19

 

    ఇన్ స్పెక్టర్ చంద్రాన్నీ, గౌరినీ - చంద్రం వద్దంటున్నా వినకుండా తన కారులో తీసుకెళ్ళి ఇంటిదగ్గర వదిలాడు. అవసరమైతే ఒకసారి పోలీసు స్టేషన్ కు రావాల్సి వుంటుందని చెప్పి వెళ్ళిపోయాడు.

 

    తెల్లవారేటప్పటికి స్థానిక పత్రికలో తాటికాయంత అక్షరాలలో క్రితం రాత్రి జరిగిన సంఘటన వన్నెల చిన్నెలతో ప్రకటించబడింది.

 

    "కృష్ణా టుబాకో కంపెనీ ప్రొప్రయిటర్ కృష్ణారావు తమ్ముడు చంద్రశేఖరంపై దుండగీడుల దౌర్జన్యం! కొరిటిపాడులో నివసించే ఒక ఆడపిల్లతో సినిమాకు వెళ్ళివస్తుంటే ఇది జరిగింది. ఆ యువతి పేరు గౌరి. ఆమెను ఎత్తుకుపోయే ప్రయత్నంలోనే ఘర్షణ జరిగినట్లు తెలుస్తూంది."              

 

    వార్త చదివిన హేమ చేతినుంచి పేపరు జారి కింద పడింది. ఎదురు కుర్చీలో కూర్చుని మరో పత్రిక చదువుతున్న ప్రసాదరావు కొయ్యబారి వున్న హేమను చూసి విస్మయం చెందాడు.

 

    క్రిందపడివున్న పేపరు చేతిలోకి తీసుకున్నాడు. వార్త చదివిన ప్రసాదరావుకు చంద్రంపై పట్టరాని కోపం, అసహ్యం కలిగాయి. హేమ అప్పటికే అక్కడినుంచి లేచి వెళ్ళిపోయింది. ప్రసాదరావు మనస్సు వికలం చెందింది. లేచి, స్నానంచేసి బయటకు బయలుదేరాడు. హేమ గది తలుపులు లోపలనుంచి వేసివున్నాయి. ఇవ్వాళ ఆమె కాలేజీకి వెళ్ళే సూచనలు ఏమీ కనిపించలేదు. గట్టిగా నిట్టూర్చుతూ బయటకు నడిచాడు ప్రసాదరావు.

 

    ప్రసాదరావు, కృష్ణారావు గదిలో ప్రవేశించేటప్పటికి సిగరెట్ పొగతో మేఘాలు తయారవుతున్నాయి. కృష్ణారావు నొసలు బిగించి కప్పువైపుకు చూస్తూ సిగరెట్ దమ్ములు పీలుస్తున్నాడు. ఎదురుగా టేబిల్ మీద ఆ వార్త పడిన పేపరు కనిపించింది ప్రసాదరావుకు. కృష్ణారావు అంత గంభీరంగా వుండటానికి కారణం అర్థం అయింది.   

 

    ప్రసాదరావు కూర్చున్న తరవాత కూడా ఎవరూ కొంతసేపు మాట్లాడలేకపోయారు. ఆ సమయంలో ప్రసాదరావు రాకకు కారణం చెప్పకనే తెలుస్తుంది ఆ విషయాన్ని చర్చించాలంటే ఇద్దరకూ బాధగానే వుంది.

 

    "వార్త చూశారుగా?" ప్రసాదరావు చిన్నగా విషయాన్ని కదిపాడు.

 

    "చూశాను. వీడింత అప్రయోజకుడవుతాడని కలలో కూడా ఊహించలేదు. మా వంశానికే కళంకం తెచ్చాడు. ఇలాంటివాడు పుట్టగానే చచ్చినా బాగుండేది అని ఆలోచిస్తున్నాను" అన్నాడు కృష్ణారావు బాధగా.   

 

    చంద్రాన్ని కృష్ణారావు తిట్టడం ప్రసాదరావుకు తన హేమను శపించినట్లు అనిపించింది. చంద్రాన్ని సమర్థించాలనిపించింది.

 

    "దీనికి చాలావరకు మనమే బాధ్యులమేమో ననిపిస్తుంది. కుర్రవాళ్ళు, పైగా చిన్నప్పటినుంచీ పెద్దవాళ్ళ రక్షణకు దూరంగా పెరిగినవాళ్ళకు కొన్ని అలవాట్లు ఏర్పడి వుండవచ్చును. చంద్రాన్ని మనం అలా వదిలేయడంవల్లనే ఇదంతా జరుగుతూంది."   

 

    "నన్నేం చెయ్యమంటారు?"

