శరత్ మైకు దగ్గరకు రావడంతో ఆగకుండా మోగుతున్న కరతాళ ధ్వనులతో హోరెత్తుతున్న హాలు ఒక్కసారిగా నిశ్శబ్దం అయింది.

 

    శరత్ చంద్ర మృదువయిన కంఠాన్ని మైకు రిసీవ్ చేసుకొని మల్లెపూల పరిమళంలా అందరికీ వెదజల్లింది.


    "డియర్ ఫ్రెండ్స్!"

 

    ఒక్క క్షణం ఆగాడు.

 

    ఏం చేయబోతున్నాడోనన్న ఉత్కంఠతో అందరూ ఎదురు చూస్తున్నారు.

 

    "ఈ అవార్డు పొందడానికి ముందు నేను చేసిన కృషిలో ప్రధాన భాగస్వామి మరొకరు వున్నారు. ఆ వ్యక్తి పేరు నేనిక్కడ చెప్పకపోతే నాకు మనశ్శాంతి వుండదు.

 

    తెరవెనుక ఎంతో కృషిచేసి కూడా చరిత్రలో పేరు రానివాళ్ళలాగే నాతోపాటు పనిచేసిన అనస్థటిస్టులూ, నా అసిస్టెంట్సూ పెర్ ప్యూజనిస్టులూ కూడా వున్నారు. వృత్తిపరంగా కాకపోయినా వీరందరికీ భిన్నంగా నా వెనుక మరొక వ్యక్తి ఉంది."

 

    మళ్ళీ ఆగాడతను. అందరికీ ఉత్కంఠ పెరిగింది.

 

    ముందు వరుసలో కూర్చున్న నీలిమకి టెన్షన్ తో వూపిరాడటం లేదు. 'వుంది' అంటున్నాడు. ఆమె రవళి కాదుగదా! అని గుండెలో దడ పుట్టింది.

 

    రెప్పవేయటం కూడా మర్చిపోయి కళ్ళు విప్పార్చి అతన్నే చూస్తోంది.

 

    "కొన్నేళ్ళుగా రాత్రింబగళ్ళూ ఒంటరి జీవితాన్ని గడుపుతూ, నా కుటుంబ బాధ్యతల్ని, ఒడిదుడుకులన్నీ ఒక భుజంమీద మోస్తూ పేరుకు మాత్రమే దాంపత్య జీవితమైనా, పంచుకునే మనిషి ప్రక్కన లేకుండా గడిపిన నా భార్య మిసెస్ నీలిమ ఆ వ్యక్తి! నా కుటుంబ బాధ్యతలకు ఆమె అండ లేకపోతే నేను నా పనిలో ఇంతటి ఏకాగ్రతని చూపించగలిగేవాణ్ణి కాదు. ఆ విధంగా నా పనిలో భాగస్వామి అయిన నా భార్యకి ఈ అవార్డు అందించడం నాకు సంతోషాన్ని కలిగిస్తుందని నేను విన్నవించుకుంటున్నాను."

 

    అతను చెప్పడం ముగించాడు.

 

    స్టేజీమీదా, హాలులోనూ మళ్ళీ కరతాళ ధ్వనులు చెలరేగాయి. ఆ ధ్వనుల మధ్య నీలిమని స్టేజి మీదకి రావల్సిందిగా ఎనౌన్స్ మెంట్ వెలువడింది.

 

    జరిగిందంతా నీలిమ నమ్మలేకుండా వుంది.

 

    ప్రపంచ మహాసభలో తన గురించి శరత్ చంద్ర చెప్పిన మాటలు మెల్లమెల్లగా గుండెను స్పర్శించి 'చంద్రా' అని మూలిగింది. మనస్సు కదిలిన జలపాతంగా కళ్ళు వర్ణించడం మొదలయింది. కాస్సేపు ఏమీ తోచలేదు.

 

    కళ్లు తుడుచుకుంటూ కూర్చుంది.

