ఉన్నా, చలివేసినా, ఉక్కపోసినా ఇలా ఇంకా అనేకానేక కారణాలవల్ల కూడా శిశువు ఏడుస్తుంది. కాని శిశువు ఏ కారణంవల్ల ఏడ్చినప్పటికీ నోట్లో ఏదైనా ఆహారముంచినట్లైతే మ్రింగడానికి నోరు మూయాల్సి వస్తుంది. కాబట్టి ఏడ్పు ఆగిపోతుంది. దీనిని ఆకలి అని నిర్ణయించడం తప్పు.


కాబట్టి అనుబంధ ఆహారం విషయంలో తల్లులు, ఇతరులు తమకు తాము సిద్ధాంతాలు అన్వయించుకుని అవే నిజమని ఇతరులకూ చెప్పి పిల్లల విషయంలో పొరపాట్లు చేయకుండా ఉండాలి. అనుబంధ ఆహారం గురించి వైద్యుల సలహతోనే దాన్ని మొదలుపెట్టాలి.


                                    ◆నిశ్శబ్ద.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.