"ఇది చూసావా? చుట్టూ సముద్రం... మధ్యలో ఈ కొండల సముదాయం....వీటిలో శైవమత ప్రచారకుల అద్భుత కళానైపుణ్యం....అన్నిటికి మించి ఈ బావి చూడు. ఎంతో ఎత్తున్న ఆ గుహల కొండలపై ఈ బావిలోకి నీరు ఎలా వస్తోంది? పైగా తియ్యటి నీరు. ఈ బావిలోని నీరే ఈ కొండలపై జీవించే ప్రజలకు ఆధారం. ఈ ప్రక్క చూడు శివలింగం. కొన్ని వేల సంవత్సరాల క్రితం శివలింగానికి రోజూ భక్తితో అభ్యంగనస్నానం చేయించేందుకే ఈ బావిని త్రవ్వారట- గైడ్ చెబితే తెలిసింది. ఇవన్నీ ఆశ్చర్యాలు కావా? అద్భుతాలు కావా? చెప్పలేం ఏది, ఎప్పుడు, ఎలా, ఎందుకు జరుగుతుందో, మనవ ప్రేరణ కావచ్చు అని అనుకుంటే ఆ మానవున్ని ఫలానా పనికి ప్రేరేపించేదెవరు?" బ్రహ్మ మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడితే బాగుండని పించేంత హాయిగా ఉంటుంది.
    
    అతని వాయిస్ లో దాగివుండే కల్చర్, మాడ్యులేషన్, మందగమనం, ఎక్స్ ప్రెస్ చేసే భావాలు ఎవరినైనా ఇంప్రెస్ చేయగలవు. ముఖ్యంగా అతను చెప్పే విషయాల గురించి ఫీలవుతూ, శ్రోతలు కూడా ఆ మూడ్ లోకి వెళ్ళి ఫీలయ్యేలా చేయటంలో దిట్ట.
    
    శృతి.... ఉద్వేగం.... ఉత్సాహం...ఆసక్తి....అతని కంఠానికున్న ముఖ్య లక్షణాలు.
    
    వాళ్ళు గుహలో ఉండటంతో చుట్టూ పల్చని చీకటి పరచుకుని ఉంది.
    
    శిలలు, శిల్పాలు, చెట్లూ చేమలు, నిర్మానుష్యం, చిరుజల్లు, చల్లని గాలి..... లయబద్దమైన హోరుగాలి....కావాలనే బ్రహ్మ ఆ యువకుడ్ని అలాంటి ప్రాంతానికి తీసుకువచ్చాడు.
    
    మనిషి భౌతికపరమైన వాంఛల నుంచి, ఆలోచనలనుంచి అలాంటి అద్భుతమైన, సుందర ప్రదేశం ఆ మనిషిని డిటాచ్ చేయగలదనే అక్కడకు తీసుకు వచ్చాడు.
    
    ఆ నలుగురూ అక్కడి నుంచి కదిలి గుహలపైకి ఎక్కసాగారు.
    
    "జీరో అవర్స్ టూ జీరో అవర్స్ 31 డిసెంబర్ 1959 పదకొండు డెలివరీలు జరిగాయా నర్సింగ్ హోంలో ఆరోజు ఫైల్లోని ఏడవ పేజీలో మాస్టర్ డెలివరీ వివరాలున్నాయి. ఎనిమిదో పేజీలో నీ డెలివరీ వివరాలున్నాయి."
    
    నలుగురూ గుహలపైనున్న కొండపైకి ఎక్కారు.
    
    అక్కడ పెద్ద మైదానం కనిపించింది.
    
    కొన్నివేల సంవత్సరాల నాటి లోహపు ఫిరంగి గొట్టాలున్నాయక్కడ.
    
    "అప్పట్లో ఈ మైదానంలోనే ఆయుధాల్ని పరీక్షించేవారు. ఆఅనాత్య రాజుల యుద్దాలకు యిక్కడ రూపకల్పన జరిగేది..." బ్రహ్మ చెప్పటం ఆపి ఎడంవేపు తిరుగుతూ "అటు చూడు- అదే న్యూ బొంబాయి. అధిక జనసాంద్రతతో, కాలుష్యంతో, బొంబాయి నగర జీవనం దుర్భరమయి పోయింది. అందుకే మహారాహ్స్త్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో బొంబాయి సముద్రానికి యివతల ఉన్న ఈ మైదానంలో న్యూ బొంబాయికి రూపకల్పన చేయడం జరిగింది. న్యూ బొంబాయికి ప్రస్తుత బొంబాయికి మధ్య సముద్రం వుంది. దానిమీద బ్రిడ్జీ నిర్మించారు. మహాసముద్రంపై నిర్మించిన ఈ బ్రిడ్జీ మీదుగానే రెండు బొంబాయిలకు రాకపోకలు ఈ న్యూ బొంబాయిలో మాస్టర్ తల్లి యశోధగారికి ఒక జ్ఞానమందిరం ఉంది..."
    
