"విమలా! ఏమయింది?" ఆత్రుతతో అడిగాడు రెండడుగులు ముందుకువేసి.

 

    విమల జవాబ్బివ్వలేదు.

 

    ఉధృతం అయిన దుఃఖాన్ని దిగమింగే ప్రయత్నంలో ఇంకా పెద్దగా వెక్కిళ్ళు రాసాగాయి.

 

    సత్యం గాబరా పడ్డాడు. మరో రెండడుగులు ముందుకు వేశాడు. వచ్చి ఆమె కుర్చీ పక్కగా నిల్చున్నాడు.

 

    "ఏమండీ, ఏమయింది? మాష్టరుగారు కులాసాగా వున్నారా?" ఆదుర్దాగా ప్రశ్నించాడు.

 

    విమలనుంచి జవాబు లేదు.

 

    వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆ దుఃఖం చూస్తుంటే ఎంతోకాలం నుంచి హృదయంలో గడ్డకట్టుకొనివున్న ఆవేదన ఒక్కసారిగా కరిగి వెల్లువై వరదలా ప్రవహిస్తోంది అని అనిపిస్తోంది.

 

    సత్యానికి భయం, చిరాకు కూడా కలిగాయి కారణం తెలియకపోవడంవల్ల.

 

    "చెప్పండి ఏం జరిగింది?" అసహనంగా ప్రశ్నించాడు.

 

    విమలనుంచి ఎలాంటి సమాధానం లేదు.

 

    సత్యం అప్రయత్నంగానే ముఖానికి కప్పుకొన్న ఆమె చేతుల్ని విడదీస్తూ అన్నాడు.

 

    "ఎందుకింతగా ఏడుస్తున్నారు? మాష్టారు ఎలా ఉన్నారు?"

 

    విమల తన చేతులమీద ఉన్న సత్యంచేతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని, అతని అరచేతిలో ముఖం దాచుకొని ఏడ్వసాగింది. దుఃఖం మళ్ళీ ఉవ్వెత్తుగా లేచింది.

 

    సత్యం గాబరాగా నిల్చున్నాడు.

 

    "నాకు భయంగా ఉంది. చెప్పండి. ఎందుకు ఏడుస్తున్నారు?" అన్నాడు తన కుడిచేతిని ఆమె చేతులనుంచి విడదీసుకునే ప్రయత్నం చెయ్యకుండానే.

 

    "ఏమీలేదు..... ఊరికే ఏడుస్తున్నాను-" వెక్కిళ్ళ మధ్యలో అంది విమల.

 

    సత్యం తెల్లబోయి చూశాడు.

 

    "ఊరికే ఏడుస్తున్నారా?" ఆశ్చర్యం ధ్వనించింది అతనికంఠంలో. తన చేతిని విమల చేతులనుంచి చిన్నగా లాక్కున్నాడు.

 

    "మీరు నన్ను అవమానించారు-" ముఖాన్ని పైటచెంగుతో తుడుచుకుంటూ అంది విమల.

 

    సత్యం అదిరిపడ్డాడు. ఓ క్షణం ఆమెవైపు దీక్షగా చూశాడు.

 

    విమల మునిపంటితో కింది పెదవిని కొరుక్కుంటూ దుఃఖాన్ని ఆపుకొనే ప్రయత్నంలో సతమతమవుతోంది.

 

    "నేను మిమ్మల్ని అవమానించానా?"

 

    విమల తలవంచుకొని అలాగే కూర్చుంది శోకమూర్తిలా.

 

    "నేను మిమ్మల్ని అవమానించటమా? నాకేమీ తెలియడంలేదు. మీరంటే నాకెంతో గౌరవం. మాష్టరుగారు నాకు ఆరాధ్యదైవం. మీ కుటుంబంలోని సభ్యుల్ని కలలోకూడా చిన్నచూపు చూడలేని నేను మిమ్మల్ని అవమానించానా?" సత్యం మాటలు తనకు తానే చెప్పుకుంటున్నట్లున్నాయి మంద్రస్థాయిలో.

 

    విమల మరోసారి పైటచెంగుతో ముఖం తుడుచుకున్నది.

