"నేనూ, ప్రెటీ కిందకు వెళ్తాం. చీకటి పడ్డాక మీరు కిందకు రండి" ప్రెటీని తీసుకుని కిందకు వెళ్ళిపోయింది సుమబాల.

 

    నేరుగా కిచెన్ రూమ్ లోకి అడుగుపెట్టింది.

 

    "వాళ్ళు కూడా వచ్చేసినట్టున్నారు కదమ్మా... ఎంతమందికి అన్నం వండమంటారమ్మా" వినయంగా అడిగింది రమణి.

 

    "ఆచి తూచి వంట చేస్తారా ఎవరైనా? అయిదారుగురికి వంట చెయ్యి" మనసులోని చికాకును కప్పిపుచ్చలేకపోతోంది సుమబాల.

 

    "వాళ్ళిద్దరు... మీరు... నేను... పాప... అంతే కదమ్మా... అన్నం వేస్ట్ చెయ్యడం నాకిష్టం వుండదమ్మా..."

 

    "అయితే ఏం చేస్తావ్?" కోపంగా అడిగింది సుమబాల. ఆ కోపాన్ని పసిగట్టేసింది రమణి.

 

    "మీ ఇష్టమమ్మా... మీరెలా చెయ్యమంటే అలాగే చేస్తాను" వాష్ బేసిన్ వేపు వెళ్తూ అంది రమణి.

 

    ఇప్పట్నించి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం... మీరు, ప్రెటీ మాత్రమే ఈ ఇంట్లో వుంటున్నారు. ఆదిత్య చేసిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది సుమబాలకు.

 

    "అయిదుగురికి మాత్రమే వండు" చెప్పేసి హాల్లోకి వెళ్ళింది సుమబాల. ఆ మాటకి రమణి ఆశ్చర్యంగా తలెత్తి వెళ్ళిపోతున్న సుమబాల వేపు చూసింది.

 

    పనిమనిషి రమణి, వాచ్ మెన్ వీరన్న, గార్డినర్ నరసింహం... ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు.


    
    సుమబాలకు గానీ... వాళ్ళకు కనిపించకుండా మేడమీద వుంటున్న ఆదిత్యకుగానీ ఎక్కడా అనుమానాస్పదంగా కనిపించడంలేదు. రాత్రివేళ సుమబాల, ఆదిత్యల మధ్య చర్చనీయాంశం అదే.

 

    వారం రోజులు గడిచాయి.

 

    ఆ రోజు ఊళ్ళోంచి చాకలి సింగడు వచ్చాడు.

 

    ప్రెటీ బట్టలు, తన బట్టలు వేసింది సుమబాల.

 

    "అమ్మగారూ! ఈసారికి బాబు బట్టలు లేవా" అసలే సింగడిగొంతు కప్ప గొంతు. వాడలా అడుగుతున్నప్పుడు రమణి వంటగదిలోనే వుంది.

 

    "లేడు... ఆ బాబు వెళ్ళిపోయాడు" సింగడికి మాత్రమే వినపడేటట్టుగా చెప్పింది సుమబాల. సింగడు అక్కడనుంచి వెళ్ళిపోయేవరకూ మనసులో భయం భయంగా వుంది సుమబాలకు. వాడు వెళ్ళిపోయాక ఆమె మనసు కుదుటపడింది. రమణికి అనుమానం రాకుండా వుండేందుకు తనే ఆదిత్య బట్టలు ఉతికి అర్థరాత్రివేళ మేడమీద గదిలో ఆరవేసి ఫ్యాన్ ఆన్ చేస్తోంది. చాకలి సింగడిలో కూడా ఆదిత్య అక్కడ లేడనే భావం కల్గించటానికే ఆ పని చేస్తోంది వారం రోజులుగా.

 

    ఆ రోజు రాత్రి.

 

    అలవాటుగా తొమ్మిదిగంటలకే పనిమనిషి రమణి తన గదిలోకెళ్ళి పడుకుండిపోయింది.

 

    కిటికీలోంచి అవుట్ హౌస్ వేపు చూసింది సుమబాల. అవుట్ హౌస్ లైట్లు వెలగడం లేదు. అంటే... వాచ్ మెన్, గార్డినర్ పడుకున్నారన్నమాట.

 

    మేడమెట్లు దిగి నెమ్మదిగా కిచెన్ రూమ్ లోకెళ్ళి ఒక ప్లేట్లో భోజనం సర్దుకొని మెట్లెక్కుతోంది సుమబాల.

 

    వారం రోజులుగా నడుస్తున్న తంతే అది... పనిమనిషికి తెలీకుండా టిఫిను, కాఫీ, భోజనం అన్నీ తనే రహస్యంగా, స్వయంగా తీసికెళ్తోంది ఆదిత్యకు.

