తరగడమే కాదు... పెరగడమూ అవసరమే!

 

 

అందంగా ఉండాలంటే స్లిమ్ గా, నాజూగ్గా ఉండాలి. అయితే సరిపడేంత బరువు కూడా ఉండాలి. నాజూకుతనం మోజులో పడి ఉండాల్సినంత బరువు ఉండకపోతే చాలా సమస్యలు వస్తాయి. అయితే బరువు తగ్గడం ఎంత సమస్యో కొలెస్ట్రాల్ పెరగకుండా ఆరోగ్యకరంగా బరువు పెరగడం కూడా అంతే సమస్య. కాబట్టి చక్కని ప్రణాళిక వేసుకుని, ఓ పద్ధతి ప్రకారం ఆహారం తీసుకుంటే ఫలితముంటుంది. అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటారా... ఇదిగో ఇదే!

 

* ఏమాత్రం ప్రమాదం లేకుండా బరువు పెరగేలా చేయగల ఆహారమంటే ఓట్స్ దే ప్రథమ స్థానమని చెప్పాలి. దీనిలో ఉండే పిండి పదార్థాలు బలాలన్నిస్తాయే తప్ప చెడు చేయవు. పైగా దీన్నిండా ప్రొటీన్లు, పీచు పదార్థాలు కూడా ఉంటాయి. 

* రొట్టెలు కూడా బలవర్ధకమైన ఆహారం. బైటికెళ్లి నాన్ లు, బటర్ నాన్ లు తినకుండా ఇంట్లోనే జొన్నపిండితో కానీ రాగిపిండితో కానీ రొట్టెలు చేసుకుని తింటే బలానికి బలం, ఆరోగ్యం కూడా.
 

* లీటరు పాలలో ముప్ఫై గ్రాముల ప్రొటీన్లు ఉంటాయట. కాల్షియం కూడా ఉంటుందట. దీనిలో ఉండే కొవ్వు పదార్థాలు బరువు పెరిగేలా చేస్తాయట. అయితే ఎంత బరువు పెరగాలి అన్నదాన్ని బట్టి తీసుకునే మోతాదు ఉండాలి. కాబట్టి ఫుల్ క్రీమ్ మిల్క్ జోలికి పోకుండా... మామూలు పాలనే తగినంత మోతాదు తీసుకోండి.
 

* కోడిగుడ్డులో కూడా ప్రొటీన్లు అధికంగా ఉండాలి. కాబట్టి ఎగ్ ని మీ డైట్ లో మిస్సవ్వకండి.
 

* శరీరానికి హాని కలిగించని కొవ్వు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారమంటే పెరుగని చెప్పొచ్చు. పైగా ఇది జీర్ణశక్తిని కూడా మెరుగు పరుస్తుంది. కాబట్టి పెరుగుకు పెద్ద పీట వేస్తే పనైపోతుంది.
 

* ఆలివ్ ఆయిల్ లో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇవి గుండెకు ఎటువంటి హానీ చేయవు. కాబట్టి ఈ నూనెను వాడండి.
 

* ఆహారంలో నట్స్ ఎక్కువగా ఉంటే త్వరగా బరువు పెరుగుతారు.

* కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే దుంపలు, తృణధాన్యాలను తీసుకోండి. అయితే ఇవి మోతాదు మించితే ప్రమాదం. కాబట్టి ఎప్పటికప్పుడు బరువును చెక్ చేసుకుంటూ, అధిక బరువు పెరగకుండా చూసుకోవాలి. 

 

* సాల్మన్ ఫిష్ తింటే త్వరగా బరువు పెరుగుతారని అంటారు. అవకాశం దొరికితే తినకుండా వదలకండి. 

 

* పీనట్ బటర్ కూడా త్వరగా బరువు పెరిగేలా చేస్తుంది. కాబట్టి దీన్ని కూడా ఆహారంలో చేర్చండి. 


    ఇంకా బాదం, జీడిపప్పు, అవిశె గింజలు, అరటిపండ్లు, కొబ్బరి పాలు... ఇవన్నీ బరువు పెరగడానికి దోహదపడేవే. అయితే గుర్తుంది కదా! అతి ఎప్పుడూ ప్రమాదకరమే. బరువు పెరగాలి కదా అని పద్ధతి లేకుండా ఎడా పెడా ఎంతపడితే అంత తినేయొద్దు. ఏది ఎప్పుడు ఎంత మోతాదులో తీసుకోవాలో డాక్టర్ అని అడిగి తినండి. 


-Sameera