"గత పదిహేను రోజుల్లో, నీ దగ్గరకెవరెవరొచ్చారో.... మర్యాదగా చెప్పేసెయ్... లేదా..." ఆ వ్యక్తి ఫిల్టును పట్టుకొని, పైకెత్తుతూ కోపంగా అన్నాడు.
    
    "నాకు తెలీదు..." ఆ జవాబివ్వడానికి, ఆ లాండ్రీ ఓనర్ ఎక్కువ టైమ్ తీసుకోలేదు.
    
    మరి ఆలోచించలేదు సూర్యవంశీ లాగి చెంపమీద ఒక్కటిచ్చాడు.....
    
    ఆ దెబ్బకి ఆవ్యక్తి వెనక్కి పడ్డాడు. వెంటనే లేస్తూ-
    
    "బేవకూఫ్... నిన్ను... ఒరేయ్.... బద్రుద్దీన్..." అరుస్తూ.... పొడవాటి కత్తిని అందుకుని మీద పడ్డాడు.
    
    సూర్యవంశీ మరి ఉపేక్షించలేదు. కుడి కాలిని పైకి లేపి, ఎగిరి వాడి పొట్టమీద తన్ని, వాడి చేతిలో కత్తిని లాఘవంగా లాక్కుని-
    
    "కబడ్దార్... ముందుకొస్తే... పీకలు తెగిపోతాయ్...." అరిచాడు. ఆ అరుపుకి, లాండ్రీ ఓనర్ అసిస్టెంట్ బద్రుద్దీన్, మంత్రం వేసినట్టుగా ఆగిపోయాడు.
    
    ఆ మాటల్ని లెక్క చెయ్యకుండా, మీద మీద కొస్తున్న లాండ్రీ ఓనర్ని నెట్టేసి, ముందుకు రాబోయిన సూర్యవంశీ చూపులు-
    
    మాసిపోయిన టేబిల్ మీద పడున్న పాత రసీదు పుస్తకాల్ని చూసాడు. అవి కస్టమర్లకు బట్టల డెలివరీ ఇచ్చినపుడు ఇచ్చే రసీదులని వెంటనే తెల్సిపోయింది సూర్యవంశీకి.
    
    చేతిలోని కత్తిని కిందపడేసి, ఆ రసీదు పుస్తకాల్ని అందుకున్నాడు.....నెలల వారీగా ఉన్న ఆ రశీదు పుస్తకాల్ని గబగబా తిరగేసాడు.... అతనికి కావల్సింది వెంటనే దొరికింది....
    
    గత నెల రశీదు పుస్తకం.....గబగబా కార్బన్ పేజీల్ని తిరగేస్తున్నాడు.
    
    సరిగ్గా ఒకచోట....సూర్యవంశీ చూపులు ఆగిపోయాయి.....
    
    ఆ ముస్లిం పేరు.... 'ఎస్' తో ప్రారంభమైంది...సయ్యద్...సయ్యద్....సయ్యద్...
    
    "ఎవడీ సయ్యద్...." ఉరుములా వచ్చిందా మాట.
    
    బిక్కచచ్చిపోయాడు లాండ్రీ ఓనర్.
    
    "కరెక్టుగా చెప్తే సరి.... లేకపోతే... పోలీస్ స్టేషన్లో..." సూర్యవంశీ మాట ఇంకా పూర్తికాలేదు.
    
    "ఆ సయ్యద్ గాడు రౌడీ సర్.... ఆడుండేది హైద్రాబాద్ లో... ఇక్కడకొచ్చినప్పుడు బట్టలేస్తాడు..."
    
    "ఎప్పుడూ పైసలియ్యలే..." పక్కనున్న అసిస్టెంట్ చెప్పాడు.
    
    విషయం చూచాయగా అర్ధమవుతోంది సూర్యవంశీకి.
    
    "ఇక్కడ వాడెక్కడకొస్తాడో తెలుసా..." సూటిగా అడిగాడు సూర్యవంశీ.
    
    "ఇక్కడ వాడికి ఒక కీప్ వుందిసార్....సయ్యద్ గాడు....ఆడిగురువు..."
    
    "గురువంటే..."
    
    "ఆడు పెద్ద రౌడీ సర్..."
    
    "వాడి పేరు..."
    
    నసిగాడు లాండ్రీ ఓనర్...
    
    "చెప్పు...."
    
    "బబ్లూగాడని...." భయం భయంగా చెప్పాడు ఆ లాండ్రీ ఓనర్.
    
    "ఆ బబ్లూగాడి షర్ట్ మీదకూడా 'ఎస్' మార్కు పెట్టడం మా కలవాటు సార్.... ఆ బట్టలుకూడా సయ్యద్ గాడే తెచ్చివేస్తాడు" అసిస్టెంట్ చెప్పాడు.
    
