సత్యానికి తుపాకి గుండు దెబ్బకంటే పెద్దదెబ్బ తగిలినట్టు అయింది. ప్రతిభ భుజం మీదనుంచి తన చెయ్యితీసి ఠక్కున ఆగిపోయాడు. ప్రతిభ కసిగా నాలుగు అడుగులు ముందుకు వేసింది.

 

    "నువ్వు మొదటినుంచీ ఈ దాడిని ఎందుకు వ్యతిరేకించావో ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ దాడి విఫలం అవుతుందని నీకు ముందే తెలుసు."

 

    "ప్రతిభా!"

 

    "అవును! నీకు తెలుసు!"

 

    "ప్రతిభా!"

 

    "శత్రువుకు సమాచారం అందించినవాడెవడో నీకు తెలుసా?"

 

    "ప్రతిభా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియడం లేదు.!"

 

    సత్యం గాయపడిన కాలును ఈడ్చుకుంటూ ప్రతిభ ముందుకొచ్చాడు. ప్రతిభా! పిచ్చిగా మాట్లాడకు. నిజమైన రాజకీయ అవగాహనవున్న విప్లవకారుడెవరూ మనోనిబ్బరాన్ని కోల్పోడు. కష్టాల్ని, చిక్కుల్ని, ఎదుర్కొంటున్నప్పుడు ఆత్మస్థయిర్యాన్ని ప్రదర్శిస్తాడు. కాని... నువ్వు"

 

    "ప్రతిభా! ప్రతిభా!" బాధతో మూలిగాడు సత్యం.

 

    "వాడు - ఆ విప్లవద్రోహి సుందరం. నీకు స్నేహితుడు. అందుకే సుజాతను ఈ దాడినుంచి తప్పించాడు. నాకు అంతా తెలుసు!"

 

    "ప్రతిభా!"

 

    "అంతా కుట్ర! నువ్వూ, వాడూ, సుజాతా అంతా కలిసి-"

 

    ప్రతిభ చంప ఛళ్ళుమన్నది. ప్రతిభను లాగి కింద కూర్చోబెట్టి తనూ కూర్చున్నాడు. ప్రతిభ తెల్లబోయి సత్యం ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది.

 

    "నీకు మతిపోయింది!" సత్యం రొప్పుతున్నాడు. "నోటికి వచ్చినట్టల్లా మాట్లాడుతున్నావు!" కోపంగా మళ్లీ అన్నాడు.

 

    ప్రతిభ మౌనంగా కూర్చున్నది. పీడకల నుంచి బయటపడిన దానిలా వెలవెలా సత్యంకేసి చూసింది.

 

    "సారీ ప్రతిభా! నన్ను క్షమించు! విప్లవకారుడు ఏది చెయ్యకూడదో ఆ పనే చేశాను. నన్ను క్షమించు!"

 

    ప్రతిభ తల వంచుకుని నేలతులసి మొక్కను కసిగా పీకింది. ఆకులు దూసి పోస్తున్నది.

 

    "ప్రతిభా! ప్రశాంతంగా ఆలోచించు మన దాడి రహస్యం శత్రువుకు తెలుసుననే విషయం నాకు ముందే తెలుస్తే ఈ దాడిలో నేనెందుకు వుంటాను? ఓసారి నావంక చూసి చెప్పు! తెలిసి తెలిసి... నిన్ను... నిన్ను నేను చేతులారా శత్రువుకు బలి ఇవ్వడానికి తీసుకెళ్తానా? ఇంతమంది దళ సభ్యుల్ని మృత్యువుకు అప్పగిస్తానా? నేను నిజంగా సుందరాన్ని అనుమానించి వుంటే, ఆ రోజే మన క్యాంపులోనే, చెట్టుకు వేలాడగట్టి ఉరితీసేవాణ్ణి. మన దళ సభ్యులకు ఆ హక్కు ఉన్నది. రెనగేడ్స్, శత్రువు ఏజెంట్లు దళాలకు చిక్కితే అక్కడికక్కడే హతమార్చాలి. అందులో ఎవరికీ అభిప్రాయభేదం లేదు. సందేహం అంతకన్నా లేదు. పోతే ఎటొచ్చీ, మనలో ఒకడిగా ఉంటున్న వాడిని విప్లవద్రోహిగా నిర్ణయించడం ఎలా? ఖచ్చితమైన ఆధారాలు లేకుండా నిర్ణయాలు తీసుకుంటే ఘోరమైన తప్పిదాలకు దారి తీస్తాయి. రాజకీయ పంథా ఆచరణల్లో భిన్నాభిప్రాయాలున్న వాళ్ళు, ఒకళ్ళ నొకళ్ళు విప్లవ ద్రోహులుగా చిత్రించుకొని ఒకర్నొకరు నరుక్కోవచ్చు! ఎన్నో గ్రూపులూ, విభేదాలూ ఉన్న ఈ దశలో, ఇలా జరగడానికి కూడా అవకాశాలూ లేక పోలేదు. ఆ మాటకొస్తే మన దళ రహస్యాలు మనకు తెలియకుండానే, శత్రువుకు తెలిసే అవకాశం వుంది. మన కొరియర్స్ మూవ్ మెంట్సు పసికట్టి శత్రువు మనమీద దెబ్బ తీయొచ్చు! అనాలోచితంగా, అశ్రద్ధతో అజాగ్రత్తతో మనవాళ్ళు చేసిన పనిగానీ, ఆడిన మాటగానీ పీకలమీదకు తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉన్నది. అలాగే - ఏం ప్రతిభా వింటున్నావా?" సత్యం ఆగి ప్రతిభ ముఖంలోకి చూస్తూ అన్నాడు.

