లోకంలో ఇంకా మంచి మిగిలిలేదా? మంచి దొరకదా? ఆధ్యాత్మికమైన తోడు అందని ఆశేనా?
    
    వుంది మంచి మిగిలుంది.
    
    'మానవదేవుళ్ళు' అబద్దం కావచ్చు. కాని మంచి గురువులన్నమాట 'మాత్రం నిజం!
    
    ఆ గురువు మీకు సన్నిహితుల్లో, సామాన్య స్థితిలో వుండి వుండవచ్చు. కాని ఉన్నతస్థాయిలో ఓ ధర్మాన్ని నడుపుతున్న స్థాయిలో వుండి వుండవచ్చు.
    
    మీ నిశితమైన ఆలోచనతో, మేధతో అటువంటి వారిని వెదికి పట్టుకోగలగాలి.
    
    వాళ్ళు మోరల్ సపోర్ట్ గా వుంటారు.
    
    మిమ్మల్ని ఎక్స్ ప్లాయిట్ చెయ్యకుండా మీకు మంచి జరిగే ఉద్దేశంతో 'సాధన' ఎంతవరకూ అవసరమో, అంతవరకూ చేయిస్తారు.
    
    మీ అభివృద్ధిని కాంక్షిస్తూ వుంటారు.
    
    లోకంలో మంచి మిగిలి వున్నదని మరీ మరీ చెబుతున్నాను. అనుభవించి మరీ చెబుతున్నాను.
    
    మొదట మానను మనం పోగొట్టుకోకుండా వుంటే.... ఆ మంచి వెతుక్కుంటూ వస్తుంది.
    
    ఇహ ఆధ్యాత్మిక సొంత సాధనాల ప్రసక్తిలోకి వస్తే...
    
    నీ ఆనందం, నీలో మానసిక వికాసం, పరిపక్వత, ప్రవర్తనలో నిండుతనం, పవిత్రత, లక్ష్యమై వుండాలి.
    
    ఓ సాధన ఎదుగుదలవైపు తీసుకువెళ్ళేదిగా వుండాలి.
    
    కొంతమందిలో ఆధ్యాత్మిక విజ్ఞానం అపారంగా వుంటుంది. పెదవి విప్పితే సూక్తులూ, ప్రవచనాలూ, శ్లోకాలూ ప్రవహిస్తూ వుంటాయి. నాకెంత తెలుసో చూశావా? అన్నట్లు వుంటుంది వాళ్ళ ధోరణి!
    
    ఆధ్యాత్మికాడంబరం వాళ్ళ ప్రతి కదలికలోనూ కనిపిస్తూ వుంటుంది.
    
    ఇంకా నిజం చెప్పాలంటే వాళ్ళలో ఆధ్యాత్మికాహంకారం తొంగి చూస్తుంటుంది.
    
    ఎదుటివాళ్ళు చెప్పేది వినరు. "నీ మొహం నీకేం తెలుసు? నే చెబుతా విను" అంటూ మొదలుపెడతారు. వాళ్ళ పాండిత్య ప్రకర్ష, చిలకపలుకులు మొదలుపెడతారు.
    
    వాళ్ళు తాము చాలా ప్రత్యేక వ్యక్తులైనట్లు ప్రవర్తిస్తూ వుంటారు.
    
    వాళ్ళ పెదవుల మీద కృత్రిమమైన నవ్వు అహంకారపూరితమైన నవ్వు నేనెక్కడో రాసినట్లు హిపోక్రటిక్ స్మైల్ నడయాడుతూ వుంటుంది.
    
    అన్నట్లు ఓ ఆధ్యాత్మిక కాఠిన్యం అరువు తెచ్చుకుంటూ వుంటారు.
    
    వాళ్ళవల్ల ఎవరికీ, ఏ విధమైన సాయమూ లభించదు. సాయం అడగలేనంతటి దూరంలో తమను తాము వుంచుకుంటూ జాగ్రత్తపడుతూ వుంటారు.
    
    మనిషికి కావలసిన వినయం, నమ్రతా, సహజత్వం కనీసం ఇప్పటికైనా సంతరించుకోకపోతే ఈ ఆధ్యాత్మిక సంపద దేనికి?
    
    ఇహ పూజలూ, పునస్కారాలూ, వ్రతాలూ, మీకు అభిరుచి వుంటే తప్పకుండా చేసుకోండి.
    
