ఆ మధ్యాహ్నం మూడుదాటింది. గోవిందరావుగారు నిద్రపోకుండా భార్యతో కబుర్లు చెబుతూ పడుకున్నారు. బయట మరీ ముసురుగా వుంది. "ఇంకా ఇక్కడ ఎన్నాళ్ళు జాగారం చేయాలో? ఆ పరమేశ్వరుడికి మనమీద ఎప్పుడు అనుగ్రహం కలుగుతుందో కదా!" అని అంటుండగా గది బయటినుంచి ఎవరో సున్నితంగా పిలిచినట్లు వినబడింది.

    "లోపలకు రండి" అంది శారద.

    యాభైఏళ్ళ వయస్సుగల ఒక వ్యక్తి. వెనుక మందగమనంతో శశీ లోపలకు ప్రవేశించారు. ఇంజనీరుగారు "నమస్కారమండీ!" అన్నాడు కొంచెం ముందుకు సమీపించి.

    గోవిందరావుగారు కూడా ప్రతినమస్కారం శుష్కహస్తాలతో గావించాక తన పేరు చెప్పుకుని "ఈమె నాకూతురు శశి. మీ రవితోబాటు చదువుకుంది" అని చెప్పాడాయన. శారద ఆయనను కూర్చుండచేసింది.

    "ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలావుంది?" అనడిగారు ఇంజనీరుగారు.

    "అలాగే... బాగానే వుంది."

    "ఫర్వాలేదు, అధైర్యపడకండి. త్వరలోనే నెమ్మదిస్తుంది."

    గోవిందరావుగారికి నవ్వు వచ్చింది ఈ ధోరణిచూసి.

    "కృతజ్ఞుణ్ణి" అన్నాడు.

    శశి మధ్య మధ్య శారదవంక చూస్తూ మెదలకుండా కూర్చుంది. కొంతసేపటికి సంభాషణ లాంఛనప్రాయంగా గడిచిపోయింది. తరువాత లోకాభిరామాయణం మొదలైంది. ఇంజనీరుగారు చాకచక్యంగానే రవినిగురించి కొన్ని విషయాలు సేకరించారు. గోవిందరావుగారు అర్ధంచేసుకోలేకపోలేదు. కొంతసేపటికి ముందు భార్యచెప్పిన మాటలు ఇంకా హృదయకుహరంలో మార్మోగుతూనే వున్నాయి. తెలివిగా సమాధానాలు ఇస్తూ వచ్చాడు. హఠాత్తుగా ఇంజనీరు గారన్నారు "అసలు నేను వచ్చిన పనేమిటంటే......"

    శశి త్వరత్వరగా లేచి బయటకు వెళ్ళబోతోంది. శారద వెనుకనుంచి "శశీ! వుండమ్మా!" అని పిలిచింది కానీ వినిపించుకోకుండా బయటకు వచ్చి ఉదయం కూర్చున్న సిమెంటు తిన్నెమీదకు వచ్చి చల్లగాలిలో హాయిగా కూర్చుంది.

    దాదాపు అరగంట గడిచింది. ఆమె విసుగులేకుండా అలానేకూర్చుని దేన్నిగురించో తీవ్రంగా ఆలోచిస్తోంది. ఒకరిద్దరు మనుష్యులు దూరంనుంచి తనవంక మోటుగా చూస్తున్నా లెక్కచెయ్యలేదు. ఇంతలో శారద కనిపించింది. వసారా మెట్లుదిగి తనవంక ప్రపుల్లవదనంతో చకచక నడిచివస్తోంది.

    శశి చప్పున రెండుచేతులతో ముఖాన్ని కప్పుకుని "ఉహు! మీముఖం చూడలేను" అంది ఆమె సమీపించాక.

    "పోనీ నీముఖం నన్ను చూడనియ్యి, కొత్త సొబగుల్ని ఏమేమి సంతరించుకుందో" అని బలవంతంగా అయినా మృదువుగా ముఖాన్ని ఆచ్ఛాదించి వున్న ఆ చేతుల్ని తీసివేసింది. ఆమె కపోలాలు, గులాబీలు రుద్దు కున్నట్లు గులాము చిందుతున్నాను.

    "పిచ్చిపిల్లా!" అనుకుంది శారద మనసులో "నిజం నీకేం తెలుసు?"

    "చూశారుగా! ఇహ మీ వశం అయిపోయాను. ఇంక ఆజ్ఞాపించండి, ఏం చేయమంటారో."

    "తొందరపడకు" అంది శారద. "నిన్ను మావెంట ఊరికి తీసుకువెడతాను. ఇష్టమేనా?"

    శశి అంగీకారంగా తల ఊపి ముసిముసిగా నవ్వింది.

    "నాతో వద్దులే. రవితో వద్దువుగానీ."

