భండారి మాధవ్ ని పరిశీలనగా చూసి "వాట్స్ ది మేటర్ ఇంజనీర్? ఏమైనా స్పెసిఫిక్ కారణమా?" అడిగాడు.
    
    "ఔను! మీరు నేను అడిగింది చేశాక మీకే తెలుస్తుంది. అప్పుడు మీరే హర్షిస్తారు నే చేసిన పనికి!" కాన్ఫిడెంట్ గా చెప్పాడు మాధవ్,
    
    "బట్ ... ఇట్స్ ఎగైనెస్ట్ అవర్ రూల్స్!"
    
    "నా ఉద్యోగం పోవచ్చు! అన్నాడు భండారి.
    
    మిమ్మల్ని చూస్తుంటే రిటైర్మెంట్ కి ఎంతో దూరంలో లేరనిపిస్తోంది. ఒక మంచిపని చేసి ఆ తృప్తితో ఉద్యోగం పోగొట్టుకోవడం అనే బాధను మరచిపోవచ్చు. చూస్తుంటే నాకు మానాన్నగారు గుర్తొస్తున్నారు." అన్నాడు మాధవ్.
    
    భండారి ఆ వాదన అంగీకరించినట్లు చిన్నగా తల ఆడించాడు.
    
    "ఓకే! మీరు అంగీకరించనందుకు జీవితాంతం రిపెంట్ అవుతారు. బై!" మాధవ్ వెనుతిరగబోయాడు.
    
    "వెయిట్, మై బాయ్!" ఆత్రంగా అన్నాడు భండారి.
    
    మాధవ్ కళ్ళు ఆశగా చూశాయి.
    
    "ఓకే! నీ కోరిక ప్రకారమే చేస్తాను. కానీ రీజన్ చాల జెన్యున్ గా ఉండాలి మరి!" అన్నాడు పైలెట్.
    
    మాధవ్ జేబులో చెయ్యి పెట్టుకుని ఉత్సాహంగా తల ఆడించాడు. అతని మొహం నిండా స్వేదం అలుముకుంది. ఒకటి .... రెండు.... మూడు .... నాలుగో నిముషంలో భండారి గట్టిగా "యా ... విండో ఓపెన్ చేస్తున్నాం ... చూడు!" అని అరిచాడు.
    
    మాధవ్ ఆలస్యం చేయకుండా జేబులోంచి అర్ధరూపాయి బిళ్ళతీసి విసిరేశాడు.
    
    కోపైలెట్ విండో క్లోజ్ చేసేసి, ఎందుకలా చేశావు అన్నాడు.
    
    మాధవ్ మొహం ఉద్విగ్నతతో మెరుస్తోంది.
    
    "కింద గోదావరి వస్తోంది. థాంక్యూ ఆఫీసర్స్ థాంక్స్ ఎలాట్!" అని తల వంచి స్టయిల్ గా అభివాదం చేసి విలాసంగా బయటకు వెళ్ళిపోయాడు.
    
    భండారి తేరుకుని, "హీ ఈజ్ క్రేజీ!" అన్నాడు.
    
    కోపైలెట్ బ్రహ్మానందం వెంటనే, "నో .... అది మా ఆంధ్రుల సెంటిమెంట్ మేం చిన్నప్పుడు రైల్లోంచి పైసలు గోదావరిలోకి విసిరేవాళ్ళం!
    
    ఇతను ప్లెయిన్ లోంచి హ.... హ..... హ.... హ" అని నవ్వాడు.
    
    సీరియస్ గా ఉన్న భండారి మొహంలోకి నవ్వొచ్చింది. "ఫన్నీ చాప్!" అన్నాడు.
    
                                                            * * *

    అమెరికా నుండి వచ్చిన కొడుకు వైపు కేశవరావు తృప్తిగా చూసుకున్నాడు. "ఇండియాలోనే సెటిల్ అవుతాననే నీ నిర్ణయాన్ని నేను కాదనను. కానీ టాటాస్ లో జాబ్ వస్తే బొంబాయి వెళ్లనని పట్టుబడితే మాత్రం ఒప్పుకోను!" అన్నాడు.
    
    మాధవ్ ఇబ్బందిగా కదిలి వాళ్ళ అమ్మతో "అమ్మా! ఆకలి ..." అన్నాడు.
    
    యశోద వెంటనే, "రా, నాన్నా భోంచేద్దువుగాని! నీ కిష్టమైనవన్నీ చేశాను!" అంది వడ్డిస్తూ.
    
    మాధవ్ టేబుల్ మీద ఉన్నపదార్దాల మూతలు తెరిచి చూస్తూ "ఇండియా రాగానే ఏం చేద్దామనుకున్నానో తెలుసా?" అన్నాడు.
    
    "బహుశా స్వంతంగా ఏదైనా ఫర్మ్ పెట్టుకుందామని అనుకుని ఉంటావు!" అన్నాడు గర్వంగా కేశవరావు.
    
    "కాదు అమ్మా! నువ్వు గెస్ చెయ్యి చూద్దాం! అన్నాడు మాధవ్.
    
    "చదువులూ, ఉద్యోగాలూ కాకుండా హాయిగా కొన్నాళ్ళు ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నావా?" గారాబంగా అడిగింది యశోద.
    
