"హర్తాళ్ అంటే పట్టుకు తన్నటమా?"
    
    ఈ ప్రశ్న ఎవరో నిజాయితీపరుడు ఎవరికో వేస్తే వచ్చి యిద్దరినీ తన్నాడుట.
    
    శివనాథరావు యింటిప్రక్క పాకలోని ఓ రిక్షావాడు అతనిదగ్గరకు వచ్చి యీ పూటకు తిండిలేదు మొర్రో అని మొత్తుకుని అతనిదగ్గర పైకం తీసుకుని వెళ్ళి, మళ్ళీ సాయంత్రం వచ్చి "ఎంత తిరిగినా బియ్యం దొరకలే"దని మొత్తుకున్న సంగతి అతనెవరికీ చెప్పలేదు.
    
    సరే, హాలు యజమానిని ప్రజలు తన్నేలోపునే పోలీసులు వచ్చి లాఠీచార్జి చేశారు. ఆరోజు మూడు ఆటలూ జరిగాయి. జనంకూడా కొత్త సినిమా విరగబడి చూశారు.
    
    శివనాథరావు నవ్వుకుంటూ ముందుకు నడిచాడు. ఓచోట జనం గుంపుగా వున్నారు. అది ఫోటోస్టూడియో తెలిసినవాడే అతను. జనాన్ని తోసుకుని లోపలకు వెళ్ళాడు. స్టూడియో కుప్పకూలిపోయింది. కెమేరాలన్నీ పిప్పి పిప్పయి పోయాయిట. మిత్రుడు రెండుచేతుల్లో ముఖాన్ని దాచుకుని బల్లమీద కూర్చున్నాడు. అతని జీవనాధారం కూలిపోయింది. ఆ స్థితిలో అతన్ని పలకరించడానికి మనస్కరించక వెనుదిరిగాడు.
    
    మరో ఫర్లాంగు దూరం యిలాగే నిట్టూర్పులతో, విషాదాలతో గడిచింది. ఒకచోట పెద్ద రేకుఒకట్రి నేలమీద పడివుంది. చుట్టూ మనుషులు కూడి ఆతృతకూడిన మొహాలతో గుసగుసలాడుకుంటున్నారు. అక్కడో పోలీసు కాపలా.
        
    ఒక మనిషిని "ఏమిట"ని వాకబు చేశాడు.
    
    "పాపం! ఎవరో అభాగ్యుడు. నిన్న గాలివానకు వెరచి, అదో ఆ షెడ్ క్రింద నిలబడి వున్నాడు. ఆ సినిమారేకు గాలికిలేచి విష్ణుచక్రంలా ఎగిరి అతని తల ఎగురుకొట్టింది. మొండానికి మొండెం, తలకు తల....."
    
    చాలు, తల తిరిగింది. ఈ ఝంఝానిలం యొక్క విలయతాండవం యిక చూడలేదు. వెనక్కి తిరిగి యింటివైపు దారితీశాడు. ఓ పావుగంటలో యిల్లు చేరుకొని, లోపలకు అడుగుపెట్టి తల ఎత్తి చూశాడు.

    హాల్లో సరోజిని కూర్చుని వుంది.
    
                                                            2
    
    సరోజిని యీ సమయంలో యిలా హఠాత్తుగా ప్రత్యక్షమౌతుందని కల్లోకూడా అనుకోలేదు. అది ఆనందమో, విషాదమో చెప్పలేడు. హఠాత్తుగా విరుచుకుపడిన ఆనందంకూడా విషాదంలా గోచరిస్తుంది. కానీ క్షణంలో తేరుకుని, తనని చూసి నిలబడి నవ్వుతోన్న ఆమెను చూస్తూ "సరోజినీ యిదెట్టి వింత? ఏల యీ అకారణాగమంబు?" అన్నాడు.
    
    "చాల్లే పరిహాసాలు. రాత్రంతా ఎంత అవస్థ పడ్డానో అని అడగడంలేదు ఆక్షేపణలు మొదలుపెట్టాడు ఆక్షేపణలు."
    
