"ఫస్ట్ హాఫెనవర్ ఈజోవర్" ప్రొఫెసర్ డిక్లేర్ చేశారు.
    
    "జవాబు చెప్పమంటారా?" అడిగింది ప్రబంధ ఉక్రోషంగా ఆదిత్యని చూస్తూ.
    
    "అవసరంలేదు" బిడియంగా తల తిప్పుకున్నాడు. "ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పండి చాలు."
    
    "వెల్ కమ్!"
    
    ప్రబంధలో పెద్ద సంచలనం లేదు.
    
    కాని శౌరి ఆందోళనగా చూస్తున్నాడు.
    
    ఏ ధైర్యంతో సూరి ఛాలెంజ్ చేశాడో అర్ధమయిన శౌరి యిప్పుడు ఆదిత్య గెలుపు గురించి ఆలోచించడంలేదు. ఒకవేళ ఆదిత్య గెలిస్తే.... ఆ తర్వాత ప్రబంధ ఏం చేయాల్సిందీ గుర్తుకొచ్చి ఉద్విగ్నంతో నలిగిపోతున్నాడు.
    
    ఇందరు విద్యార్ధులముందు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురైన ప్రబంధ అలాంటి సన్నివేశం ఎదుర్కోవాల్సి వస్తే?
    
    ఈ పోటీని ఎలా ఆపాలి?
    
    కనీసం ప్రబంధ గెలుపుగానయినా ఎలా మార్చాలి?
    
    అప్పటికే ఆదిత్యని చూస్తూ ప్రారంభించమన్నట్టుగా సంజ్ఞ చేశారు ప్రొఫెసర్స్.
    
    డిజిటల్ పై అంకెలు శౌరికి తన గుండెలపైన చురకల్లా అనిపిస్తున్నాయి.
    
    "స్టాపిట్!" అరిచాడు శౌరి.
    
                                                                * * *
    
    "ఏమైంది?" కూల్ గా అడిగాడు సూరి.
    
    "నేనీ పోటీకి అంగీకరించను" మొండిగా అన్నాడు శౌరి.
    
    ఓ ప్రొఫెసర్ సర్దిచెప్పాలని పైకి లేవబోయి ఆగిపోయాడు.
    
    "మిస్టర్ శౌరీ!" సూరి ఆవేశపడటంలేదు. మృదువుగా అన్నాడు. "ఈ స్థాయిలో పోటీనుంచి విరమించడమూ అంటే ఓటమిని అంగీకరించడమే..."
    
    "దానికి నువ్వే పేరుపెట్టినా నాకు అభ్యంతరంలేదు...." శౌరి వేగంగా డయాస్ పైకి నడిచాడు "ప్రబంధా-కమిన్."
    
    ప్రబంధలో చలనంలేదు.
    
    అంతసేపూ నిశ్శబ్దంగావున్న ఆడిటోరియంలో వున్నట్టుండి కేకలు మొదలయ్యాయి.
    
    "షేమ్ షేమ్!" ఇంజనీరింగ్ విద్యార్ధులు గట్టిగా అరిచారు.
    
    "బుల్ షిట్" శౌరి ప్రబంధ చేయి పట్టుకోబోతుంటే ఆమె ఆవేశంగా లేచింది.
    
    "అన్నయ్యా!"
    
    శౌరి మధ్యలో చేస్తున్న ఈ హడావుడి ఆమెకు చాలా అవమానకరంగా తోచిందేమో "ప్లీజ్ స్టాప్ దిస్ నాన్సెన్స్."
    
    "నీకు తెలీదు" నచ్చచెప్పబోయాడు.
    
    "పోటీకి సిద్దపడింది నేను సో! ఏ నిర్ణయమయినా తీసుకోవాల్సింది నేను."
    
    "హియర్ హియర్!" ఆడిటోరియంలో నుంచి కేకలు వినిపించాయి.
    
    న్యాయనిర్ణేతలుగా వుండమని అభ్యర్ధించిన శౌరి, ఇలాంటి అవాంతరము కలుగజేయడం సహించలేని ఓ సీనియర్ ప్రొఫెసర్ జోక్యం చేసుకోబోయాడు కాని, వైస్ ఛాన్సలర్ కావడానికి అవకాశమున్న తను ఓ రాష్ట్రముఖ్యమంత్రి కొడుకుతో గొడవ పడటం సమంజసం కాదని నిశ్శబ్దంగా వుండిపోయాడు.
    
