నవవర్ష సుందరి


    వర్షధారను నేను వడివడిగ వచ్చాను
    పరువంపు పైరులకు పచ్చదన మలరించి
    స్రోతస్వినీబాల చేతమ్ము విరియించి
    వడివడిగ జడిజడిగ వచ్చాను నేను.

 

    క్షితిమీద అందాల జెండాల నెగిరించి
    రసగంధ రూపాలు ప్రకృతిలో నెగడించి
    జీవనానంద సంజీవనీ దేవినై
    వేదనా బంధాల విదలించి వచ్చాను.

 

    బాధల, నిరాశల, విభేదాల తెమలించి
    పచ్చికల బయలు పయి ముచ్చటగ విహసించి
    తుహిన బిందువులతో దోబూచి పచరించి
    అరుణ కిరణాధ్వనుల హాయిగా పయనించి
    వచ్చాను వచ్చాను వర్షధారను నేను.

 

    విశ్వచైతన్య దీపికలు వెలిగించాను
    ఆత్మలోతులలో అనంత రతి నించాను
    సాధనా శిఖరాల శాంతి కురిపించాను
    అభయమని ఈ యవని నాశీర్వదించాను.

 

    కామధేనువు వోలె కదలి నే వచ్చాను
    శూన్య శుష్కాత్మలకు స్తన్య సుధ లిచ్చాను
    విరహ విధురాగ్నులకు వేణువై, వీణనై
    మదన కావ్యమరంద మధురిమలు తెచ్చాను.
    పూల డెందాలలో పొంగుపరిమళ మట్లు
    అసమశరు రసనలో మసృణ శ్రుతులు నించి
    స్వర్శాసుఖమ్ములో ప్రణయమూర్తులు హరించి
    ఫేన సంకేతాలలో నవ్యసృజనతో
    వడివడిగ వచ్చాను వర్షధారను నేను.

 

    నవ్యవర్షను నేను శ్రావ్యగుంజనలతో
    విశ్వతోముఖ సుఖావిర్భూతి తెచ్చాను
    సుమమంజరుల దేహముమీద ఆకర్ష
    ణీయ చంద రచర్చ చేయంగ వచ్చాను

 

    బాలామణుల మానసాలలో అవ్యక్త
    కాంక్షా సుధాతరంగాలు నర్తించగా
    శిలల పలకలమీద శేఫాలికా సితా
    చ్ఛాదనము కల్పించి చల్లగా వచ్చాను.

 

    నవవర్ష సుందరిని దివితేలి భువి నేలి
    గీష్మభీష్మ హలాహలోష్మహతి తొలగించి
    స్వర్ణ ఘంటా వినిక్వణ నానురణనతో
    ధరణి మా ర్ర్మొగ కెందమ్మి సిందూరముల

 

    మృత్తికా మస్తకముమీద నభిషేకించి
    ఋతువంద స్తోత్ర రుతులతో హైమాచ
    లోత్తుంగ శృంగముల నుద్ధతిని లంఘించి
    వచ్చాను వచ్చాను వర్షబాలను నేను.

                                                     రేడియో ప్రసారితం
                                       ఒరియా మూలం : కుమారి తులసీదాస్
                               విశాలాంధ్ర దినపత్రిక - ఉగాది సంచిక, 23.3.1966