    అప్పుడతనికి జాలేసి "యింత వానలో ఎందుకు బయల్దేరావ్?" అన్నాడు.
    
    "ఇలా గాలివాన వస్తుందని కలగన్నానా? ఒట్టి ముసురేననుకున్నా. రైలు ఓ యిరవైమైళ్ళు వచ్చాక ఇహ మొదలెట్టింది చూసుకో, అదేదో ఊళ్ళో ఆపేశారు. ప్రాణాలన్నీ గుప్పిట్లో పెట్టుకుని కూర్చున్నాం. మళ్ళీ తెల్లవారు ఝామున అయిదింటికీ బయల్దేరింది-వచ్చి ఓ పావుగంటయింది."
    
    "ఎవరెవరు వచ్చారు?"
    
    "నేనూ, మా తమ్ముడూ."
    
    "లోపలకు రా."
    
    ఆమె అతనివెనకనే లోపలకు వచ్చింది. ఇంకా బట్టలుకూడా మార్చుకున్నట్లు లేదు. రాత్రంతా నిద్రలేదేమో, మనిషి నలిగివుంది. లోపల సరోజినీ తమ్ముడు వాసూ, గోవిందూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. పదేళ్ళుంటాయి వాడికి.
    
    "ఏమయ్యోయ్! చదువుతున్నావా బాగా?" అని పలకరించాడు శివనాథరావు పల్లెటూరివాడిలా.
    
    వాడు సిగ్గుపడి, తల ఊపాడు.
    
    కాసేపు కుశలప్రశ్నలు అయినాయి.
        
    ఇంతలో గోవిందు అతని దగ్గరకు వచ్చి "అలా వీధిలోకి వెళ్ళొస్తాను బాబూ" అన్నాడు.
    
    "వెళ్ళు, త్వరగా వచ్చెయ్యి."
    
    వాసుకూడా గోవిందువెంట వెడతానని బయల్దేరాడు. శివనాథరావు సరోజినిని పైకి తీసుకువెళ్ళాడు.
    
    ఇద్దరూ వసారాలో పిట్టగోడకు ఆనుకుని నిలబడ్డారు. సూర్యకిరణాలు ఎలాగో మబ్బుల్లోంచి దారిచేసుకుని పిట్టగోడమీద నాజూగ్గా పడుతున్నాయి. వీధిచివర దూరంగా గోవిందూ, వాసూ కనబడ్డారు నడుస్తూ, పాకల్లో కోలాహలం యింకా తగ్గలేదు. పూజారిగారు గోచీ బిగించి అటూయిటూ హడావిడిగా తిరుగుతున్నారు. ఓ జట్కాబండి సందుమలుపు తిరిగి ఆ యింటి గేటుమీదుగా అటూయిటూ బురద చిందించుకుంటూ సాగిపోయింది.
    
    "సరోజినీ!" అన్నాడు చిన్నగా.
    
    "ఊ!"
    
    ఇద్దరూ ఒకరివంక ఒకరు చూసుకోవడం లేదు. రోడ్డువేపే తిలకిస్తున్నారు.
    
    "ఉత్తరం గిత్తరం లేకుండా ఏమిటో హఠాత్ ఆగమనం?"
    
    "నాకు మాత్రం తెలిస్తేగా?"
    
    "నువ్వు మరీ అంత పల్లెటూరి మొద్దువి కాదు. నువ్వు చేసిన పనికి అర్ధం ఆమాత్రం తెలియదేం?"
    
    "తెలియదు నిజంగా"
    
    ఓ క్షణం ఆగి తనే అంది "ఏం చెప్పను? ఓరోజు రాత్రి చిత్రమైన కల వచ్చింది. నువ్వు మేఘంగా మారి ఎగిరిపోతున్నావు. నేను విమానం ఎక్కి వెంటాడాను. నువ్వు మరీ దూరంగా ఎగిరిపోయావు. విమానం స్పీడు ఎక్కువ చేశాను. కళ్ళు తిరిగాయి. క్రింద పడిపోయాను. ఇంతలో అమ్మ లేపుతోంది. "ఏమిటే అమ్మాయి-ఆ కన్నీళ్లు?" అని సిగ్గుతో చచ్చిపోయాను."
    
