"వెరీగుడ్" నానీని ముద్దుకూడా పెట్టుకుంది. అంత పెద్దకారున్న అమ్మాయి తనను ముద్దుపెట్టుకోవడం చాలా సంతోషమనిపించింది.

 

    మన్మథరావుని చూస్తూ "నేనడిగిన సమస్యకి అర్థం తెలుసుకోడానికి నువ్వెంత మధనపడి వుంటావో వూహించగలను మనూ! నీకు తెలుసుగా చిన్నప్పటినుండి నిన్ను ఆటపట్టించడమంటే నాకిష్టమని. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం" అంది అప్పటిలాగే.

 

    ఆ చెప్పడంలో ఎలాంటి భావుకతా లేదు, ఉద్రేకంలేదు.

 

    "థాంక్యూ రతి! మారిపోయావనుకున్నాను."

 

    "ఎందుకనుకున్నావు?"

 

    "నువ్వెక్కడ" నేనెక్కడ?"

 

    "స్నేహానికి, ఇష్టానికి ఈ అంతస్తులేమిటి?"

 

    ఆ మాటలు వింటూంటే దాగలేనమ్మా అంటూ స్మృతుల నీటిపొర అతడి కళ్ళల్లో పేరుకుపోయింది.

 

    "ఎలా మరచిపోగలను మన్మథరావ్! మనం తిరిగిన ఈ ప్రదేశాలనీ, మనల్ని పలకరించే ఈ చెట్లనీ, చేమల్ని ఎప్పటికీ మరిచిపోలేను. నిన్నూ అంతే."

 

    "అంటే" ఒక చిన్న అపశృతి ధ్వనించిందామె పదజాలంలో. "నేను... నేను అంతకుమించి ఏమీకానా రతీ?" కంపించిపోతూ అడిగాడు.

 

    "ఏమౌతావు మనూ! అవి మాట్లాడలేవు. నువ్వు మనసులోనిది చెప్పగలవు అరె! ఎందుకలా అయిపోతున్నావు? నీకు తెలుసుగా నేను చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తానని."

 

    దోసిలిలోని పూలు దేవత పాదాలపై నైవేద్యంగా అర్పించకముందే పెనుగాలికెగిరి నేలపైపడినట్లు ఆందోళన పడిపోతున్నాడు. "నువ్వూ... నువ్వింకా ఆటపట్టిస్తున్నావు కదూ!"

 

    "నీ దగ్గర నాకా చనువుంది మనూ! నిన్ను జీవితాంతం ఆటపట్టించగలను. అది నా కేరక్టర్."

 

    ఆమె చాలా మెటీరియలిస్టిక్ గా ఆలోచిస్తోంది తప్ప ప్రేమ విషయంలో ఆటపట్టించడంలేదని ఊహించలేకపోతున్నాడు "అంటే! మనప్రేమ" గొణిగాడు తలవంచుకునే.

 

    నవ్వేసింది. అతడి మనోభావాల్ని పూర్తిగా అర్థంచేసుకున్నట్టు "పిచ్చి మనూ! నువ్వు రచయితై ఎంత పొరపాటు చేశావో ఇప్పుడు నాకర్థమైంది. నీ ఇమేజినేషన్స్, నీ యిల్యుషన్సూ ఎంతవరకు ప్రయాణం చేస్తున్నాయి అంటే అప్పటి మన స్నేహంతో నన్ను పెళ్ళికూడా చేసుకోవాలనుకుంటున్నావు డోంట్యూ థింగ్ ఇట్సే రెడిక్యులస్! నన్ను చెప్పనియ్ మనూ! ప్రతిప్రాణికి వయసుకుతగ్గ కొన్ని అభిరుచులుంటాయి. యస్! నిజమే. చిన్నతనంలో కాలువలో కొట్టుకుపోయే తాటిపండుకోసం దూకి సాహసంచేసి మరీ తెచ్చుకోవాలనిపిస్తుంది. చెట్టు ఆకుపై వాలిన తూనీగ తోకకు దారంకట్టి ఆడుకోవాలనిపిస్తుంది. అంటే ఎల్లకాలం మనం అలాగే ప్రవర్తిస్తామని అర్థంకాదుగా. వయసుతో ఇష్టాలు మారతాయి. పెరిగే మనసు ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంది. దట్స్ లైఫ్!"