    అంటే చచ్చింది బబ్లూగాడా? సయ్యదా? ఎవరు చంపారు?
    
    చటుక్కున ఒక విషయం జ్ఞాపకం వచ్చింది సూర్యవంశీకి.
    
    "ఆ ఇద్దరిలో ఎవరికైనా, పైపన్ను దగ్గర స్టీల్ రాడ్ ఉంటుందా?"
    
    "స్టీల్ రాడ్ బబ్లూగాడికి ఉంటుంది సార్-వాడు నవ్వినప్పుడు అది స్పష్టంగా కనిపిస్తుంది సర్..." చెప్పాడు లాండ్రీ ఓనర్.
    
    వెంటనే మరోప్రశ్న వేశాడు సూర్యవంశీ.
    
    "ఆ సయ్యద్ గాడి కీప్ ఎక్కడుంటుంది?"
    
    ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొన్నారు ఒకింత ఆందోళనగా.
    
    "చెప్పు..."
    
    "మున్సిపల్ ఆఫీసు సందులో.... షీల కంపెనీ అంటే...."    
    
    "ఆ కీప్ పేరు..."
    
    "సల్మ... సల్మాబేగమ్..." మీరేమాత్రం ఆలస్యం చెయ్యలేదు సూర్యవంశీ.
    
    ఫాంటు జేబులోంచి, వందరూపాయల నోటుతీసి, లాండ్రి ఓనర్ చేతిలో పెట్టి, గబగబా బయటికొచ్చాడు.
    
                                                 *    *    *    *    *
    
    పట్టపగలు గబగబా లోనికొస్తున్న సూర్యవంశీవేపు ఆశ్చర్యంగా చూశారు ఇద్దరమ్మాయిలు.
    
    "షీల కంపెనీ అంటే ఇదేనా..." కారాకిళ్ళీ నముల్తున్న ఒక అమ్మయి వేపు చూస్తూ అడిగాడు సూర్యవంశీ.
    
    "బాగానే ఉంది....దుకాణంలోకొచ్చి, దుకాణం అంటే ఇదేనా....అన్నాట్ట ఒకడు...." గలగలా నవ్వుతూ అందా అమ్మాయి.
    
    "సల్మా కావాలి..." వెంటనే అడిగాడు సూర్యవంశీ.
    
    "ఏం మేం నచ్చలేదా...." ఇంకో అమ్మాయి జోకేసింది.
    
    "జోకులాపు... సల్మా కావాలి.... ఎక్కడుంది...." ఆ గొంతులోని కఠినత్వాన్ని వాళ్ళిద్దరూ గుర్తించారు.
    
    "మొబైల్ బండి... రోడ్డుమీదే ఉంటుంది... ఎక్కడికెళ్ళిందో.... ఓనర్ని అడుగు..." అదే సమయంలో లోన్నించి ఓ భారీ మహిళ అడుగుపెట్టింది.
    
    "హైద్రాబాద్ నుంచొచ్చాను... పోలీస్ ఇన్ స్పెక్టర్ని.... ఓ కేసు విషయంలో సల్మాతో మాట్లాడాలి..." పోలీస్ అన్న పదం వినబడగానే ఆ భారీ మహిళ తత్తరపడింది.
    
    "సల్మ... సల్మ.... వారంరోజులు కేంప్ వెళ్ళింది...." ఉర్దూలో చెప్పింది కంపెనీ ఓనర్ షీల.
    
    "ఎక్కడికో...." తనూ ఉర్దూలోనే అడిగాడు సూర్యవంశీ.
    
    "భువనేశ్వర్..."
    
    "భువనేశ్వర్ లో ఎడ్రస్ తెలుసా..."
    
    "పాసింజర్ తో వెళ్ళింది... ఏ కాటేజ్ లోనో, హోటల్లోనే ఉంటారు...."
    
    "ఆ కస్టమర్ పేరు తెలుసా..."
    
    "హైద్రాబాద్ లో నగల దుకాణం....రమేష్ చంద్ర కొడుకు సురేష్ చంద్ర.....ఈ పేరు నేను చెప్పినట్టు ఎక్కడా చెప్పొద్దు..."
    
    "థాంక్యూ..." గబగబా వెనక్కి వచ్చేస్తున్న సూర్యవంశీని చూస్తూ డర్టీ జోకు వేసుకొని నవ్వుకున్నారు ఇద్దరు అమ్మాయిలు ఇంటి ముందునుంచి హీరో హోండా మాయం కాగానే, పరుగు, పరుగున లోనగదిలో కెళ్ళింది. కంపెనీ ఓనర్ షీల ఫోన్ రిసీవర్ అందుకుంది. హైద్రాబాద్ లోని ఒక నెంబరుకు డయల్ చేయడం ప్రారంభించింది.
    
                                                  *    *    *    *    *
    
    సాయంత్రం సరిగ్గా నాలుగు గంటలు.