మోహనరావు చిన్నగానూ, కృష్ణ చిలిపిగానూ నవ్వేశారు.
    
    చంద్రం గొంతు సర్దుకుని "అసలు ప్రపంచంలో సుఖాలలో ఓలలాడుతుంటే యాచించేదెవరంటా? యాచించేవారు లేకపోతే దాతలెలా వస్తారు? ఇలా జరిగితే దానం మాటకు కొంత కాలానికి అర్ధం నశిస్తుంది......నిన్న గాలివ్గాన వచ్చింది ప్రజల హాహాకారాలు మొదలైనాయి కొంతమంది చచ్చిపోయారు. కొంతమంది దిక్కులేని వారైనారు. దీనివల్ల జరిగే లాభాలు చూడండి. పత్రికల వాళ్ళకు కావలసినంత న్యూస్."
    
    "న్యూస్ కోసం ప్రజల్ని చావమంటావా?" అన్నాడు కృష్ణ కోపంవచ్చి.
    
    "ఆ మాట నేననలేదు. మనం యిక్కడ తాత్వికులుగా ఆలోచిద్దాం. కర్మ సిద్దాంతంలో నమ్మకమున్నవాళ్ళం మనం. చావదలుచుకున్నవాడు, చావు ఎలాగూ తప్పదని తెలుసుకున్నవాడు ముక్కోటి ఏకాదశినాడో, మరో పర్వదినంనాడో చావాలని కోరుకుంటున్నాడా లేదా? సర్గద్వారాలన్నీ తెరుచుకుని వున్న రోజున "హరీ" అంటే అందులోకి జొరబడవచ్చు గదా అని వాళ్ళ ఉద్దేశ్యం మన శాస్త్రాలు చెబుతున్నట్లు ఏదో ఒకరోజున మన ఆయుర్దాయం తీరిపోతుంది."
    
    "ఏ శాస్త్రంలో?" అని కృష్ణ అడగలేదేమా అని మిగతావాళ్ళంతా విస్తుపోయి చూచారు.
    
    "ఎటువంటి సందర్భములో టి.బి. వచ్చి చచ్చిపోతేయేం? ఎలక్ట్రిక్ షాక్ తగిలి చచ్చిపోతే ఏం? గాలివాన వొచ్చి పోతే ఏం? కాబట్టి దేనివల్ల కూడా ఏమీ నష్టంలేదని చెబుతున్నాడు. ఇంకోటి-దీనివల్ల పత్రికల్లో ప్రచారం వస్తుంది. రెండోది విరాళాలు. వాళ్ళ ధర్మమా అని బ్రతికున్న మనబోటివాళ్ళకు దేశసేవచేసే భాగ్యం లభిస్తుంది. లైఫ్ అంటే యిదీ!"
    
    హఠాత్తుగా ఎవరిమట్టుకు వారే యీ మాటల్లోని హాస్యం స్వీకరించకుండా, గంభీరంగా ఆలోచించడం మొదలుపెట్టినట్లున్నారు. అందరి ముఖాలూ భయంతో పాలిపోయాయి. స్తబ్దుగా ఊరుకున్నారు.
    
    "మళ్ళీ రాజకీయాలు" చంద్రం అందుకున్నాడు.
    
    "మనం చూస్తున్నాం. కళ్ళముందు పదవులకోసం ప్రాకులాటలో యీ నాయకులనబడే వినాయకుల పోటీలు ఒకసారి మంత్రిగా వెలిగి మరోసారి చెప్పులు లేకుండా మనముందు నుంచి నడిచిపోతున్నారు. నేనామధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఓ ఏబ్రాసిలా వున్న వ్యక్తి బీడీకి నిప్పడిగాడు. తరువాత సెలక్టు అయిన ఎమ్.ఎల్.ఏ.ల లిస్టులో అతని ఫోటోచూసి నివ్వెరపోయాను."
    
    "భారతదేశాన్ని ఉర్రూతలూగించిన అమర గాయకుడు చిన్నప్పుడు వీధుల్లో అడుక్కుంటూ తిరిగాడు."
    