    కాని అవి చేయనివారు, ఎంతవరకూ అవసరమో అంతవరకే చేసి ఊరుకునేవారు ఎందుకూ పనికిరానివారనీ, వాళ్ళు తప్పు చేస్తున్నారనే భావన మీలోకి రానివ్వకండి.
    
    వాళ్ళెందుకు ముక్తసరిగా వున్నారో, వాళ్ళ లోతులేమిటో, భక్తికి వారిచ్చే నిర్వచన మేమిటో మీకు తెలియకపోవచ్చు.
    
    వాళ్ళ సంస్కారం, అత్యోన్నతి, వ్యక్తిత్వం మీకు అందే స్థాయిలో వుండి ఉండక పోవచ్చు. యాంత్రికంగా చెయ్యలేక వాటికి దూరంగా వుండి వుండవచ్చు. వాటిమీద గౌరవం లేక కాదు.
    
    మీరు యాంత్రికంగా చేస్తున్నారని నేననటం లేదు. ఈ విధానంలో మీ మనసులు ప్రభావితమైనట్లు వాళ్ళ మనసులు ప్రభావితం కాకపోవచ్చు. ప్రభావితం కాని చర్యలు వాళ్ళు చేపట్టలేక పోయుండవచ్చు.
    
    అందుకని... మీ అభిప్రాయాలు వాళ్ళమీద రుద్దటానికి ప్రయత్నించవద్దు.
    
    మీరు వారికి భర్త అయివుండవచ్చు. భార్య అయివుండవచ్చు మీ అధికారాన్ని వారిమీద ప్రయోగించటానికి ప్రయత్నించవద్దు. మీ విధానంలో పయనించటానికి వారికీ అంత స్వాతంత్ర్యమున్నది.
    
    ఆస్తికులై వుండటానికి దేవుడిమీద నమ్మకముంటే చాలు. బాధ్యతలు స్వీకరించటంలో, కర్తవ్య నిర్వహణలో, ధర్మాచరణలో... వారు పయనించే విధానంలో మనం సృష్టించుకుంటున్న ఆధ్యాత్మికత కన్నా ఎక్కువ డివినిటీ వుండివుండవచ్చు.
    
    బహుశా అది మనకు అర్ధం కావటంలేదు.
    
    దాన్ని మనం అందుకోలేకపోతున్నాం.
    
    ప్రపంచ ప్రఖ్యాతుల్లో... ఏ రంగానికి చెందినవారైనా....పరిశీలించి చూడండి. వాళ్ళు ఆస్తికత్వాన్ని ఎంతవరకూ స్వీకరించాలో అంతవరకూ స్వీకరించి...మిగతాది కృషి అనే నిర్మాణతలో నింపేసి పునీతులయ్యారు.
    
శుభాకాంక్షలు
    
    ఇవేళ కొత్త సంవత్సరం మొదలైంది.
    
    జనవరి 1.
    
    రెండు మూడు రోజులనుంచీ గ్రీటింగ్ కార్డ్స్ రావటం మొదలైంది. రాత్రంతా ఫోన్ కాల్స్.
    
    నూతన సంవత్సర శుభాకాంక్షలు కోరుతూ.
    
    ఓ.కే...బాగుంది. ఇలా ప్రతి ఒక్కరి గురించీ శుభంగా ఆలోచించటం కన్నా కావలసిందేముంది?
    
    కాని హృదయం అనేది ఒకటుంది. దానికి చాలా లోతులంటూ వుంటాయి. ఒక పనిచేస్తే హృదయంలోంచి ఆవిర్భవించాలి. మామూలుగా, అలవాటుగా, సంప్రదాయబద్దంగా, యాంత్రికంగా చెయ్యకూడదు.
    
    'హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ ఫోన్లు మోగిపోతున్నాయి. లోకల్ కాల్స్... ఎస్ టీడీలూ, ఐ ఎస్ డీలూ...
    
    గ్రీటింగ్ కార్డ్స్ ప్రవహిస్తున్నాయి.
    
    వాటినిండా ప్రేమగురించీ, స్నేహంగురించీ, మానవత్వంగురించీ, సేవగురించీ ఎన్నో సూక్తులు.
    
    రాత్రి... పన్నెండు గంటలవరకూ, ఆ తర్వాత కూడా...
    
    పార్టీలు.
    
    డ్రింక్ పార్టీలు.
    
    విందులూ, వినోదాలు.
    
    పేకాటలు.
    
    కేకులు కట్ చెయ్యటాలు.