ప్రదీప్ కారు స్టార్ట్ చేస్తూ అడిగాడు "ఎలా వుంది?"
    
    "మాధవి నా ప్రాణ స్నేహితురాలని చెప్పాక కూడా మీరు..." అని ఆపేశాను.
    
    ప్రదీప్ మొహం ఆశ్చర్యంగా పెట్టి "మాధవి నాకు తెలుసు! మీరు ఆవిడ ఫ్రెండ్...రైట్! అయితే మీరు ముద్దు పెట్టుకోడానికి అనర్హులా? అసలు ఏం చెప్పాలని మీ ప్రయత్నం?" అన్నాడు.
    
    అంత తేలిగ్గా నన్ను తీసిపారేసి మాట్లాడినా సహిస్తానేమో కానీ మాధవిని తీసిపారేస్తే సహించలేకపోయాను.
    
    "అది అమాయకంగా మీ మీద ఆశలు పెంచుకుంది. మీ ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తోంది! మీకేమో దాని గురించి చెప్తే ఆటగా వుంది కదూ?" కోపంగా అడిగాను.
    
    "ఇంకోసారి ముద్దు పెట్టుకుందామా?" అడిగాడు.
    
    నాకేం మాట్లాడాలో తెలీలేదు అసలు నేను చెప్పే విషయాన్ని కేర్ చెయ్యడేంటి?
    
    స్టీరింగ్ ఒక్క చేత్తో పట్టుకుని నా భుజం మీద చెయ్యి వెయ్యగానే "ప్రదీప్...పెళ్ళి కాని ఆడపిల్లల జీవితాలతో ఆటలాడవద్దు!" అన్నాను.
    
    "పెళ్ళి అయిన వాళ్ళతో ఓ.కేగా!" అని నవ్వాడు.
    
    నేను విదిలించుకుని అతని చెట్టి తీసేశాను.
    
    "ఓ.కె. సీరియస్ గా మాట్లాడదాం...మాధవి నా మీద ఆశలు పెంచుకోవడంలో నా తప్పేమైనా వుందా? ఇలా నన్ను నిలదీయడం అన్యాయం కాదూ! అలాగే మీరు మాధవి ఫ్రెండ్ అవడంలో కూడా తప్పేంలేదు. మనుష్యులన్నాకా స్నేహితులూ, బంధుఉలూ వుంటూనే వుంటారు! కానీ నేను మిమ్మల్ని ముద్దుపెట్టుకోవడం మీకు అభ్యంతరమైతే మాత్రం అది నేరమే! స్ట్రయిట్ గా పోలీస్ లకి ఫోన్ చెయ్యండి.....ఇదిగో సెల్!" అన్నాడు.
    
    "అసలు మీకు ఏ స్త్రీ గురించీ ప్రత్యేకమైన ఫీలింగ్స్ వుండవా? మాధవి చెప్పిన దానిని బట్టి చూస్తే ఆమెని ప్రేమించారనుకున్నానే!" ఒకలాంటి ఉత్సుకతతో అడిగాను.
    
    "నాకు పరిచయమైన ప్రతి స్త్రీ ప్రత్యేకమే. ఆమె సుఖంగా, సంతోషంగా వుండాలనే కోరుకుంటాను. కానీ ఆ సుఖం సంతోషం నాతో ముడివేసి తన దుఃఖానికి నన్ను కారణభూతుడ్ని చేస్తే నవ్వొస్తుంది. జాలి పడతాను. నీకు నేనెంత చేసానో తెలుసా? అన్నప్పుడు మాత్రం! 'నీకు ఇష్టం, సంతోషం కలగనప్పుడు నువ్వెందుకు చేస్తావు? ఇష్టంగా చేసినప్పుడు నువ్వూ సంతోషం పొందావు కాబట్టి ఇంక త్యాగం చేసిన ఫీలింగ్ ఎందుకు?' అని అడగాలనిపిస్తుంది. ఇంక రెండో పాయింట్....మాధవిని నేను ప్రేమించాను. మిమ్మల్నీ ప్రేమించాను. ఇంకా చాలామందిని...ఎవరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత లేకుండా వుండదు కదా! అందుకే నేను వారిని ప్రేమిస్తాను. వెన్నెలలో చల్లదనాన్నీ మంచి గంధంలోని సువాసననీ, కొబ్బరి నీటిలోని తియ్యదనాన్నీ, వేణునాదంలోని మాధుర్యాన్నీ సమానంగా ప్రేమిస్తాంకదా! ఆ ప్రేమలో హెచ్చుతగ్గులుంటాయా? అప్పుడే పూసిన పువ్వునీ, మనసులోంచి వచ్చిన నవ్వునీ, అందమైన రూపాన్నీ, రుచికరమైన పదార్ధాన్నీ ఇష్టపడనివాళ్ళు వుండరేమో!....ఏవిటీ అలా స్పెసిమన్ ని చూసినట్లు చూస్తున్నారూ? నా లాజిక్ మీకు అందదు లెండి. వదిలేద్దాం. మీకు బీర్ గట్రా తీసుకునే అలవాటుందా? లేక కొబ్బరినీళ్ళు, కాఫీలతో సరిపెట్టేస్తారా?" అన్నాడు.
    
