శక్తి రెండుకళ్ళనిండా ఇద్దర్నీ చూసుకుంది. ఆమెకి అప్పటిదాకా పడిన బాధంతా చేత్తో తీసేసినట్లుగా పోయింది.
ఇంద్రనీల్ పొందుతున్న ఆనందానికి కారణం తనేనన్న భావన ఆమె మనసుని గాల్లో తేలిపోయేట్లు చేసింది.
"బాబుని చూడు.... అచ్చు నాలాగే నవ్వుతున్నాడు" శక్తికి చూపిస్తూ అన్నాడు.
శక్తికి నిజంగానే బాబునవ్వు ఇంద్రనీల్ నవ్వంత నిష్కల్మషంగా అనిపించింది.
"నీల్... థాంక్యూ" అతని చేతిని అందుకుని దానిమీద ముద్దుపెట్టింది.
మాలతి బాబుని అందుకుంటూ "భర్తల్ని లేబర్ రూంలలోకి ఎలౌ చేస్తే డెలివరీలు ఈజీ అయ్యేట్లున్నాయే" అనుకుంది.
శక్తిని ఆస్పత్రినుంచి గోపాలరావు ఇంటికి తీసుకెళ్ళాడు. అరుంధతి వచ్చింది కాని శంకర్ రాలేదు. గిరి సుమతిని తీసుకొని వచ్చాడు.
"పురుడుకూడా నువ్వే పోసినట్లున్నావూ" వ్యంగ్యంగా ఇంద్రనీల్ ని అడిగాడు గిరి.
"ఔను! ఈ భూమి మీదకి రాగానే నా బాబు కళ్ళు మొట్టమొదటిసారిగా నన్నే చూశాయి" గర్వంగా చెప్పాడు ఇంద్రనీల్.
శక్తి బాలింత అందంతో మెరిసిపోతోంది.
తార వచ్చి చూసింది. "బాబు అచ్చు నీల్ పోలికే" అంది.
అరుంధతి వారి దగ్గరకొచ్చి "ఈ విచిత్రం ఎక్కడా చూడలేదమ్మా! పిల్లాడికి నీళ్ళుకూడా మమ్మల్ని పోయనీయడంలేదు. ప్రపంచంలో ఇతనొక్కడే పిల్లాడ్ని కన్నాడా అన్నట్లు చేస్తున్నాడు" అంది.
"అది శక్తి అదృష్టం" మనఃస్ఫూర్తిగా చెప్పింది తార.
"ఏమ్మా తారా? మగాళ్ళు ఇలాంటి పనులు చేయడం నువ్వు ఎప్పుడైనా చూశావా?" నిష్టూరంగా అడిగింది అరుంధతి.
"పసివాడ్ని ఎత్తుకోవడంకూడా 'రాదు' అని గర్వంగా చెప్పుకుంటారు మగవాళ్ళు. అది గొప్పకాదు. అశక్తత. మార్పు ఎప్పుడూ కొత్తగానూ వింతగానూ వుండి విమర్శకి లోనవుతుంది" చెప్పింది తార.
ఆమెకి షేవింగ్ చేసుకున్న తర్వాత ఆ రేజర్, సబ్బు నీళ్ళూ నిర్లక్ష్యంగా టేబుల్ మీద వదిలేసి వెళ్ళే భర్త గుర్తొచ్చాడు. తన పెళ్ళయిన "పదహారేళ్ళలో ఆమె ఒక్కసారి కూడా శ్రీధర్చేత స్నానం చేశాక తుడుచుకున్న తువ్వాలు బైట ఆరేయించలేకపోయింది. వుండలా చుట్టి మంచంమీద గిరాటేస్తాడు. పక్కంతా తడిగా అయి ఆ తర్వాత ముచ్చుకంపు కొడుతుంది. ఇవన్నీ చెయ్యడం రాక చేసే పనులా? అశక్తతా? కాదు... మాయరోగాలు!
ఇంద్రనీల్ బాబుకి స్నానం చేయించి తీసుకొచ్చి, సిద్దంగా పెట్టిన కుంపటిలో నిప్పులు ఎగదోసి సాంబ్రాణి పొగవేశాడు.
శక్తి తాంబూలం వేసుకున్న ఎర్రని పెదిమలతో నవ్వుతూ ఇదంతా వేడుకగా చూస్తూ కూర్చుంది.
తారకి ఆ పరిమళాలు, సాంబ్రాణి ధూపంవల్ల కాదు.... అవి వారి అనురాగ సుమసౌరభాలు అనిపించింది.
తార కాసేపు కూర్చుని "ఇంటికి వైజాగ్ నుంచి పెద్దబావగారూ వాళ్ళూ వస్తారు. వెళ్లి కూరగాయలవీ వున్నాయో లేవో చూసుకోవాలి" అని లేచింది.
"అదేమిటీ? ఇంత హఠాత్తుగా పిల్లల పరీక్షలటైంలో ఎందుకు వస్తున్నట్లు?" అడిగింది శక్తి.
"వాళ్ళ అమ్మాయికి ఇక్కడ పెళ్లి చూపులట."