 

    జనం ఆమెని చూడటానికి కుతూహలంగా ఎదురు చూస్తున్నారు. కదలకుండా కూర్చుని పిచ్చిదానిలా తననే చూస్తున్న నీలిమని 'స్టేజీ' మీదికి రమ్మని సైగచేశాడు శరత్ చంద్ర.

 

    మెల్లగా లేచి మరుమల్లెదండ కదులుతున్నట్లు బరువయిన అడుగులతో స్టేజీ మీదకి వెళ్ళింది.

 

    మిసెస్ నీలిమ శరత్ చంద్ర అవార్డు అందుకుంటున్న దృశ్యాన్ని కెమేరాలు అందంగా బంధించాయి.


                                                    *    *    *    *

        
    అది హోటల్ గది. తెల్లవారు జామున మూడవుతోంది. నీలిమ శరత్ గుండెమీద తలపెట్టుకొని పడుకొని వుంది. ఆమె కళ్లలో తడి ఇంకా ఆరడం లేదు.

 

    ఉండుండి దుఃఖం పొంగుకొస్తుంది. సంవత్సరాల తరబడి పేరుకుపోయిన దుఃఖం అది. ఆ రాత్రంతా ఆమె భర్తతో మాట్లాడ్తూనే వుంది. ఎంత మాట్లాడినా చెప్పవల్సింది ఇంకా మిగిలే వుంటోంది.

 

    చెప్పవలసినవన్నీ నిక్షిప్తం చేసుకొని ఇన్నాళ్లూ మూగబోయిన మనసది. ఘనీభవించిన మంచు పర్వతం కరిగిపోతున్నట్లు ఆమె మనసు ఇప్పుడు తేలికపడుతోంది. ఆమెని గుండెల్లో పొదువుకొని అన్నీ వింటున్నాడు శరత్ చంద్ర.

 

    ఆమెను బాధపెట్టిన చిన్న చిన్న విషయాలకు కూడా తనవేపు నుండి వివరణ ఇస్తున్నాడు. జీవన్ విషయం కూడా చెప్పడం మంచిది అనిపించింది.

 

    చాలా మామూలుగా ఆమెని కంగారుగా పడనీకుండా చెప్పాడు మెల్లగా.

 

    ముందు నమ్మలేకపోయింది నీలిమ. విషయం మనసుకెక్కిన తర్వాత తట్టుకోలేకపోయింది.

 

    "ఇప్పుడే వెళ్ళిపోదాం. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను. వాడిని చూడాలి" అంటూ ఏడ్చింది.

 

    "భయపడకు నీలూ! అక్కడ రంజిత్ జీవన్ ని చూసుకుంటున్నాడు. కొద్దిగా మార్పు కూడా వుందని వచ్చేముందు చెప్పాడు. రంజిత్ ని మన ఇంటిలో వుంచిన కారణం కూడా ఇదే! వెళ్ళిన తర్వాత జీవన్ ని నువ్వే చూసుకోవచ్చు! భయంలేదు" అంటూ ఓదార్చాడు.

 

    "ఊహూ.... నేనుండలేను" అంటూ మారం చేసింది.

 

    "ఇప్పుడంటే ఇప్పుడే వెళ్ళిపోవడానికి ఇదేం హైదరాబాద్ టు అనకాపల్లి ప్రయాణం కాదుగా. ప్యారిస్ నగరం చూడటానికి మళ్ళీ మళ్ళీ రాగలమా? ఉదయమే పోన్ చేసి జీవన్ తో మాట్లాడుదాం" అని బ్రతిమాలాడు.

 

    అర్ధాంగీకారంగా మరి మాట్లాడలేదు నీలిమ. ఆ ఉదయం జీవన్ తో మాట్లాడాక, నాలుగు రోజులు తర్వాత ఇండియా తిరిగి వచ్చేవరకూ హనీమూన్ లా గడిచింది ఆ ఇద్దరికీ.


                                                   *    *    *    *

        
    శరత్ చంద్ర ప్యారిస్ నుండి తిరిగొచ్చి వారం రోజులయింది. అతను మళ్ళీ హాస్పిటల్ పనిలో నిమగ్నమైపోయాడు.