 

    మేడ మెట్లెక్కి కుడివేపు గదిలోకెళ్ళి తలుపేసింది సుమబాల.


    
    అప్పటికే ఆదిత్య కడుపు నకనకలాడిపోతోంది.

 

    "మిమ్మల్ని చాలా శ్రమ పెడుతున్నాను కదూ" ఆమె చేతిలోని ప్లేట్ ను అందుకుంటూ అన్నాడు ఆదిత్య.

 

    "ఇంత దూరం వచ్చాక ఇందులో శ్రమేం వుంది? మ్యూచవల్ కోపరేషన్... అంతే.. మీరు భోంచెయ్యండి" గ్లాసును పక్కన పెట్టి... అతని వేపు చూస్తూ కూర్చుంది సుమబాల.

 

    ఆదిత్య ఆరాటంగా తినటం మొదలుపెట్టాడు.

 

    "మీరు అనవసరంగా అనుమానపడ్డారా? వాళ్ళల్లో ఎక్కడా పోలీసువాసన వెయ్యడంలేదు. రేపట్నించీ మీరు అజ్ఞాతవాసానిని స్వస్తి చెప్పేస్తే బాగుంటుంది" సలహా యిచ్చింది సుమబాల.

 

    "పిచ్చికుక్క ఎప్పుడు కరుస్తుందో తెలీదు సుమబాలా! అంతా నటన అని నా నమ్మకం... మిమ్మల్ని నమ్మించడానికి."

 

    "అసలు మీరు పోలీస్ డిపార్ట్ మెంట్లో వుండాల్సిన వారు" నవ్వుతూ అంది సుమబాల.

 

    "పోలీసు డిపార్టుమెంటే నన్నిలా తయారుచేసింది" చేతులు కడుక్కుంటూ అన్నాడు ఆదిత్య.

 

    "గుడ్ నైట్" ప్లేట్ ను, గ్లాసును పట్టుకుని కిందకు దిగింది సుమబాల.

 

    బేసిన్ లో ప్లేటును పడేసి... చేతులు కడుక్కొని... అన్నం గిన్నెలోకి చూసింది. గిన్నంతా ఖాళీగా వుంది.

 

    అయిదుగురంటే అయిడుగురికే వండుతోంది పనిమనిషి.

 

    ఉదయంపూట ఎలాగో సర్దుకుపోతోంది. రాత్రిపూట మాత్రం రోజూ యిదే పరిస్థితి... మరో మనిషికి వండమంటే పనిమనిషికి అనుమానం వస్తుంది. పనిమనిషి ప్రశ్నలు వేస్తుంది. ఆ ప్రశ్నలకు తను జవాబివ్వలేదు.

 

    రోజులాగే మంచినీళ్ళు తాగి పడుకుండిపోదామనుకుంది. కానీ ఆకలికి భరించడం కష్టంగా వుంది.

 

    కిచెన్ రూమ్ తలుపు దగ్గరగా వేసేసి... కుక్కర్లో బియ్యం వేసి అన్నం వండడానికి పూనుకుంది సుమబాల.

 

    ఇలా ఎన్నాళ్ళు? ఏ స్పిరిట్ తననిలా నిలబెడుతోంది?

 

    ఎందుకో ఆమె కళ్ళంట నీళ్ళొచ్చాయి...

 

    గోడకి చేరబడి కూర్చుని ఆలోచిస్తున్న సుమబాలకు ఎందుకో ధరణి గుర్తుకొచ్చాడు.

 

    మనసంతా శతధా విచ్చిన్నమైపోయింది....

 

    ఎవరు ఆదిత్య? ఆదిత్య కోసం... తనెందుకు త్యాగం చేస్తోంది?

 

    ప్రశాంతమైన వాతావరణంలో భర్తతో ప్రశాంతమైన జీవితాన్ని తను కోరుకుంది...అన్నీ కాదనుకుని, అమర్నీ వదులుకుని వచ్చేసింది.

 

    కానీ ప్రస్తుతం...

 

    ప్రశాంతమైన వాతావరణంలో దుర్భరమైన జీవితం... చీకటి జీవితం...

 

    ఆ చీకటి జీవితంలో వెలుగులా నిలిచినవాడు... ఓ అపరిచితమైన వ్యక్తి...

 

    ఆమె కనుకొలకుల్లోంచి కారిన కన్నీటి చుక్క బుగ్గల మీదుగా జారి గుండెలమీద పడుతున్నాయి.

 

    అకస్మాత్తుగా-

 

    కిచెన్ డోర్ తెరుచుకుంటే ఉలికిపాటుగా తలతిప్పి చూసింది. ఎదురుగా ఆదిత్య.

 

    ఆదిత్యను చూడగానే పైటచెంగుతో కళ్ళొత్తుకుని లేచి నిలబడింది.

 

    ఏమిటి... ఇప్పుడొచ్చారు... ఎవరైనా చూస్తే?"