 

    "మీరువెళ్ళి ఎలాగయినా ఒప్పించి ఇంటికి తీసుకొని వచ్చేయండి."

 

    "వాడికి నా మాటంటే బొత్తిగా ఖాతరు లేకుండా పోయింది. పైగా, నా మీద పగ సాధించటానికే ఈ మాదిరిగా ప్రవర్తిస్తున్నాడు."   

 

    "చంద్రం అలాంటివాడు కాదు. మీరంటే అతనికి ఇప్పటికీ అభిమానమే. కాకపోతే చిన్నతనంలో గాయపడిన హృదయం. అతనిని అనునయంగాకాని మనం మార్గంలోకి తీసుకురాలేము," అన్నాడు ప్రసాదరావు.  

 

    "ప్రయత్నించి చూస్తాను. దీనికంతా కారణం అసలు ఈ ప్రకాశంగాడే. వాణ్ణి ఈ ఊళ్ళో లేకుండా చెయ్యాలి" అన్నాడు కృష్ణారావు.

 

    ప్రసాదరావు ఆశ్చర్యంగా చూశాడు.

 

    "అంత పని మాత్రం చెయ్యకండి! ప్రకాశం మీద ఈగ వాలటాన్ని కూడా చంద్రం సహించలేడు. మనం ప్రకాశాన్ని ఏమయినా చేసినట్లు పసిగట్టాడా - చంద్రం మనకు శాశ్వతంగా దూరం అవుతాడు."

 

    "ఊఁ - అదీ చూస్తాను" అంటూ సిగరెట్టు ముక్క కొరికి ఊశాడు కృష్ణారావు. "ఇంతవరకూ వచ్చాక నా కుటుంబ గౌరవం కాపాడుకోవటానికి ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాను."

 

    స్ప్రింగ్ డోర్ తెరుచుకోవటంతో కృష్ణారావు మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. ప్రైవేటు సెక్రటరీ అనూరాధ లోపల ప్రవేశించి ఎదుటి కుర్చీలో కూర్చుంది. తెల్లటి దుస్తుల్లో అందంగా కనిపించిన అనూరాధను ఆత్మీయత వుట్టిపడే కళ్ళతో చూశాడు కృష్ణారావు 'ఏమిటి?' అన్నట్లు.    

 

    "బాస్!" అంటూ ఏదో చెప్పబోయి ఆకస్మాత్తుగా పక్కకు తిరిగి చూసి ఆగిపోయింది అనూరాధ. ఏదో వింత వస్తువును చూసినట్లు ప్రసాదరావును రెప్పవాల్చకుండా చూస్తూ వుండిపోయింది. క్రమంగా ఆమె ముఖంమీద చెమట బిందువులు కనిపించసాగాయి. కృష్ణారావు విస్మయంతో ఆమెనే చూస్తుండిపోయాడు. తూలి పడిపోబోతున్న అనూరాధను కృష్ణారావు పట్టుకుని పక్క సోఫాలో పడుకోబెట్టాడు.

 

    కృష్ణారావు ఫ్యూన్ ను కేకవేసి మంచినీళ్ళు ఇవ్వమన్నాడు. ఆమె ముఖంమీద నీళ్ళు చిలకరించి కదిపిచూశాడు. కాని ఆమెకు తెలివిరాలేదు. గాబరాగా ఫ్యామిలీ డాక్టరుకు ఫోన్ చేశాడు. ఇంత జరుగుతున్నా కదలక మెదలక కుర్చీలో తాపీగా కూర్చొనివున్న ప్రసాదరావును ఆశ్చర్యంతో చూశాడు కృష్ణారావు. అప్పుడే ప్రాణంపోయిన శవంలా బిగుసుకొని పోయివున్న ప్రసాదరావును చూసి కృష్ణారావు గాబరాగా లేచివచ్చి కదిపాడు. ఏదో భయంకరమైన దుస్స్వప్నం నుంచి బయటపడినట్లు ప్రసాదరావు నాలుగువైపులా వెర్రిగా చూశాడు. మరో క్షణంలోనే తేరుకొని లేచి అనూరాధ పడుకొనివున్న సోఫా దగ్గిరకు వెళ్ళి, పక్కనే తల దగ్గిర కూర్చుంటూ "అనూ, అనూ" అంటూ ఆమెను ఆవేశంగా కదిపాడు.

 

    కృష్ణారావు అర్థంకాక అయోమయంగా చూస్తూ కూర్చున్నాడు. తెలివిలేని అనూరాధ తలను నిమురుతూ ఆమె ముఖంలోకే చూస్తూ కూర్చున్నాడు ప్రసాదరావు.     

