పిల్లల్ని కూడా వదిలిపెట్టడం లేదు!

 

 

‘ఐదేళ్ల చిన్నారి మీద అత్యాచారం’, ‘హాస్టల్‌ పిల్లల మీద వార్డెన్ అఘాయిత్యం’, ’పసికందు మీద 65 ఏళ్ల వృద్ధుని దాష్టీకం’.... ఇలాంటి వార్తలు నిరంతరం చదువుతూనే ఉంటాం. ఎక్కడో ఎవరికో జరిగింది కదా అనుకుని పెద్దగా పట్టించుకోం. కానీ నిజంగానే రోజులు బాగోలేవు! ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన పిల్లలు కూడా లేనిపోని ప్రమాదాల బారిన పడే పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. అదృష్టవశాత్తూ... చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే, ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని చెబుతున్నారు నిపుణులు.

 

ఏది తప్పు – ఏది ఒప్పు

అభంశుభం ఎరుగని పిల్లలకు వారి శరీరం గురించిన అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. సెక్స్‌ ఎడ్యుకేషన్‌ గురించి వారికి చెప్పే సందర్భమూ, చెప్పినా అర్థం చేసుకునే వయసూ కాదు. కానీ వారి శరీరంలోని భాగాల గురించి స్పష్టంగా చెప్పితీరాలని సూచిస్తున్నారు. అంతేకాదు! ఫలానా భాగాన్ని ఇతరులు ముట్టుకోవచ్చు, ఫలానా భాగాలను ఇతరులు ముట్టుకోకూడదు అంటూ నేర్పుగా సూచించాల్సి ఉంటుంది.

 

అయినవారే!

ఒక సర్వే ప్రకారం దాదాపు 90 శాతానికి పైగా లైంగిక చర్యలు... తెలిసినవారి నుంచే ఎదురవుతున్నాయని తేలింది. అందుకని పిల్లలు ఎవరి ఇంటికి వెళ్తున్నారు, ఎవరితో మెలుగుతున్నారు, అవతలి వ్యక్తి స్వభావం ఎలా ఉంది అని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. పిల్లలు వారి మానాన వారు తిరుగుతున్నారు కదా అని వదిలేస్తే, వారు సాఫ్ట్‌ టార్గెట్స్‌గా మారిపోతారు.

 

మగపిల్లలు కూడా

ఆడపిల్లలతో పోల్చుకుంటే మగపిల్లలు లైంగిక వేధింపులకి గురయ్యే అవకాశం తక్కువే! అలాగని వారు సురక్షితం మాత్రం కాదు. ప్రతి ఐదుగురు మగపిల్లల్లో ఒకరు, 18వ ఏట వచ్చేసరికి అత్యాచారానికి గురవుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి వారి విషయంలోనూ తగినన్ని శ్రద్ధ తీసుకోవాల్సిందే!

 

బడిలో కూడా

పిల్లలు ఇంటి తర్వాత బడిలోనే ఎక్కువగా గడుపుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో టీచర్లో, పెద్ద తరగతి పిల్లలో హద్దు మీరే ప్రమాదం లేకపోలేదు. సంస్థ ప్రతిష్టకు భంగం కలుగుతుందనే భయంతో పాఠశాల యాజమాన్యం కూడా ఇలాంటి సంఘటనలను కప్పిపెట్టే ప్రయత్నం చేయవచ్చు. అందుకని బడిని ఎంచుకునే సమయంలోనే, అక్కడ చదువు, ఆటపాటలతో పాటుగా క్రమశిక్షణ తీరుని గమనించాలి. కేవలం బడి మాత్రమే కాదు- ట్యూషన్‌ సెంటర్, కేర్‌ సెంటర్‌... ఇలా పిల్లల్ని భరోసాగా వదలిపెట్టే ప్రతి చోటా, అక్కడి వ్యక్తులు సరైనవారే అన్న అంచనాకు వచ్చితీరాలి.

 

చేతలే కాదు- మాటలు కూడా

Sexual Abuse అనేది కేవలం చేతల్లోనే కాదు, మాటల ద్వారా కూడా జరిగే ప్రమాదం ఉంది. అందుకని మీముందు పిల్లలతో ఎవరన్నా తేడాపాడాగా మాట్లాడుతుంటే వెంటనే ఖండించండి. ఒక వయసు వచ్చిన తర్వాత ఫలానా మాట సభ్యత కాదు అని పిల్లలు తెలుసుకుంటారు. ఎవరన్నా పిల్లలతో అలాంటి ‘బూతులు’ మాట్లాడుతున్నట్లు మీ దృష్టికి వస్తే జాగ్రత్తపడండి.

 

పిల్లవాడిలో మార్పు

పిల్లవాడి రోజువారీ అలవాట్లలో కానీ, అతని స్వభావంలో కానీ అనూహ్యమైన మార్పు వస్తే... దానికి కారణం గుర్తించే ప్రయత్నం చేయండి. బడికి వెళ్లడానికి భయపడటం, ఎవరినన్నా చూసి వణికిపోవడం, మర్మాంగాల దగ్గర నొప్పిగా ఉందని చెప్పడం, ఎవరినీ దగ్గరకు రానీయకపోవడం, దిగాలుగా కూర్చోవడం... లాంటి లక్షణాలన్నీ పిల్లవాడు ఏదో సమస్యతో బాధపడుతున్నాడని చెప్పకనే చెబుతాయి. ఇలాంటి సూచనలను నిర్లక్ష్యం చేయకుండా, పిల్లవాడితో నేర్పుగా మాట్లాడి విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేయాలి.

 

ఈ జాగ్రత్తలన్నీ మనకి తెలియవని కావు. కాకపోతే ఏం జరగదులే అన్న ధీమాతో వాటిని అంతగా పాటించము. కానీ అదృష్టంలాగానే దురదృష్టం కూడా ఎవరినైనా వరించవచ్చు. కాబట్టి పిల్లలకు ఇలాంటి విషయాల మీద కాస్త అవగాహన ఏర్పడేవరకూ కంటికి రెప్పలా చూసుకోక తప్పదు.

- నిర్జర.