    ఇతని గురించి చెపుతున్నప్పుడు వెలిగిపోయిన మాధవి ముఖం నా కళ్ళల్లో మెదుల్తోంది. ఎంత దురదృష్టం కాకపోతే ఇలాంటి పురుషుడు తారసపడతాడూ? అసలు మగాడంటేనే చిరాకు పడుతూ ఆమడ దూరం జరిగిపోయే దానికి ఇతని మీద ప్రేమ కలిగింది. అదేదో ఇంకెవడి మీద కలిగినా దాని జీవితం ఆనందమయ్యేది. ఇప్పుడు ఇతని మనస్తత్వం....తత్వం...వ్యక్తిత్వం గురించి దానికి అర్ధమయ్యేలా చెప్పడం ఎలా? అతను ఎంత అందంగా కన్విన్స్ చేస్తాడంటే అసలు అతని తప్పేం లేదనిపిస్తుంది!
    
    "మనం ప్రయాణం చేస్తున్నంతసేపూ ఆలోచిస్తూనే వుంటారా?" మీలో మీరు తర్క వితర్కాలు మీమాంసలూ పడుతూనే వుంటారా? నవ్వుతూ అడిగాడు.
    
    "మీరు నాకెందుకు పరిచయం అయ్యారు? బాధగా అడిగాను.
    
    "మీరనుకునేదే ప్రపంచం కాదని తెలియజెయ్యడానికి" అదే చిరునవ్వుతో అన్నాడు.
    
    "కనీసం మీరు మా మాధవికి పరిచయం అవకపోయినా బావుండేది!" ఎంతో గిల్టీ ఫీలింగ్ తో అన్నాను.
    
    నవ్వి "మన మాధవి అనొచ్చు కదా!" అన్నాడు.
    
    నాకు ఎందుకో కన్నీళ్ళు వచ్చాయి.
    
    ఆనంద్ ఎంత కోరుకున్నా రాని కన్నీళ్ళు!
    
    అతను నన్ను దగ్గరగా తీసుకున్నాడు.
    
    "నేను వెళ్ళిపోతాను" అన్నాను.
    
    "ఎందుకు?"
    
    "భయం!"
    
    "రేప్ చేస్తానేమోననా?"
    
    "కాదు....మిమ్మల్ని ప్రేమిస్తానేమోనని!"
    
    "అయితే పంపించేస్తాను."
    
    మోహమంత స్వార్ధమయింది. ఇంకోటిలేదు! అతని సాహచర్యంలో ప్రపంచాన్ని మరచిపోవాలనిపిస్తుంది. ఇంక ఆ ప్రపంచంలో ఒక్కతైన మాధవి ఎంత? భయం....సంకోచం....ఆపుకోలేని కోరిక....బిడియం.....పాప భీతి....ఇవన్నీ నాలో కలగాపులగంలా కలుగుతున్నాయి. ఆనంద్ గుర్తుకొస్తే....హృదయం భగ్గుమని వెంటనే వెళ్ళి ప్రదీప్ ఒడిలో వాలిపోవాలనిపిస్తోంది. విషయం అతనికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలనిపిస్తోంది. నేను అతని చేతిలో చచ్చినాసరే! తను పెంచుకున్న కుక్కపిల్ల....తను తన్నినా సరే ఇంకోళ్ళ వెనకాల పరిగెడితే ఊరుకునే స్వభావం కాదతనిది! తాళి కట్టిన భార్య విషయంలో వూర్కుంటాడా? తన బానిస....అతని దృష్టిలో ఖరీదైన బానిస.....తను తన్నినా ఆ బాధలన్నీ పడుతూ పడి వుండాల్సిందేగానీ ఇంకోడి దగ్గరికి వెళ్ళకూడదు. ఇంకొకరి మీద ఆ భార్యకు మనసు పుట్టకూడదు. తనకు అక్కర్లేకపోయినాసరే ఆ దేహం, ఆత్మా అన్నీ రైట్స్ కొనుక్కున్నట్లు ఫీలవుతాడు. అతను తాగిన మైకంలో ప్రియంవదతో తాను వెలగబెట్టొచ్చిన శృంగారం.... పచ్చిబూతులతో వర్ణించి చెపుతుంటే నా మనసు ఎంతగా మండిపోయిందో అతని మనసూ అలాగే మండాలి.... వీలైతే ఎదురుగా ప్రదీప్ శృంగారం చెయ్యాలి. అది చూసి అతను కోపంతో పిచ్చివాడైపోవాలి. చంపేస్తాడో....లేక నా కాళ్ళు పట్టుకుని లోకానికి మాత్రం తెలియకుండా రహస్యంగా సాగించమని బేరాలాడతాడో చూడాలి! ఆనంద్ పరంగా ఇలా సాగుతున్న ఆలోచనలు...మాధవి గుర్తుకు రాగానే షాక్ కొట్టినట్లు ఆగిపోతున్నాయి. ప్రపంచంలో ఎవరూ శాసనాలకి లొంగలేదు. శిక్షలకి వెరవలేదు. అధికారానికి జంకలేదు. కానీ ఒకే ఒక దానికి తలవంచి ఆగుతున్నారు. అదే నీతి! అందుకే లోకం ఈ మాత్రంగానైనా వుంది అని నేను మనసా వాచా కర్మణా నమ్ముతున్నాను.