    "శివాయ్ వేసిన బొమ్మల్ని మొదట్లో అంతా తిట్టేవారు. ఇప్పుడు పొగుడుతున్నారు."
    
    ఏమిటి దీనికి భేదం? వీళ్ళందరూ ఎప్పుడూ ఒకేదశలో వుంటే యీ ఆనందాల తారతమ్యం, అంతస్థుల్లో సౌభాగ్యం అనుభవించేవారా? గాంధీజీ చిన్నప్పుడు సిగరెట్లు తాగినందువల్ల కదా నేను చిన్నతనాన చాటుగా సిగరెట్లు కాలుస్తూ ఉంటే మానాన్న పిలిచి గాంధీ కథ చెప్పి ఆయన్ని ఉపమానం చేశారు."
    
    ఉన్నట్లుండి కృష్ణ అడిగేశాడు తూణీరంలా "ఇంతకూ నువ్వింక చెప్పేది గాలివాన గురించేనా?"
    
    ఈ ప్రశ్నకు చంద్రం అవలీలగా జవాబు చెప్పగలడు. చంద్రందగ్గరనుంచి స్వాత్కర్షలు ఎక్కువగా వెలువడుతాయేమోనన్న భయంకొద్దీ 'నా మీద దయ వుందా మీకు?' అని ప్రశ్నించాడు శివనాథరావు జాలిగా.
    
    "ఏమిటి?" అన్నారు తెల్లబోయి.
    
    "ఇహ ఆ ప్రసంగం ఆపివేసి మనసుకు ఉల్లాసం కలిగించే కబుర్లేమయినా చెప్పగలిగితే చెప్పండి."
    
    చంద్రం ముఖం ముడుచుకుని "యిందాకటినుంచీ నేను మిమ్మల్ని చోరీ చేశానల్లే వుందే" అన్నాడు.    
    
    "అబ్బెబ్బే! లేదు ఊరికినే మనసు బాగుండక" అని నసిగాడు శివనాథరావు.
    
    "మరి నేను వెంటనే మూడ్ మార్చుకోలేను."
    
    కృష్ణను ఏదైనా చెప్పమని కోరారు మిగతా యిద్దరూ కలిసి.
    
    ఎక్కువ బెట్టుసరి చేయకుండా ప్రారంభించాడు అతడు. "మీరంతా సరదా కావాలన్నారు. నేను చెప్పబోయే విషయాలలో సరదా వుందోలేదో నాకు తెలియదు. నా దగ్గర రహస్యం అనేదిలేదు కాబట్టి దాపరికం లేకుండా జరిగిన సంగతులు చెప్పేస్తున్నాను. ఇదీ గాలివానకు సంబంధించిందే అయినా సభ్యులు ఖంగారు పడాల్సిన అవసరంలేదు. ఎందుచేతనంటే నా మనస్తత్వం మీకు తెలుసు."
    
    "నిన్న సాయంత్రం మా నాన్నగారికి జబ్బుగావుంది కాబట్టి లోపల తలుపులు బిగించి పడుకున్నారు. అమ్మకూడా ఆయనదగ్గరే వుంది. నా గదిలో నేను కిటికీ తలుపులు వేసి, అద్దాలగుండా బయటకు చూస్తూ కూర్చున్నాను.
    
    నేనంత ఓపిగ్గా కూర్చోవటానికి కారణం వుంది. మా యింటికెదురుగా వున్న కారుషెడ్ క్రింద ఓ అమ్మాయి గాలివానకు ఝాడిసి నిలబడి, తనూ నావంక చూస్తోంది."
    
    "అసలు కృష్ణుడెక్కడ వున్నాడో రాధక్కడే వుండి తీరుతుంది." అన్నాడు చంద్రం సిగరెట్ పొగని నాజూగ్గా వొదిలి.
    
    "అప్పుడు నేనేం చేశాను? కొంచెంసేపు అలచూసి చేత్తో పిలిచాను."
    
    "దౌర్జన్యం" అన్నాడు చంద్రం.
    
    "నీ సాహసాన్ని అభినందించాల్సిందే" అన్నాడు మోహనరావు.
    
