"ఖచ్చితంగా" అన్నాడు అభిరాం.
    
    "కేవలం మంత్రశక్తితోనే వ్యాధి నయం చేయగలిగినప్పుడు ఆహార విషయం నువ్వు హ్సుప్పిన పరిమితిలెందుకు?" ప్రశ్నించాడు మహదేవ్.
    
    అభిరాంకేం సమాధానం చెప్పాలో తోచలేదు. అందుకే ఆలోచిస్తుండి పోయాడు.
    
    "కాబట్టి డియర్ అభిరాం.... నా ఉద్దేశ్యం ప్రకారం పచ్చకామెర్ల రోగులకి చికిత్సగా వారు తీసుకోమనే డైట్ లోనే అసలు కిటుకు అంతా వుండొచ్చు" అన్నాడు మహదేవ్.
    
    "అంటే...?" తెల్లబోయాడు అభిరాం.
    
    "అంటే ఏముంది...? వాళ్ళు రోగికి తీసుకోమనే ఆహారంలోనే వ్యాధిని నిరోధించే గుణం వుండవచ్చు. ఇక సబ్బునీటిలో చేతులు ముంచడం, తెల్లసున్నం లో కళ్ళముందు మూడుసార్లు వుంచడం, మంత్రపఠనం, వైద్యం జరిపించుకునేటప్పుడు రోగి పాదరక్షలు ధరించకూడదనటం అంతా షో..."
    
    "అంటే మంత్ర తంత్రాలు, మానవాతీత శక్తులులాంటివి ఏవీ లేవంటావ్?" కుర్చీలో వెనక్కి జారపడి అన్నాడు అభిరాం.
    
    "నిస్సందేహంగా!" అన్నాడు మహదేవ్.
    
    "నువ్వు పొరబడుతున్నావ్ మహదేవ్."
    
    "నో..." నొక్కి పలికాడు అతను.
    
    "మంత్రాలు, మానవాతీత శక్తులు లేవనటానికి మన శక్తి చాలదు. అపరిమితమైన ఈ భూగోళంలో పరిమితమైన ప్రదేశంలోనే సంచరించే మనకు వాటి గురించి తెలియకపోవచ్చు. అంతమాత్రాన అవి లేవని నిష్కర్షగా అనటం సమంజసం కాదు."
    
    "నిజమే! కాని దేనికయినా రీజనింగ్ అనేది వుండాలిగా..." అన్నాడు మహదేవ్.
    
    "అంటే రీజన్ కీ, హేతువుకీ అందని విషయాలు మానవాతీత శక్తులని నమ్ముతావుగా అయితే విను.... నూట పదకొండు సంవత్సరాల క్రితం జరిగిన ఓ అపూర్వ సంఘటన.... ఇంత కాలమైనా దానికి నువ్వు నమ్మే సైన్స్ కారణాన్ని కనుక్కోలేకపోయింది" ఉత్సాహంగా అన్నాడు అభిరాం.
    
    "ఏమిటది....?" ఆశ్చర్యంగా అడిగాడు మహదేవ్.
    
    "1886వ సంవత్సరంలో షిర్డీసాయిబాబా ఉబ్బసం వ్యాధికి గురయ్యారు. దాని నుంచి విముక్తులయ్యేందుకు, ఆయన తన ప్రాణాన్ని సమాధిలో వుంచాలనుకుని బాబా భక్తుడైన మహాల్సాపతితో 'నా శరీరాన్ని మూడు రోజులు కాపాడండి. అప్పుడు నా శరీరంలో ప్రాణముండదు. కానీ దానిని మృత్యువుగా పరిగణించవద్దు...." అన్నారు.
    
    ఆ రాత్రే బాబా శరీరం అచేతనమయింది. ఎందరో డాక్టర్లు బాబాని పరీక్షించారు. ఆయన శరీరంలో ఊపిరి నిలిచిపోయిందని, నాడి కూడా ఆగి పోయిందని, గుండె కొట్టుకోవటం కూడా ఆగిపోయిందని, కాబట్టి బాబా పరమపదించారని తేల్చేశారు.
    
    దాంతో ఆ వూరి వాళ్ళంతా బాబా శరీరాన్ని సమాధి చేయబోతే ఆయన భక్తుడైన మహాల్సాపతి అడ్డుకున్నాడు. కంటికి రెప్పలా మూడు రోజులూ బాబా శరీరాన్ని కాపాడాడాయన.
    