    శశికి సిగ్గుతో చచ్చినచావయింది. మాట్లాడకుండా తల ప్రక్కకు త్రిప్పుకుని నేలచూపులు చూస్తోంది.

    శారద ముందుకు వచ్చింది "అయినా తండ్రితో దెబ్బలాడతారా ఎవరయినా ఇటువంటి విషయాలలో?"

    "అదేమిటి? నాన్న ఏమని చెప్పారు మీకు? అన్నీ అబద్ధాలు" అని శశి చటుక్కున తల త్రిప్పి ఓరగా ఓ చూపు చూసింది.

    శారద ఆ చూపును హృదయసీమలో పదిలపరచింది.

                                      *    *    *

    రాత్రి చాలాసేపటివరకూ శారద తమ్ముడికోసం ఎదురుచూస్తూనే వుంది. ఎ క్షణంలో అతనువచ్చి తనని పిలుస్తాడో అ ని ఘూర్ణిల్లుతోంది, కానీ అది ఆక్రోసించటమే. భర్త హాయిగా, శాంతంగా నిద్రపోతున్నాడు. ఆమెకూడా చాలా రాత్రయాక పడుకుని నిద్రపోవడానికి ప్రయత్నించింది కానీ కనులు మూతపడటంలేదు. స్త్రీలు అనేక సందర్భాలలో ఏడుస్తారుగానీ తనలాంటి స్త్రీలు తలుచుకుని దురపిల్లుతారు. దానితో సరిసమానమైంది మరి ప్రపంచంలో ఏముంది? ఆమె తనపనికి తానే సిగ్గుచెంది "ఛీ!" అనుకుంది. ప్రక్కకు ఒత్తిగిలిన భర్తవంక చూసింది. పెదాలు బిగుసుకున్నాయి అమిత దాహం వేసినట్లు. ఆయన పాదాలు విశాలమైనవిగా తోచాయి. కాసేపు వెళ్ళి వాటిమీద తృప్తితీరా పడుకుందామనుకుంది. కానీ ఆయన లేచి "శారదా! ఇదేమిటి?" అని ఉలిక్కిపడతారు. వద్దు. ఆమె బరువుగా కళ్ళు మూసుకోవడానికి ప్రయత్నించింది. కానీ అది సాధ్యంకాదు. నెమ్మదిగా లేచి కిటికీవద్దకు వచ్చి నిల్చుంది. హాస్పిటల్ అంతా చెప్పలేనంత నిశ్శబ్దంగా వుంది. మందమైన కాంతి వెన్నెలలా చల్లదనాన్నిస్తుంది. ఆమెలో తహతహ అధికమైంది - ఈ చల్లదనాన్నంతా తనలో యిముడ్చుకుని అప్పుడు ఓ చిరునవ్వు నవ్వాలి. అప్పుడు జీవితం ధన్యత చెందినట్లు. ఎక్కడో నర్స్ నడుస్తుంది గావును. చిన్నగా అడుగుల చప్పుడు శ్రవణగోచరమయింది. ఉదయం అందాన్ని యిచ్చిన దూరంగా వున్న చెట్లు చీకటి అపాయాన్ని ఆపాదిస్తున్నాయి. ఆమె నిరాశ చేసుకుంది. "రవి ఇప్పుడు రాడు. ఈ అశాంతి యిప్పుడు తీరదు" అనుకుంటూ వచ్చి బలవంతంగా పడుకుంది.

    కానీ మరునాడుకూడా రవి రాలేదు. అంతేకాక ఆ మరునాడుకూడా అతని దర్శనంకాలేదు. ఈ రెండురోజులూ చిన్నక్క కాలుకాలిన పిల్లిలా తిరిగింది. మనసు వేస్తూన్న ఈ ముద్ర ముఖంలో స్పష్టంగా వ్యక్తీకరించబడింది. అది ఆయనకూడా కనిపెట్టారు. కానీ "శారదా! అలా వున్నావేం?" అని అడగలేదు ధైర్యం చేసి.

    శారదకు తమ్ముడిమీద కోపంకూడా వస్తోంది. ఏమయినాడు? పారిపోయినాడా? అయితే ఈ రెండురోజులనుంచి అతను తప్పించుకుని తిరగటం ఆమెలోని విపరీతమైన సంచలనాన్నే కాక, ఏదో జ్ఞానాన్నికూడా ఆర్జించింది. "వాడు చాలా తెలివితక్కువ పనే చేశాడు" అనుకుంది. "కానీ చాలా తెలివిగా బాధ్యతనుంచి తప్పుకున్నాడు."

    ఆ రాత్రి విసుగుతో ప్రక్కపై అటూఇటూ పొర్లింది. "అన్నిటికీ చిన్నక్కే!"