Home » Ladies Special » ఎపిసోడ్ -5


    "ఒక నిముషం వ్యవధి ఇస్తున్నాను. సరెండర్ యువర్ సెల్ఫ్"

 

    ఆ కేకలకి సమీపంలోని ఇళ్ళలో లైట్లు వెలిగాయి.

 

    ఉత్కంఠగా కిటికీలను తెరిచి చూస్తున్నారంతా.

 

    "మిస్టర్ షా. హాఫ్ మినిట్ అయిపొయింది సరెండర్." బర్రిస్ నుదుట స్వేదం పేరుకుంటోంది.

 

    మరో పదిహేను సెకండ్లు గడిచాయి.

 

    ఉన్నట్టుండి లూసి యింటికిటికీ తెరుచుకుంది.

 

    అది కాదు.

 

    దూకుడుగా కిటికీ అంచుపై పడిందో ఆకారం.

 

    బర్రిస్ ఆలస్యం చేయలేదు.

 

    ఫ్లడ్ లైట్ ని ఫోకస్ చేశాడు.

 

    "మిస్టర్ బర్రీస్. డోంట్ ప్లే విత్ మి."

 

    పొగ మంచులోనుంచి గంభీరంగా వినిపించింది షా కంఠం.

 

    తన పేరు ఉచ్ఛరించడంతో తొట్రుపడ్డాడు బర్రిస్.

 

    "తొందరపడితే డాక్టర్ మోరే ప్రాణాలు పోతాయి."

 

    అవాక్కయ్యాడు బర్రీస్.

 

    "యస్ మిష్టర్ బర్రీస్. నీ దూకుడు నాకు తెలుసు. కాని ఇప్పుడు నా భార్యని ట్రీట్ చేయటానికి వచ్చిన డాక్టర్ మోరే నా ఆధీనంలో వున్న విషయంను గ్రహిస్తే తొందరపడవు. సో. రెండు నిముషాల టైం యిస్తున్నాను. త్వరగా నీ ఫోర్స్ ని విత్ డ్రా చేయాలి. లేదంటే మోరేని చంపాల్సి వస్తుంది."

 

    సూపర్నెంటు బర్రిస్ సందిగ్ధంలో పడ్డాడు.

 

    అక్కడి కిటికీదగ్గర నిలబడ్డ డాక్టర్ మోరే ఎవరో వెనుక నుంచి నొక్కిపట్టుకున్నట్టు పెనుగులాడుతున్నాడు.

 

    "నిముషం పూర్తయ్యింది" షా కేక వినిపించింది మరోమారు.

 

    "సర్" బర్రీస్ సొలిసిటర్ జనరల్ దగ్గరికివెళ్ళాడు ఉద్వేగంగా.

 

    "విత్ డ్రా." అసహనంగా అన్నాడు. "ఆ ఇంటి సమీపంనుంచి టెంపరెరీగా మన బలగాన్ని ఉపసంహరించుకోండి."

    "గెటప్."

 

    బర్రిస్ ఆదేశం అర్థంచేసుకున్న పోలీసులు వెనక్కి వచ్చేసారు. సుమారు వందడుగుల దూరందాకా వచ్చిన బర్రీస్ అన్నాడు.

 

    "మనం అన్ని రూట్స్ నీ క్లోజ్ చేయాలి."

 

    "దట్స్ రైట్. డాక్టర్ మోరే బయటకు వచ్చేదాకా మనం చేసేదేమీ లేదు కాబట్టి అంతవరకూ మన ఫోర్స్ ని నాలుగుకార్నర్ లలో షా ఇంటికి దూరంగా కాపలా పెట్టండి. ఈలోగా..."

 

    వైర్ లెస్ లో హెడ్ క్వార్టర్స్ కి తెలియపరచబడింది.

 

    ఇప్పుడు వందలసంఖ్యలో పోలీసు బలగం సెంట్ లారెన్స్ చర్చివైపు దూసుకొస్తుంది.

 

    మంచులో నిలబడటం యిబ్బందిగా ఉంది.

 

    ఊపిరి అందటంలేదు. అయినా మొండిగా తన ప్రయత్నాల్ని సాగించాలనుకున్నాడు సొలిసిటర్ జనరల్.

 

    అరగంట గడిచింది.