    సరిగ్గా మూడురోజుల తర్వాత తెల్లవారుజామున మూడుగంటలకు బాబా శరీరంలోకి ప్రాణం ప్రవేశించినట్లు తెలుసుకున్నాడు మహాల్సాపతి.
    
    శ్వాస, నాడి, గుండె, పనిచేయకపోవడాన్నే 'మరణం' అంటారు కదా! మరిదెలా సాధ్యమయింది? ఈ విషయంలో మన అడ్వాన్స్ డ్ సైన్స్ ఏం జవాబు చెప్పగలుగుతుంది?" రెట్టిస్తూ అడిగాడు అభిరాం.
    
    "ఓకే... ఓకే.... నీతో వాదించటం ఆ బ్రహ్మతరం కూడా కాదు. ఇంకా విషయాన్ని వదిలేయ్" చిన్నగా నవ్వుతూ అన్నాడు మహదేవ్.
    
    "సమాధానం తెలియని వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ పళ్ళికిలించకూడదు" అతను నవ్వటంతో రోషంగా అన్నాడు అభిరాం.
    
    "సరి.... సరి.... ఏమిటి అందులో రహస్యం?" నమ్రత నటిస్తూ అడిగాడతను.
    
    "అదే మానవాతీతశక్తి" మహదేవ్ నే చూస్తూ అన్నాడు అభిరాం.
    
    "మానవాతీత శక్తంటే...?"
    
    "మానవుడికి అతీతమైన శక్తులు అవి ఈ సృష్టిలో చాల వున్నాయి. సైన్స్ కి కూడా అందని శక్తులవి...." స్థిరంగా అన్నాడు అభిరాం.
    
    "శ్వాస, నాడి, గుండె పని చేయకపోవడాన్నే డాక్టర్లు చావుగా పరిగణిస్తారని.... అలా పని చేయకుండా మూడు రోజులుండి తిరిగి బతికిన వ్యక్తి బాబా అని నవ్వుకున్నావు. ఇది నిజమే- దీన్ని నేనే కాదు, చాలామంది శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యంతో అంగీకరించారు. నీకొక విషయం తెలుసా?
    
    మనిషి శరీరంలో థర్డ్ డైమెన్షన్ లో ఇంకో శక్తి ప్రవహిస్తుంటుందనీ, దాన్ని 'కీ' అంటారనీ, థర్డ్ డైమెన్షన్ లో కరెంట్ లా ఈ శక్తి ప్రవహిస్తూ వుంటుంది. చైనావారు దీన్ని 'మెరీడియన్' అన్నారు. ఈ మెరీడియన్ ని కంట్రోల్ చేయడం ద్వారా వ్యాదుల్ని నయం చేయవచ్చని చైనీస్ వైద్యశాస్త్రం నిరూపించింది.
    
    శ్వాస, నాడి, గుండె పనిచేయకపోవడమే మరణం కాదు. మనవ శరీరపు థర్డ్ డైమెన్షన్ లో ప్రవహించే శక్తీ మెరీడియన్ ఎప్పుడు పోతుందో అప్పుడే అసలైన మరణం.... అంతేకాదు.... సైన్స్ ప్రకారం శరీరంలోని ప్రోటోప్లాజం నశించనంత వరకూ మనిషి ఎన్నిసార్లు చనిపోయినా, తిరిగి బ్రతకడానికి అవకాశం వుంది. ఈ ప్రోటోప్లాజంలో జరిగే మార్పుల్ని అరికట్టగలిగితే అసలు వృద్దాప్యమనేదే వుండదు" సాలోచనగా అన్నాడు మహదేవ్.
    
    అభిరాం మౌనంగా వుండిపోయాడు.
    
    "సాయంత్రం నీ ప్రోగ్రాం ఏమిటి?"
    
    అతని మూడ్ ని మార్చడానికి అడిగాడు మహదేవ్.
    
    "ఏముంది? రొటీన్ ఇంటికెళ్ళడం, కాస్సేపు రీడింగ్, భోంచేసి పడుకోవటం."
    
    "ఆదివారం కదా! ఎటైనా వెళదాం ప్రోగ్రాం ఫిక్స్ చేయకూడదు?"
    
    "ఎక్కడికెళదాం?"
        
    "నీ యిష్టం! రోజువారీ పనులతో విసిగిపోయాను. రేపంతా బయట గడిపి కాస్త రిలాక్స్ కావాలనుంది."
    
    "సరే! రేపుదయం ఎనిమిదింటికి మా ఇంటికొచ్చెయ్...." ఏదో ఆలోచించి ఒక్కక్షణం ఆగి అన్నాడు.