పొద్దు పొడవని వయసులో పొద్దుగూకని సౌభాగ్యపు మరకలా రేవతి రూపం దారుణమైన అంతర్మధనానికి గురిచేస్తుంటే జ్ఞానేంద్రియాలు చచ్చుబడిపోతున్నట్లు వెళ్ళి కారులో కూర్చుండిపోయాడు శ్రీహర్ష.

 

    "ఏమిటిదంతా?"

 

    సమీపంలో కూర్చున్న రేష్మీని కాదు... తనను తానే ప్రశ్నించుకున్నాడు శ్రీహర్ష.


                                                             *  *  *


    "ఈ దేశంలో శమంత్ లు బ్రతకరు, కాదు బ్రతకనివ్వరు శ్రీహర్ష" నెమ్మదిగా అంది రేష్మి.

 

    ఇంటికి తిరిగివచ్చిన అరగంటసేపట్నుంచి నిశ్శబ్దంగా కూర్చున్న శ్రీహర్ష ఉద్విగ్నంగా తలపైకెత్తాడు. "ఇట్స్ షీట్ మిస్ రేష్మీ... ఇది శమంత్ స్వయంకృతం... యస్...తన పరిధిని మరిచిపోయిన ప్రతివ్యక్తి కథ యిలాగే ముగుస్తుంది. ముగిసి తీరాలి. దట్సాల్... అవును రేష్మీ. ప్రత్యర్థులు బలవంతులని అతడికి తెలుసు. తను వేటాడాలనుకొంటున్న నేరవ్యవస్థ యీ దేశమంత విస్తరించిందనీ అతడికి అనుభవమే... అయినా తను రెచ్చిపోయాడు. కనీసం తనపై హత్యాప్రయత్నం జరిగాకన్నా జాగ్రత్త పడకుండా పొడిగించబడిన తన జీవితకాలాన్ని ప్రత్యర్థులతో పోరాటానికి అంకితం చేస్తానంటూ... డేమిట్... యిప్పుడో నిర్భాగ్యురాలికి... ఓ పసికందుకి అన్యాయం చేశాడు."

 

    రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయింది క్షణంపాటు. "జీవితమంటే రాజీపడి బ్రతకటం కాదు శ్రీహర్షా"

 

    "సమర్ధత లేనప్పుడు రాజీపడి తీరాలి"

 

    "సమర్థతంటే..."

 

    "పోరాడి గెలిచే శక్తి"

 

    "గెలుపూ ఓటములన్నవి తెలిసేది పోరాడటం ప్రారంభిస్తేనేగా"

 

    "శత్రువు శక్తి అంచనావేయడం చేతకానివాడు సైనికుడు కాడు"

 

    "మీకు తెలీదు శ్రీహర్షా. ఈ దేశంలో వ్యక్తులకన్నా సంఘం శక్తివంతమైన దైతే సంఘంకన్నా బలమైనది చట్టం, శమంత్ అలాంటి చట్టానికి ప్రతినిధి - కాబట్టే నిజానికి అందరికన్నా బలవంతుడు. ఆ బలంతోనే పోరాటం సాగించాలనుకున్నాడు. ఓడిపోయాడు. ఇక్కడ మనం తప్పుపట్టాల్సింది శమంత్ ని కాదు శ్రీహర్షా. అంత బలమైన చట్టాన్ని బలహీనపరుస్తున్న యస్పీ శ్యాంసుందర్ లాంటి వ్యక్తుల్ని... యస్.

 

    అప్పుడు చూశాడు శ్రీహర్ష. రేష్మి కళ్ళనుంచి నీళ్ళు చిమ్ముతున్నాయి. "ఈ సత్యం శమంత్ అనుభవపూర్వకంగా తెలుసుకునేసరికి అతడి జీవితమయిపోయింది శ్రీహర్షా. కాని నేను గ్రహించాను కాబట్టే నేను చట్టాన్ని కాక మీలాంటి వ్యక్తి అండకోసం చూసింది.

 

    రెండు లిప్తల నిశ్శబ్దం.

 

    "నా వాళ్ళంటూ నాకెవరూ లేని ఆడదాన్ని శ్రీహర్షా! కాని నాకు అందముంది. ఆ అందంతోనే మోడలింగ్ సామ్రాజ్యాన్ని యువరాణిలా ఏలిన అనుభవముంది. కాని ఏం సాధించాను? అవసరానికి మించిన డబ్బు, అందం మిగిల్చిన శత్రువులు. ఇప్పటికయినా కొన్ని వాస్తవాల్ని మీకు తెలియజెప్పకపోవటం నా నేరమౌతుంది శ్రీహర్షా!" ఓ క్షణం ఆగి చెప్పటం ప్రారంభించింది "నాకెవరూ లేకపోవచ్చు. కాని నావాడు అనుకున్న మనిషితో కలిసి బ్రతకాలన్న ఆలోచన ఉంది. ఆ ఆలోచనతోనే నాపై సంధించబడుతున్న సమ్మోహనాస్త్రాల్ని తెలివిగా ఛేదించుకుంటూ నన్ను నన్నుగా ఇష్టపడే మనిషికోసం నిరీక్షించడం ప్రారంభించాను. సరిగ్గా అదేసమయంలో నాకో ఆఫర్ వచ్చింది. అదే ఇప్పుడు శమంత్ ని సంహరించిన వ్యవస్థనుంచే... పెళ్ళికాదు శ్రీహర్షా! అసాధారణమైన అందగత్తెనయిన నేను బ్లూ ఫిలింలో నటించాలి. అలా వాళ్ళకి కోట్లను సంపాదించి పెట్టాలి. కాదన్నాను. అవసరమయితే ఈ దేశంనుంచి పారిపోవాలనుకున్నాను. జీవితంపై రోత. నేను కోరినా నన్ను కాపాడలేని ఈ పోలీస్ వ్యవస్థపై కసి. ఒక్క మనిషి...మీలాటి ఒక్క వ్యక్తి నాకు తారసపడినా నేను...నేను మున్నీని కోల్పోయేదాన్ని కాదు"

 

    ఎక్కడో ఓ విస్పోటనం...

