Home » Health Science  » ఎపిసోడ్ -102


    సరళ చివాలున లేచి తలుపు దగ్గరగా లాగి సరోజ గదికేసి పరుగెత్తింది.

 

    "హల్లో సరళా! వంట్లో బాగాలేదా! ఏమిటి విశేషం?" స్కార్ఫ్ విప్పుకుంటూ తలతిప్పి ఓరగా చూస్తూ అడిగింది మిస్ రోజా.

 

    మిస్ రోజా ధోరణికి సరళకు వళ్ళు మండిపోయింది. ఆవిడతో మాట్లాడ్డానికే అసహ్యం వేసింది.

 

    "సరోజ వెళ్ళిపోయిందా?"

 

    "సరోజమాత్రం నేను చేయలేనా? కూర్చో!"

 

    సరళ గిర్రున వెనక్కు తిరిగింది.

 

    డైనింగ్ హాల్లో భోజనం ముందు కూర్చున్న సరళకు ముద్ద మింగుడుపడటంలేదు. అవతల వరసలో కూర్చుని పకపకలాడుతూ పక్కవాళ్ళమీద విరగబడి మాట్లాడుతున్న మిస్ రోజాను చూస్తుంటే సరళకు కంపరం పుట్టిపోయింది. డిన్నర్ మధ్యలోనే వదిలేసి గదికి వచ్చేసింది.

 

    పక్కమీద పడుకుంది. పడక కుదిరినట్టుగా లేదు. అటూ ఇటూ దొర్లింది. నిద్ర రావటం లేదు. తలంతా వేడెక్కిపోయింది.

 

    ఎందుకొచ్చిన పీడ తనకు యిది? అయినవాళ్ళందర్నీ వదులుకొని వచ్చేసింది. నీళ్ళులేక యెండిపోయిన మొక్కను పీకి చిత్తడినెలలో మళ్ళీ పాతడం ఎందుకు? ఇదంతా తన భ్రమేనేమో? తనెవరు? రాజమణిదేవి యెవరు? ఆమెగారు ఈ పాటికి తనను మరచిపోయే ఉంటుంది. కొత్త నర్సు సరోజతో ఈపాటికి ఆప్యాయత వలకబోస్తూ ఉంటుంది. ముక్కూ- మొహం తెలియని తనతో ఆమె మొదటిరోజే ఎట్లా మాట్లాడింది? అలాగే సరోజతో కూడా మాట్లాడి వుంటుంది. ఆమెగారి మానసిక స్థితి అలాంటిదే. తనను పూర్తిగా మరిచిపోయే వుంటుంది. తనే లేనిపోని ఆలోచనలతో మమకారాన్ని పెంచుకొంటూ, గుండెల్ని పిండుకొంటూంది... అంతే-

 

    "సరళా!"

 

    ఎవరది? సత్యం బావా? సూర్యం బావలా వున్నాడు! సూర్యం కంఠం ఇంత కర్కశంగా మారిపోయిందేం? అరే అంతలోనే గొంతు మారిపోయిందే? సందేహం లేదు - యిది సత్యం బావ పిలుపే. ఆ పిలుపే వేరు. ఆ పిలుపే వేరు. ఆ పిలుపులో ఎంత మాధుర్యం? ఎంత ఆత్మీయత? ఎంత సౌమ్యత?

 

    ఎన్నాళ్ళకు వచ్చాడు బావ? ఇంతకాలం నన్నొదిలి ఎలా ఉండగలిగావు బావా? నీకోసం నా హృదయం ఎంత పరితపించి పోతుందో నీకు తెలియదా? కళ్ళల్లో వత్తులు వేసుకొని నీకోసం ఎదురు తెన్నులు చూస్తున్నానే? నీకు తెలియదా బావా? ప్రకృతిలోని అంతఃసౌందర్యాన్ని వెలికి తీసి రంగులు వేసే కళాకారుడివిగదా బావా? నీ సరళ మనసును అర్ధం చేసుకోలేకపోయావేం?

