"సో... డియర్ ఫ్రెండ్స్!" తన ఓటమిని సైతం అందరిముందూ సగర్వంగా అంగీకరించాలనే మొండితనం సూరి గొంతులో- "ఒక ఓటమిలాంటి జీవితాన్ని గెలుపుగా అన్వయించుకుంటూ ఈ యూనివర్శిటీ క్యాంపస్ లో 'ఎవరు చెప్పు ఇంత గర్వంగా, మొండిగా బ్రతికిన మనిషి' అనిపించుకుంటూ తిరిగిన సూరి, ఓడిపోతున్నాడు. సో-నిన్న అందించబోయిన కారు 'కీస్'ని శౌరి ఇప్పుడు నా చేతి కివ్వాల్సిందిగా సభాముఖంగా..."
    
    "స్టాపిట్!"
    
    గావు కేకలా వినిపించింది. వెనక్కి చూశారంతా.
    
    రొప్పుతున్నాడు ద్వారం దగ్గిర నిలబడ్డ ఆదిత్య.
    
    పోరాటానికి సన్నద్ధం కాలేక ఎక్కడో ఏ మూలనో ఆగిపోయిన ఆదిత్య చివరి నిముషంలో తీసుకున్న నిర్ణయమో, లేక ఒక ప్రాణ స్నేహితుడికోసం పోరాడి ఓడితేనేం అన్నభావమో, ఏనాడూ పదిమంది ముందుకి సాహసించి రాని ఆదిత్య ఇప్పుడు వందలమంది విద్యార్ధుల ముందు నిలబడివున్నాడు.
    
    సందిగ్ధత-ఎండలో సొమ్మసిల్లిపోతూన్న తెల్లపావురంలా గుండె ట్రెంచెస్ లో నొక్కి పెట్టిన ఉలిపిరిలాంటి ఊపిరిని పీల్చుకుంటూ డయాస్ ని చేరుకున్నాడు.
    
    మేరునగ దీరుడిలా కాదు, కార్యదీక్షాదక్షుడిలా అంతకన్నా కాదు ఒక కర్తవ్యం కోసం దృఢంగా నిర్ణయించుకున్నట్టు సూరి చేతులందుకున్నాడు.
    
    "నా నిశ్శబ్దంలోకి అలవోకగా అడుగుపెట్టి సందేహంలా బ్రతుకుతున్న నన్ను స్నేహమనే సందిట బంధించి అణుమాత్రమయినా బాసటగా నిలిచిన నా మిత్రుడా! ఫలితం ఏమవుతుందో తెలియని స్థితిలో నీ మాటకి కట్టుబడి, మన స్నేహానికి చిన్న అర్ధాన్ని నిర్వచించాలని ఇలా వచ్చాను. నన్ను ఆశీర్వదించు!"
    
    సూరి కళ్ళు చెమర్చాయి చిరుగర్వంతో.
    
    అంతరాంతర రంగస్థలాన ఏకాకి నటుడిలా అంతసేపూ నిలబడ్డ సూరి శౌరిని చూస్తూ పోరాటానికి తన సంసిద్దతని వ్యక్తం చేశాడు.
    
    'నో...' అంటూ అరవబోయిన శౌరి అప్పుడు చూశాడు. ఇంకా గడువుకి అయిదు సెకండ్లు మిగిలి వున్నాయి.
    
    ప్రబంధ మృదువుగా నవ్వింది అన్నయ్యని చూస్తూ.
    
    అదే శౌరికి చాలా ధైర్యాన్ని అందించిందేమో.
    
    "ప్రొసీడ్."    
    
    ఆడిటోరియంలో మరోసారి చప్పట్లు.
    
    వెంటనే లేచిన ఓ ప్రొఫెసర్ షరతులను వివరించాడు. "పరీక్ష గడువు అరవై నిముషాలు. అంటే ఒక్కో పార్టిసిపెంట్ కి కేటాయించింది ముప్పై నిముషాలు."
    
    "అవును...." ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వెనుకనించి కేకలు పెట్టారు.
    
    "సరే!" ఇప్పుడు ప్రబంధే జవాబు చెప్పింది.
    
    ఓ ప్రొఫెసర్ చివరి కండిషన్ లా అన్నాడు. "ప్రశ్న అడిగిన తర్వాత ప్రత్యర్ధి ఆలోచించుకోడానికి గడువు నలభై అయిదు సెకండ్లు మాత్రమే....అప్పటిదాకా విప్పకపోతే మార్కులు కోల్పోయినట్టుగా భావించాలి."
    
    "లేదు.... శౌరి ఆవేశంగా లేచాడు. "అరగంట చాలు. ప్రశ్నలు అడిగేది ప్రబంధ జవాబు చెప్పాల్సింది మిస్టర్ ఆదిత్య."
    