 

    ప్రతిభ సత్యానికి దగ్గరగా జరిగి, అతని భుజం మీద చెయ్యి వేసి "ఊఁ!" అన్నది.

 

    "మనం సాయుధ పోరాటానికి పిలుపు ఇవ్వగానే నిరాశా నిస్పృహల్లో వున్న అనేకమంది యువతీ యువకులు, ఉత్తేజితులై మన వైపుకు వచ్చారు. అంతకు ముందునుంచీ కమ్యూనిస్టు ఉద్యమంలో వున్నవాళ్ళతోపాటు కొత్తవాళ్ళు కూడా వచ్చారు. పాతవాళ్ళు కొందరు కొన్ని అవలక్షణాలతోను వచ్చారు. వ్యక్తిగత బలహీనతలూ, సరయిన రాజకీయ అవగాహనా లేకపోవడమే మన ఉద్యమానికి అవరోధంగా వున్నాయి. ఇందులో గాలివాటుకు వచ్చినవాళ్ళుకూడా వున్నారు. వీళ్ళందర్నీ తీర్చిదిద్దుకునే అవకాశం మనకు లేకపోయింది. విప్లవ నినాదం ఇచ్చినంత మాత్రాన సిద్ధాంతవేత్త ఎలాకాడో, అలాగే తుపాకి పట్టుకున్నంత మాత్రాన విప్లవకారుడూ కాలేడు. అందువల్ల నువ్వు సుందరాన్ని అనుమానించడం సుజాతను ద్వేషించడం సరికాదు."

 

    "కామ్రేడ్! మన దాడిని గురించిన రహస్యం శత్రువుకు ముందే తెలిసిపోయిందనీ, అది మనవాళ్ళు చేసిన పనే అనీ నువ్వే అన్నావుగా?"

 

    "అవును! అది నా ఖచ్చితమైన అభిప్రాయం. దానికి తిరుగులేదు. మన వ్యూహం గురించి తెలియకపోతే శత్రువులు అంత పకడ్బందీగా మనల్ని చుట్టుముట్టలేరు. మనం ఒచ్చేపోయే మార్గాలు తెలుసు. మనం ఎంత మందిమి వెళుతున్నామో కూడా వాళ్ళకు తెలిసే వుండాలి. లేకపోతే అంతధైర్యంతో, తెగింపుగా చుట్టముట్టలేరు. ప్రమాదంలేని స్థావరాన్ని చూసుకుని వీలయినంత దూరం నిలబడి కాల్పులు సాగిస్తారు. మనం ఒక సిద్ధాంతం కోసం జీవితాలను బలివ్వడానికి సిద్ధమయిన విప్లవకారులం. పోలీసులు - జీతపురాళ్ళ కోసం జీవితాలు అమ్ముకున్న మామూలు సగటు మనుషులు. అక్కడే వున్నది తేడా అంతా!"

 

    "అయితే మనలో వున్న విప్లవ ప్రతీఘాతకుల్ని గుర్తించడం ఎలా?"

 

    "అది కాలమే నిర్ణయిస్తుంది. ఎంతో కాలం విప్లవద్రోహి మనల్ని మోసం చెయ్యలేడు. ఏదో ఒకరోజు బయటపడి తీరతాడు. ఆధారాలు, రుజువులూ దొరుకుతాయి. అప్పుడే వాళ్ళు శిక్ష అనుభవిస్తారు."