 

    అయ్యో! నేనంటుందేమిటి? నిన్ను వాకిట్లోనే నిలబెట్టి ఏమేమో మాట్లాడుతున్నాను. అలా మాట్లాడేగదూ నిన్ను దూరం చేసుకున్నాను. వస్తున్నా బావా! ఇదిగో తీస్తున్నా నా గుండె తలుపులు! నేరుగా లోపలకు వచ్చేయ్. అక్కడ ప్రతి అణువులోను నీ రూపమే నిండి ఉన్నది. నువ్వే చూసుకో!

 

    "సరళా! ఓ సరళా!"

 

    - - తలుపు కొడ్తున్న సవ్వడి.

 

    సరళ గాబరాగా పక్కమీదనుంచి లేచింది.

 

    "అబ్బ! ఎంతనిద్ర పోతున్నావో?" అంది సరోజ లోపలికొస్తూ.

 

    "ఎంతసేపట్నుంచి పిలుస్తున్నావు?"

 

    "ఐదు నిముషాలుగా అరుస్తూనే ఉన్నా!"

 

    కుర్చీలో కూలబడుతూ అన్నది సరోజ. కణతలు నొక్కి పట్టుకొని సరళకేసి నిస్సహాయంగా చూడసాగింది సరోజ. ఆమె కళ్ళు జ్యోతుల్లా మండిపోతున్నాయి. ముఖం అంతా పాలిపోయి వుంది. వరుసగా ఏడు రాత్రుళ్ళు నిద్రలేని మనిషిలా వుంది.

 

    "ఏమిటి సరోజా! ఏమయింది?"

 

    "ఏమయిందా? నువ్వు శెలవెందుకు పెట్టావో ఇప్పుడు నా కర్ధం అయింది-" అన్నది సరోజ వగరుస్తూ.

 

    సరళ సరోజ ముఖంలోకి అయోమయంగా చూసింది.

 

    "ఆమెగారు- అదే స్పెషల్ వార్డులో ఉన్న పేషంట్ రాజమణిదేవి-" అదే అడగాలని ఆగిపోయింది సరళ, సరోజ ముఖం చూసి.

 

    "పేషంట్ కాదు - షి యీజ్ ఎ డెవిల్! మెంటల్ హాస్పిటల్ లో ఉండాల్సిన మనిషిని తీసుకొచ్చి మన హాస్పిటల్లో పడేశారు మన ప్రాణాలు తియ్యటానికి."

 

    "ప్లీజ్! సరోజా, అలా అనొద్దు. ఆమెకెలా ఉందిప్పుడు?" సరళ కంఠం ఆర్ద్రమయింది.

 

    సరోజ ఓ క్షణకాలం సరళ ముఖంలోకి తీక్షణంగా చూసింది.

 

    "ఆమెగారు నీ కేమవుతుంది?"

 

    "ఏమీ - ఏమీ కాదు."

 

    "అబద్ధం! నువ్వేదో దాస్తున్నావు. మొదటిరోజు రాత్రంతా నీ గురించే అడిగింది. ఏదో సర్దిచెప్పాను. రాత్రంతా పక్కమీద కూర్చునే ఉంది. నేనేది అడిగినా నీగురించే మాట్లాడేది. ఇక రాత్రి సరేసరి, నా ప్రాణాలు తోడేసింది. హాస్పిటల్ వాళ్ళంతా కుట్రచేసి నిన్ను తననుంచి దూరం చేశారట! ఇలాగే ఏమేమో పిచ్చిమాటలు మాట్లాడింది. ఆమె చేత స్లీపింగ్ పిల్ కూడా మింగించలేకపోయాను! మందు విసిరికొట్టింది. రాత్రి పదకొండు గంటలకు బిగిసిపోయి బెడ్ మీద విలవిలా తన్నుకొంది. న్యూరాలజీ సర్జెన్ కు కబురుపెట్టి పిలిపించాను-."

 

    సరళ ఆదుర్దాగా లేవటం చూసి సరోజ ఆగిపోయింది.

 

    "సరళా! తల రేగివుంది. కనీసం చీరయినా మార్చుకో."