 

    ఆ రోజు.... ఉదయం ఎనిమిది గంటలవుతుండగా శరత్ చంద్ర కారు హాస్పిటల్ ఆవరణలో ప్రవేశించింది. అతని కారు వెనుకే ఒక అంబులెన్స్ "కుయ్యి..... కుయ్యి...." మని శబ్దం చేస్తూ వేగంగా వచ్చి ఎమర్జన్సీ గేటు దగ్గర ఆగింది.

 

    ఏదో ఎమర్జన్సీ కేసు అనుకుంటూ కారు పార్కింగ్ స్థలం వేపు వెళ్ళి కారు పార్కు చేసి తన గదిలోకి వెళ్ళాడు.

 

    "సార్ ఎమర్జన్సీ కేసు. అర్జంటు కాల్ వుంది!" సెక్రటరీ చెప్పింది.

 

    "కేసు ఎక్కడ?"

 

    ఆమె చెప్పింది.

 

    పరుగువంటి నడకతో ఐ.సి.సి.యు. కి చేరాడు.

 

    అంబులెన్స్ నుండి దించిన రోగి ఇంకా స్ట్రెచర్ మీదనే ఉన్నాడు. డాక్టర్ రఘు, అతని అసిస్టెంట్స్ స్ట్రెచర్ మీదే ఎమర్జన్సీ ట్రీట్ మెంట్ చేస్తున్నారు.

 

    దగ్గరగా వెళ్ళి వాళ్ళ మధ్య నుండి రోగిని తొంగిచూస్తూనే ఖిన్నుడయ్యాడు శరత్.

 

    స్ట్రెచర్ మీద వున్నది భగవంతం!

 

    శరత్ చంద్రని చూస్తూనే చేతులెత్తి నమస్కరించాడు.

 

    "ఛ! ఏమిటిది? వాట్ హ్యాపెండ్?" అంటూ అతని రెండు చేతులనీ అలాగే ఆప్యాయంగా పట్టుకున్నాడు శరత్ చంద్ర.

 

    "నాకు హార్ట్ ఎటాక్! నన్ను మీరే బ్రతికించాలి! ఆపరేషన్ మీరే చేయాలి" కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా అన్నాడు భగవంతం.

 

    "మీరు ధైర్యంగా వుండండి. భయం లేదు. నేను అన్నీ చూసుకుంటాను. ప్రశాంతంగా వుండండి!" అన్నాడు శరత్ చంద్ర అతని తల నిమురుతూ.

 

    "శరత్ చంద్రా! ఈయనకు యాంజియోగ్రాం చేయాలి" అన్నాడు రఘు.

 

    "పదండి! త్వరగా పని జరపాలి!"

 

    స్ట్రెచర్ అక్కడి నుండి కదిలింది.

 

    "సర్!" రాజ్యం పిలుపుకు వెనుదిరిగి చూశాడు శరత్ చంద్ర.

 

    "సర్! ఆయన మీ శత్రువు" అంది.

 

    "శత్రువా? నాకెవరూ శత్రువు కాదు. అతనే నన్ను శత్రువుగా చూశాడు. ఇప్పుడు అతనికి నా సహాయం కావాల్సి వుంది. నిస్సహాయ స్థితిలో వున్న పరమ శత్రువుని కూడా పసిపిల్లవాడితో సమానంగా చూడవలసిన వృత్తి మనది" అంటూ మరో యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లు అక్కడి నుండి ఠీవిగా కదిలాడు.

 

    అతని చూపు ఆపరేషన్ థియేటర్ మీద నిలిచి వుంది. అక్కడ మరో యుద్ధం మొదలవబోతోంది. అక్కడ అతని పోరాటం ఆగదు.

 

    అతని యుద్ధం మృత్యువుతో.... అజ్ఞానంతో....! అతడు యోధుడు!

 

    వేల గుండెల్ని గుప్పిట్లో పొదువుకుని మృత్యువుని నిత్యం సవాలు చేస్తున్న అతను 'వీర యోధుడు!'

 

    సైన్స్ అతని కరవాలం! మానవుడు అతని సంగీతం!


                                                     * శుభం *