    "ఉహుఁ. రూర్కెలాలో ఉన్న పెద్దత్తయ్యనీ, మావయ్యనీ, చెన్నయ్ లో ఉన్న చిన్నాన్ననీ, వైజాగ్ లో ఉన్న పిన్నినీ, పిల్లలనీ, వరదరాజపురంలో ఉన్న పెద్దనాన్ననీ అందర్నీ చూడాలనుకుంటున్నాను!" అన్నాడు.
    
    "అదేం భాగ్యం! రేపు నీ పెళ్లి కుదిరితే అందరూ వస్తారు - ఇంకో రెండు గారెలు వేసుకో!" తేల్చేస్తూ అంది యశోద.
    
    మాధవ్ గారెని చేతిలోకి తీసుకుని దాని కన్నంలోంచి చూస్తూ అన్నాడు. "చిన్నప్పుడు సెలవులొస్తే ఎంత బాగుండేదమ్మా! చిన్నాన్న పిల్లలూ, పిన్ని పిల్లలూ, అత్తయ్యపిల్లలూ .... అందరం కలిసి ఆడుతుంటే నువ్వూ, పిన్నీ పిండివంటలు చేస్తూ .... అత్తయ్య మా అందరికీ అన్నం కలిపి ముద్దలు పెడుతూ .... ఓహ్ ...! ఆ రోజులు మళ్ళీ వస్తేనో..."
    
    కేశవరావు నవ్వి, "మా చిన్నప్పుడు నేనూ మా సుబ్బారాయుడూ పందెం వేసుకుని ఇవతల ఒడ్డునుంచి అవతల ఒడ్డుకి ఈతలుకొట్టేవాళ్ళం. చింతచెట్టెక్కి కాయలు దులిపి తిట్లు తినేవాళ్ళం, గాలిపటాల కోసం ఇంటికప్పుల పైకెక్కి పెద్దాళ్ళతో దెబ్బలు తినేవాళ్ళం ... ఇప్పుడవన్నీ చేస్తే బాగుంటుందా మరి! అవన్నీ చిన్నతనం రోజులు!"
    
    "తలుచుకోవడానికి కూడా చిన్నతనంగా వుందా నాన్నా?" నవ్వుతూ అడిగాడు మాధవ్.
    
    "అదేం లేదు, కానీ .... నా కొడుకు జీవితం కూడా నాలా చెప్పులు లేని కాళ్ళతో మైళ్ళు నడిచి బడికెళ్ళడం, హరికేన్ లాంతర్ లో చదువు ప్రారంభం కాకూడదనేరా రాత్రింబవళ్ళు కష్టపడి ఈ స్థాయికి ఎదిగానూ!"
    
    "కానీ, నువ్వు మొదటిసారి రైలెక్కినప్పుడూ, విమానం ఎక్కినప్పుడూ, స్వయంకృషితో ఇల్లు కట్టుకున్నప్పుడూ పొందిన ఆనందం... అంత థ్రిల్ నేను పొందలేనుకదా నాన్నా!" చేతిలోని గారెముక్క ప్లేట్లోనే జారవిడుస్తూ అన్నాడు మాధవ్.
    
    యశోద నిష్టూరంగా "నువ్వు ఇండియా వస్తూనే ఇల్లు సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్ చేయించలేదేం అనో, ఇంకా యీ ఫియట్ లోనే తిరుగుతున్నారా అనో అంటావనుకున్నాను కానీ, ఇలా జోడెద్దుల బండ్లగురించీ, పేడకళ్ళాపి గురించీ మాట్లాడతావనుకోలేదు" అంది.
    
    మాధవ్ వెంటనే తదాత్మ్యంగా "భలే గుర్తుచేశావమ్మా! పెద్దనాన్న  వాళ్ళ  వూళ్ళో పొద్దుటే చల్లిన పేడకళ్ళాపి ... దానిమీద నుండి వీచే సుగంధం, పచ్చని ముంగిళ్ళలో తెల్లని ముగ్గులూ, వాటిమీద గుమ్మడిపూల గొబ్బెమ్మలూ, తలుచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోందమ్మా!"
    
    "ఔను! ఎక్కడో అక్కడ పాకలు తగలపడటం, వెంటనే గంటల బళ్ళూ" కేశవరావుకూడా కొడుకుతో కలిసి ఉత్సాహంగా చెప్పడం మొదలెట్టాడు. "చల్లకవ్వం చప్పుడికి నిద్ర మెలకువొచ్చేది. అప్పటికీ కావిడిలో కూరగాయలు తెచ్చేవాళ్ళ కేకలూ, గొబ్బెమ్మలచుట్టూ తిరిగే కన్నెపిల్లల మొగలిపూల జడలూ"
    
    యశోద పెద్ద శబ్దంతో గరిటె కిందపడేసి, "మీరూ మొదలెట్టారా? బాగానే వుంది సంబడం!" అని మూతి తిప్పింది.
    
    "ఓసారి వరదరాజాపురం వెళ్ళొద్దామమ్మా!" తల్లిచేతిని పట్టుకుంటూ అన్నాడు మాధవ్.