 

    సరళ మాట్లాడకుండా గదిబయటకు నడిచింది.

 

    సరోజ నిట్టూర్చి తన గదివైపుకు వెళ్ళింది.

 

    ఉదయం ఎనిమిది గంటలు దాటిపోయింది. తోటీలూ, నర్సులూ తమతమ పనుల్లో మునిగిపోయి వున్నారు. హాస్పిటల్ వార్డ్సు అన్నీ శుభ్రం చేస్తున్నారు ఒకవైపు. పేషెంట్సు బెడ్స్ సర్ది బట్టలు మారుస్తున్నారు నర్సులు.

 

    సరళ ఫిమేల్ వార్డు దాటి స్పెషల్ రూమ్ లకేసి నడవసాగింది.

 

    రాజమణిదేవి గదిలో అడుగు పెడ్తూనే ఆగిపోయింది సరళ. ఆమె పక్కమీదకు వంగి తల్లిని కూర్చోపెట్టటానికి ప్రయత్నిస్తున్నాడు మాధవరావు.

 

    "నేను పచ్చి గంగ మింగను. ఈ నరకంలో నేను ఒక్కక్షణం ఉండను."

 

    "అలాగే అమ్మా౧ మరో హాస్పిటల్లో చేర్పిస్తాను. ఈ ఒక్కరోజుకు ఓపికపట్టు. ముందు ఆ కాఫీ తీసుకో, చల్లారిపోయింది. నేను డాక్టరు రావుతో మాట్లాడి డిస్ ఛార్జి చేసేట్టు చూస్తాను."

 

    "ఆఁ! డాక్టర్ రావు! అతడు నన్ను పిచ్చి ఆసుపత్రిలో చేర్పిస్తాడు. నాకు తెలుసు."

 

    "ఏమిటమ్మా ఆ మాటలు?"

 

    "లేకపోతే ఏమిటిరా? వీళ్ళంతా కలిసి నా సరళను ఎందుకు నా దగ్గరకు రానివ్వకుండా చేశారు?"

 

    "ఎవరమ్మా ఆ సరళ?"

 

    రాజమణిదేవి తలెత్తి కొడుకు ముఖంలోకి చూసింది. మాధవ్ భుజాలకు వెనగ్గా మౌనంగా నిలబడ్డ సరళ కన్పించింది.

 

    రాజమణిదేవి కళ్ళు కాంతిమంతమయ్యాయి. ముఖం వికసించింది. చివాలున మంచం మీదనుంచి లేచింది. మాధవ్ ను తప్పుకొని ముందుకు అడుగులు వేస్తూ తూలింది. సరళ ఆమెను మెల్లగా నడిపించి బెడ్ మీద కూర్చోబెట్టింది. ఎడంగా జరుగుతున్న సరళను రాజమణిదేవి రెండు చేతుల్లో పొదవి పట్టుకొని గుండెలకు హత్తుకొంది. ఆమె ఆలింగనంలో సరళ చిన్నపిల్లలా అయిపోయింది! అనిర్వచనీయమైన ఆనందానుభూతిని పొందింది. సరళ చెంపలమీద జారుతున్న అశ్రువులను రాజమణిదేవి తన పమిటకొంగుతో తుడిచింది.

 

    మాధవరావు కళ్ళు పెద్దవి చేసుకొని వింతగా చూస్తూ ఉండిపోయాడు.

 

    "పిక్చిపిల్ల౧ నాకు దూరంగా ఉండటానికి ప్రయత్నించావు గదూ? అది నీ వల్లకాదు, నాకు తెలుసు. ప్రాణదానం చేసిన నువ్వు మళ్ళీ నా ప్రాణాల్ని తియ్యలేవని నాకు తెలియదా?"

 

    రాజమణిదేవి గర్వంగా తలెత్తి కొడుకు ముఖంలోకి చూసింది.

