వనితా... నీకు వందనం

 

 

డాటర్ ఈజ్ నాట్ ఏ టెన్షన్..డాటర్ ఈజ్ ఈక్వల్ టూ టెన్ "సన్స్"  ఈ మధ్య కాలంలో తరచూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ లక్షల్లో లైకులు, షేర్లు కొట్టించుకుంటోంది ఈ కొటేషన్. వినడానికి, చదవడానికే కాదు ఈ కొటేషన్ అక్షర సత్యం కూడా. మన సమాజంలో ఆనాదిగా వస్తోన్న కొడుకుల ఆధిపత్యం క్రమంగా తగ్గిపోతోంది. తల్లిదండ్రులు కుమార్త-కుమారులను వేర్వేరుగా చూడటం తగ్గుతోంది ఈ మధ్య. తల్లిదండ్రుల ప్రోత్సాహం, సమాజం నుంచి వస్తోన్న అవకాశాలను అందిపుచ్చుకుని మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. మగవారికి పోటిగా వ్యవస్థలను సైతం శాసించే స్థాయికి అతివలు పోటీపడుతూ ప్రపంచ శక్తివంతమైన మహిళల్లో భారతీయ మహిళలు కూడా స్థానం సంపాదించారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకుకు మొదటి మహిళా ఛైర్మన్‌..అంతేకాదు ఈ స్థాయికి చేరిన అతి పిన్న వయస్కురాలు అరుంధతి భట్టాచార్య. ఆమె నాయకత్వంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి వృద్ధి సాధిస్తోంది.

 

ఎన్నో ఆశలతో ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత క్రీడాకారులంతా ఒట్టి చేతులతో దేశానికి తిరిగి వస్తే..ముగ్గురమ్మాయిలు ఇండియా పరువు కాపాడారు. వారే పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్‌ వీరి ప్రతిభ కారణంగా దేశం సగర్వంగా తలెత్తుకోగలిగింది.  ఈ విజయాలన్ని ఊరకే రాలేదు..అవమానాలు..ఛీత్కారాలు..ఆడపిల్లలని చిన్నచూపులు..అన్నింటిని మౌనంగా భరిస్తూ కసిగా ముందుకు వెళ్లారు. నిరాశ, నిస్పృహలకు గురికాకుండా లక్ష్యాలను ఎంపిక చేసుకుని సాధించే వరకు కృషి చేస్తే ఏదో ఒక రోజు మనం ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతామన్నది వీరు నేర్పే పాఠం. ఓటములు, అవమానాలు ఎదురైన ప్రతిసారి నేలకు కొట్టిన బంతిలా మరింత ఉత్సాహంగా కృషి చేస్తే లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. వీరి ప్రేరణతో కొత్త సంవత్సరంలో మహిళలు తమ తమ రంగాల్లో విజయబావుటా ఎగురవేయాలని తద్వారా దేశానికి పేరు తీసుకురావాలని ఆశిద్దాం.