    "తెలివిని ప్రదర్శించకు మిస్టర్ శౌరీ!" జోక్యం చేసుకున్నాడు సూరి. "ఐ.క్యూ. టెస్ట్ లో మేధను నిర్ణయించాలీ అంటే పార్టిసిపెంట్స్ ఇద్దరికి సమానమయిన టైమ్ ని అలాట్ చేయాలి."
    
    "ఓ.కే!" చెప్పాడు ఆదిత్య.
    
    హఠాత్తుగా ఆడిటోరియంలో నిశ్శబ్దం ఆవరించింది.
    
    "టాస్ వేసి ఎవరు ప్రారంభించాల్సిందీ నిర్ణయిస్తాం" మరో ప్రొఫెసర్ పైకి లేవబోతుంటే అక్కర్లేదన్నట్టుగా వారించాడు ఆదిత్య. "లెట్ మిస్ ప్రబంధ డిసైడ్."
    
    క్షణంపాటు ఆమె చూపులు ఆదిత్య చూపులతో కలిసి విడిపోయాయి.
    
    "నేనే ప్రారంభిస్తాను."
    
    "రైట్!" ప్రొఫెసర్ ప్రారంభసూచనగా టేబుల్ పై డిజిటల్ వాచ్ ను చూస్తూ..." ఇప్పుడు టైమ్ అయిదు గంటల పదిహేను నిమిషాలు కావస్తూంది మిస్ ప్రబంధా!" అన్నాడు.
    
    క్షణంపాటు ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిలా కనిపించిన ఆదిత్యని చూసిన ప్రబంధ ప్రసన్నంగా కాదు, తనతో దీటుగా నిలబడగలడా అన్న ధీమాలో మొదటి ప్రశ్న అడిగింది.
    
    "ఆసియా ఖండంలో ప్రింట్ చేసిన మొదటి గ్రంథమేది? ఏ దేశంలో? దేనిపైన అది ముద్రితమయింది?"
    
    ఆదిత్య ఫాలభాగం పైన ముత్యాల్లా పేరుకుంటున్నాయి.
    
    పది సెకండ్లపాటు నిశ్శబ్దం.
    
    ఆడిటోరియంలో కూర్చున్న సూరి ఉద్విగ్నంగా ముందుకు జరిగాడు.
    
    "ది డైమండ్ సూత్ర అన్నది పుస్తకం పేరు" జవాబు చెప్పాడు ఆదిత్య. "అది ప్రింటయింది చైనాలో, ప్రింట్ చేసింది వుడెన్ బాక్స్ పైన సంవత్సరం క్రీస్తుశకం 858" అడగని మరో ప్రశ్నకి జవాబులా సంవత్సరాన్నీ చెప్పాడు.
    
    క్షణంపాటు తెప్పరిల్లలేకపోయింది ప్రబంధ.
    
    "రైట్....!"
    
    ప్రొఫెసర్స్ ఓ పక్క నోట్ చేసుకుంటున్నారు.
    
    "రెండో ప్రశ్న..." ఇప్పుడు ప్రబంధ ఏకాగ్రతగా ఆదిత్యనే గమనిస్తోంది. "యునైటెడ్ స్టేట్స్ లో ప్రెసిడెంట్ గా ఎన్నుకున్న తొలి రోమన్ కేథలిక్ ఎవరు? అమెరికా ప్రెసిడెంట్స్ లో మొత్తం ఎంతమందిని అసాసినేట్ చేశారు? హంతకుల పేర్లేమిటి?"
    
    "ప్రొటెస్టెంట్స్ మాత్రమే ప్రెసిడెంట్స్ గా ఎక్కువగా ఎన్నికైన యునైటెడ్ స్టేట్స్ లో తొలి రోమన్ కేథలిక్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్.కెన్నడీ ముఫ్ఫై తొమ్మిది మంది ప్రెసిడెంట్స్ లో నలుగుర్ని అసాసినేట్ చేశారు. క్రీస్తుశకం 1865లో అబ్రహం లింకన్ ని హత్యచేసిన అసాసిన్ పేరు జాన్ విక్స్ బూత్, క్రీస్తుశకం 1881లో జేమ్స్ గేర్ ఫీల్డ్ ని హత్యచేసింది ఛార్లెస్ గిల్డ్, క్రీ.శ. 1901లో యు.ఎస్. ప్రెసిడెంట్ విలియం మెకెన్లీని హత్య చేసింది లియాన్ జోగో, క్రీస్తుశకం 1963లో కెన్నెడీని హత్యచేసింది లీహార్ట్ ఆస్వాల్ట్...."