 

    ఎవరికోసం తన తల్లి ఇంతసేపు గొడవ చేసిందో, ఆమే ఈ సరళ అని అర్ధం చేసుకోటానికి మాధవరావుకు ఎంతోసేపు పట్టలేదు. తన తల్లి ఒడిలో తలదూర్చి వచ్చే దుఃఖాన్ని ఆపుకోటానికి ప్రయత్నిస్తోన్న ఆ అమ్మాయిని విస్మయంతో చూస్తూ ఉండిపోయాడు.

 

    ఏమిటీ వింత? తన తల్లికి కూతురు పోయినప్పటినుండి మతి సరిగా ఉండడం లేదు. కాని ఈ నర్సమ్మ ఏమిటి ఇలా ప్రవర్తిస్తుంది? ఈ అమ్మాయికి కూడా మతిస్థిమితం కొంచెం తక్కువేమో! లేకపోతే నాలుగు రోజుల పరిచయానికి ఈ పిల్ల అలా తన తల్లి ఒళ్ళో తలదూర్చి ఏడవటం ఏమిటి?

 

    "ఎన్నిమాటలు చెప్పావు? నాలో ఎన్ని ఆశలు కల్పించావు? కొత్త జీవితాన్ని, ఓ కొత్త లోకాన్నే సృష్టించుకొన్నానే? ఈ రెండు రోజులూ నేను ఎంత చిత్తక్షోభను అనుభవించానో నీకు తెలియదా సరళా?"

 

    "అదంతా పీడకల! మర్చిపోండి. నేను ఇంకెప్పుడూ అలా చెయ్యను-" కళ్ళు తుడుచుకుంటూ అంది సరళ.

 

    "నిజంగానే ఈ అమ్మాయికి కూడా కొంచెం పిచ్చి ఉంది-" అనుకొన్నాడు మాధవరావు.

 

    "మళ్ళీ నువ్వు అలా చేసే అవకాశం నీకుండదులే. నిజంగా నేను పిచ్చిదాన్ని కాబట్టే ఇలా జరిగిపోయింది. మళ్ళీ అలా జరగటానికి వీల్లేదు. వెళ్దాం పద!"

 

    "ఎక్కడికమ్మా? మీరీ స్థితిలో-"

 

    "ఎక్కడికా? నీ ఇంటికే!"

 

    "నా ఇల్లా? నాకు ఇల్లు-"

 

    "అమ్మకు పూర్తిగా మతిపోయినట్లుంది-" లోలోపలే విసుక్కున్నాడు మాధవరావు.

 

    "అవును, నీ ఇంటికే! నా ఇల్లు నీది కాదా? నేను నీదాన్ని కాదా?"

 

    సరళ బిత్తరపోయి చూసింది. ఆమె ధోరణికి అడ్డుపడటం ప్రస్తుతం శ్రేయస్కరం కాదనిపించింది.

 

    "మాధవ్! చూస్తావేంరా? అమ్మాయి, నేను ఇంటికి వస్తున్నాం. నువ్వు డాక్టరుగారితో మాట్లాడిరా!" అని రాజమణిదేవి బెడ్ మీదనుంచి లేచింది.

 

    మాధవరావు ఏదో అనాలని, తల్లి ముఖంచూసి ఏమీ అనలేక గది బయటకు వెళ్ళిపోయాడు.


                                         25


    కారు బంగళా గేటు దాటింది. పూలమొక్కల మధ్యగా పోర్టికోకేసి పోతూంది. రాజమణిదేవి ప్రక్కన వెనక సీట్లో కూర్చున్న సరళ విస్మయంగా చూడసాగింది.

 

    ఎంత పెద్ద బంగళా! ఎంత పెద్ద ఆవరణా! తనెప్పుడూ ఊహించనిది కళ్ళముందు చూస్తోంది. తోటలో ఆ మేడ ఎంత అందంగా ఉంది? సత్యం బావ ఇంత అందమైన బంగళా చూస్తే ఎంత ఉబ్బి తబ్బిబ్బై పోతాడో? ఈ అందమైన పూలబాటనీ, ఆ విశాలమైన ఇంటినీ రంగుల్లో రంగరించి ఎంతటి అద్భుత చిత్రాన్ని గీస్తాడో!