    "దానికి తనూ రెస్పాన్స్ ఇచ్చింది. అప్పుడాలోచించాను-ఏం చేయడమా అని. అనవసరంగా తొందరపడ్డానే అని కాస్త విచారించాను. చివరకు తెగించి యింట్లోకి రమ్మని సైగ చేశాను. వానలో తడుస్తూ గబగబా వచ్చేసింది" అని కృష్ణ కొంచెం ఆగాడు.
    
    నిముషాలు విరామంతో మూలిగాయి.
    
    "తర్వాత అమ్మ వచ్చి తలుపు తట్టింది చాలాసేపటికి- "అబ్బాయ్, అన్నానికి రారా" అంది. ఆ అమ్మాయి భయంతో మూలకినక్కింది. "ఆకలిలేదే" అన్నాను. "కాస్తంత తిని పోరాబాబూ లేకపోతే ఆనక బాధపడ్తావు" అంది అమ్మ. "వద్దే నేను చదువుకుంటున్నాను. డిస్టర్బ్ చేయబోకు" అన్నాను సీరియస్ గా బ్రతికాను అమ్మ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి నిట్టూర్చి యివతలికి వచ్చింది."
    
    ఈ సన్నివేశం ఎలా వుండివుంటుందా అని చంద్రం తన మానసక్షేత్రంలో చిత్రించుకుంటున్నాడని అతని ముఖకవళికలు చూస్తే బోధపడ్తుంది.
    
    "తరువాత ఎప్పుడో రాత్రికి మెలకువ వచ్చింది. గోడనున్న గడియారంలో రెండయింది."
    
    "అప్పటివరకూ ఏం జరిగిందో చెప్పవేం?" అని చంద్రం గద్దించాడు.
    
    ఈ ప్రశ్న మిగతావాళ్ళకు వెగటుగా తోచింది అవునా అని ఒకళ్ళనొకళ్ళు కళ్ళతో ప్రశ్నించుకుని, భరించి వూరుకున్నారు.
    
    కృష్ణ కాస్త సిగ్గుపడ్డాడు. కపోలాలు ఎర్రబారాయి. చాలా సుందరంగా వున్నాడు.
    
    "వీడికి రసవత్తరంగా వర్ణించడం చేతకాదు" అని చంద్రం అల్టిమేటం ఇచ్చాడు.
    
    కృష్ణ అన్నాడు : "ప్రక్కకి చూశాను ఆమెలేదు. తలుపులు దగ్గరగా వేసి వున్నాయి. పాపం గాలిలో ఎక్కడకు పోయిందోనని భలే బాధ కలిగింది. లేచి అటూ ఇటూ తిరిగాను. ఏదో అనుమానం వచ్చింది. నాలో నేను నవ్వుకున్నాను. గబగబ డ్రాయరుసొరుగు తెరిచాను. ఉదయం అందులో ఇరవై అయిదు రూపాయలు వుంచాను. అవి నిష్క్రమించాయా? ఆదుర్దాగా చూశాను. ఆ డబ్బు పదిలంగా వుంది....."
    
    అంతా బరువుగా ఊపిరి విడిచారు. ఊహ నిర్ధయాగా విరిగిపోయింది.
    
    "గదిలోని వస్తువులన్నీ ఎక్కడివక్కడే వున్నాయి. ఆమె మాత్రం వెళ్ళిపోయింది. తరువాత ఏం జరిగిందంటే ....ఏం జరిగిందంటే నాకాకలి వేసింది."
    
    "అప్పుడేం చేశానూ? వంట యింట్లోకి వెళ్ళాను. మెల్లిగా అన్నం, ఆవకాయ తొక్కూ వేసుకుని సుష్టుగా భోంచేశాను. "ప్రొద్దున్నే అమ్మ అంది "రాత్రి పిల్లి వచ్చి అన్నం తినేసిందిరా" అని.
    
    చంద్రం రెండు క్షణాలు మౌనంగా వుండి తన అభిప్రాయం ప్రకటించాడు "ఈ కథ నేను ఎక్కడో చదివినట్టుగా వుంది."