 

    చీకటి పేగుల్ని బ్లేడ్లతో కోస్తున్నంత కలవరపాటు...

 

    "మున్నీ నా ప్రాణం. కొన్ని నెలల క్రితం ఏ ఏడ్ ఫిల్మ్ లో నటించాలని నేను ఫ్రాన్స్ కి వెళ్ళినప్పుడు యాదృచ్చికంగా ఓ గేంగునుంచి తప్పించుకుని నా హోటలు గదిని చేరుకుంది. ఆ పసికందు ఎవరో, యే దేశానికి చెందిందో అర్థంకాలేదు. అమ్మకి జబ్బంది. నాన్న ఎక్కడుంటాడో తెలీదంది. నన్ను చంపేస్తారు ఆంటీ అంటూ నన్ను చుట్టేస్తే ముందేం చేయాలో పాలుపోలేదు. పోలీసులకి అప్పచెప్పడం నా అభిమతం కాలేకపోయింది శ్రీహర్షా! ఎందుకంటే తండ్రెక్కడున్నాడో తెలీని ఆ పాపకి తల్లే ఆసరా అయితే ఆ తల్లీ నాలాంటి ఆడదే కాబట్టి రక్షించే అవకాశం నేనే తీసుకోవాలనుకున్నాను. నా పలుకుబడితో ఈ దేశం తీసుకొచ్చాను. ఒకనాటి జూలీ నా జీవితంలో మున్నీగా స్థిరపడిపోయింది.

 

    నా బ్రతుకులో ఓ భాగమైపోయింది. ఆ ఆనందమూ నాకు శాశ్వతంకాలేదు శ్రీహర్ష. నన్ను సాధించటానికి జూలీని ఆయుధంగా భావించిన వ్యవస్థ నా యవ్వనానికి ఖరీదుగా జూలీని కిడ్నాప్ చేసారు.

 

    తన మొహంలో భావాలు కనిపించకుండా భావరహితంగా వింటున్నాడు శ్రీహర్ష.

 

    "ఏం చేయాలో నాకు పాలుపోలేదు. నేను కోరి రక్షించి తీసుకొచ్చిన జూలీ నా మూలంగా అన్యాయంకావడం నాకిష్టంలేదు. అందుకే ఆలోచించుకోవటానికి కొన్ని రోజుల గడువడిగాను. ఈలోగా మీలాంటి ఓ వ్యక్తికోసం గాలించటం ప్రారంభించాను."

 

    "జూలీ ఖచ్చితంగా ఎక్కడుందో తెలుసా?"

 

    "శాఖోపశాఖలుగా విస్తరించిన ఆ వ్యవస్థలో అంతా నాకు ప్రత్యర్థులే అయినప్పుడు ఖచ్చితంగా ఎక్కడున్నదీ ఎలా చెప్పగలను? ఈ దేశ ఉపప్రధాని మొదలుకొని ఈ జిల్లా యస్పీ శ్యాంసుందర్ దాకా అంతా నాకు శత్రువులే అయితే నేను ఎవరినుంచి సహాయాన్ని ఆశించగలను!"

 

    "అవసరంలేదు రేష్మి! మీరెవరి సహాయాన్నీ అర్థించనక్కర్లేదు" క్షణమాగి అన్నాడు "థాంక్యూ రేష్మీ!"

 

    "దేనికి?" నిశ్చేష్టురాలయింది.

 

    ఒక్క జూలీనేకాక మరెందరో జూలీలు, రేష్మీలు, రేవతి, లల్లూలు ఇకముందు ఆ నేర ప్రపంచంలో బలికాకుండా నాకు స్ఫూర్తినందించినందుకు."

 

    రేష్మీ చూస్తూనే వుంది. కాని అప్పటికే నిశ్శబ్దంగా బయటికి నడిచాడు శ్రీహర్షా ది నొటోరియస్ ఇంటర్నేషనల్ కిల్లర్.


                                    *  *  *


    అపరాత్రి దాటి అరగంట కావస్తుంది.

 

    దట్టంగా ఆవరించిన చీకటిలో సముద్ర కెరటాలు చిత్రమైన శబ్దాన్ని చేస్తున్నాయి.

 

    మృత్యునాదంలా వీస్తున్న గాలి అలల సంగీతం శ్రీహర్షని కిరాతకుడిగా మార్చుతుంటే నిశ్శబ్దంగా అనుసరిస్తున్న రాణాతో అన్నాడు "ఎస్పీ శ్యాంసుందర్ ప్రెస్ స్టేట్ మెంట్... ...అదే శమంత్ హత్యచేసింది లిబియా టెర్రరిస్టులన్న వార్థ రాత్రికే దినపత్రికల్లో పబ్లిష్ అవుతుంది కదా!"