చుట్టూ చూస్తే అమ్మ కనిపించలేదు. నేను నీళ్ళకోసం వెతుకుతూ తలుపు తెరుచుకుని బైటికి వెళ్లాను.

 

    అప్పుడే డాక్టర్ బెడ్ రూంలోంచి అమ్మ బైటికి వస్తూ కనిపించింది. నన్ను చూసి కంగారుపడింది. తలవంచుకుంది.

 

    నేను ఏమీ జరగనట్లే వెళ్ళి అక్కడున్న వాటర్ బాటిల్ తీసుకుని తమ్ముడి దగ్గర కొచ్చేశాను. లోపల ఏం జరిగిందో నేను ఆలోచించదలచలేదు.

 

    వాడు మా అసహాయతని ఆసరాగా తీసుకుని ఫీజ్ ఆ విధంగా అమ్మనుండి వసూలు చేసి ఉండొచ్చు. లేదా ఏమీ జరగకపోయి ఉండచ్చు! దానిగురించి నేను నా బుర్ర పాడుచేసుకోదలుచుకోలేదు.

 

    అతడు ఆ టైంలో మా తమ్ముడి ప్రాణం కాపాడాడు. ఎన్నోరాత్రులు మా అమ్మ నమ్మినవాడు ఆమెతో రాత్రులు గడిపాడు. అందుకు మాకు తిండీ బట్టాయిస్తూ వచ్చాడు. వాడు అలాగే సహాయం చేసి కావలసింది తీసుకున్నాడు. ఎక్కడైనా మగాడిది ఒకటే బేరం!

 

    తెల్లవారాక ఆయన ఇచ్చిన మందులతో, తమ్ముడ్ని తీసుకొని ఇంటికి వచ్చేశాం. జరిగినదాని గురించి నేను అమ్మతో ఒక్కమాట కూడా అనలేదు. అమ్మ నాకు చెప్పాలని అనుకోలేదు!

 

    ఇద్దరం ఆ సంఘటన రికార్డ్స్ లోనుండి తుడిచెయ్యడానికే ప్రయత్నించాం.

 

    బహుశా అప్పుడే నాలో ఏదీ పట్టించుకోకుండా నా పని నేను చేసుకోవడానికి అంకురం పడి ఉంటుంది.

 

    ఆ రాత్రి అమ్మ నాతో 'మగపిల్లాడివైనా బావుండేది' అన్నమాట నా మనసులో ముద్రపడిపోయింది. మగపిల్లాడు ఉంటే ఏమేంచేసేవాడో ఆలోచిస్తూ అవన్నీ చేసి ఆ లోటు అమ్మకి తీర్చడానికి ప్రయత్నించేదాన్ని.

 

    కాలేజీలో ఒకడ్ని కొడ్తే నాకు రౌడీ అని పేరొచ్చింది. అప్పటినుండీ ఆ పేరు నిలుపుకోడానికి నానాతంటాలు పడ్డాను.

 

    కొన్ని కొన్నిసార్లు కావాలని కరుకుగా, మొండిగా ప్రవర్తించేదాన్ని!

 

    నాన్న ఒకరోజు 'ఆడపిల్లలా ప్రవర్తించు ఏమిటా వేషాలు?' అన్నాడు.

 

    "నీలా ఇంకో మగాడెవడూ నన్నూ మోసం చెయ్యకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నాను" అన్నాను.

 

    అమ్మ నన్ను చెంపదెబ్బ కొట్టింది.

 

    "ఎందుకు కొట్టావు? నువ్వు చేసిన తప్పుకి నేనూ తమ్ముడూ శిక్ష అనుభవిస్తున్నాం. తాళి కట్టించుకోకుండా ఆయన్ని నమ్మి ఎవరు రమ్మన్నారు? చూడు. లోకం మనని ఎలా చూస్తోందో" అని అరిచాను.

 

    "నేనేం తక్కువచేశాను మీకు?" అన్నాడు నాన్న.

 

    'మొన్న నీ యింట్లో సత్యనారాయణవ్రతం చేసి నీ భార్యతో పీటలమీద కూర్చుని ఫంక్షన్ చేశావు. అలా మా అమ్మతో చేస్తావా? మమ్మల్ని ధైర్యంగా నీ యింటికి తీసుకెళ్ళగలవా? నీ కొడుకులని కార్లో స్కూల్ నుండి ఇంటికి తీసుకెళుతూ దారిలో తమ్ముడు కనిపిస్తే కారాపి ఎక్కించుకుని, బుగ్గలమీద ముద్దులు పెట్టుకోగలవా?' అన్నాను.