 

    డాక్టరువచ్చి ఇన్ జెక్షన్ ఇచ్చి స్మెల్లింగ్ సాల్టు ముక్కు దగ్గిర వుంచాడు. ఆమె కదలింది. ఒకసారి కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకుంది.

 

    "ప్రమాదం ఏమీలేదు. ఒకోసారి అనుకోని సంఘటన సంభవించినప్పుడు ఇలా జరుగుతుంది. పది నిముషాలలో తెలివి వచ్చేస్తుంది. కాని, ఒక వారంరోజులు ఆమెకు మానసికంగా, శారీరకంగాకూడా విశ్రాంతి అవసరం" అని చెప్పి డాక్టరు వెళ్ళిపోయాడు.

 

    డాక్టరు వెళ్ళిపోయిన కొద్దిసేపట్లోనే అనూరాధకు పూర్తిగా తెలివి వచ్చేసింది. తను ఎక్కడ వుందీ, ఏ పరిస్థితిలో వుందీ తెలుసుకున్న ఆమె ఒక్కసారిగా లేచి కూర్చుంది. తన సోఫాలోనే కూర్చునివున్న ప్రసాదరావును తిరస్కారంగా చూసి లేచి నిల్చుంది. ప్రసాదరావు ఆమెను లేవవద్దని వారించబోయాడు. కాని, ఆమె చూపును తట్టుకోలేక అపరాధిలా తల వంచుకొన్నాడు. అనూరాధ తూలి పడబోయి నిలదొక్కుకుంది. కృష్ణారావు ఏమనుకున్నాడో?..... ఆ తలపు రాగానే అనూరాధ సిగ్గుతో చితికిపోయింది. ఏ అద్భుత శక్తో వచ్చి తనను నిల్చున్నపాటున మాయం చేస్తే ఎంత బావుణ్ణు! కనీసం తను నిల్చున్న భూమి పగిలి తనలో ఇముడ్చుకుంటే? అలా ఎందుకు జరుగుతుంది? సీతాదేవి తన బిడ్డ కాబట్టి ఆనాడు ఆమెను భూదేవి తన హృదయంలో దాచుకుని, ఆమెకు జరగబోయే అవమానం నుంచి కాపాడింది.

 

    ఆమె ఇబ్బందిని కనిపెట్టాడు కృష్ణారావు. "వెళ్ళమ్మా, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఓ వారం రోజులు శెలవు తీసుకోండి" అన్నాడు కృష్ణారావు.

 

    ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న అనూరాధ ఆ గదినుంచి గబగబా బయటకు వెళ్ళిపోయింది.

 

    కింకర్తవ్య విమూఢుడై కూర్చొనివున్న ప్రసాదరావుతో కృష్ణారావు అన్నాడు: "ఆమె చాలా ఆవేశంలో వున్నట్టుంది. ఏమయినా అఘాయిత్యం చెయ్యవచ్చు. మీరు వెళ్ళి కొంత ఓదార్చటం అవసరం అనుకుంటాను." పరిస్థితి కొంతవరకు అర్థం అయింది కృష్ణారావుకు.  

 

    "లేవండి. ఆమె ఈ బిల్డింగులోనే చివర గదుల్లో వుంటుంది" అని చెప్పి బెల్ మోగించాడు. వచ్చిన ఫ్యూన్ తో " అయ్యగారికి అనూరాధమ్మగారి గది చూపించు" అన్నాడు.     

 

    ప్రసాదరావు మౌనంగా లేచి ఫ్యూన్ వెనకే యాంత్రికంగా నడుస్తున్నాడు.

 

    ఆయన అపరాధిలా జంకుతూ అనూరాధ గదిలో అడుగుపెట్టాడు. ఆమె మంచంమీద బోర్లా పడుకొని గుండెలు పగిలిపోయేలా విలపించడం చూశాడు.

 

    ప్రసాదరావు ఆవేశం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా ఆమెను సమీపించాడు. ఆమెను తన రెండు బాహువుల్లో పొదివి పట్టుకొని బలంగా గుండెలకు అదుముకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. అనూరాధ ప్రసాదు గుండెల్లో ఇమిడిపోవటానికి ప్రయత్నిస్తుందాన్నట్లు అతని గుండెల్లో తలదాచుకొని ఏడుస్తోంది. ఇంతకాలం ఈ విశాల ప్రపంచం గుండెలో భూగోళమంత ఒంటరితనాన్ని దాచుకొని జీవిస్తున్న అనూరాధకే ప్రసాదు గుండెల్లో తలదాచుకొని ఏడుస్తుంటే, ఏదో లోతులు తెలియని అగాధంలోకి జారిపోతున్నవాని చేతికి ఏదో ఆధారం దొరికినట్లు కొంత ఊరట కలిగింది.