 

    అప్పటికే పోలీస్ వ్యాన్స్ లో రెండు వందలమందిదాకా బ్రిడ్జిని చేరుకున్నారు కెనెడియన్ పోలీస్.

 

    హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.

 

    రహస్యంగా పొంచి షా ఉన్న ఇంటినే గమనిస్తున్న బర్రీస్ తర్వాత మూవ్ ని అంచనా వేయలేకపోతున్నాడు.

 

    "బాస్టర్డ్"

 

    కెనడా ప్రభుత్వ పోలీసు విభాగపు అత్యున్నతాధికారిగా ఇక్కడ ఓటమిని అంగీకరించలేని సొలిసిటర్ జనరల్ "వాట్ డజ్ హి వాంట్" అన్నాడు టైం చూసుకుంటూ.

 

    ఒక అంతర్జాతీయస్థాయి నేరస్థుడు అంత సులభంగా పట్టుబడతాడని అతడు అనుకోవడంలేదు.

 

    కాని ఇప్పుడు తాత్కాలికంగానయినా డాక్టర్ మోరేపేరిట ఒక అవాంతరాన్ని సృష్టించాడు.

 

    క్షణాలు భారంగా గడుస్తున్నాయి.

 

    అప్పుడు జరిగిందో వూహించని సంఘటన.

 

    షా ఇంటిలో నుంచి ముందు రివాల్వర్ పేలిన చప్పుడు.

 

    కెవ్వుమన్న కేకతోపాటు డాక్టర్ మోరే బయటికి పరుగెత్తుతూ వచ్చాడు.

 

    అతడి భుజంనుంచి రక్తం చిమ్ముతూంది.

 

    ఎంతవేగంగా సొలిసిటర్ జనరల్ ని చేరుకున్నాడంటే "కమాన్ హెల్ప్ మి, టేక్ మి" హాస్పటల్ బాధగా అరిచాడు డాక్టర్ మోరే.

 

    ఓ పోలీస్ కారులో చతికిలబడ్డాడు డాక్టర్ మోరే.

 

    ఆలస్యం చేయలేదు సొలిసిటర్ జనరల్.

 

    "వెంటనే హాస్పటల్ కి తీసుకెళ్ళండి"

 

    పోలీస్ యూనిఫాంలోవున్న డ్రైవర్ కారు నడుపుతూంటే వెనుక సీటులో వున్న డాక్టర్ మోరే వెనక్కి జారగిలపడ్డారు మెలి తిరిగిపోతూ.

 

    "మన సమస్యని సింప్లిఫై చేసాడు డాక్టర్ మోరే. ఉత్సాహంగా అన్నాడు సూపర్నెంటు బర్రీస్. "ఇక మనం ప్రొసీడవడం బెటరనుకుంటాను"

 

    "కిల్ ది బాస్టర్డ్" సొలిసిటర్ జనరల్ ఆవేశం యింకా పూర్తి కానేలేదు...

 

    తూటాల చప్పుళ్ళతో చీకటి ప్రతిధ్వనించిపోయింది.

 

    హెచ్చరిక లేదు... ఆదేశం లేదు...

 

    ఇంటి బ్రిక్ వాల్స్ పగిలిపోతున్నాయి. ఒకరుకాదు. సుమారు నూటయిరవయ్ మంది సాయుధులయిన పోలీస్ సిబ్బంది నిముషాలలో ఇంటిని నుగ్గుచేసారు.

 

    ఒక్క అంగలో పగిలిపోయిన ద్వారం తోసుకుని లోపల అడుగుపెట్టిన బర్రీస్ "హేండ్సప్" అన్నాడు గావుకేకలా.

 

    జవాబులేదు... ఏమయ్యాడు షా?

 

    నేలపై పడివున్న శవం చూసి ముందు 'షా' అనుకున్నాడు కాని దుప్పటిలాగేక తెలిసింది.

 

    అది ఓ స్త్రీ శవం. కణతలనుంచి చిమ్ముతున్న రక్తం అప్పటికే గడ్డకట్టి ఉంది.

 

    లూసీ ప్రాణంపోయి చాలాసేపయినట్టుగా ఉంది.

 

    అప్పుడు మొదలయింది అసలయిన అలసట.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.