"అది ఆపకూడనంత ప్రమాదం ఏం కాదుగా! నీ పిల్లాడికి సెవెన్త్ కామన్ ఎగ్జామ్. ఇంటినిండా సంతలా చుట్టాలొస్తే ఎలా చదువు కుంటాడూ? పరిస్థితి వివరించి పదిరోజులు ఆగమనలేకపోయావా?" రవ్వంత కోపంగా అడిగింది శక్తి.
'అమ్మో! మా అన్నయ్యవాళ్ళు రావటం నీకు యిష్టంలేదా?' అంటూ ఆయన చేసే గొడవ నీకు అర్ధం కాదులే శక్తీ. ఈ గొడవకన్నా ఆ గొడవే బెటర్!" అంది తార.
"ఆ గొడవ నీకు పూడ్చలేని నష్టాన్ని చేస్తుంది తారా! శ్రీధర్ కి అర్ధమయ్యేటట్లు చెప్పుకోవడం కాస్త ప్రయత్నిస్తే అసాధ్యం అని అనుకోను" అంది.
తార నవ్వి 'అందరూ ఇంద్రనీల్ లే వుండరు శక్తీ. నువ్వు చెప్పేదంతా తేలికైతే మీ పెద్దక్క ఇంకా బెల్ట్ దెబ్బలు ఎందుకు తింటుంది? మీ చిన్నక్క సూయి సైడ్ చేసుకోవడం సుఖం అని ఎందుకంటుంది?" అంది.
శక్తి ఆలోచనగా తలవూపింది.
తార వెళ్ళిపోయింది.
ఆ రాత్రి సుమతి శక్తిదగ్గర కూర్చుని చాలాసేపు ఏడ్చింది. "మగపిల్లాడ్ని ఈ సంవత్సరం కనకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటారట ఆయన. అదేమైనా నాచేతుల్లో పనా?" అంది.
అరుంధతి చెల్లెల్ని ఊరడిస్తూ "కోపం కొద్దీ అంటాడు. తగ్గాక మనమే బతిమాలుకోవాలి. అన్నింటికీ కాపురాలు వదిలేసుకుంటామా?" అంది.
సుమతి ఉక్రోషంగా "బావ నిన్ను రాత్రి చితకతన్ని ఓ కొత్తచీర నీ మొహాన కొడితే అన్నీ మర్చిపోయి మురిసిపోతావు. ఆత్మాభిమానం అనేది వుంటే ఎంత బాధో నీకేం తెలుసు?" అంది.
"ఆత్మాభిమానమా?" అడిగింది అరుంధతి.
"ఔను!" ముక్కులు ఎగబీలుస్తూ అంది సుమతి.
అరుంధతి ఆ నిముషంలో హిమాలయాలనుంచి వచ్చిన సర్వసంగ పరిత్యాగి అసెంబ్లీలో పదవులకోసం కుక్కలతక్కెడలా పోట్లాడుకుంటున్న మంత్రుల్ని చూసినట్లు చూసింది.
"ఆత్మాభిమానం నాకూ, నా ముగ్గురుపిల్లలకూ అన్నం పెడుతుందంటే? వాళ్ళకి చదువులకీ, బట్టలకీ నెలకి ఎంత అవుతుందో తెలుసా? అవన్నీ ఆయన్ని వదిలేసి వచ్చి నాన్ననెత్తిన వెయ్యనా? లేక నేను నాలుగిళ్ళల్లో పాచిపనులు చేసి సినిమాలోల్లా నా బిడ్డల్ని ఇంజనీర్లని, ఆఫీసర్లని చెయ్యనా? ఉల్లిపాయ కారం నూరి అన్నం వండిపెడితే పూటకి నూరు రూపాయలవుతోంది ఒకడికి రాళ్ళుకొట్టేపని, ఇంకోడికి హోటల్లో బల్లలు తుడిచేపనీ అప్పజెప్పనా? నేను ఆయన్ని ఆత్మాభిమానం లేక భరిస్తున్నా ననుకున్నావా?" అరుంధతి లేచి వెళ్ళి పెట్టెలోంచి ఎర్రని చీర తుంపులు తెచ్చి చూపించి, "మొన్న పండక్కి ఇన్ స్టాల్ మెంట్లవాడి దగ్గర మోజుపడి కొనుక్కున్నాను. బావ 'ఎర్రచీరా?' అంటూ యిలా ముక్కలు ముక్కలు చేశాడు. ఎందుకో తెలుసా?"
"ఎరుపు అంటే భయమా?" వేళాకోళంగా అడిగింది శక్తి.
"కాదు ఆరోజు... ఎప్పుడో వచ్చీరాని వయసులో నేను కమల్ కి రాసిన ఉత్తరంలో మన పెళ్ళికి ఎర్రని జరీబుటా వున్న చీర కొనుక్కుని బెంగాలీ పద్దతిలో కట్టుకుని నీకోసం ఎదురు చూస్తాను" అని రాశానట! ఆ విషయం ఆ ఉత్తరాన్ని చూపించి మరీ గుర్తుచేసి ఎర్రని వాతలు దేలేట్లు నా వీపు చిట్లగొట్టాడు. 'నీ మొదటి ప్రియుడు ఎక్కడైనా కలిసి ఎర్రచీరలో రమ్మన్నాడా?' అని వారంరోజులు నరకం చూపించాడు."