అతని గాయాలకు మందు పూస్తున్నప్పుడు తగిలిన చేతిస్పర్శ గుర్తుకొస్తోంది.

 

    వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ వ్రాసిన 'థాంక్స్ విత్ లవ్' అక్షరాలు జ్ఞాపకాని కొస్తున్నాయి.

 

    నోట్ బుక్ లో దాచుకున్న ఆ ప్రిస్క్రిప్షన్ పేపర్ని తీసి బెడ్ లైట్ వెలుగులో మరోసారి చూసింది.

 

    అతను తనకు మళ్ళెప్పుడయినా కన్పిస్తాడా?

 

    కనిపిస్తే బాగుండు. ఎందుకో ఆదిత్యను చూడాలని మనసుల కోరిక.

 

    తనలో తనే ఎందుకో నవ్వుకుంది శివరాణి.

 

    సరిగ్గా అదే సమయంలో....

 

    తలుపు చప్పుడైంది. భయంగా లేచి కూర్చుంది శివరాణి. మొదట ఆ చప్పుడు ఎక్కడో అనుకుంది.

 

    తర్వాత తెల్సింది....

 

    తన డోర్ ఎవరో తడుతున్నారు.

 

    ఇంత రాత్రి ఎవరై వుంటారు? డాక్టరా? కాదు... ప్రస్తుతానికి అర్దరాత్రి వేళ తన తలుపు తట్టేది డాక్టర్ ఒక్కడే...

 

    మరి....

 

    ఆదిత్య కాదు గదా....

 

    పారేసిన బట్టల కోసం వచ్చాడేమో... పగలంతా ఎక్కడో దాక్కుని రాత్రవగానే వచ్చాడేమో?

 

    రకరకాలుగా ఆలోచిస్తూ ఆదిత్యే వచ్చి వుంటాడని రూఢి చేసుకుని ఉత్సాహంగా ముందుకి అడుగేసింది ఆమె.

 

    తలుపు తియ్యగానే గుప్పుమన్న వాసనకు ఉలిక్కిపడింది శివరాణి.


    
    ఎదురుగా ఇన్స్ పెక్టర్ డేవిడ్!

 

    అతన్ని చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి ఆమెకి. గొంతు తడారి పోయింది.

 

    పాలరాతి శిల్పానికి సన్నటి ఉల్లిపొర కాగితం చుట్టినట్టుగా వున్న నర్స్ శివరాణిని చూడగానే-

 

    వెకిలిగా సకిలించి, లోనికడుగేసాడు డేవిడ్.

 

    "భయపడ్డావా? నేనే..." ఓరకంట ఆమె అందాన్ని చూస్తూ గుటకలు మింగుతూ అన్నాడు డేవిడ్.  

 

    "ఎందుకొచ్చారు?" భయంగా వెనక్కి అడుగువేస్తూ అడిగింది శివరాణి.

 

    "జస్ట్... చిన్న ఇన్ఫర్మేషన్" గోడ పక్కనున్న కుర్చీని లాక్కుని చుట్టూ చూసి సిగరెట్ తీసుకుని వెలిగిస్తూ...

 

    "కావాలి... అందుకు..." అని...

 

    "ఒంటరిగానే ఉంటున్నావా?" మళ్ళీ అన్నాడు డేవిడ్.

 

    "ఏం... ఇన్ ఫర్... మేషన్..."

 

    "క్రిమినల్ ఆదిత్య హెల్త్ సెంటర్ కొచ్చాడు... అందుకు నా దగ్గర సాక్ష్యముంది... అతనికి ఎవరు ట్రీట్ మెంట్ చేశారు... నువ్వా... డాక్టరా? చెప్పు?" ఆ గొంతు కరకుగా వుంది.

 

    ఆదిత్య హాస్పిటల్ కు వచ్చి వెళ్ళినట్టుగా తనకి, డాక్టర్ కు తప్ప మరెవ్వరికీ తెలీదు. మరెవ్వరూ చూడలేదు... మరి?!


    
    "తను రాలేదు"

 

    "లేదు... వచ్చాడు" ఆమె కళ్ళవైపు కాకుండా ఎత్తయిన గుండెల వేపు చూస్తూ అన్నాడు డేవిడ్.

 

    "అయితే నాకు తెలీదు"

 

    "చూడు నర్సమ్మా! మంచిగా అడుగుతున్నాను... మంచిగా చెప్పు. నా గురించి నీకు తెలీదు... కమాన్... టెల్ మీ... ఆదిత్య యిక్కడికి ఎన్ని గంటలకు వచ్చాడు... ఇక్కడ్నించి ఎన్ని గంటలకు బయటికెళ్ళాడు? టెల్ మీ క్విక్..." స్వరం పెంచి అడిగాడు డేవిడ్.