    "ప్లీజ్!"
    
    ఈసారి సూరి అభ్యర్ధనగా చూశాడు శౌరి వైపు.
    
    నిజానికి అది అభ్యర్ధనలా లేదు. జూదంలో భార్యను ఓడిన ధర్మరాజుపైన దుర్యోధనుడు చూపిస్తున్న సానుభూతిలా వుంది.
    
    "వస్తావా, రావా?" చివరి హెచ్చరికలా శౌరి ప్రబంధని చూశాడు.
    
    "సారీ!" అంతే మొండిగా అంది ప్రబంధ.
    
    ఇంకా పట్టుదలని ప్రదర్శిస్తే ప్రబంధ ఏ స్థాయికి వెళ్ళేది శౌరికి తెలుసు. లౌక్యం తెలీని ప్రబంధ పదిమంది ముందూ తన పరువు తీస్తుంది. దూకుడుగా కిందికి దిగిపోయాడు శౌరి.
    
    "ప్లీజ్....ప్రొసీడ్!" ఆదిత్యను చూస్తూ అంది ప్రబంధ.
    
    హఠాత్తుగా ఆడిటోరియంలో నిశ్శబ్దం ఆవరించింది.
    
    టైం నోట్ చేసుకున్నారు న్యాయనిర్ణేతలుగావున్న ప్రొఫెసర్స్.
    
    "మగబిడ్డ పుట్టుక్కి కారణం తల్లిదండ్రులలో ఎవరు? ఎందుకు?" ఆదిత్య అడిగాడు తొలిప్రశ్నగా.
    
    ఇంత చచ్చు ప్రశ్న అడుగుతాడని వూహించనందుకేమో రిలాక్సింగ్ గా క్షణం చూసింది ప్రబంధ.
    
    "పురుషాధిక్యంగల ఈ సొసైటీలో మగబిడ్డకి జన్మనివ్వనందుకు భార్యని హింసించి, వంశాంకురంకోసం మరో ఆడదాన్ని కట్టుకోవాలనుకుంటాడు భర్త. కాని మగబిడ్డ పుట్టుక్కి అసలు కారణం ఆడది కాదు. మగడి స్థానంలో వున్న మగాడు" ఇంతదాకా ఉత్సాహంగా చెప్పిన ప్రబంధ ఇప్పుడు కారణం చెప్పటానికి క్షణం సంకోచించింది.
    
    భార్యాభర్తల సంగమం మొదలుకొని పిండం ఫార్మేషన్ దాకా చెప్పాలని వున్నా, ఒక స్త్రీ అయ్యుండి ఆ ప్రాసెస్ వివరంగా తెలియచేయటం ఎంత యిబ్బందికరమైన విషయమో తోచడంతో, ఇది కావాలనే ఆదిత్య తనను ఇరకాటంలో పెట్టడంగా భావించింది.
    
    ఆ ఆలోచనే ఆమె అహాన్ని రెచ్చగొట్టిందేమో కూడా.
    
    "భార్యాభర్తల కలయికలోని క్రోమోజోమ్స్ పేటర్న్ ని బట్టి కడుపులోని బిడ్డ ఆడా లేక మగా అన్నది నిర్ణీతమవుతుంది. కేవలం 'ఎక్స్' క్రోమోజోమ్స్ మాత్రమే వుండే స్త్రీకి ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ గల పురుషుడి నుంచి 'ఎక్స్' సంప్రాప్తిస్తే ఎక్స్ ఎక్స్ గా ఫీమేల్ చైల్డ్ కి కారణమవుతుంది. లేదూ మగాడినుంచి ఉత్పత్తి అయ్యే 'వై' క్రోమోజోమ్ స్త్రీ 'ఎక్స్' తో కలిస్తే 'ఎక్స్ వై'గా ఏర్పడి మేల్ చైల్డ్ కి కారణమవుతుంది.
    
    తొణుకూ బెణుకూ లేకుండా ప్రబంధ చెప్పిన జవాబుకి ఆడిటోరియంలో కూర్చున్న విద్యార్దులంతా ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు.
    
    "రైట్!" ఆదిత్య అభినందనపూర్వకంగా చూశాడు. "యువతులు చాలా ఎత్తుకు ఎదగగలుగుతున్న ప్రస్తుత ప్రపంచంలో అందరికన్నా ఎత్తుకి ఎదిగిన యువతి ఎవరు?"