 

    'లిల్లీ...నీకేమన్నా పిచ్చా? పెద్దా, చిన్నా లేకుండా ఏవిటామాటలు' అని అమ్మ అడ్డుపడబోయింది.

 

    'నువ్వు ఉండు. ఇంకో అయిదారేళ్ళుపోయాకా అమ్మకి వయసు అయిపోతే కూడా నువ్వు ఆవిడ్ని ఇప్పటిలా పోషిస్తావని ఏమిటి గ్యారంటీ? ఏమీలేదు. అంతా గాల్లో దీపంలాంటి వ్యవహారం!' అన్నాను.

 

    నాన్న కోపంగా అరుస్తాడనుకొన్నాను. కానీ నావేపు విస్మయంగా చూస్తూ ఆలోచనలోపడ్డాడు. అమ్మ భవిష్యత్తు తలుచుకునేమో వెక్కి వెక్కి ఏడ్చింది.

 

    చాలాసేపటి తర్వాత నాన్న అమ్మతో 'మీరు ఇక్కడ ఉండొద్దు. ఉరవకొండలో నా యిల్లొకటి ఉంది. అది నీపేరున రిజిస్టర్ చేయిస్తాను! ఒకవాటా అద్దెకికూడా యివ్వవచ్చు. నేను వస్తూ పోతూ వుంటాను.

 

    'నెలనెలా నేను ఇచ్చేది యివ్వనని కాదు! మీకు నమ్మకం కోసం ఈ ఏర్పాటు. నేను నీకూ పిల్లలకూ అన్యాయం చెయ్యను సావిత్రీ! నువ్వు నాకోసం యేం త్యాగం చేశావో నాకు తెలుసు' అన్నాడు.

 

    అమ్మ కృతజ్ఞతగా చూసింది.

 

    ఆయన నా తలనిమిరి 'నాకు ఇద్దరు కూతుళ్ళు! అక్కడ ఒక కూతురు రేపటిగురించి ఆలోచనే లేకుండా ఫ్యాషన్సూ డిస్కోలూ అంటూ ఒళ్ళుమరిచి ఖర్చుచేస్తూ బాధ్యతారహితంగా ఎంజాయ్ చేస్తోంది. ఇక్కడ ఒక కూతురు భవిష్యత్తు గురించి అభద్రతా భావంతో కనిపించిన ప్రతి పుడకా పెట్టి తన చుట్టూ పంజరం నిర్మించుకుంటోంది. నువ్వు నా కూతురివి కాకుండా ఇంకెవరి కూతురివో అయితే నీ తెగువకీ, తెలివికీ మెచ్చుకుని ఉండేవాడ్ని. ఇప్పుడు మాత్రం నీ దృష్టిలో నా విలువ తెలిసి సిగ్గుపడ్తున్నాను' అన్నాడు.

 

    ఆయనలో ఉన్న ఆ సిన్సియారిటీ నాకూ అబ్బింది. అలా మీ ఊరుచేరాం. అమ్మకూడా ఖాళీగా లేకుండా అక్కడ చిన్న రెడీమేడ్ బట్టలషాప్ పెట్టింది. నాన్నది ఎలాగూ బట్టల వ్యాపారమే!

 

    తమ్ముడ్ని ఇంజనీరింగ్, నన్ను ఎం.బి.ఏ. చెయ్యడానికీ నాన్న చాలా సహాయం చేశాడు. ఇప్పుడు అనిపిస్తుంది నేను ప్రతి నిమిషం ఆయనపట్ల కృతజ్ఞత చూపిస్తూ ఆయన్ని బాగానే శిక్షించానని! ఎందుకంటే... నాకు వీసా వచ్చినరోజు అందరికన్నా ఆయనే యెక్కువగా సంతోషించాడు.

 

    పెద్ద కేక్ తెచ్చి నాచేత కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు. ఆ తర్వాత అందరం బయట డిన్నర్ కి వెళ్ళాం.

 

    చెన్నైలో ఆయన మిత్రుడొకడు కనబడ్డాడు. ఇద్దరూ మాట్లాడుకుంటున్న సందర్భంలో ఆయన తన కూతురు ఎమ్.ఎస్. చెయ్యడానికి అమెరికా వెళుతోందని గర్వంగా చెప్పాడు. అమ్మా, తమ్ముడూ టేబుల్ దగ్గర ఉన్నారు. నేను నాన్నపక్కనే ఉన్నాను. నాన్న గర్వంగా 'మా అమ్మాయి కూడా...' అని అంటూ ఆగిపోయాడు.