 

    "చిన్నప్పటినుంచి మీరంటే నాకెంతో గౌరవం!"

 

    "హుఁ గౌరవం! గౌరవం! ఎవరికి కావాలి ఈ గౌరవం?" విమల నిర్లక్ష్యంగా, విసుగ్గా అంది, సత్యం మాటలకు మధ్యలోనే అడ్డుపడుతూ.

 

    సత్యం విమల ముఖంలోకి విస్తుబోయి చూశాడు.

 

    "గౌరవం అనే పదాన్ని అంత తేలిగ్గా తృణీకరించకండి! ఇతరులచేత గౌరవించబడాలని ఎవరికుండదు?" ఈ గౌరవంకోసం ఎంతమంది మనస్సులో లేని మంచితనాన్ని పైకి చూపించడంలేదు? మనిషి డబ్బుకంటేకూడా ఇతరులచేత గౌరవించబడాలని ఆకాంక్షిస్తాడు! ఒకరిచేత నిజంగా గౌరవించబడడంకంటే మానవజన్మకు సార్ధకత ఏముంది?" పైకి అనాలనుకున్న మాటల్ని మనస్సులోనే అనుకున్నాడు సత్యం.

 

    "గౌరవించబడాలని మీకు ఉండదూ?" అనిమాత్రం అడగ్గలిగాడు.

 

    "ఉంటుంది, గౌరవాన్ని పొందాలని ఎవరికుండదు?"

 

    "మరి.....?"

 

    "అందరిచేతా అన్నిచోట్లా కాదు. మనిషికి కావాల్సింది కేవలం గౌరవించబడటమేకాదు" అంది విమల తగ్గుస్థాయిలో.

 

    సత్యం అయోమయంగా చూశాడు విమల ముఖంలోకి. ఏదో అర్ధంచేసుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లు ఆమె ముఖంలోకి, కళ్ళలోకి లోతుగా చూశాడు.

 

    ఆ చూపులను తట్టుకోలేక విమల ముఖం దించుకొంది. ఆమె చెక్కిళ్ళు కొంచెంగా జేవురించడం సత్యం కళ్ళపడింది.

 

    అతనికి ఏదో లీలగా తోచింది.

 

    ఓ క్షణం ఆశ్చర్యం కలిగింది.

 

    మరుక్షణంలోనే తత్తరపాటు కలిగింది. ఆనందం, విషాదం సమ్మేళనంవల్ల వింత అనుభూతి కలిగింది.

 

    ఇది నిజమేనా? తను ఊహిస్తున్నది నిజమేనా? కాదు- అలా ఎన్నటికీ కాకూడదు. ఇంత విజ్ఞానవతి తనలాంటి ఏ డిగ్రీలు లేనివాణ్ణి ప్రేమించటమా?

 

    లేదు, తను పొరపాటు పడుతున్నాడు! తనతోపాటు పెరిగిన సరళ-తన మనస్సు అర్ధం చేసుకోగలదని నమ్మిన సరళే తనను స్వీకరించలేకపోయింది.

 

    తను అవిటివాడు. తనను ఏ స్త్రీ కూడా చూస్తూ చూస్తూ ప్రేమించలేదు. ఒకసారి దెబ్బతిన్న తన హృదయం.... అలా భ్రమపడుతుంది-అంతే. అది నిజం కాదు. కాకూడదు.

 

    సత్యం వెనక్కు తిరిగి కిటికీదగ్గరకు వెళ్ళి బయటకు చూస్తూ నిల్చున్నాడు. బుర్రలో లక్ష ప్రశ్నలు అల్లిబిల్లి తిరుగుతున్నాయి.

 

    తనలో చోటు చేసుకోవటానికి ప్రయత్నిస్తున్న బలహీనతను బలంగా బయటకు నెట్టటానికి ప్రయత్నిస్తున్నాడా అన్నట్లు కిటికీ చువ్వను గట్టిగా పట్టుకున్నాడు.

 

    బయటకు చూస్తున్నాడు. అతనికి ఏమీ కన్పించడంలేదు.

 

    మనసులోని సంచలనాన్ని అదుపులో పెట్టుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు.