 

    అనూహ్యమైన షాక్ నుంచి ఇంకా తేరుకోలేనట్టు అలాగే నిలబడిపోయాడింకా. చెట్టుపై ఎప్పుడో రాయబడిన 'రతీ మన్మథుల పెళ్ళంట' ఎగతాళి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.

 

    "మనూ! నీకిష్టమైనట్టు పాత్రల్ని సృష్టించి వాటిని నీకిష్టమైనట్లు నడిపిస్తూ మంచి రచయితవైపోయావు. అలా అని నీ యిష్టప్రకారం నేను నడవటానికి నేను నీ పాత్రని కాదుగా. పాత స్నేహితురాల్ని. చించెయ్. నీ ఆలోచన పుటల్లో ఎక్కడున్నా ఇంకా నా రూపం మిగిలివుంటే తుడిచిపెట్టి మరో అమ్మాయిని పెళ్ళిచేసుకుని సుఖంగా బ్రతుకు" ఈసారి అతడి కళ్ళనుంచి నీళ్ళు చెంపలపైకి జారాయి. "గాడ్! ఏం మనిషి నువ్వు? మగాడివయ్యుండి ఆ కన్నీళ్ళేమిటి? నాకు తెలియకడుగుతాను నీ స్టేటసేంటి మనూ. నువ్వు ఓ ఏడాది కష్టపడి సాహిత్యంపై సంపాదించిన డబ్బు నేనో నెలకి ఖర్చుచేసే కాస్మటిక్స్ కి సరిపోదే! ఎలా నిన్ను పెళ్ళి చేసుకుంటాననుకున్నావు? ఇట్సే సింపుల్ లాజిక్"

 

    వెళ్ళబోతూ ఆగింది. "నేను భాషాప్రవీణను కాబట్టి ఇలాంటి సన్నివేశాన్ని చదవడంలో థ్రిల్ ఫీలవుతాను. నిజం. నేను ఓరియంటల్ కాలేజీలో చేరింది అందుకే. అలా అని మోడరన్ థింకింగ్ లేని ఆడపిల్లనని ఎలా అనుకున్నావు? అత్తయ్యగార్ని అడిగానని చెప్పు. పాపం ఆరోగ్యం బాగా లేదన్నావుగా. చివరగా ఒక్కమాట. ఎవరన్నా చెబితే అది వార్త. నీ అంతట నువ్వు తెలుసుకుంటే అది నిజం. అదే ఇప్పుడు నేను పర్సనల్ గా తెలియజేసింది కూడా."

 

    వెళ్లిపోయింది మామూలుగా.

 

    చెట్టు మొదల్న మన్మథరావు మోకాళ్ళపై తలానించుకుని వుండిపోయాడు చాలాసేపటిదాకా.

 

    ఇంకా నమ్మలేకపోతున్నాడు. తను దశాబ్దాల స్మృతులలో నిర్మించుకున్న ఓ ప్రేమమందిరాన్ని ఆ మందిరంలో పారాడిన దేవతే పాదాలతో తన్ని వెళ్ళిపోతుందని.

 

    "ఎవరన్నా చెబితే అది వార్త. నీ అంతట నువ్వు తెలుసుకుంటే అది నిజం" ఈ వాక్యం నానీకి పూర్తిగా అర్థంకాలేదు. కొంత అర్థమైంది. అదికాదు నానీని ఆ క్షణాన ఏ కొద్దిగానైనా కలవరపరిచింది.

 

    తను కొన్ని గంటలపాటు తాతయ్య చెప్పిన కథలోలాంటి మనుషుల్ని చూశాడు. కాని ఇప్పుడు జరిగిన కథ తాతయ్య చెప్పిన కథంత ఆనందాన్నివ్వలేదు. ఏదో వెలితి. రాసాభాసం చెందిన ఓ శృంగార కావ్యమని గుర్తించేటంత వయసు లేకపోయినా చాలా చాలా అసంతృప్తుడిలా 'అంకుల్'ని సమీపించబోయాడు.