 

    "ఈలోపల మన దళాలు దెబ్బతిని సాయుధ పోరాటం అణచబడితేనో?" నిట్టూర్పు విడిచింది ప్రతిభ.

 

    "విప్లవ ద్రోహులూ, రెనగేడ్స్ వల్ల విప్లవ పోరాటాలు సమసిపోవు. తాత్కాలికమైన అడ్డంకులూ, నష్టాలూ కలుగుతాయి. అంతే. ప్రజలు సాయుధ పోరాటాన్ని ఆదరించకపోతే విప్లవం ఆగిపోతుంది." ఓ క్షణం ఆగి మళ్ళీ చెప్పసాగాడు.

 

    "ప్రజలు ఆదరించడమే కాదు - ప్రజలు మన పోరాటంలో భాగస్వాములయినప్పుడే మన ఉద్యమం నిలబడుతుంది. లేనినాడు నీళ్ళు కారిపోతుంది. వ్యక్తుల త్యాగాలూ - ద్రోహాలూ మాత్రమే చరిత్రలో మిగిలిపోతాయి. లే! తెల్లవారడానికి ఇంకా మూడు గంటలే వున్నది. తెల్లవారే లోపున లోయలోకి చేరుకోవడం కష్టం అనుకుంటాను."

 

    ప్రతిభ లేచింది. సత్యాన్ని లేవదీసి నిలబెట్టింది. బాధతో కుంటుకుంటూ ప్రతిభ భుజం మీద బరువు మోపి నడక సాగించాడు సత్యం.

 

    "తెల్లవారేసరికి లోయ చేరగలమా? ఇంకా ఎంత దూరం వున్నది?" భారంగా అడుగులువేస్తూ అడిగింది ప్రతిభ.

 

    "ఇంకా తొమ్మిది మైళ్ళుంది" సత్యం చెప్పాడు. "తొమ్మిది మైళ్లే?"

 

    "ఏమిటి కామ్రేడ్! అంతదూరం నడవలేమంటావా? చైర్మన్ మావో లాంగ్ మార్చ్ ని గుర్తు చేసుకో!"

 

    "కరెక్టుగా గుర్తుచేశావ్ కామ్రేడ్! తెల్లవారకముందే కొండ కొనకు చేరుకుంటాం!" ఉత్సాహంగా నడవసాగింది ప్రతిభ.

 

    సత్యం కాలు, రానురాను బరువెక్కిపోతూ వున్నది. ఆయాసపడుతున్నాడు. అడుగుతీసి అడుగు వేయడం కూడా కష్టం అయిపోతున్నది. బాధ భరించరానిదిగా వున్నది! గాయంలో నిప్పులు కురిసిన మంటలు! ప్రతిభకు కాళ్ళు బరువెక్కి పోయినై. మెడలు గుంజుతున్నాయి. గూడలు జారిపోతున్నాయి. ఆమె చేతిలోంచి సత్యం జారిపోతున్నాడు. కళ్ళు తిరిగి పోతున్నాయ్! ఒక్కొక్క క్షణం ఒక యుగంలా అనిపిస్తున్నది. తొమ్మిది మైళ్ళు తొంభయ్ మైళ్ళ యాత్రలా సాగిపోతున్నది. వేగుచుక్క పొడిచింది. తూర్పున వెలుగు రేఖలు విరిశాయి.

 

    కొండ దిగువన, నీటిమడుగు దగ్గర సత్యం, ప్రతిభా సొక్కి సోలి పడి వున్నారు. ఊపిరి పీల్చడం మినహా శరీరాల్లో మరే కదలికా లేదు. కరా కరా పొద్దు పొడిచింది. పక్షులు నీరెండలో పరుగులు తీస్తున్నాయి. మడుగులో చేపలు వెండిపువ్వుల్లా తృళ్ళి పడ్తున్నాయి!

 

    "ప్రతిభా! ప్రతిభా!" మృదువుగా ప్రతిభ తల నిమిరాడు సత్యం.

 

    "ఊ!" కళ్ళు తెరిచి ఒకసారి చూసి మళ్లీ మూసుకున్నది.

 

    "ప్రతిభా! మనం ఎక్కడ వున్నామో ఒకసారి చూడు!"

 

    "నాకు తెలుసు. కొండతామర మడుగు పక్కన!" మత్తుగా అన్నది కళ్ళు తెరవకుండానే ప్రతిభ.