 

    విమల ఎందుకు అంతగా ఏడ్చింది? అంత విజ్ఞానవతి, ఎంతో గంభీరంగా కన్పించే ఆమె, పసిపిల్లలా ఎందుకు ఏడ్చింది? ఆమె దుఃఖం యిప్పటికిప్పుడు కలిగిన బాధవల్ల వచ్చింది కాదు. ఎంతోకాలంగా హృదయంలో ఘనీభవించిన ఆవేదన ఒక్కసారిగా చల్లనిగాని తగిలిన మేఘంలా భోరున కురిసింది.

 

    ఆ దుఃఖం వెనక ఏదో దాగిన రహస్యం వుందనిపిస్తుంది. అంటే తను ఊహించింది సత్యమేనా?

 

    తను విమలగురించి కలలోకూడా మరోలా ఊహించలేదు. ఇంతవరకు ఆమెను గౌరవిస్తూ వచ్చాడు మాష్టరుగారి కూతురిగా.

 

    విమలా మాధవ్ ల వివాహం అయితే బాగుండునని తను ఎన్నోసార్లు అనుకున్నాడు.

 

    మాధవ్ విమల్ని ప్రేమిస్తున్నాడేమోననే అనుమానం ఎన్నోసార్లు తనకు కలిగింది.

 

    ఒకవేళ అది నిజం అయితే? మాధవ్ విమల్ని ప్రేమించటం నిజం అయితే?

 

    సత్యం శరీరం భయంతో బిగుసుకుపోయింది. కిటికీ చువ్వను ఇంకా గట్టిగా పిడికిలి బిగించి పట్టుకున్నాడు. చేతిమీద నరాలు పొంగాయి.

 

    ఇది కూడా నిజం కాదేమో! మాధవ్ విమల్ని ప్రేమిస్తూ వుంటే తనకైనా చెప్పడా? అతనికి తన ప్రేమను వెల్లడించటానికి సంకోచం ఎందుకుండాలి? మాధవ్ స్వభావం మనస్సులో దేన్నికూడా దాచలేనిది.

 

    సత్యం తనకు తెలియకుండానే ఆమె దగ్గరకువెళ్ళి ఆమె వీపుమీద గోముగా చెయ్యి వేశాడు.

 

    గిర్రున తిరిగిన విమల ఒక్కసారిగా ముఖాన్ని సత్యం గుండెల్లో దాచుకుంది.

 

    సత్యం! కాదు- అతనిలోని పురుషుడు ఆవేశంతో, ఉద్వేగంతో, ఉద్రేకంతో, ఆవేశంతో ఉన్న ఒక చేతిలోకి వెయ్యిచేతుల బలం రాగా, ఆమెను గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు.

 

    విమల ఆ క్షణంకోసమే యుగాలుగా ఎదురుచూస్తున్నట్లు, సత్యం గుండెల్లోకి ఒదిగిపోయింది.

 

    ఎంతోకాలంగా ప్రయాణంచేసి, అలసిపోయివున్న బాటసారి తుది మజిలీని చేరినట్లు, పద్యానికి చివరిపాదం స్పురించక తల బద్దలు కొట్టుకుంటున్న కవికి అకస్మాత్తుగా అనుకోకుండా ముగింపు దొరికినట్లు విమల సత్యం గుండెలమీద తల ఆన్చి అతని కౌగిలిలో ఇమిడిపోయి అనిర్వచనీయమైన అనుభూతిని ఆస్వాదించసాగింది.

 

    అకస్మాత్తుగా సత్యం కాలిపోతున్న వస్తువును ఒదిలేసినట్లు విమల్ని వదిలేసి దూరం జరిగి నిల్చున్నాడు.

 

    విమల పూర్తిగా ఈ లోకంలోకి రాలేదు. సత్యం స్పర్శను ఇంకా ఆమె శరీరం అనుభవిస్తూనే వుంది.

 

    "క్షమించండి!" అన్నాడు సత్యం అపరాధిలా తలవంచుకొని.

 

    విమల చివ్వున తలెత్తి చూసింది. దీనంగా చూసింది.

 

    మధురమైన కల క్షణంలో కరిగిపోయినట్లయింది విమలకు.

