Home » Yoga » Meditation Benefits

 

ధ్యానం అంటే...

        సాధారణంగా వ్యక్తులు మూడు రకాలైన విషయాలలో మునిగి తేలుతుంటారు. అవి ' భౌతిక పరమైనవి, మానసికమైనవి, ఆధ్యాత్మికమైనవి'.

              పరుగెత్తడం, నడవడం, కూర్చోవడం, శ్రమించడం వంటివి భౌతికపరమైనవి కాగా, ఆలోచించడం, ఆలోచనలు లేకుండా ఉండటం వంటివి మానసికమైనవి. భౌతికం, మానసిక పరమైన వాటికంటే అత్యుత్తమమైనది - ఆధ్యాత్మికం. దానినే మనం ధ్యానం అని అంటున్నాము.

                       ధ్యానం ఆధ్యాత్మికమైనదని చెప్పగానే అదేదో ఋషులు, మహర్షులకు సంబంధించిన విషయమని భయపడనక్కర లేదు . చెప్పాలంటే, ఏదైనా ఒక విషయం గురించి , పూర్తి మనసును కొంత కాలం పాటు నిమగ్నం చేయడమే ధ్యానం అనబడుతుంది. ఉదాహరణకు ఒకరు తమ ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తున్న సమయంలో పూర్తిగా బాహ్య పరిసరాలను మర్చిపోయి ఆ పనిలో నిమగ్నమయ్యారనుకోండి , అది కూడా ఒక రకమైన ధ్యానమే. ధ్యానమంటే మనసుకు స్నానం చేయించడం. మన ఆలోచనలను ఎటూ చెదరనీయకుండా ఉంచే నిశ్చలస్థితే ధ్యానం. ఒక వస్తువుపై మనసును కేంద్రీకరించడం ధ్యానం కాబట్టి, ధ్యానం చేసుకునేందుకు అంటే మనం మన మనసును ఒకే వస్తువుపై కేంద్రీకృతం చేయాలి. మరే విషయం గురించిన ఆలోచనలు ఉండకూడదు . పూర్తిగా మనసు గురించిన ధ్యాస కలిగి ఉండాలి. ఒక విషయం పై చాలా సేపు మనసు కేంద్రీకరించగలగాలి.

ధ్యానాన్ని గురుముఖత :

                         ఇది  నేర్చుకుంటే త్వరగా ఫలితాలను పొందవచ్చు. ధ్యానంతో, యోగసాధనతో జీవితాన్ని అసాధారణమైన మార్పు వైపుకు మార్చుకుని, అభివృద్ధిని సాధించిన వారు మనకు కొందరు కనబడుతుంటారు . కొంతమంది ధ్యానానికి ఇవేమీ అవసరం లేదని అంటుంటారు . అలాగే ధ్యానం అంటే ఏ విషయం గురించి ఆలోచించని స్థితి అని అంటుంటారు . కాని ధ్యానం అంటే మనసును ఖాళీ చేసి, ఎటువంటి విషయం లేకుండా చేయడం కాదు .

                                   ధ్యానం కోసం ఒక వస్తువును భావించుకున్న తరవాతే ధ్యానం మొదలవుతుంది. మనసును మనసులోనే లయం చేయడాన్ని ధ్యానమని అన్నారు. ధ్యానం చేస్తున్నప్పుడు బాహ్యస్మృతి పోతుందని అంటారు . మనసులోని విషయం పట్ల ధ్యాస తప్ప వేరే విషయం గురించి ఆలోచన ఉండదు. మనసులో ఒక్క విషయం కూడా లేని స్థితిని 'నిర్విషయ స్థితి' అని అంటారు . అయితే ఒకే ఒక విషయాన్ని గురించి మనసును కేంద్రీకరించడాన్ని ధ్యానంగా భావించవచ్చు .

 

ధ్యానం వల్ల ఉపయోగాలు :

                            ధ్యానం మానసిక ప్రశాంతతను చేకూర్చుతుంది. ధ్యానం మన మనసును స్వాధీనం లోకి తెస్తుంది. తద్వారా మన జీవితమే మారిపోతుంది. మనసును స్వాధీనం చేసుకున్న తరవాత మన మనసులోని తరంగాలన్నీ ఆగిపోవడమే కాక, మనలోని చేతనా స్పృహ విస్తరిస్తుంది. ధ్యానం చేసినప్పుడల్లా మానసికంగా పెరుగుదలను పొందుతుంటాం.

        ప్రారంభంలో కాస్త కష్టమైనప్పటికీ, రానురాను తీవ్రతరం చేస్తే ధ్యాస కుదురుతుంది. అప్పుడు ఇతర విషయాల గురించిన ఆలోచనే ఉండదు. మన మనసుకు, తద్వారా మన శరీరానికి గాఢమైన విశ్రాంతి లభిస్తుంది.

 

 


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.