 

    కారు పోర్టికోలో ఆగింది. మాధవరావు ముందు సీట్లోనుంచి దిగివచ్చి వెనక డోర్ తెరచి నిలబడ్డాడు. రాజమణిదేవి సరళ భుజం మీద చెయ్యివేసి ఆనుకొని కారు దిగింది.

 

    "కుడికాలు పెట్టమ్మా!" - ఎడంపాదం మొదటి మెట్టుమీద దాదాపు ఆనించిన సరళను వారిస్తూ అన్నది రాజమణిదేవి.

 

    - మంగళవాద్యాలు

 

    తాళిబొట్టూ, తలంబ్రాలూ

 

    పారాణి పాదాలూ

 

    గడపదాటుతున్న పెళ్ళికూతురూ-

 

    క్షణంలో సగంసేపు సరళ మనస్సు సుందర మనోహర దృశ్యాలను దర్శించి, మధురాతి మధురమైన అనుభూతుల్తో తిరిగివచ్చింది.

 

    ఇది అసంభవం! ఇది నిజంగాదు! ఇది భ్రమ! పగటికల!

 

    సరళ తల తిరిగిపోతూంది.

 

    "మాధవ్! ఇలా రారా! సరళకు ఏదో అయిపోతుందిరా!" గట్టిగా అరిచింది రాజమణిదేవి.

 

    అంతవరకు వెర్రివాడిలా చూస్తూ నిలబడ్డ మాధవరావు ముందుకొచ్చాడు.

 

    "నాకేం కాలేదు. బాగానే ఉన్నా! ఒక్కక్షణం ఏదో తల తిరిగినట్టయింది. అంతే!"

 

    సరళ తెప్పరిల్లుకొని అన్నది.

 

    మాధవరావూ, సరళా రాజమణిదేవిని చెరొక రెక్క పట్టుకొని మెట్లు ఎక్కించారు.

 

    బెడ్ రూంలోకి దారితీస్తున్న వాళ్ళను ఆపుచేసి రాజమణిదేవి "ఇంక పడకలతో పనిలేదు. నన్నిక్కడే కూర్చోనీయండర్రా!" అంటూ హాల్లో ఉన్న సోఫాలో జారిగిలపడి కూర్చుంది.

 

    సరళకు ఏమి చెయ్యటానికి తోచలేదు. ఆమెకు రాజమణిదేవి తప్ప, ఆ ఇల్లూ, ఆ వాతావరణం అంతా కొత్తే. రాజమణిదేవి ముందు నిలబడి దిక్కులు చూడసాగింది.

 

    "ఏమిటమ్మాయ్! అలాగే నిలబడిపోయావు? నీ యింట్లో నువ్వే కొత్తదానివిలా దిక్కులు చూస్తూ నిలబడ్డావు?"

 

    "అమ్మకు నిజంగానే మతి భ్రమించినట్టుంది-" అనుకున్నాడు మాధవరావు.

 

    "ఒరేయ్! మాధవ్! అట్లా నీళ్ళు నములుతూ నిలబడిపోయావేరా? అమ్మాయిని తీసుకెళ్ళి ఇల్లంతా చూపించు. ఈ క్షణం నుంచి ఈ ఇంట్లో నా పెత్తనం ఏమీలేదు. అందరం సరళ చెప్పినట్టే వినాలి. ఆమె పెడ్తే తినాలి. కూర్చోమంటే కూర్చోవాలి. లేవమంటే లేవాలి. ఆఁ, తెలిసిందా?"

 

    రాజమణిదేవి ఆయాసానికి ఆవేశంతోడయి ఉక్కిరి బిక్కిరి అయిపోతూ చెప్పింది.

 

    సరళ స్థంభించిపోయి కొయ్యబొమ్మలా నిలబడింది.

 

    మాధవరావు సరళకేసి చూడకుండానే "రండి" అంటూ తల వొంచుకొని తల్లిముందునుంచి కదిలాడు.

 

    సరళ యాంత్రికంగా, అంతకంటే ఏం చేయాలో తోచనిదానిలా కదలి మాధవరావును అనుసరించింది.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.