 

    "క్షమించండి. విజ్ఞానవతి అయిన మిమ్మల్ని నేను ఎంతో గౌరవిస్తున్నాను. కలలో కూడా అవమానించలేను."  

 

    "మీరు అమాయకంగా పసిపిల్లలా ఏడుస్తూంటే, నాకు తెలియకుండానే- ఆపైన ఏం చెప్పాలో తెలియనివాడిలా ఆగిపోయాడు సత్యం.

 

    అతని కంఠంలో, ముఖంలో, పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తోంది.

 

    విమల సత్యం ముఖంలోకి అసహాయంగా చూసింది. ఆమె పెదవులమీద రేఖామాత్రంగా బోలునవ్వు వెలసి అంతలోనే విరిగిపోయింది.

 

    అర్ధం చేసుకోగల హృదయానికి ఆ నవ్వులో ఎన్ని విషాదగీతాలు విన్పిస్తాయో!

 

    సత్యం అదేమీ గమనించలేదు. పెద్ద అపరాధం చేసినట్లు కుంగిపోతున్నాడు.

 

    "అమాయకత్వంలో ఇంత ఆకర్షణ వుందని నాకు తెలియదు. విజ్ఞానం, వివేకంలో లేని అద్భుతమైన బలం అమాయకత్వంలో ఉందని నాకు తెలియదు ఇంతకాలం. స్త్రీ అమాయకత్వంతో పొందగల అమూల్య జీవితాన్ని విజ్ఞానంతో పొందలేదని ఇవ్వాళ నాకు అర్ధం అయింది" అంది విమల ఆవేశంగా.

 

    సత్యం కళ్ళు పెద్దవి చేసుకొని విమల్ని చూస్తూ వుండిపోయాడు.

 

    "ఈనాటి స్త్రీలోకం విజ్ఞానోపార్జనకోసం ఎంత అమూల్యమైన వస్తువులను పోగొట్టుకుంటున్నదో ఇప్పుడే అర్ధం అయింది."

 

    వాకిట్లో అడుగుల శబ్దం విని ఇద్దరూ ఉలిక్కిపడి చూశారు.

 

    ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎందుకు ఉలికిపడతాడో ఇట్టే అర్ధం అవుతుంది.

 

    మాధవరావు ఇద్దర్నీ ఓ క్షణం మార్చి మార్చి చూశాడు. అతని చూపుల్లో ఆశ్చర్యం స్పష్టంగా గోచరిస్తుంది.

 

    "సారీ!" అంటూ గిర్రున వెనక్కి తిరిగాడు మాధవరావు.

 

    అలా వెళ్ళిపోతున్న మాధవరావును వెనక్కు పిలవాలనుకున్నాడు సత్యం. కాని వెలవెలపోతూ చూస్తూ ఉండిపోయాడు.

 

    వాతావరణంలోని గాంభీర్యాన్ని అర్ధంచేసుకున్న విమల లేచి గదిబయటకు నడిచింది.


                                          21


    ఆరు గంటలుకే చలి ప్రారంభం అయింది. ఎక్కడో కోల్డువేవ్ వచ్చి ఉంటుంది అనిపించేలా ఉంది.

 

    సరళ పొగడ చెట్టుక్రింద వున్న రాతిమీద కూర్చొనివుంది. అరచేతిమీద గడ్డం ఆనించి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తోంది.

 

    అప్పుడే లోపలకు వస్తున్న సూర్యం అలాగే నిల్చొనిపోయాడు. సరళను చూస్తూండిపోయాడు. తెల్లని దుస్తుల్లో ముఖంమీద నీరెండ పడుతూవుంటే దీర్ఘాలోచనల్లో మునిగి చెట్టుకింద కూర్చొనివున్న సరళ, ఏ గంధర్వ కుమారుడికోసమో వేచివున్న వనదేవతలా కన్పించింది.

 

    వనదేవత గంధర్వ కుమారుడికోసం చూస్తుందేమోకాని ఈ సరళ మాత్రం సత్యంకోసమే ఎదురు చూస్తోంది అనుకుని నిట్టూర్చాడు సూర్యం.