    "అయితే నువ్వు విమానం డ్రైవ్ చేశావన్నమాట."
    
    "ఎస్. మై సెల్ఫ్" అంది చప్పున తరువాత తన మాటకు తనే తెల్లబోయి నవ్వుకోవడం మొదలుపెట్టింది.        
    "నేను నీకు చెప్పినట్లు ఇంగ్లీషు అభివృద్ధి చేసుకుంటున్నావా? లేక అంతేనా!"
    
    "అది కాదు బావా!" అందామె అప్రయత్నంగా జాలిగా "నేనైతే ఓ పదిరోజులు కాపీలు రాయడం, నువ్విచ్చిన పుస్తకాలు చదవడం యివన్నీ చేశాను. ఓరోజు అమ్మ కోప్పడింది. "ఎందుకే అవన్నీ నీకు? హాయిగా భారతం, భాగవతం చదువుకోక?" అని. దాంతో కట్టిపెట్టాను.
    
    "పోనీ అవైనా చదువుతున్నావా?"    
    
    "ఆ! భాగవతం రోజూ ఓ గంటసేపు చదువుతున్నాను అమ్మముందు కూర్చుని."
    
    "బహుశా రుక్మిణీకళ్యాణం, ధృవోపాఖ్యానం అత్తయ్య నిన్ను కంఠతా పెట్టించి వుండాలే."
    
    ఆమె ఆశ్చర్యంగా "నిజమే. అవన్నీ నీకెలా తెలుసు?" అంది.
    
    "నాకు తెలుసులే అయితే రుక్మిణి ఏమని చెప్పమంది కృష్ణయ్యకు? మొదటి పద్యం ఏదీ?"
    
    "ఏ నీ గుణములు.....అబ్బ! సిగ్గేస్తోంది."
    
    అతను కోపంగా ముఖంపెట్టి "సరోజినీ నువ్వెందుకు పనికివస్తావు? ఒక పని చేయమంటే చేయవు. బద్దకమంటావు. ఇంగ్లీషు నేర్పిస్తాను అంటే అమ్మ కోప్పడిందంటావు. నీకు వచ్చిన పద్యం చెప్పమంటే సిగ్గంటావు. పోనీ తెలుగైనా సరిగ్గా నేర్చుకోలేదు. రాసేవన్నీ తప్పులు" అన్నాడు.
        
    "కోపం వచ్చిందా?"
    
    "రాదా ఏం? నిన్ను చూసి నేనెట్లా గర్వించను?"
    
    ఈ వాక్యం ఆమె అర్ధం చేసుకున్నట్లు లేదు. "నా తెలివి తక్కువతనానికీ మా యింట్లో ఎవరికీ కోపంరాదే! నీకు ఎందుకు వస్తుందో?" అంది సాలోచనగా.
    
    అతనామె విషయం స్పష్టం చేశాడు. ప్రపంచంలో ప్రతివారూ ఒకానొక వ్యక్తిని కొంచెం బుద్దిగా చూసుకుంటారు. ఆ వ్యక్తి తెలివితక్కువ పని ఏం చేసినా వాళ్ళు కోపగించుకుంటారు.
    
    "అసలు తెలివితక్కువ పని అంటే ఏది?"
    
    "ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలు వేయడమే."
    
    ఈసారి ఆమె అతనివంక తిరిగింది. అతనూ తిరిగాడు. ఆమె పెదాలు విప్పబోతుండగా అడ్డగింది "అసలు విషయం చెప్పలేదు. కన్నీళ్ళు కార్చాక ఏం చేశావు?" అన్నాడు.
    
    "ఏం చేశాను? అప్పటినుంచీ ఇక్కడకు రావాలని ఆరాటపడసాగాను చివరకి ఎలాగో యింట్లో ఒప్పించి, తమ్ముడితో సహా....."