"ఇదంతా నా వల్లనే జరిగిందిరా..... నేనే కారకుడ్ని. జ్యోతికి పాఠం చెప్పడానికి చాలా ఫీజే వసూలు చేశాను ఆమెనించి" భారంగా అన్నాడు మురారి కన్నీళ్ళు తుడుచుకుంటూ.
    "లేదురా, బాధపడకురా. ఆమె జీవితం అంటే ఏమిటో పాఠం నేర్చుకునేందుకు అమూల్యమైన కానుక చెల్లించింది అనుకుందాం" సుబ్బారావే మురారిని ఓదార్చవలసి వచ్చింది.
    జ్యోతికి కుడికాలుమీద ఎముక నజ్జు నజ్జు అయిపోతే అంగుళం మేర ఎముక తీసేసి ఎముకలు మళ్ళీ అతికించారు.
    దానివల్ల రెండో కాలుకంటే ఈ కాలు అంగుళం పొట్టిగా వుండడం వల్ల కుంటికాలులా నడవాల్సి వుంటుందని చెప్పారు డాక్టర్లు.
    అంతేకాక మొహాన ఎడమచెంపమీద రెండు అంగుళాలు పొడుగు, అంగుళం లోతు గాయం కుట్టడంవల్ల ఆ గాటు ఆ మొహంమీద తప్పదని చెప్పారు.
    మొత్తానికి చావుతప్ప బతికి బయటపడినందుకు సంతోషించాల్సి వచ్చింది అందరూ.
    "లేదురా. నేను అంత పౌరుషంగా మాట్లాడకపోతే అంత ఆవేశం తెచ్చుకునేదికాదు.
    అంత ఆవేశం, కోపం లేకపోతే అలా జరిగేదికాదు. ఆమెకు బుద్ధి చెప్పడానికి కాస్త నిష్ఠూరంగానే మాట్లాడాను. నీకు ఉపకారం చెయ్యాలని, ఎంత అపకారం చేశానో చూడరా" మురారి బాధకి అంతులేకుండా వుంది.
    "నాకు అపకారం చేశానని ఎందుకనుకుంటావురా? చాలా ఉపకారం చేశావురా. జ్యోతి ఇకమీదట నన్ను అసహ్యించుకోదురా ఇప్పుడు ఆమె కంటే నేను అందగాడినేగా" సుబ్బారావు కళ్ళనీళ్ళ మధ్య నవ్వుతూ అన్నాడు.
    మురారి తెల్లబోతూ చూశాడు.
    సుబ్బారావు మిత్రుడి చెయ్యి అభిమానంగా నొక్కాడు.
                                 *       *        *       *
    నెలాపదిహేను రోజుల తర్వాత జ్యోతి ఇంటికి వచ్చాక- "జ్యోతీ! ఒక శుభవార్త చెప్పనా? నేను బ్యాంక్ పరీక్షలో ప్యాసయి సెలక్ట్ అయ్యాను. ప్రొబిషనరీ పీరియడ్ లో నెలకి పన్నెండువందలు ఇస్తారు. నీవు కలలుకన్న హీరోలాంటి రూపం తెచ్చుకోలేను కానీ ఇంట్లో సోఫాలు, డన్ లాప్ లు, ఫ్రిజ్ అన్నీ ఒక్కొక్కటే కొనగలననుకుంటాను. ఓ రెండేళ్ళు టైమివ్వు జ్యోతీ" అన్నాడు సుబ్బారావు జ్యోతి పక్కన కూర్చుని.
    జ్యోతి సుబ్బారావు మొహం చూడలేనిదానిలా చేతులలో మొహం దాచుకుని హృదయ విదారకంగా ఏడవసాగింది.
    సుబ్బారావు చలించిపోయాడు.
    ఆమె తలని గుండెలకి అదుముకుని తల నిమరసాగాడు ప్రేమగా.
    "ఊరుకో జ్యోతీ! ఏడవకు. కన్నీరు కార్చేరోజులు అయిపోయాయి. ఇంక మళ్ళీ ఆ అధ్యాయం లేదు" బాధగా అన్నాడు.
    జ్యోతి సుబ్బారావు గుండెలకి ఇంకా ఇంకా మొహం దించుకుని వుండిపోయింది అతని మొహం చూసే శక్తిలేనిదానిలా.

                              - : శుభం : -