 

    "రాలేదంటే..." ఏదో అనబోయింది శివరాణి.

 

    డేవిడ్ తన కుడిచేతిని ఫ్యాంటు జేబులోకి పోనిచ్చి ఈనాడు పేపరుని తీసి విప్పి చూబెడుతూ...

 

    "ఈ పేపరేంటో తెల్సుకదూ... నువ్వు నీ చేతుల్తో పెంటకుప్పమీద పడేసిన పేపర్."

 

    అతను జేబులోంచి పేపర్ తీయగానే పరిస్థితి అర్ధమైంది శివరాణికి. ఆ పేపర్ని అతనెలా సంపాదించాడు?

 

    బుకాయించడమో, పారిపోవడమో తప్ప మరేం మార్గంలేదు.

 

    "నాకు తెలీదు... ఆ పేపర్ని నేను చూడలేదు. అయినా ఇన్ఫర్ మేషన్ కి అర్దరాత్రి రావడమేమిటి?"

 

    ఆ మాటకి కోపమొచ్చింది అతనికి. తనెందుకు ఉపేక్షిస్తున్నాడో తనకి తప్ప నర్స్ కి తెలీదు.

 

    గబుక్కున లేచి... "రూల్స్ మాట్లాడుతున్నావా నర్సమ్మా... బొక్కలిగిరి పోతాయ్- మర్యాదగా చెప్పు... లేకపోతే ఇదే లాకప్ రూమ్ అవుతుంది. నువ్వే మవుతావో తెల్సా?" అంటూ చటుక్కున ఆమె బుగ్గను పట్టుకుని గట్టిగా గిల్లి, అనాచ్చాదితంగా కనిపిస్తున్న గుండెలవేపు చూస్తూ "చెప్పు" అన్నాడు గట్టిగా.

 

    శివరాణి నోటంట మాటలు రావడంలేదు. వళ్ళంతా చెమటతో తడిసి పోయింది.

 

    "నీకు తెలుసనే విషయం నాకు తెలుసు నర్సమ్మా. కానీ నీకేమీ తెలియదని నన్ను నమ్మమంటున్నావ్... అవునా? నమ్ముతాను... మాట్లాడకుండా వెనక్కెళ్ళి పోతావు... నువ్వు కాసేపు మౌనంగా వుంటానంటే."

 

    డేవిడ్ చేతులు శివరాణి భుజాల మీద పడ్డాయి... కిందకు... జరుగుతున్నాయి.

 

    అతని ఉద్దేశ్యం అర్ధమైంది శివరాణికి.

 

    "మేటరాఫ్ సెవెన్ మినిట్స్" ముందుకు వంగుతూ నవ్వాడు అతను.

 

    తను తప్పించుకోక తప్పదు... ఇక్కడ్నించి పారిపోక తప్పదు.

 

    తననెలా రక్షించుకోవాలో క్షణకాలంలో ఆలోచించి... వెంటనే రియాక్టయి...

 

    "హెల్ప్... హెల్ప్... రక్షించండి... రక్షించండి..." అంటూ కేకలు వేస్తోంది శివరాణి.

 

    ఆ హఠాత్సంఘటనకు అదిరిపోయాడతను.

 

    గుట్టుగా లొంగిపోతుందనుకున్న శివరాణి..." అరుస్తుండడంతో ఆమె మెడ పట్టుకుని ఆమెను అరవకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.

 

    ఆ అరుపులు కొంచెం దూరంలో గుడిసెల్లో ఉన్న జనానికి వినిపించాయి. వాళ్ళు కేకలేసుకుంటూ లేచారు.

 

    ఆ అరుపులకి హెల్త్ సెంటర్ కు అటూ ఇటూ ఉన్న జనం లేచారు.

 

    నర్స్ శివరాణి కేకలను వారు గుర్తుపట్టారు. బాణాకర్రలు తీసుకుని ఇంటివేపు పరుగెత్తడం ప్రారంభించారు అరుస్తూ.

 

    ఆ అరుపుల్ని గమనించాడు డేవిడ్. ఈ పరిస్థితిలో వాళ్ళకు దొరికితే...

 

    తనని పచ్చడి చేయడం ఖాయం... పేపర్ వాళ్ళకు ఈ విషయం తెలిస్తే మొత్తం తన కెరీర్ నాశనమౌతుంది.

 

    "ఓ.కె. నర్స్! ఇవాళ వదిలేస్తున్నాను... కానీ... ఏదో ఒకరోజు నువ్వు నా చేతికి చిక్కుతావు గుర్తుంచుకో... మైండిట్... నువ్వెక్కడున్నా ఈ డేవిడ్ నిన్ను వెంటాడక మానడు" శివరాణిని ఓ పక్కకు తోసేసి తలుపు తెరుచుకుని బయటికొచ్చాడు.