    ఆ యువకుడు బ్రహ్మ మాటలకు అడ్డు తగులుతూ "ఇంతకీ ఆ మాస్టర్ ఎలాంటివాడు?" అంటూ ప్రశ్నించాడు.
    
    బ్రహ్మ ఒక్కక్షణ మాలోచించి "ఇదిగో ఇటుకేసి చూడు- అక్కడేం కనిపిస్తోంది? తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం. అలాంటివాడు మాస్టర్" అన్నాడు బేస్ వాయిస్ లో.
    
    కొద్ది క్షణాలు వారిమధ్య నిశ్శబ్దం అలుముకుంది. "ఆ అణు విద్యుత్ కేంద్రం, బోర్లించిన డోమ్ లా కనిపిస్తున్న ఆ ఆటమిక్ రియాక్టర్ చెర్నోబిల్ మాదిరిగా పేలిపోతే ఎలా వుంటుంది? అలాంటివాడు మిల్లర్.... జాన్ మిల్లర్. మాస్టర్ రక్షణకు ఎలాంటి అవాంతరం వాటిల్లనంత వరకు సముద్రానికి, కొండలకి మధ్యన ప్రశాంతంగా ఉన్న ఆ రియాక్టర్ లా వుంటాడు. అవాంతరం ఏర్పడబోతున్నదని తెలిస్తే చెర్నోబిల్ లా చెలరేగిపోయి ఎలాంటి వినాశనం సృష్టించయినా మాస్టర్ ని రక్షించుకుంటాడు" పోను పోను కొత్త కొత్త విషయాలు బయటకు వస్తుండటంతో ఆ యువకుడు కలవరపడ్డాడో క్షణం.
    
    "ఈ మిల్లర్ ఎవరు?"
    
    "సారీ! నాకు కాస్త మతిమరుపు....ఇంతకీ నీ పేరేంటి...?" మహేశ్వర్ తలగోక్కుంటూ అడిగాడు.
    
    "ప్రణవ!" యువకుడు తన పేరు చెప్పాడు.
    
    "అవునుగదా? తరువాత మరలా మర్చిపోతానేమోనని ముందే చెబుతున్నాను. మాస్టర్ ఒక్క అణురియాక్టర్ తోటే సమానమైతే- అతన్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే జాన్ మిల్లర్ మాత్రం పది ఆటమిక్ రియాక్టర్సంత ప్రమాదం. అతన్ని ఏమార్చటమే అన్నిటిలోకి కష్టమైంది" అన్నాడు కళ్ళను ఆర్పుతూ మహేశ్వర్.
    
    ప్రణవ కళ్ళు అనుమానంతో చిన్నవయ్యాయి.
    
    "ఆ వివరాలు తరువాత చెబుతాను. ముందు నీలోని అనుమానాల్ని తీరుస్తాను. పుట్టినప్పుడు నీ బరువు 9.1 పౌండ్స్- కలర్ ప్యూర్ వైట్- 1961లో మరలా నువ్వు అదే హాస్పిటల్ కి తీసుకురాబడ్డావు. చిత్రమేమిటంటే సరిగ్గా అదే తేదీన, అదే నెలలో, ఇయర్ లో మాస్టర్ కూడా అదే హాస్పిటల్ కి తీసుకురాబడ్డావు. అలాగే మాస్టర్ కూడా ఈ యాదృచ్చికాలేమిటో నాకూ ఆశ్చర్యంగానే వుంది. డాక్టర్ అనిబిసెంట్ మెటర్నిటీ నర్సింగ్ హోమ్ లో అప్పట్లో ఒక మంచి చిల్డ్రన్స్ స్పెషలిస్టు ఉండేవారట. జబ్బు చేసినప్పుడల్లా డాక్టర్ ని మార్చటం మంచిది కాదని మీ అమ్మగారు నిన్నక్కడికే తీసుకువచ్చేవారట. ఇకపోతే యశోధరగారికి సెంటిమెంట్స్, నమ్మకాలు ఎక్కువ. మాస్టర్ ఆరోగ్యం ఒకసారి బాగా పాడయితే హాంకాంగ్ లో చూపించారట అయినా జబ్బు తగ్గలేదట. రెండు వారాలు చూసి మాస్టర్ ని తీసుకొని బొంబాయి వచ్చారట. అది 1951లో జరిగింది మాస్టర్ కోలుకున్నాడు 1963లో తీసుకురావటానికి గల కారణాలు గురించి ఇక చెప్పనక్కర్లేదనుకుంటాను. మనం బొంబాయికి తిరిగి వెళ్ళగానే మైక్రో ఫిల్మునుంచి ప్రింట్స్ వేసుంటాయి. వాటిని నువ్వోసారి పరిశీలించవచ్చు" కొండ దిగుతుండగా అన్నాడు బ్రహ్మ.
    
    ఆ తరువాత కొండ దిగేవరకూ ఎవ్వరూ మాట్లాడలేదు. దిగువున ఉన్న ఒక రెస్టారెంట్ లో లంచ్ తీసుకున్నారు నలుగురూ.