 

    సరళకు తను ద్రోహం చేశాడు. ఆనాడు తన స్వార్ధంతో సత్యంతో సరళ పెళ్ళి జరగకుండా చేశాడు. ఆ తర్వాత పశ్చాత్తాపంతో కుంగిపోయాడు అన్నయ్యకు చేసిన ద్రోహాన్ని తల్చుకుంటూ.

 

    అన్నయ్య వెళ్ళిపోయిన కొద్దిరోజులకే తను సరళను నిజంగా ప్రేమించడం లేదని తెలుసుకొన్నాడు. ఆమెను కేవలం తన మామయ్య కూతురుగానే, సన్నిహితురాలుగా భావించాడు. అన్నయ్యమీద తనకు ముందునుంచీ అసూయ వుండేది. ఆ అసూయ వల్లనే అన్నయ్యను సరళనుంచి వేరు చేయాలని బాధపడ్డాడు. అన్నయ్య అంతగా ప్రేమించే సరళను తనదాన్ని చేసుకోవాలని తాపత్రయపడ్డాడు. దాన్నే ప్రేమ అని భావించారు.

 

    సరళ అంటే తనకు చాలా ఇష్టంవున్నమాట వాస్తవమే.

 

    అన్నయ్య వెళ్ళిపోయిన ఆరు నెలలకే తనకు కమల పరిచయం అయింది. హాస్పిటల్లో పేషెంటుగా చేరిన ఆ శ్రీమంతులబిడ్డ తనను ప్రేమిస్తున్నా నన్నప్పుడు, తను ఉక్కిరిబిక్కిరయిపోయాడు. ఈ పెద్ద తోట, బంగళా వైభవం అన్నీ తనను మత్తులో ముంచివేశాయి. అందుకే అమ్మా నాన్నా కబురుచేసి సరళతో వివాహం చేస్తామన్నప్పుడు తాను నిరాకరించాడు.

 

    తను సరళను వివాహం చేసుకోనన్నప్పుడు అందరు ఆశ్చర్యపోయారు. అమ్మా, నాన్నా దుమ్మెత్తి పోశారు. సరళమాత్రం చాలా చిత్రంగా తన ముఖంలోకి చూసింది. ఆ చూపులు ఇంకా తనను వెంటాడుతూనే వున్నాయి.

 

    తన వివాహం కమలతో ఎంతో వైభవంగా జరిగింది. అమ్మా నాన్నా రాలేదు. సరళమాత్రం వచ్చింది.

 

    "ఏం బావా, అలాగే నిలబడి పోయావ్?" సరళ మాటలకు సూర్యం ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు.

 

    "ఇక్కడ చలిలో కూర్చున్నావేం సరళా?" అన్నాడు.

 

    "నాకు హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి ట్రాన్స్ ఫర్ వచ్చింది బావా!" అంది సరళ లేచి నిల్చుంటూ.

 

    తలమీద రాలిన పొగడ పూవులను దులుపుకుంటూన్న సరళను కళ్ళు పెద్దవి చేసుకొని చూడసాగాడు సూర్యం.

 

    "ఏమిటి బావా అలా చూస్తావ్! ఆశ్చర్యంగా వుందా?"

 

    "ట్రాన్స్ ఫర్ కు ప్రయత్నిస్తున్నట్టుకూడా చెప్పలేదే?"

 

    "క్షమించు బావా! నీకు చెబితే ఒప్పుకోవని నాకు తెలుసు! కాని-"

 

    "కాని నీకు ఇక్కడ ఉండడం ఇష్టంలేదు, అంతేకదూ?"

 

    "అలా నిష్ఠూరంగా మాట్లాడకు బావా!"

 

    సూర్యం మాట్లాడలేదు. ముఖంలో విచార రేఖలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

 

    "మాట్లాడవేం బావా? కోపం వచ్చిందా?"

 

    "కోపం ఎందుకు? నిన్ను అన్ని విధాల అన్యాయం చేశాను. అందుకే బాధపడుతున్నాను" అన్నాడు సూర్యం బరువుగా.

 

    "జరిగినదానికి బాధపడి ప్రయోజనం ఏమిటి బావా?"