Home » Ladies Special » Karnataka Selvi Life Story

విధికి ఎదురు నిలిచిన... ఓ సెల్వి కథ

 

 

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 కోట్లమంది ఆడపిల్లలకు 18 ఏళ్లలోపు వయసులోనే పెళ్లి జరిగిపోతోంది. అందులో మూడోవంతు బాల్య వివాహాలు మన దేశంలో జరుగుతున్నట్లు అంచనా. ఆడపిల్లలను గుండెల మీద కుంపటిలాగా భావించేసి, వారిని ఎలాగైనా వదిలించేసుకోవాలనుకునే తల్లిదండ్రుల ఆలోచనలకు ఇది ప్రతిఫలం కావచ్చు. కానీ అలా వదిలించుకున్న తరువాత ఆ పిల్లల పరిస్థితి నిజంగానే కుంపట్లపాలవ్వడం విషాదకరం. అత్తింతి ఆరళ్ల దగ్గర్నుంచీ అనారోగ్య సమస్యల వరకూ వీరి జీవితం ఓ నరకంగా మారిపోతోంది. అలాంటి నరకం నుంచి బయటపడే ప్రయత్నం చేసిన ఓ సెల్వి కథే ఇది.

 

 

బాల్యవివాహంతో మొదలు

కర్ణాటకకు చెందిన సెల్వికి 14వ ఏటే పెళ్లి జరిగిపోయింది. మొగుడు మహా దుర్మార్గుడు! తిట్టడం, కొట్టడం, అదనపు కట్నం కోసం వేధించడంలాంటి అవలక్షణాలతో పాటుగా... సెల్వితో వ్యభిచారం చేయించి పబ్బం గడుపుకొనేవాడు. అలాంటి భర్తతో కలిసి జీవించడంకంటే ఈ లోకం నుంచి నిష్క్రమించడం మేలనుకుంది సెల్వి. ‘‘కానీ అలా చేస్తే నన్ను నేను నిరూపించుకునే అవకాశం ఉండదు కదా! అందుకనే నేను పారిపోయాను’’ అంటుంది సెల్వి.

 

 

ఆశ్రయం లభించినా

సెల్వి తన భర్త నుంచి పారిపోయాక అటుతిరిగీ ఇటుతిరిగీ మైసూరులోని ‘ఒడనాడి’ అనే స్వచ్ఛంద సంస్థలో ఆశ్రయం తీసుకుంది. వ్యభిచార వృత్తిలో చిక్కుకున్న మహిళలకు ఆ సంస్థ ఆశ్రయం కల్పిస్తూ ఉండేది. జీవితంలో అన్నేసి కష్టాలు పడిన సెల్వికి నిజంగానే అది ఒక ఊరట. కానీ తను అక్కడితో ఊరుకోలేదు. తన కాళ్ల మీద తాను నిలబడాలని అనుకొంది. అదే సమయంలో తన ప్రత్యేకతని చాటుకోవాలని అనుకుంది. అలా సెల్వికి కారు డ్రైవింగ్ మీద మనసైంది. సెల్వికి సంస్థ అధికారులు తోడుగా నిలవడంతో ఆమె టాక్సీ డ్రైవరుగా జీవనం మొదలుపెట్టింది. కొన్ని పత్రికల ప్రకారం ఆమె దక్షిణ భారతదేశంలోనే తొలి మహిళా టాక్సీ డ్రైవర్‌!

 

 

అయినా ఆగలేదు

సైకిల్‌ కూడా తొక్కడం రాని సెల్వి టాక్సీ డ్రైవర్‌గా నిలదొక్కుకుంది. మగవాళ్లకే పరిమితం అనుకునే రంగంలో.... అనుమానపు చూపులనీ, ఆకతాయి ప్రశ్నలనీ దాటుకుని సత్తా చాటుకుంది. కానీ ఆమె అక్కడ కూడా ఆగలేదు. ప్రస్తుతం మహిళా డ్రైవర్లు మాత్రమే ఉండే ఒక టాక్సీ సంస్థకి యజమానురాలిగా మారింది. సెల్వి వ్యక్తిత్వాన్ని చూసి మనసుపడిన విజీ అనే తోటి డ్రైవర్‌ని వివాహం చేసుకుంది. వారికిప్పుడు ఇద్దరు పిల్లలు.

 

 

డ్రైవింగ్‌ విత్‌ సెల్వి

2004లో సెల్వి ఆశ్రయం తీసుకొంటున్న సంస్థని చూసేందుకు కెనడాకి చెందిన ఒక పర్యటకురాలు వచ్చారు. ఆమె పేరు ‘ఎలిసా పొలాస్చి’. ఎలిసా ఏదో సరదాగా సెల్వి గురించి అప్పట్లో వీడియో తీసుకుని కెనడాకు వెళ్లిపోయింది. కానీ కొన్నాళ్ల తరువాత ఇండియాకి మళ్లీ వచ్చిన ఎలిసా, సెల్వీ సాధిస్తున్న విజయాలను గమనించింది. దాంతో గత 11 సంవత్సరాలుగా ఆమె సెల్వీ జీవితాన్ని వీడియోల ద్వారా రికార్డు చేస్తూ వచ్చింది. వాటన్నింటినీ కలిపి గత ఏడాది ‘డ్రైవింగ్ విత్‌ సెల్వీ’ పేరుతో ఒక డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో చోటు సంపాదించుకుంది. ఆ డాక్యుమెంటరీతో పాటుగా సెల్వి పేరు కూడా మారుమోగిపోతోంది. స్త్రీలకు సంబంధించిన అనేక సెమినార్లలో పాల్గొనాలంటూ సెల్వీకి అనేక ఆహ్వానాలు అందుతున్నాయి. కర్ణాటకలోని వాడవాడలా సెల్వితో కలిసి స్త్రీల హక్కుల గురించి ప్రచారం చేయాలని స్వచ్ఛంద సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.

 

సెల్వి సాధించిన విజయం ఏదో అయాచితంగా లభించినది కాదు. దాని వెనుక దాచలేని కష్టాలున్నాయి, మర్చిపోలేనంత శ్రమ ఉంది. కానీ ఇంత దూరం వచ్చిన తరువాత సెల్వి తన తోటివారందరికీ చెప్పే మాట ఒక్కటే- ‘‘కష్టాల్లో ఉన్న మనల్ని ఆదుకునేందుకు అన్నో, అమ్మో వస్తారనుకుని ఎదరుచూస్తూ కూర్చుంటే ఉపయోగం లేదు. మనకోసం మనం ఏం చేయగలమో ఆలోచించాలి. మనం ఏం సాధించగలమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తరువాత మనమే అడుగు ముందుకు వేయాలి!’’ సెల్వి చెబుతున్న మాటలు వాస్తవానికి ఎంత దగ్గరగా ఉన్నాయో కదా! ఆ మాటల వెనుక ఆమె జీవితమే ఉందయ్యే...
 

- నిర్జర.
 


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.